2018 డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ప్రాధాన్య జాబితా విడుదల
ABN , First Publish Date - 2022-06-22T21:20:41+05:30 IST
డీఎస్సీ 2018 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య జాబితాను జిల్లాలకు పంపించారు. ఈ జాబితాను క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వెబ్‌సైట్‌లో ఉంచారు. జాబితాపై అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే..
అమరావతి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ 2018 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య జాబితాను జిల్లాలకు పంపించారు. ఈ జాబితాను క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వెబ్‌సైట్‌లో ఉంచారు. జాబితాపై అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే శాప్ ఎండీకి మెయిల్ చేయాలని సూచించారు. అయితే ఇప్పటికైనా ఈ నియామకాల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందా? అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో వెలువడిన 2018 డీఎస్సీలోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయిపోయింది. కానీ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు మాత్రం ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వలేదు. ఈ కోటా కింద ఉన్నవే తక్కువ పోస్టులు. కానీ ఇప్పటివరకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వలేదు. వీరి స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఒకసారి శాప్ పరిశీలించింది. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖాధికారులు కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఇవన్నీ కాదు.. మళ్లీ శాప్ పరిశీలించాలన్నారు. ఇప్పుడదీ పూర్తిచేసి తాత్కాలిక ప్రాథమిక జాబితాను విడుదల చేశారు. అయిత త్వరలోనే పాఠశాలలు తెరవనున్నారని అప్పటికైనా ఈ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
1998 డీఎస్సీ జాబితాలెక్కడ..?
మరోవైపు 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కొన్నిరోజుల కిందటే ప్రకటించారు. అప్పట్లో ఎంపికైన సుమారు 4,500 మందికి ఇప్పుడు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. అయితే వారందరికీ ఇచ్చేది కాంట్రాక్టు ఉపాధ్యాయ ఉద్యోగాలు లేకుంటే మినిమమ్ టైమ్ స్కేల్ ఉద్యోగాలే. మినిమమ్ టైమ్ స్కేల్ అందిస్తే జీతాలు నెలకు రూ.33వేలు చొప్పున ఇస్తారు. కాంట్రాక్టు ఉద్యోగాలైతే అంతకంటే తక్కువే ఇస్తారు. మరోవైపు ఈ 1998 డీఎస్సీ జాబితాలు డీఈవో కార్యాలయాల్లో అందుబాటులో లేవు. అభ్యర్థులు తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ డీఈవో కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.