ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అటెండెన్స్‌ భయం

ABN , First Publish Date - 2022-10-17T21:18:24+05:30 IST

ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో జియో అంటెండెన్స్‌ గుబులు రేపుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్ణీత సమయంలో పాఠశాలలకు చేరేవిధంగా చూసేందుకు జిల్లా యంత్రాంగం జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయం

ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అటెండెన్స్‌ భయం

పాఠశాలకు సమయానికి వచ్చేలా అధికారుల ఏర్పాట్లు

జిల్లాలో తొలిరోజు అంతంతమాత్రంగా అమలు

జియో అటెండెన్స్‌ను వ్యతిరేకిస్తున్న బిజినెస్‌ టీచర్లు

సాఫ్ట్‌వేర్‌ ఇబ్బందులతో 50 శాతమే టీచర్ల నమోదు

జిల్లావ్యాప్తంగా 1,156 పాఠశాలలు.. విధుల్లో 5వేలకుపైగా టీచర్లు


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 15: ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో జియో అంటెండెన్స్‌ గుబులు రేపుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్ణీత సమయంలో పాఠశాలలకు చేరేవిధంగా చూసేందుకు జిల్లా యంత్రాంగం జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేసినప్పటికీ.. తొలిరోజు ఉపాధ్యాయుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 5వేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు సక్రమంగా హాజరు కావడంలేదనే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్‌కు తెరలేపింది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఇకపై తప్పక సమయానికి పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో బిజినెస్‌ టీచర్లు, సంఘ నాయకులు, డుమ్మా టీచర్లు లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్‌ సీరియస్‌గా జియో అటెండెన్స్‌ అమలు చేస్తామని చెప్పడంతో బిజినెస్‌, డుమ్మా టీచర్లలో కొంత టెన్షన్‌ మొదలైంది. చాలాసార్లు డుమ్మా టీచర్లు, బిజినెస్‌ టీచర్ల విషయంలో విద్యాశాఖ చర్యల వరకు వెళ్లినా.. అధికారులపై ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు ఒకేరోజు పాఠశాలకు డుమ్మా కొట్టగా.. గ్రామస్థులు పాఠశాలకు తాళం వేసిన ఘటన జిల్లాలో జరిగింది. వేలాది రూపాయల జీతాలు పొందుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా డుమ్మాలు కొట్టడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. 

 

తొలిరోజు అంతంతే..

జిల్లా యంత్రాంగం జియో అటెండెన్స్‌పై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పటికీ.. శనివారం తొలిరోజు అంతంతమాత్రంగానే జియో అటెండెన్స్‌లో ఉపాధ్యాయు లు తమ పేర్లను రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. జిల్లాలో 5,700లకు పైగా ఉపాధ్యాయులు ఉండగా.. జియో అటెండెన్స్‌లో తొలిరోజు కేవలం 50 శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడకక్కడ సాఫ్ట్‌వేర్‌ ప్రాబ్లం రావడంతో చాలామంది ఉపాధ్యాయులు ఈ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోలేదు. రెండు వేలకు పైగా ఉపాధ్యాయులు జియో అటెండెన్స్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోలేదు. సమయపాలన పాటించేవిధంగా రూపొందించిన ఈ యాప్‌లో ఉపాధ్యాయులు పాఠశాలల సమయానికి అనుగుణంగా పాఠశాలకు వెళ్లి జియో అటెండెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాల లోకేషన్‌ను బట్టి జియో యాప్‌లో ఉపాధ్యాయులు అటెండెన్స్‌ నమోదవుతుంది. పాఠశాల ప్రారంభమైన మొదటి పిరియడ్‌లోనే ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేసుకోవాలి. సెల్ఫీ ఫొటోతో అటెండెన్స్‌ నమోదవుతుంది కాబట్టి పాఠశాల ప్రాంగణంలోనే ఉపాధ్యాయులు తమ జియో అటెండెన్స్‌ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 


బిజినెస్‌ టీచర్లలో గుబులు

రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో జియో అటెండెన్స్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నారు. పక్క జిల్లా కామారెడ్డిలోనూ ఈ విధానం ఇప్పటికే అమలులో ఉండగా.. జిల్లా యంత్రాంగం అమలు చేయనున్న జియో అటెండెన్స్‌ కొంతమంది ఉపాధ్యాయుల గుండెల్లో గుబులు రేపుతోంది. పాఠశాలలకు సక్రమంగా వెళ్లకుం డా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఇక తప్పక పాఠశాలలకు హాజరుకావాల్సి ఉండడంతో.. వారు ఈ విధానంపై పెదవి విరుస్తున్నారు. జిల్లా లో చాలామంది ఉపాద్యాయులు రియల్‌ ఎస్టేట్‌, ఎల్‌ఐసీ, చిట్టిల నిర్వహణ, ఇతర వ్యాపారాలు చేస్తూ ఎంఈవోలను మచ్చిక చేసుకుని పాఠశాలలకు డు మ్మాలు కొడుతున్నారు. కొంతమంది సంఘ నేతలు సైతం పాఠశాలలకు డు మ్మాలు కొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాకేంద్రానికి చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య జిల్లా యంత్రాంగం తీసుకున్న జియో అటెండెన్స్‌ విధానం ఏమేరకు విజయవంతం అవుతుందో మరీ!!  

Updated Date - 2022-10-17T21:18:24+05:30 IST