రాయడం, చదవడం, వినడం..!
ABN , First Publish Date - 2022-10-21T06:00:33+05:30 IST
ప్రతిపాఠశాలలో ప్రాథమిక స్థాయి తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలు పెంపొందించడానికి చదవడం, రాయడం ప్రక్రియలు ముఖ్య పాత్ర వహిస్తాయి. పుస్తక పఠనం, పరిశీలన, అవగాహన, క్రియేటివిటీ, ఆలోచనాత్మక అనుభవం...
ప్రతిపాఠశాలలో ప్రాథమిక స్థాయి తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలు పెంపొందించడానికి చదవడం, రాయడం ప్రక్రియలు ముఖ్య పాత్ర వహిస్తాయి. పుస్తక పఠనం, పరిశీలన, అవగాహన, క్రియేటివిటీ, ఆలోచనాత్మక అనుభవం వంటి విషయాలతో బాటు క్లిష్టమైన విషయాలను ఆకళింపు చేసుకోవడం చదవడం, రాయడం వల్లనే సాధ్యమౌతుందనేది వాస్తవం. అందుకు పాఠశాల యాజమాన్యాలు, తల్లి దండ్రులు కీలక బాధ్యత వహించాలి. కరోనా కార ణంగా ఆన్‌లైన్ విద్య వల్ల చదవడం, రాయడం సన్నగిల్లాయి. అంటే స్క్రీన్ చదువులు, అవసరమైన పాఠ్యంశాలపైనే దృష్టి సారించడం, ఆన్‌లైన్ పరీక్షల ద్వారా ప్రగతి మదింపు సర్వ సాధారణమై పిల్లలలో రాయడం పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది. దీనివల్ల పాఠ్య ప్రణాళిక స్థాయి వరకే పిల్లల చదువును పరిమితం చేయడం జరుగుతోంది.
అదనంగా గ్రంథాలయ పుస్తకాలు చదవడం, పాఠ్య ప్రణాళికకు మించి పరిజ్ఞానం కోసం జీవన నైపుణ్యాల మెరుగుదలను పెంపొందించే పుస్తక సామాగ్రి అందుబాటులో ఉండకపోవడం, ఒకవేళ ఉన్నా వినియోగంలో సమయాభావం, కరోనా కారణంగా పూర్తిగా దూరం కావడం... ఇవన్నీ వెరసి పిల్లల అభ్యసనకు అవరోధాలుగా తయారయ్యాయి. ఈ సంక్లిష్ట స్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన రీడ్ కార్యక్రమం వల్ల దేశవ్యాప్తంగా ఒక చైతన్యం వచ్చినా ఆ ప్రయత్నం శాశ్వతత్వాన్ని అందుకోవడానికి– సమయం, పాఠశాల యాజమాన్యాల ప్రయత్నాలు, తల్లిదండ్రుల తోడ్పాటు అనుకున్న స్థాయిలో ప్రస్ఫుటం కాలేదు. ఇలా కారణాలేమైనప్పటికీ విద్యార్థులు తమ వయసు, తరగతి స్థాయి సామర్ధ్యాలు సాధించడంలో బాగా వెనుకబడి ఉన్నారు. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థులు ప్రాథమికోన్నత స్థాయికి చేరేనాటికి కనీస విద్యా సామర్ధ్యాలు సాధించలేని పరిస్థితి ఇటు తల్లిదండ్రులకు, అటు పాఠశాల యాజమాన్యాలకు ఒక సవాలుగా మిగిలింది.
పిల్లలు తరగతి వారీ విద్యా సామర్ధ్యాలు సాధించడానికి భాషను రాయడం, చదవడం తప్పనిసరి. ఈ పునాదికి సరైన అవకాశాలు ఏర్పరచకపోతే విద్యార్థికి మనం తీవ్ర నష్టాన్ని కలిగించినట్టే. ఈ పరిస్థితులు చక్కదిద్దకుండా ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం, ఎంత ప్రాధాన్యమున్నప్పటికీ తగిన వ్యూహాలు, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపు, ఆంగ్ల మాధ్యమ బోధనకు సుశిక్షితులైన ఉపాధ్యాయుల నియామకం వంటి కీలక విషయాల నిర్లక్ష్యం వల్ల మాతృ భాష అభ్యసనల సవాళ్లతో పాటు ఆంగ్ల మాధ్యమ సామర్ధ్య సాధన మరొక సవాలుగా ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు పరిణమించింది. ఈ పరిస్థితులను అధిగమించడానికి పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలసికట్టుగా కృషి చేయాలి. అందుకు పిల్లలకు కావలసిన వస్తు సామాగ్రిని అంటే... లైబ్రరీ పుస్తకాలను అందుబాటులో ఉంచడం, రాయడం–చదవడం ప్రోత్సహించడం, పిల్లలకు చదవడం పట్ల ఆసక్తి కలిగేలా తరగతి గదిని తీర్చిదిద్దడం, తల్లిదండ్రులకు–పిల్లలకు వీటి పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించడం ద్వారా పిల్లల అభ్యసనలో తల్లిదండ్రుల పాత్రను పెంపొందించవచ్చు.
పిల్లలు పుస్తకాలను ప్రత్యక్షంగా చదవడం, రాయడం, పదాలను, వాక్యాలను రాస్తూ వాటిని ఉచ్చరించడం, తరగతి గదిలో లేదా ఇంటి దగ్గర తగినన్ని కథల పుస్తకాలు, పోస్టర్లు, మ్యాగజైన్లు, వార్తా పత్రికలు, న్యూస్ లెటర్లు, బొమ్మలతో కూడిన వ్యాఖ్యానాలు, వివిధ విషయాలు తెలియపరిచే కరపత్రాల వంటి సామాగ్రి ద్వారా చదువుకోవాలనే వాతావరణం కల్పించడం ఎంతో అవసరం. ఈ వాతావరణం పిల్లలను అనుభవాత్మక అభ్యసన వైపు మళ్ళిస్తుంది. దీనివల్ల పిల్లలకు చదవాలి, నేర్చుకోవాలి– పరిశోధించి విషయ పరిజ్ఞానాన్ని గడించాలనే వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా పఠనాశక్తి పెరిగి, పరిశోధనాత్మక అభ్యసన ఏర్పడుతుంది.
పరిశోధనాత్మక జాతీయ విద్యా చట్టం–2005 చెప్పిన ప్రకారం పటిష్ఠమైన అభ్యసన సాధ్యమౌతుంది. ఈ పరిస్థితి ఆన్‌లైన్ పాఠాల వల్ల ఎంతమాత్రం సాధ్యం కాదు సరికదా, ఆన్ లైన్ విద్య వల్ల ఆచరణాత్మక అనుభవాత్మక విద్య కనుమరుగై పిల్లలు చదవడం, రాయడం, సంభాషించడం, భాషపట్ల పట్టు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పరీక్షల్లో చురుగ్గా రాయలేకపోవడం, రాయడంలో తప్పులు దొర్లడం, తద్వారా మార్కుల శాతం తగ్గడం వంటి పరిణామాలకు దారి తీసి, పిల్లల ప్రగతిపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే మన విద్యార్థులు విద్యా సామర్ధ్యాల్లో వెనుకబడి ఉన్నారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు కరోనా కారణంగా సుమారు రెండు సంవత్సరాలు ప్రత్యక్ష అభ్యసనకు నోచుకోని విద్యార్థుల పరిస్థితి మరింత క్లిష్టతరమైంది.
విద్యార్ధికి విజ్ఞానంతో పాటు రాయడం, చదవడం, వినడం, అవగాహన అనుభవాత్మక విద్యార్జన చాల ముఖ్యమని అందుకే (ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ) వినడం, మాట్లాడ్డం, చదవడం, రాయడం ప్రధానాంశంగా ప్రాథమిక విద్యా ప్రామాణికల పట్టికలో ప్రధానంగా సూచించారు. ఈ దిశగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినప్పటికీ మాతృ భాషా విద్యలో పట్టు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఆంగ్ల మాధ్యమానికి కూడా పటిష్ఠ వ్యూహాలను రచించి ముందుకు సాగాలి. ఈ దిశగా సాధ్యాసాధ్యాలను ఒకసారి పరిశీలిద్దాం.
పిల్లల అభ్యసనా ప్రక్రియలో తల్లిదండ్రుల పాత్రను ప్రధానం చేయాలి. ఇంటి దగ్గర పిల్లల ప్రగతి, వారి చదువు విషయంలో తగిన అజమాయిషీ ఉండేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఇంటివద్ద కూడా పిల్లల అభ్యసన శాస్త్రీయంగా జరిగేలా వారికి చదువు సామాగ్రి సమకూర్చడం ద్వారా పిల్లలకు, తల్లిదండ్రులకు చేయూతనివ్వాలి. తరగతి వారీ లెర్నింగ్ మెటీరియల్స్ ఉచితంగా ప్రతి విద్యార్థికి అందించడం, ఇంటిదగ్గరే చదువుకునేటట్లు తగిన పుస్తకాలు, చార్టులు, మ్యాగజైన్లు, వార్తాపత్రికలు, కథల పుస్తకాలు, డ్రాయింగ్, పెయింటింగ్ సామాగ్రి, వర్క్ షీట్లు, వర్క్ బుక్కులు, పోస్టర్లు, క్రాఫ్ట్ వస్తువుల వంటి సామాగ్రిని ప్రతి విద్యార్థికి సమకూర్చాలి. దీంతో విద్యార్థులు కోల్పోయిన అనుభవాత్మక విద్య వైపు దృష్టి మరల్చడానికి వారు కథలు రాయడం–చెప్పడం, పేపర్–మ్యాగజైన్లు చదవడం ద్వారా అధిక పరిజ్ఞానాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు పాల్గొని పిల్లలను ప్రోత్సాహించేలా వారికి మార్గదర్శకత్వం అందించడం ప్రధానాంశంగా గుర్తించాలి. ఈ విధంగా అప్రమత్తతతో ముందుకు సాగితే విద్యార్థుల భవిష్యత్తుకు ఒక పటిష్ట పునాది లభించినట్టే. అందుకు ప్రభుత్వం, తల్లిదండ్రులు, ప్రభుత్వేతర సంస్థలు, సమాజం కలసికట్టుగా కృషి చేయాలి. బాలల విద్య మనందరి బాధ్యత అని అందరూ గుర్తించి సహకరించేలా సమిష్టి కృషి చేసినప్పుడే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయి.
మల్లాడి శ్రీనగేష్
మేనేజర్
ఎడ్యుకేషన్– సౌత్ ఇండియా –సేవ్ ది చిల్డ్రన్