బోధనలో స్థానికత లేకుండా BYJUSతో ప్రయోజనమేంటి?
ABN , First Publish Date - 2022-07-14T20:32:54+05:30 IST
బైజూస్(byjus) సేవలు అందినా పిల్లలకు డిజిటల్ లిటరసీపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా బైజూస్ ద్వారా లభ్యమయ్యే డిజిటల్ పాఠాలు(Digital lessons) వారు ఉపయోగించిన భాష. మన రాష్ట్ర భాష. స్థానికతకు సరితూగకపోవచ్చు. స్థానిక భాష. బైజూస్ డిజిటల్ తరగతి పాఠ్యాంశాలు బోధించే భాషలో
బైజూస్(byjus) సేవలు అందినా పిల్లలకు డిజిటల్ లిటరసీపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా బైజూస్ ద్వారా లభ్యమయ్యే డిజిటల్ పాఠాలు(Digital lessons) వారు ఉపయోగించిన భాష. మన రాష్ట్ర భాష. స్థానికతకు సరితూగకపోవచ్చు. స్థానిక భాష. బైజూస్ డిజిటల్ తరగతి పాఠ్యాంశాలు బోధించే భాషలో వ్యత్యాసం వల్ల పిల్లలకు అర్థం కావడం కష్టమయ్యే అవకాశాలను కాదనలేం.
జాతీయ విద్యావిధానం–2020 దిశగా దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ విధానం విద్యను డిజిటలీకరణ చేయమంటుంది. ఆ దిశగా బైజూస్ మల్టీ నేషనల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుని, ఇందుకోసం 500 కోట్లతో టాబ్‌లను కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 2025లో పదవ తరగతి సిబిఎస్‌సిలో రాసే విద్యార్థులు దీని పరిధిలోకి వస్తారు. సంప్రదాయ బోధనా విధానాన్ని అధిగమించడానికి, అనుభవాత్మక అభ్యాసన అనగా సెల్ఫ్ లెర్నింగ్ ప్రతిపాదికలో డిజిటల్ విద్య ఒక ప్రధాన భూమిక పోషిస్తోంది.
కొవిడ్ మనకు కొత్తగా నేర్పిన ఆన్‌లైన్ విద్య ద్వారా మనం గడించిన అనుభవాలు భౌతిక తరగతుల ఆవశ్యకత, ప్రింట్ రిచ్ వాతావరణం, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఆన్‌లైన్ విద్య ఉన్నప్పటికీ అందని ఫలంలా ఉండిపోవడం, అందరికీ డిజిటల్ పరికరాలు లేకపోవడం, ఒకవేళ ఉంటే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, పిల్లలకు అనుభవాత్మక విద్య దొరకకపోవడం ఇలా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. భారతదేశంలోనే కొవిడ్ విపత్తు వల్ల సుమారు 32 కోట్ల మంది విద్యార్థులు అభ్యసనకు దూరమైనట్లు యునెస్కో 2020 నివేదిక వెల్లడించింది. ఇందులో అధిక శాతం డిజిటల్ పరికరాలు అందుబాటులో లేని వారే అని మనం గుర్తు పెట్టుకోవాలి.
భారతదేశంలో కంప్యూటర్లు ఉన్న బడులు 22 శాతం మాత్రమే. ఆన్‌లైన్ విధానం ద్వారా విద్య అందించడానికి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేసినప్పటికీ ఎక్కువ శాతం మందికి కంప్యూటర్ సౌకర్యం లేకపోవడం, ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోను వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడం వల్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, పట్టణ, పేద కుటుంబాలలో ఎటువంటి వసతి లేకపోవడం వల్ల విద్యార్థుల్లో ప్రగతి కుంటుపడే ప్రమాదం ఏర్పడుతుందని అనేక సర్వేల ద్వారా తెలుస్తోంది. యూనిసెఫ్ – యు.టి.ఐ నివేదిక ప్రకారం 3–17 వయసు కలిగిన 1.3 బిలియన్ మంది పిల్లల్లో 50 శాతం మందికి ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్ సౌకర్యం కూడా లేదని వెల్లడించింది. ఎన్.సి.ఇ.ఆర్.టి సర్వే ప్రకారం దేశంలో 27 శాతం మందికి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు లేనందువల్ల ఆన్‌లైన్ విద్య అందుకోలేక విద్యార్థులు ఎంతో వెనుకబడ్డారని తెలిపింది.
నాణేనికి రెండు వైపులా అన్న విధంగా గ్రామీణ, హరిజన–గిరిజన ప్రాంత పిల్లలు ఆన్‌లైన్ విద్య అందుకోలేక, మాతృ భాష–బడి భాషల మధ్య వ్యత్యాసంలో కొవిడ్ కారణంగా తరగతివారీ సామర్థ్యాలకి దూరమై బడికి రావాలా, లేదా బడిలో చేరితే తాము నెగ్గుకురాగలమా అనుకునే నిరక్షరాస్య కుటుంబాలకు చెందిన పిల్లల పరిస్థితిని పునఃసమీక్షించాల్సిన ఆవశ్యకత ఉంది. పట్టణాలకు, చదువుకు చాలా దగ్గరగా ఉన్న విద్యార్థులు ఒక వైపు బడి బాటకన్నా కూలి పని, చేతి పని మిన్న అని భావిస్తూ చదువు పట్ల అవగాహన లేదా ఆసక్తి లేని పిల్లల స్థితిగతులకు వారి విద్యా పటిష్ఠతకు ప్రభుత్వం మరో వ్యూహం రచించాలి. బైజూస్ సేవలు అందినా పిల్లలకు డిజిటల్ లిటరసీపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా బైజూస్ ద్వారా లభ్యమయ్యే డిజిటల్ పాఠాలు వారు ఉపయోగించిన భాష, మన రాష్ట్ర భాష, స్థానికతకు సరితూగకపోవచ్చు. స్థానిక భాష, బైజూస్ డిజిటల్ తరగతి పాఠ్యాంశాలు బోధించే భాషలో వ్యత్యాసం వల్ల పిల్లలకు అర్థం కావడం కష్టమయ్యే అవకాశాలను కాదనలేం.
ట్యాబులకు తగినన్ని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు, ఇంటర్నెట్, విద్యుత్ నిరంతరాయంగా అందుబాటులో ఉండడం తప్పనిసరి. అయితే దీనిలో పాఠాలు ముందే రికార్డు చేసి ఉండటం వల్ల ఆఫ్‌లైన్ కూడా వినడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ లైవ్ పాఠాలు వినే వెసులుబాటు ఉండదు, ఇంకా ఉపాధ్యాయులతో చర్చించే వెసులుబాటు ఉండదు. దీనికి ఉపయోగించే ట్యాబులను ఇతర అవసరాలకు ఉపయోగించలేం. బైజూస్ డిజిటల్ సామాగ్రి చదువుకోవడానికే ఉపయోగపడుతుంది. మరే ఇతర సౌకర్యాలకు ఉపయోగించలేం. బైజూస్ ట్యాబుతో బాటు ఒక మెమరీ కార్డు లభిస్తుంది. ఇది వారిచ్చిన ట్యాబులోనే ఉపయోగంలోకి వస్తుంది. ఒకవేళ ట్యాబ్ పాడైతే మెమరీ కార్డు వినియోగం దుర్లభం.
బైజూస్‌తో ఒప్పందం వల్ల ఉపాధ్యాయ పోస్టులు గల్లంతవుతాయి. డీఎస్సీపై ఈ ప్రభావాన్ని కాదనలేం, గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. ఇప్పటికే ఇరవై అయిదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం బైజూస్‌ను ముందుకు తెస్తోంది అన్న వాదనను తోసిపుచ్చలేం. బైజూస్‌తో ఒప్పందం అయినందున ఉపాధ్యాయుల నియామకం, బహుళ స్థాయి తరగతుల నిర్వహణలో శిక్షణను నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అయిన విద్యారంగంలోకి కూడా కార్పొరేట్లను ఆహ్వానిస్తున్నారు.
ఆన్‌లైన్ విద్య అందుకోలేని పాఠశాల పిల్లలకు ప్రత్యామ్నాయ వ్యూహాలతో విద్యనందించడం, డిజిటల్ తరగతులను చేరుకునేందుకు పిల్లలకు తగిన డిజిటల్ పరికరాల ఏర్పాటుతో పాటు ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనకు కార్యాచరణ చేపట్టాలి. సాధారణ ప్రాథమిక–ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వయసు, తరగతివారీ విద్యా సామర్థ్యాలను సాధించేలా ప్రణాళికలు రచించి అమలు చేయాలి. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా కోల్పోయిన విద్యా సామర్థ్యాలు పునరుద్ధరించేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ముఖ్యంగా చదువులో నిర్లక్ష్యానికి గురి అవుతున్న బాలికల విద్యకు ప్రోత్సాహాన్ని అందించాలి. ఉపాధ్యాయుల బోధనా పటిమను పెంచాలి, కాలానుగుణంగా బోధన సాగేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రత్యేక ప్రోత్సాహాలనందించి పిల్లలను బడికి రప్పించడంకన్నా, భవిష్యత్తు తరాలకు భరోసాను కల్పించే నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ తరహాలో పాఠశాలల ఉపాధ్యాయులు, అధికారులు పిల్లల తల్లిదండ్రులతో, పౌర సమాజంతో కలసి పనిచేయాలి. విద్యా ప్రయోజనాలు అందరికీ సమంగా అందేలా విధులు, నిధులు, మార్గదర్శకాలు రూపొందాలి.
-మల్లాడి శ్రీనగేష్
-హరి వెంకటరమణ