చదువొక రాష్ట్రంలో.. పరీక్ష మరొక స్టేట్‌లో..! విద్యార్థులకు కొత్త కష్టాలు!

ABN , First Publish Date - 2022-08-01T18:38:53+05:30 IST

రాష్ట్రంలోని కొందరు వైద్య విద్యార్థుల(Medical students)కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. విద్యాభ్యాసం(education) ఇక్కడ చేయగా.. పరీక్షలు

చదువొక రాష్ట్రంలో.. పరీక్ష మరొక స్టేట్‌లో..! విద్యార్థులకు కొత్త కష్టాలు!

ఇక్కడి ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏపీలో..

సరిపడా విద్యార్థుల్లేకనే: అధికారులు

ఇబ్బందులు తప్పవంటున్న విద్యార్థులు


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొందరు వైద్య విద్యార్థుల(Medical students)కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. విద్యాభ్యాసం(education) ఇక్కడ చేయగా.. పరీక్షలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రాయాల్సి వస్తోంది! ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా నెల రోజుల పాటు ఏపీలో పరీక్షలు రాయాలి. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలతో పాటు సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు నెల రోజులు అక్కడ ఉండి పరీక్షలు రాయడం కష్టమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు- సెప్టెంబరు నెలల్లో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌ 1, 2 సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌(mbbs) చదువుతున్న 140 మంది విద్యార్థులకు గుంటూరులో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ(NTR Health University) కింద వీరంతా అడ్మిషన్లు పొందారు. వీరికి ఈ ఏడాది జనవరి వరకు తెలంగాణలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. తాజాగా వీరికి గుంటూరులో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 


ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సీటీకి లేఖ రాస్తే.. 

ఎంబీబీఎస్‌ పార్ట్‌ 1, 2 కలిపి మొత్తం 25 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని విద్యార్థులు చెబుతున్నారు. అన్ని రోజుల పాటు అక్కడ సొంతంగా బస ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. అమ్మాయిలకు ఇది చాలా ఇబ్బందికరమని పేర్కొంటున్నారు. కచ్చితంగా తల్లిదండ్రులను తీసుకెళ్లాల్సిన పరిస్థితులుంటాయని ఓ విద్యార్థి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి లేఖ రాస్తే మన దగ్గరే పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు.మరోవైపు ఇక్కడి విద్యార్థులకు గుంటూరులో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడానికి కారణాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల పరీక్ష కేంద్రంలో ఉండాల్సిన కనీస సంఖ్యలో విద్యార్థులు లేరని, అందుకే గుంటూరులో సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఉదాహరణకు రిమ్స్‌ ఆదిలాబాద్‌ నుంచి పరీక్ష రాసే విద్యార్థి కేవలం ఒక్కరే ఉన్నారు. ఒక్కరి కోసం సెంటర్‌ ఏర్పాటు చేయలేమని చెబుతున్నారు. సప్లిమెంటరీలో ఇటువంటివి సహజమేనని అంటున్నారు. రాష్ట్ర విద్యార్థులందరికీ ఇక్కడే ఒక సెంటర్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. 


ఇక్కడే ఏర్పాటు చేయాలి

మాకు ఏపీలో ఎగ్జామ్‌ సెంటర్‌(Exam Centre) వేశారు. జనవరి దాకా పరీక్షా కేంద్రాలు ఇక్కడే ఉండేవి. ఇప్పుడు స్ట్రెంత్‌ సరిపోదని చెప్పి, గుంటూరులో సెంటర్‌ వేశారు. దీంతో అక్కడికి వెళ్లి, అన్ని రోజులుండి పరీక్షలు రాయాలంటే ఇబ్బంది. పరీక్షా కేంద్రం మార్చే విషయంపై మంత్రిని కలిసే ప్రయత్నం చేశాం. కుదరలేదు. ప్రభుత్వం స్పందించి మన దగ్గరే ఎగ్జామ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. 

- అఖిలేశ్‌, వైద్య విద్యార్థి

Updated Date - 2022-08-01T18:38:53+05:30 IST