సాంకేతిక కోర్సులకు దీటుగా Degree!

ABN , First Publish Date - 2022-07-22T18:00:33+05:30 IST

సాధారణ డిగ్రీ విద్యలో సమూల మార్పులు చేయాలని ఉన్నత విద్యామండలి సంకల్పించింది. జాతీయ విద్యావిధానం, యూజీసీ సూచనలను అనుసరించి డిగ్రీ

సాంకేతిక కోర్సులకు దీటుగా Degree!

సాధారణ కోర్సుల్లో సమూల మార్పులకు శ్రీకారం

పరీక్షా విధానంలో సంస్కరణలు 

ఇక ప్రతి ఇంటర్నల్‌ పరీక్షకూ మార్కులు

అంశాల వారీగా విద్యార్థుల ప్రతిభ గుర్తింపు

ఒకేసారి రెండు డిగ్రీలు చేసే అవకాశం 

కీలక మార్పులపై ఉన్నత విద్యామండలి కసరత్తు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): సాధారణ డిగ్రీ విద్యలో సమూల మార్పులు చేయాలని ఉన్నత విద్యామండలి సంకల్పించింది. జాతీయ విద్యావిధానం, యూజీసీ సూచనలను అనుసరించి డిగ్రీ కోర్సులను సమగ్రంగా మార్చేలా కసరత్తు ప్రారంభించింది. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ల్లో డిగ్రీ కోర్సుల విధివిధానాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సెమిస్టర్ల విధానం ప్రవేశపెట్టగా.. ఇప్పుడు పరీక్షా విధానంలోనూ సమూలంగా సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకూ వార్షిక, సెమిస్టర్ల పరీక్షలకే డిగ్రీ కోర్సుల్లో ప్రాధాన్యం ఉంది. ఇకపై ప్రతి అంతర్గత పరీక్షకూ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఎప్పుడో ఆరు నెలలకోసారి పెట్టే పరీక్షల్లో పాసైతే చాలనే భావన నుంచి ప్రతి పరీక్షలో సాధించే మార్కులూ ముఖ్యమేనని విద్యార్థులు భావించే పరిస్థితి తీసుకురానుంది. గతేడాది రాష్ట్రంలో నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సుల్లో సెమిస్టర్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఏటా రెండు సెమిస్టర్ల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో మాత్రమే ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇకపై అంతర్గత పరీక్షలకూ మార్కులిచ్చే విధానాన్ని తీసుకొస్తున్నారు. మధ్య మధ్యలో నిర్వహించే పరీక్షల్లో విద్యార్థుల మార్కులను ప్రామాణికంగా తీసుకుని, వాటికి వెయిటేజీ ఇచ్చి తుది గ్రేడింగ్‌ ఇస్తారు. దీనివల్ల విద్యార్థులకు ప్రతి పాఠం, అధ్యాయంపై అవగాహన ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. తాజా విధానంతో ఏ పాఠాన్నీ విడిచిపెట్టే అవకాశం ఉండదని, దీనివల్ల విద్యార్థులకు కోర్సులపై సమగ్ర అవగాహన ఏర్పడుతుందని చెబుతున్నారు. తద్వారా సాధారణ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం పెరిగి, ఉద్యోగాలు సులభంగా లభిస్తాయని అభిప్రాయపడుతున్నారు. 


పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా.. 

గత కొన్నేళ్లుగా సాధారణ డిగ్రీ కోర్సులకు డిమాండ్‌ బాగా పడిపోయింది. సాంకేతిక విద్యా కోర్సులతో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్న నేపథ్యంలో డిగ్రీ కోర్సులకు విద్యార్థులు దూరమవుతున్నారు. డిగ్రీ అనంతరం పీజీ చేసే అవకాశం ఉన్నప్పటికీ పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఇంజనీరింగ్‌లో సీట్లు లభించనివారు, ఆసక్తి లేనివారే డిగ్రీలోకి వస్తున్నారన్న వాదన ఉంది. దీంతో డిగ్రీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ఉన్నత విద్యామండలి సంస్కరణలకు శ్రీకా రం చుట్టింది. సాంకేతిక కోర్సులకు దీటుగా ఉద్యోగ అవకాశాలు దక్కేలా కోర్సులను తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభించింది. యూజీసీ కూడా ఈ తరహాలోనే డిగ్రీ కోర్సులు ఉండాలని సూచిస్తోంది.


డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు

గతేడాది ప్రారంభించిన నాలుగేళ్ల డిగ్రీ కోర్సులతో ఈ ఏడాది పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌లు చేయించే విధానాన్ని ప్రారంభిస్తున్నారు. నాలుగేళ్ల డిగ్రీలో మొదటి ఏడాది తర్వాత సమీప ప్రాంతాలపై ఎనిమిది వారాల పాటు అధ్యయనం చేసి ప్రాజెక్టు పూర్తిచేయాలి. దీనికి రెండు క్రెడిట్లు ఇస్తారు. రెండో ఏడాది పూర్తి చేసి మూడో సంవత్సరం ప్రారంభానికి ముందు పరిశ్రమల్లో ఇంటర్న్‌షి్‌పలు చేయాలి. దీనికి నాలుగు క్రెడిట్‌లు ఇస్తారు. మూడో ఏడాదిలో ఒక సెమిస్టర్‌ అంతా ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. దానికి 12 క్రెడిట్లు లభిస్తాయి. ఇలా మార్కులకు గ్రేడింగ్‌ ఇస్తూ, ప్రాజెక్టులకు క్రెడిట్లు ఇస్తారు. దీనివల్ల విద్యార్థి ఏ అంశంలో ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాడు, ఎందులో తక్కువ ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా పరిశ్రమల యాజమాన్యాలు వారికి కావాల్సిన అంశాల్లో ఎక్కువ అవగాహన ఉన్నవారిని ఉద్యోగాలకు పిలిచే అవకాశం ఏర్పడుతుంది.


ఎప్పుడు మానేసినా సర్టిఫికెట్‌ 

గతంలో డిగ్రీ అంటే కచ్చితంగా మూడేళ్లు చదివితేనే పట్టా చేతికొచ్చేది. కానీ ఇప్పుడు విద్యార్థి ఏ సంవత్సరంలో చదువు మానేసినా అందుకు తగ్గట్టుగా సర్టిఫికెట్‌ ఇస్తారు. అప్పటి వరకూ పూర్తయిన పరీక్షల్లో గ్రేడింగ్‌, ప్రాజెక్టుల్లో క్రెడిట్లు కేటాయిస్తారు. నాలుగేళ్లు పూర్తిచేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రెండేళ్లతో ఆపేసినా ఉద్యోగం లభిస్తుందనుకునే వారికి వెళ్లిపోయే వెసులుబాటును కల్పిస్తున్నారు. మరోవైపు రెగ్యులర్‌ డిగ్రీ కోర్సు చేస్తూ, సమాంతరంగా ఆన్‌లైన్‌లో మరో డిగ్రీ చేసే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు. 

Updated Date - 2022-07-22T18:00:33+05:30 IST