రామప్ప నుంచి మల్లేశం సినిమా వరకు..
ABN , First Publish Date - 2022-10-17T18:06:33+05:30 IST
నేరుగా అడిగినట్లు కాకుండా సంక్లిష్ట ప్రశ్నలు.. తెలంగాణ నేపథ్యంతో కూడిన వాటికి ప్రాధాన్యం.. మొత్తంమ్మీద కఠినం.. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రం తీరిది. ఆదివారం నిర్వహించిన పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
ప్రశ్నలు సంక్లిష్టం.. చాలని సమయం
సివిల్స్ తరహాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం!
15-20 దాకా ప్రశ్నలను వదిలివేసిన కొందరు
విశ్లేషణాత్మక జవాబులకు చెందినవే ఎక్కువ
తెలంగాణతో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతం.. 75% హాజరు
వారంలో కీ.. దాంతోనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): నేరుగా అడిగినట్లు కాకుండా సంక్లిష్ట ప్రశ్నలు.. తెలంగాణ నేపథ్యంతో కూడిన వాటికి ప్రాధాన్యం.. మొత్తంమ్మీద కఠినం.. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రం తీరిది. ఆదివారం నిర్వహించిన పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. 1,019 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష సాగింది. 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,86,031 మంది (75 శాతం) పరీక్ష రాశారు. 94,031 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి (67 శాతం), మేడ్చల్ (68 శాతం), హైదరాబాద్ (69 శాతం) జిల్లాల్లో అభ్యర్థుల హాజరు తక్కువగా ఉంది. కాగా, వారం రోజుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటే అభ్యర్థికి సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను వెబ్సైట్లో ఉంచాలని నిర్ణయించారు. ప్రాథమిక కీపై 5 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది. ఇలా వచ్చే అభ్యంతరాలపై నిపుణుల కమిటీ అధ్యయనం అనంతరం తుది కీ ప్రకటించనున్నారు. అప్పుడే ఫలితాలను వెల్లడించే వీలుంది. మరోవైపు పోస్టుల సంఖ్యకు వీలుగా 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్స్ జరుగనుంది.
సివిల్స్ తరహాలో..
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం సివిల్స్ పరీక్షల ప్రశ్నపత్రం మాదిరిగా ఉందనే అభిప్రాయం అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నది. విశ్లేషణాత్మక జవాబులకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అన్ని ప్రశ్నలకు జవాబు రాయడానికి సమయం సరిపోలేదని చెబుతున్నారు. ఒక మార్కు విలువైన 150 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు 150 నిమిషాలు ఇవ్వగా.. సమయం సరిపోక చాలామంది 15 నుంచి 20 ప్రశ్నలను వదిలివేసినట్టు తెలుస్తున్నది. ఇక ప్రశ్నలు కూడా కొంత కఠినంగానే ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి ప్రశ్నల్లో ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్‌కు సంబంధించినవి ఉన్నాయి.
రామప్ప నుంచి మల్లేశం సినిమా వరకు..
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తెలంగాణకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. రామప్ప దేవాలయం, కాకతీయ కాలం నాటి నాయంకర్ల వ్యవస్థ, సర్వాయి పాపన్న నిర్మించిన కోటలు, సమ్మక్క-సారక్మ జాతరల ప్రస్తావనతో పాటు దొరసాని, మట్టి మనుషులు, జై బోలో తెలంగాణ, మల్లేశం సినిమాల గురించి ప్రశ్నలడిగారు. తెలంగాణలో ‘సూఫీయిజం’, కర్ణాటక సరిహద్దుల్లోని తెలంగాణ జిల్లాలు, కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, గాంధారి వనం-తెలంగాణకు హరిత హారం, రైతు బంధు, శాతవాహనుల నాటి హస్త కళలు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ఆర్కిటెక్చరల్ డిజైనర్ ఎవరు? అని ప్రశ్నించారు. ‘‘సూర్యుడు అకస్మాత్తుగా మాయమైతే భూమికి ఏమవుతుంది?’’ వంటి సైన్స్ ప్రశ్నలు కూడా అడిగారు.
అధికారుల పర్యవేక్షణ
హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పటిష్ట బందోబస్తు కొనసాగింది. హైదరాబాద్‌లో ఓ యువతి కూకట్పల్లి చైతన్య డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రానికి బదులు ప్రగతి డిగ్రీ కాలేజీ వద్దకు వచ్చింది. దీంతో ఆమెను సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ బైక్‌పై నిర్దేశిత కేంద్రానికి చేర్చారు. ఇలానే పరీక్ష కేంద్రాల పేర్లు పొరబడి.. వేరొకచోటకు వచ్చిన ఇద్దరు విద్యార్థినులను మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు తన మొబైల్ వాహనంలో సరైన కేంద్రానికి పంపారు. కాగా, ఖమ్మం ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో బయోమెట్రిక్ ప్రక్రియ నిర్వహించే హాలులో విద్యుత్తు లేక చీకటిగా ఉండడంతో సిబ్బంది సెల్‌ఫోన్ లైట్లు వేసి అభ్యర్థుల నుంచి ఫొటోలు, వేలిముద్రలు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జాదవ్ రమేష్ గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు హాజరయ్యేలా అధికారులు సహకరించారు. కోర్టు సూచన మేరకు జైలు అధికారులు ఆదిలాబాద్ సీఐ పర్యవేక్షణలో.. రమేష్ పరీక్షకు హాజరయ్యేలా చూశారు.