వీరవిధేయ ‘ఖర్గే’తో కాంగ్రెస్ సాధించేదేమిటి?

ABN , First Publish Date - 2022-10-07T06:06:27+05:30 IST

మనరాజకీయ పార్టీల సంస్థాగత వ్యవహారాలు ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికల కోలాహలంలో ఒక వార్త దాదాపుగా ఎవరి దృష్టికీ రాలేదు...

వీరవిధేయ ‘ఖర్గే’తో కాంగ్రెస్ సాధించేదేమిటి?

మనరాజకీయ పార్టీల సంస్థాగత వ్యవహారాలు ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికల కోలాహలంలో ఒక వార్త దాదాపుగా ఎవరి దృష్టికీ రాలేదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పదవీ కాలాన్ని వచ్చే జనవరిలో పొడిగించనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయన్నది ఆ వార్త సారాంశం. కాంగ్రెస్ ‘హై కమాండ్’ (అధిష్ఠానవర్గం) ఏకపక్ష నిర్ణయాల అప్రజాస్వామికతను ఎత్తి చూపుతున్న మీడియా, పార్టీ అధ్యక్షుని ‘ఎంపిక’ ప్రకియలో బీజేపీ అపారదర్శక వైఖరిని ఎందుకు ఉపేక్షిస్తుందని కాంగ్రెస్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. నిజమేమిటో చెప్పనా? సైనిక తరహా నియంత్రణ శైలిలో బీజేపీ వ్యవహరించడం పరిపాటి కాగా ఎడతెగని, ఆశ్చర్యకరమైన ఘటనా పరంపరకు తావిచ్చేవిగా కాంగ్రెస్ నాయకత్వ పద్ధతులు ఉంటాయి. ‘అంతర్గత ప్రజాస్వామ్యాన్ని’ పటిష్ఠం చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం చేసిన ఒక ప్రయత్నమే ఇటీవల ఆ పార్టీలో నెలకొన్న గందరగోళానికి కారణమని చెప్పవచ్చు.


బీజేపీలో నిర్ణయాలు తీసుకునే పద్ధతులు పూర్తిగా భిన్నమైనవి. వాటిపై అగ్ర నాయకత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ కారణంగా ఆ పార్టీ నిర్ణయాలు ఎటువంటి అలజడికీ దారితీయవు, గడబిడలు సృష్టించవు. సీనియర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ల విషయాన్నే చూడండి. గత ఆగస్టులో బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి వారిరువురినీ తొలగించారు. అయితే అందుకు కారణాలు ఏమిటో ఎవరూ వెల్లడించ లేదు. అలాగే గత ఏడాది గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి విజయ్ రూపానీకి రాత్రికి రాత్రే ఉద్వాసన చెప్పారు. ఎవరికీ తెలియని భూపేంద్ర పటేల్‌ను కొత్త ముఖ్యమంత్రిగా అధిష్ఠించారు. రూపానీని ఇంత హఠాత్తుగా, అందునా శాసనసభ్యులతో సంప్రదించకుండా, ఎందుకు తొలగించారని ఎవరూ గుండెలు బాదుకోలేదు! నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ ప్రజాస్వామిక సభ్యతలకు ప్రాధాన్యమివ్వడం చాలా చాలా అరుదు. ఆ అగ్రనాయక ద్వయం మాటే తుది నిర్ణయం. ప్రధానమంత్రి కేంద్రంగా పెరుగుతోన్న వ్యక్తి పూజ కూడా పార్టీలో ప్రతి ఒక్కరి నుంచి సంపూర్ణ విధేయతను డిమాండ్ చేస్తోంది. ప్రశ్నలు అడగరు, సమాధానాలు ఇవ్వరు.


బీజేపీ నాయకత్వానికి పూర్తిగా భిన్నమైనది కాంగ్రెస్ ‘హై కమాండ్’. రాజస్థాన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల మున్నెన్నడూ లేని విధంగా పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయంపై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ హై కమాండ్ ఎంతగా బలహీనపడిందో ఈ ఉదంతమే స్పష్టం చేసింది. పార్టీ కేంద్ర నాయకత్వానికి సదా విధేయంగా ఉండాలని ఇప్పుడు ఎవరూ భావించడం లేదు. రాజస్థాన్ పరిణామాలే ఇందుకొక తిరుగులేని నిదర్శనం. ఎన్నికలలో తిరుగులేని విజయాలు సాధించినంతవరకు గాంధీ కుటుంబం పార్టీ శ్రేణుల విధేయతను పొందుతూ వచ్చింది. అయితే గత దశాబ్దంలో వరుస అపజయాలతో కాంగ్రెస్ ప్రథమ కుటుంబ ప్రతిష్ఠ మసక బారింది. పార్టీపై పట్టును కోల్పోసాగింది. కాంగ్రెస్ శ్రేణుల నుంచి విధేయతను ఇంకెంత మాత్రం డిమాండ్ చేయలేకపోతోంది. 


ఏమైతేనేం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో రాజీపడ్డారు. దాని నిర్ణయాలను ఆమోదిస్తున్నారు. సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. అయితే ఒక సత్యం విస్మరించలేనిది: గాంధీ కుటుంబ వీర విధేయులను సైతం ఇంకెంత మాత్రం విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబ విశ్వాసపాత్రులుగా ఉన్న పలువురు నాయకులు తమ ‘తటస్థత’కు స్వస్తి చెప్పారు. వృద్ధ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే విజయానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఖర్గే వల్ల గాంధీ కుటుంబ ఆధిపత్యానికి ఎటువంటి ఢోకా ఉండబోదని విశ్వసిస్తున్నవారు ఆయనను పార్టీ అధ్యక్ష పదవికి తమ ‘అనధికారిక’ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. స్వతంత్ర ఆలోచనాపరుడైన శశి థరూర్ పార్టీ విధానాలకు నిబద్ధుడుగా ఉండడని ఆక్షేపిస్తున్నారు. 10, జన్‌పథ్ ఆదేశాలను ఖర్గే ఎట్టి పరిస్థితులలోను ఉల్లంఘించడని గాంధీ కుటుంబ విధేయులు భావిస్తున్నారు.


భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నదో ఒకనాడు భారతీయ జనతా పార్టీ కూడా అటువంటి పరిస్థితి నెదుర్కొన్నదనేది ఒక విచిత్ర వాస్తవం. 2004లో ఉమాభారతి అగ్రనాయకులతో తీవ్రంగా విభేదించి, పార్టీ సమావేశం నుంచి ఎలా వాకౌట్ చేశారో గుర్తు చేసుకోండి. ఆ తిరుగుబాటు దృశ్యాన్ని ఆనాడు దేశ ప్రజలు అందరూ టెలివిజన్‌లో చూసి ఆశ్చర్యపోయారు. సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ అనూహ్య పరాజయం పాలైన సందర్భమది. అంతర్గత విమర్శలు, దూషణలను నిలువరించలేని నిస్సహాయ స్థితిలోకి పార్టీ అగ్రనాయకులు జారి పోయారు. నేడు వింతగా ఉండవచ్చుగానీ మరొక వాస్తవాన్ని కూడా ప్రస్తావించక తప్పదు. 2012 ఉత్తరప్రదేశ్ శాసనసభా ఎన్నికలలో ప్రచారానికి నరేంద్ర మోదీని తీసుకురావడంలో అప్పుడు పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నితిన్ గడ్కరీ విఫలమయ్యారు! 


మరింత ముఖ్యమైన విషయమేమిటంటే బీజేపీ హై కమాండ్ నిర్మాణం విశిష్టమైనది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో పార్టీకి ఉన్న సంక్లిష్ట సంబంధమే ఆ ప్రత్యేకతకు ప్రాతిపదిక. 1998లో జస్వంత్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించాలని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నిర్ణయించారు. అయితే ఆరెస్సెస్ ఆ నిర్ణయాన్ని ఆమోదించలేదు. 2004లో పాకిస్థాన్ సృష్టికర్త మహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసించినందుకు గాను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆడ్వాణీ వైదొలగాలని ఆరెస్సెస్ పట్టుపట్టింది. అంతేకాకుండా 2014 సార్వత్రక ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థిగా ఆడ్వాణీని అంగీకరించేందుకు కూడా సంఘ్ ససేమిరా అంది.


బీజేపీ వ్యవహారాల్లో ఆరెస్సెస్ నిర్వహిస్తున్న పాత్ర ప్రజాస్వామిక పద్ధతులకు విరుద్ధమైనది. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న సంఘ్ నాయకులు ఎవరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారు కాదు. అయినా వారు ఆ పార్టీ వ్యవహారాల్లో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారు. చిత్రమేమిటంటే ఆ పాత్ర ప్రజాస్వామ్యబద్ధమైనది కాకపోయినప్పటికీ బీజేపీలో జవాబుదారీతనానికి కారణమవుతోంది. వాజపేయి లాంటి సమున్నత నాయకుడు సైతం 2004 పరాజయం అనంతరం పార్టీ నాయకుడుగా కొనసాగలేకపోయారు. వాజపేయిని విడిచి ముందుకు వెళ్లాలని సంఘ్ నిర్ణయించడమే అందుకు కారణమని మరి చెప్పనవసరం లేదు. అయితే నరేంద్ర మోదీ–అమిత్ షాల హయాం వచ్చేటప్పటికీ సంఘ్ నాయకత్వం గతంలో వలే నిశ్చిత వైఖరితో వ్యవహరించడం లేదు. ఎన్నికలలో తిరుగులేని విజయాలు దక్కడంతో పాటు, తమ భావజాలానికి గుజరాత్ నాయకద్వయం ప్రజామోదాన్ని సాధిస్తుండడమే అందుకు కారణంగా చెప్పవచ్చు. 


ఆరెస్సెస్ నాయకత్వంతో పోలిస్తే కాంగ్రెస్ అధిష్ఠానవర్గం సంస్థాగత ఎన్నికల ద్వారా ఏర్పడ్డ అత్యున్నత నిర్ణాయక సంఘమే అయినా జవాబుదారీతనం దాని వ్యవహారశైలిలో కనిపించదు! గత రెండు సార్వత్రక ఎన్నికలలో చవిచూసిన ఘోర పరాజయాలు అంతర్గత మథనానికి, పార్టీ వ్యవస్థల్లో సమూల మార్పులకు దారితీసి ఉండవల్సింది. అలా జరగకపోగా 2019 ఓటమి అనంతరం రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి నాటకీయంగా రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని యోగ్యుడైన మరొక నేతతో భర్తీ చేయడంలో పార్టీ విఫలమయింది. అంతిమంగా సోనియా గాంధీ ‘తాత్కాలిక’ అధ్యక్షురాలుగా మళ్లీ పార్టీ సారథ్యాన్ని చేపట్టేందుకు దారి సుగమమయింది. ప్రతీ సంక్షోభానికి ప్రథమ కుటుంబ నేతృత్వమే పరిష్కారమని నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్‌కు పరిపాటి అయింది. మరి ఇటువంటి పరిస్థితిలో ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే కొత్త, సృజనాత్మక ప్రత్యామ్నాయాలను కాంగ్రెస్ ఎలా సృష్టించగలుగుతుంది? 


మరి కాంగ్రెస్ పూర్తిగా ఒక కుటుంబ నియంత్రణలో ఉన్న పార్టీ అని, ప్రతిభాసమన్విత నాయకత్వం దానికి దక్కే అవకాశం ఏమాత్రం లేదన్న ఒక సునిశ్చిత అభిప్రాయం ప్రజల్లో సుస్థిరంగా నెలకొంది. 1998లో కాంగ్రెస్ సారథ్యాన్ని సోనియా చేపట్టిన తరువాత ప్రజాబలం గల నాయకుడు ఒక్కడైనా ఆ పార్టీలో ప్రభవించగలిగాడా? కీర్తిశేషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి (ఆంధ్రప్రదేశ్), అశోక్ గెహ్లోత్ (రాజస్థాన్)లు మాత్రమే బహుశా, అందుకు మినహాయింపు కావచ్చు. మరి ఇదే 24 సంవత్సరాల కాలంలో బీజేపీ వ్యవహారాలతో కాంగ్రెస్‌లో నడుస్తున్న కథను పోల్చి చూడండి. 1998-–2022 మధ్య బీజేపీ అధ్యక్షులుగా దాదాపు 10 మంది నేతలు వెలుగులోకి వచ్చారు. వారందరూ గొప్ప నాయకులు కాకపోవచ్చు. తమ అధికారాలను వారు పూర్తి స్థాయిలో చెలాయించి ఉండలేకపోవచ్చు. అయితే పార్టీలో ఒకే విధమైన పరిస్థితులు నిరంతరాయంగా కొనసాగడం లేదని, నిత్య నూతనంగా మార్పులు వస్తున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడలేదూ? ప్రస్తుత అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డానే తీసుకోండి. రాజకీయ ఆజానుబాహువు నరేంద్ర మోదీ పక్కన నడ్డా ఒక రాజకీయ వామనుడుగా కనిపించవచ్చుగాక. అయితేనేం బీజేపీ అధ్యక్షుడుగా ఆసేతు శీతాచలం సకల ప్రజలకు సుపరిచితుడుగా ఆయన వెలుగొందుతున్నారు. భారతీయుల మనస్సులో బీజేపీ పట్ల ఒక నిర్దుష్ట అభిప్రాయానికి ఆయన విశేషంగా దోహదం చేస్తున్నారు. 


మరి కాంగ్రెస్ విషయమేమిటి? కొత్త తరానికి నాయకత్వాన్ని అప్పగించడం ద్వారా కాంగ్రెస్‌లో మౌలిక సంస్కరణలు తీసుకువచ్చే దార్శనికతను పార్టీ అధిష్ఠానవర్గం చూపలేకపోయింది. ఉన్నత స్థాయి పదవుల్లో తరాల మార్పుతో కార్యకర్తలను చైతన్యపరచకపోగా విశ్వసనీయ, అయితే విఫలమైన పాత తరం నాయకులపై ఆధారపడడం ద్వారా కాంగ్రెస్ తనను తాను సమస్యల పాలు చేసుకుంది. భవిష్యత్తులో వర్థిల్లేందుకై గత కాలం నాయకత్వ ధోరణులకు స్వస్తి చెప్పనవసరం లేదా? మరింత స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ శిలాజీకరణలోనే ఉండిపోయే ప్రమాదమున్నది. వయస్సు పైబడిన, శారీరక సత్తువ సైతం అంతగా లేని మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సంభావ్య విజేత) శక్తి, ఉత్సాహం పరిపూర్ణంగా ఉన్న, నిత్యం దేశ వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శిస్తుండే బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకు నాయకత్వ దక్షత, కార్యసాధనలో సమ ఉజ్జీ కాగలరా?


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Read more