ఆరోగ్య శాఖలో ‘ఫేక్‌’ దందా! ఉత్తుత్తి నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు గేలం

ABN , First Publish Date - 2022-08-04T20:27:10+05:30 IST

ఆరోగ్య శాఖలో హైటెక్‌ దందా వెలుగు చూసింది. ఫేక్‌ నోటిఫికేషన్లు, ఫేక్‌ ఉద్యోగాల మాటున ఆ శాఖ కమిషనరేట్‌ సిబ్బంది అత్యంత చాకచక్యంగా తతంగం నడిపించారు. నిరుద్యోగులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారు. గుంటూరులోని ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా

ఆరోగ్య శాఖలో ‘ఫేక్‌’ దందా! ఉత్తుత్తి నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు గేలం

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో వసూళ్లు  

శిక్షణ పేరుతో అనధికారికంగా పోస్టింగులు

కమిషనరేట్‌ సిబ్బంది కనుసన్నల్లో తతంగం 

కన్సల్టెన్సీ ద్వారా వ్యవహారం నడిపిన సిబ్బంది 

వసూలు చేసిన డబ్బుతో విందులు, విలాసాలు 

మంత్రి, డీజీపీకి ఫిర్యాదులతో గుట్టు రట్టు 

పరారీలో కమిషనరేట్‌ ఉద్యోగులు

రహస్యంగా సాగుతున్న విచారణ 


ఆరోగ్య శాఖ(Department of Health)లో హైటెక్‌ దందా వెలుగు చూసింది. ఫేక్‌ నోటిఫికేషన్లు(Fake notifications), ఫేక్‌ ఉద్యోగాల మాటున ఆ శాఖ కమిషనరేట్‌ సిబ్బంది అత్యంత చాకచక్యంగా తతంగం నడిపించారు. నిరుద్యోగులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారు. గుంటూరులోని ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా యువతకు గేలం వేశారు. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో కొందరు సిబ్బంది పరారయ్యారు. ఆరోగ్యశాఖలో ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచినా, డీజీపీ కార్యాలయం, ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం దీనిపై రహస్యంగా విచారణ చేపట్టినట్లు సమాచారం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలో కొలువుల పేరిట కొందరు కేటుగాళ్లు భారీ స్కెచ్‌ వేశారు. ఉద్యోగాలు కచ్చితంగా వచ్చేస్తాయని కమిషనరేట్‌లోని కొంతమంది సిబ్బంది, ఓ కన్సల్టెన్సీ సంస్థ కలసి నిరుద్యోగులను నమ్మించారు. ఆరోగ్యశాఖ స్టాంపులతో ఫేక్‌ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు ఏకంగా కమిషనరేట్‌ కార్యాలయంలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ఈ ఓవర్‌ యాక్షన్‌కు బుట్టలో పడిపోయిన నిరుద్యోగులు... వారిని పూర్తిగా నమ్మి కన్సల్టెన్సీ ద్వారా రూ.లక్షలు సమర్పించుకున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో సిబ్బంది విందులు, విలాసాల్లో మునిగి తేలారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు బాధితులు అడ్డం తిరిగారు. నేరుగా వెళ్లి కన్సల్టెన్సీ సంస్థను నిలదీశారు. దీనిపై సదరు సంస్థ యాజమాన్యం కమిషనరేట్‌ సిబ్బందిని గట్టిగా ప్రశ్నించడంతో వ్యవహారంమొత్తం బయటపడింది. ఇప్పటికే పెద్దసంఖ్యలో నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాకపోవడం, డబ్బులిచ్చిన వారినుంచి ఒత్తిడి పెరగడంతో కన్సల్టెన్సీ సంస్థ యాజమాన్యం, బాధితులతో కలసి నేరుగా డీజీపీకి, ఆరోగ్యశాఖ మం త్రికి ఫిర్యాదు చేసింది. డీజీపీ కార్యాలయం నుంచి సమాచారం అందడంతో ‘మేం ఎలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయలేద’ంటూ కమిషనర్‌ కార్యాలయం అధికారులు ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీని వెనుక ఎవరున్న దానిపై విచారణ చేపట్టలేదు. అయితే డీజీపీ కార్యాలయం, మంత్రి ఆఫీసులో మాత్రం ఈ వ్యవహారంపై రహస్య విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


స్కెచ్‌ ఇలా...

తొలుత కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఫేక్‌ నోటిఫికేషన్‌పై వాట్సప్‌ లేదా సోషల్‌ మీడియా ద్వారా నిరుద్యోగులకు సమాచారం అందిస్తారు. గట్టిగా ప్రశ్నించరు అన్నవారిని కన్సల్టెన్సీ ఎంపిక చేస్తుంది. వారిని బుట్టలో వేసుకుని డబ్బులు లాగేందుకు ప్లాన్‌ చేస్తారు. ఇందుకోసం మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి... అతి త్వరలో పర్మినెంట్‌ అవుతారని నమ్మబలుకుతారు. ప్రతి ఉద్యోగానికి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకూ బేరం మాట్లాడుకుంటారు. అందులో సగం మొత్తం ముందుగానే ఇవ్వాలని నిబంధన కూడా ఉంటుంది. ఈ మాటలు నమ్మిన నిరుద్యోగులు లక్షల రూపాయిలు తీసుకువచ్చి కన్సల్టెన్సీ సిబ్బంది చేతుల్లో పెడతారు. అందులో నుంచి కమిషనరేట్‌లోని ఒక ఉద్యోగికి సగం చేరుతుంది. మిగిలిన సగం కన్సల్టెన్సీ సిబ్బంది వద్ద ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల పేరిట ఈ తతంగం నడిచింది. 


ఫేక్‌ ఇంటర్వ్యూలతో బురిడీ 

నిరుద్యోగులకు ఎలాంటి అనుమానం రాకుండా డబ్బు తీసుకున్న తర్వాత రెండు నెలలకు ఒక సాయంత్రం పూట అందరూ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో మీరు ఇంకా శిక్షణ పొందాల్సి ఉంది, మరో రెండు నెలల పాటు కంప్యూటర్‌ శిక్షణ తీసుకోవాలని చెప్పి పంపిస్తారు. ఇలా మరో రెండు మూడు నెలలు కాలం గడుపుతారు. గట్టిగా ప్రశ్నించిన వారిని ఆరోగ్యశాఖలోని కీలకమైన విభాగాల్లో ఉన్న అధికారుల దగ్గరకు ట్రైనింగ్‌ పేరుతో పంపిస్తారు. జీతం లేకుండా కేవలం ట్రైనింగ్‌ పేరుతో మూడు నెలల పాటు పని చేయమని చెబుతారు. కమిషనరేట్‌ ఆదేశాలు కావడంతో అధికారులు కూడా ఎవరు, ఏమిటని ప్రశ్నించకుండా వచ్చిన నిరుద్యోగులతో పని చేయించుకుంటారు. ట్రైనింగ్‌ అయిన మూడు నెలల తర్వాత కానీ నిరుద్యోగులకు తత్వం బోధపడటం లేదు. శిక్షణ కోసం వచ్చినవారిలో కొంతమందిని పరిచయం ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడి డీఈవో పోస్టుల్లో నియమిస్తున్నారు. ఉద్యోగాలు ఖాళీ లేకపోవడంతో మరికొంత కాలం ట్రైనింగ్‌ పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. కమిషనరేట్‌ పరిధిలో ఏడాదిన్నరగా నడుస్తున్న ఈ వ్యవహారం రెండు వారాల క్రితం వెలుగులోకి వచ్చింది. డబ్బులిచ్చి ఐదు నెలలు కావడం, ఎన్ని రోజులైనా ఉద్యోగాలు రాకపోవడంతో తాము ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని కొంతమంది నిరుద్యోగులు అడ్డం తిరిగారు. దీనిపై మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి, ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో కమిషనరేట్‌ కార్యాలయంలో కొంతమంది సిబ్బంది పరారయ్యారు. మరికొంత మంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో పెద్దసంఖ్యలో యువత మోసపోయినట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమంది బయటకు రాగా, మరికొంత మంది భయంతో డబ్బులు వదులుకునేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీనిపై పూరిస్థాయిలో విచారణ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-08-04T20:27:10+05:30 IST