పాఠశాలా? ప్రయోగశాలా? ఏపీలో అస్తవ్యస్తంగా విద్యా విధానాలు

ABN , First Publish Date - 2022-07-01T16:38:16+05:30 IST

ఒకే రాష్ట్రంలో రెండు రకాల బోధనలు. పాఠశాలలను బట్టి ఒకే తరగతికి వేర్వేరు స్థాయి టీచర్లు (ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు) బోధించనున్నారు. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ వేదికైంది. విద్యార్థులు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయడం ఏమోగానీ... ప్రభుత్వం, అధికారులకు మాత్రం పాఠశాల విద్య ఇప్పుడొక..

పాఠశాలా? ప్రయోగశాలా? ఏపీలో అస్తవ్యస్తంగా విద్యా విధానాలు

రాష్ట్రంలో గందరగోళంగా విద్యా విధానాలు

3, 4, 5 తరగతులకు 2 రకాల బోధనలు

ఫౌండేషన్‌ ప్లస్‌లో ఎస్జీటీలతో పాఠాలు 

ప్రీహైస్కూల్‌, హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్లు

ప్రీహైస్కూల్‌లో 98 మంది విద్యార్థులు లేకుంటే 6, 7, 8 తరగతులకు కూడా ఎస్జీటీలే

సొంత ఊరికి దూరంగా పాఠశాలలు

ఇక 3, 4, 5 తరగతుల కోసం పక్క ఊరికి

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పాఠశాల విద్య 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఒకే రాష్ట్రంలో రెండు రకాల బోధనలు. పాఠశాలలను బట్టి ఒకే తరగతికి వేర్వేరు స్థాయి టీచర్లు (ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు) బోధించనున్నారు. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ వేదికైంది. విద్యార్థులు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయడం ఏమోగానీ... ప్రభుత్వం, అధికారులకు మాత్రం పాఠశాల విద్య ఇప్పుడొక ప్రయోగశాలగా మారిపోయింది. ‘జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాం.  పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నాం’ అనే పేరుతో ఇష్టానుసారంగా పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఒకే రాష్ట్రంలో పక్క పక్క ఊళ్లల్లో చదివే విద్యార్థులకు రెండు రకాల బోధనలంటే అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతారనే విషయాన్ని పూర్తిగా విస్మరించారు. ‘మాకు ఏది నచ్చితే అదే చేస్తాం’.. అన్నట్టుగా పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ ప్రక్రియతో పాఠశాల విద్యను అస్తవ్యస్తం చేస్తున్నారు. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో బోధన ఉండాలనేది జాతీయ విద్యా విధానమని, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐదు రకాల పాఠశాలల్లో ప్రీ హైస్కూల్‌ నుంచి సబ్జెక్టు టీచర్ల విధానంలో స్కూల్‌ అసిస్టెంట్లను కేటాయించింది. ఫౌండేషన్‌ పాఠశాలలో పీపీ1, పీపీ2, 1, 2 తరగతులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఎస్జీటీలు బోధిస్తారు. ప్రీ హైస్కూల్‌ (3 నుంచి 8 తరగతులు)లో చదివే విద్యార్థులకు స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు. ఆ తర్వాత ఉన్నత పాఠశాల (ఎ-కేటగిరి, 3 నుంచి 10 తరగతులు), (బి-కేటగిరి, 6 నుంచి 10 తరగతులు)ల్లో స్కూల్‌ అసిస్టెంట్లే బోధిస్తారు. కానీ ప్రీ హైస్కూల్‌ కంటే దిగువ స్థాయి ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాల (పీపీ1, పీపీ2, 1 నుంచి 5 తరగతులు)లో 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు కాకుండా ఎస్జీటీలు పాఠాలు చెబుతారు. అలాగే ప్రీహైస్కూల్‌లో మొత్తం విద్యార్థుల సంఖ్య 98 కంటే తక్కువగా ఉంటే స్కూల్‌ అసిస్టెంట్లకు బదులు ఎస్జీటీలే బోధిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే 98 కంటే తక్కువ విద్యార్థులున్న ప్రీ హైస్కూళ్లలో 6, 7, 8 తరగతులకు కూడా ఎస్జీటీలే బోధిస్తారు. అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యపై పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తగినంతమంది విద్యార్థులు ఉన్న ప్రీహైస్కూల్‌, హైస్కూల్‌ అందుబాటులో ఉంటేనే సబ్జెక్టులో ప్రావీణ్యం ఉన్న టీచర్లు పాఠాలు చెబుతున్నారు. లేకుంటే 8వ తరగతి వరకు ఎస్జీటీల బోధనతోనే సరిపెట్టుకోవాలి. ఇలా పక్క పక్క గ్రామాల్లో 3 నుంచి 8వ తరగతి వరకు విద్యావిధానం వేర్వేరుగా ఉంటుంది. ఒక స్కూలులో విద్యార్థులను సబ్జెక్టు టీచర్లు తీర్చిదిద్దితే, పక్క స్కూలులో విద్యార్థులకు అన్నీ కలిపి పాఠాలు చెప్పే ఎస్జీటీలు బోధిస్తారు. బహుశా దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యా విధానం అత్యంత గందరగోళంగా తయారైంది. 


చిన్నారుల భవిష్యత్‌తో ఆటలు 

ఇప్పటి వరకూ ప్రాథమిక పాఠశాలలకు ఎస్జీటీలు, ఉన్నత పాఠశాలలకు స్కూల్‌ అసిస్టెంట్లు పాఠాలు చెప్పే విధానం ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను ఇష్టమొచ్చినట్లుగా విభజించి చిన్నారుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసిన ఎస్జీటీలకు 3, 4, 5 తరగతుల పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడంలో ప్రావీణ్యం ఉంటుంది. చాలా సంవత్సరాల పాటు పనిచేసిన వారిని ఒక్కసారిగా ప్రీ హైస్కూల్‌కు మారిస్తే 6, 7, 8 తరగతులకు పాఠాలు చెప్పడానికి అంతగా ప్రావీణ్యం ఉండకపోవచ్చు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ప్రీహైస్కూల్‌లో ఆ తరగతులకు కూడా ఎస్జీటీలే పాఠాలు చెప్పక తప్పదు.


సొంతూరు దాటి బడికి

విలీనం పేరుతో కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. దీంతో ఇకపై ప్రాథమిక విద్యను (3 నుంచి 5వ తరగతి) అభ్యసించాలంటే చిన్నారులు ఊరి దాటి పక్క ఊళ్లకు వెళ్లాల్సిందే.  హైస్కూలు, ప్రీహైస్కూలు ఉన్న ఊళ్లలోని విద్యార్థులకు మాత్రమే ఆ పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ప్రతి ఊరిలో అంగన్‌వాడీ నుంచి 5 వరకు తరగతులు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాఠశాలకు వెళ్లడానికి ఎలాంటి సమస్యా లేదు. ఇప్పుడు 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల పిల్లలు చదువు కోసం పక్క గ్రామాలకు వెళ్లాలి. దీంతో తల్లిదండ్రులు వారిని విడిచిపెట్టి రావాలి లేదా ఆటోల్లోనైనా పంపించాలి. కూలి పనులు, పొలం పనులు, ఇతరత్రా చేసుకుంటూ జీవనం సాగించే పేద, మధ్యతరగతి వారికి పిల్లలను పంపడం ఇబ్బందిగా ఉంటుంది. తరగతుల విలీనం పేద పిల్లల చదువుపై ప్రభావం చూపే అవకాశముంది. 


జాతీయ విద్యా విధానం స్ఫూర్తికి తూట్లు 

జాతీయ విద్యా విధానం ప్రకారం కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన తప్పనిసరి. ఆ తర్వాత అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాష్ర్టాలు మీడియంను మార్చుకోవచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానానికి విరుద్ధంగా నిర్బంధంగా ఇంగ్లిష్‌ మీడియంను విద్యార్థులపై రుద్దుతోంది. గతేడాది ఏడో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ఉంటే, ఈసారి 8వ తరగతిలోనూ ఇంగ్లిష్‌ మీడియంలో బోధించనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే రెండు మీడియం (తెలుగు, ఇంగ్లిష్’)లు అందుబాటులో ఉంటాయి. వచ్చే రెండేళ్లలో అవి కూడా పూర్తిగా ఇంగ్లిష్‌లోకి మారబోతున్నాయి. మరోవైపు మాతృభాషలో బోధన ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి ఇంగ్లిష్‌ మీడియం బోధనను పెంచుకుంటూ వెళ్తోంది.

Updated Date - 2022-07-01T16:38:16+05:30 IST