అనేక యుద్ధాలు

ABN , First Publish Date - 2022-03-05T06:13:50+05:30 IST

మా నవ ప్రస్థానంలో అసంఖ్యాక పోరాటాలు, ఘర్షణలు, యుద్ధాలు జరిగాయి. పంచుకోవడానికి వీలుకుదరని చోట అధీనం చేసుకోవడానికి, పెంచుకోవడం కోసం ఆక్రమణలు చేయడానికి మనుషులు యుద్ధాలు చేస్తూ వచ్చారు. నేల, నీరు సహా సమస్త వనరుల మీద, సాటి మనుషుల మీద....

అనేక యుద్ధాలు

మా నవ ప్రస్థానంలో అసంఖ్యాక పోరాటాలు, ఘర్షణలు, యుద్ధాలు జరిగాయి. పంచుకోవడానికి వీలుకుదరని చోట అధీనం చేసుకోవడానికి, పెంచుకోవడం కోసం ఆక్రమణలు చేయడానికి మనుషులు యుద్ధాలు చేస్తూ వచ్చారు. నేల, నీరు సహా సమస్త వనరుల మీద, సాటి మనుషుల మీద అదుపు కోసం అనేక వ్యవస్థలు ఏర్పడ్డాక, ప్రయోజనాల వైరుధ్యం తారస్థాయికి చేరినప్పుడు మాత్రమే భౌతిక యుద్ధాలు అవసరమవుతాయి. అన్ని జీవనరంగాలలో సభ్యత, సున్నితత్వపు విలువలు ఏర్పడినట్టే రణరంగాలకు నియమావళి రూపుదిద్దుకుంది. యుద్ధం దుర్మార్గమైనదే, యువకులకు వృద్ధుల చేత తలకొరివి పెట్టించే కర్కశత్వమే, కానీ, యుద్ధం వెలుపల ఉండే సమాజాలు ప్రశాంతంగా, ఏ ఘర్షణలూ విషాదాలూ లేకుండా ఉన్నాయనుకుంటే అమాయకత్వం. ఏ అలజడీ లేనట్టుగా పైకి కనిపించే సమాజగర్భంలో అనేక అగ్నిపర్వతాలు రగులుతూ ఉంటాయి. నాగరికతా కిరీటాల సమాజాలు, ప్రభుత్వాలు ఇంకా అనేక అగాధాలను, అంతరాలను, వివక్షలను, విద్వేషాలను అనుమతిస్తూనే ఉన్నాయి. అన్ని ఉద్వేగాలను రద్దుచేసి, చావు--.. బతుకు అనే ద్వంద్వం మాత్రమే మిగిలే యుద్ధరంగాలలో కూడా చర్మపు రంగు, మత విశ్వాసాలు, జాతి, తెగ, మతం, కులం వర్ధిల్లుతూనే ఉంటాయి. 


ఉక్రెయిన్ మీద రష్యా చేసిన దాడి అనేక సన్నివేశాలను రచించింది. ఒకటి, నేరుగా బాధితులయిన ఉక్రెయిన్ పౌరులు, ముఖ్యంగా పట్టణాల వాసులు. వారు సురక్షిత ప్రాంతాలకు, పొరుగు దేశాలకు తమ ప్రాణరక్షణ కోసం తరలివెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. కరోనా పేరిట లాక్ డౌన్ విధించినప్పుడు భారతదేశ పట్టణాల రహదారులమీద వలసకార్మికులు వేలాదిగా లక్షలాదిగా ఎట్లా పాదయాత్ర మొదలుపెట్టారో, మొదటి బాంబు పడిన రోజున కీవ్ నగరం దారులన్నీ వెలుపలికి వెళ్లే వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దేశం కాని దేశంలో చదువుకోవడానికి, పనిచేయడానికి వచ్చి ఉంటున్న లక్షలాది మంది ఆసియన్లు, ఆఫ్రికన్లు వీరిది మరొక ఘోష. జీవనరంగాలు స్తంభించిపోగానే, పరాయిస్థలంలో నివసించేవారు తీవ్ర అభద్రతకు లోనవుతారు, ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తమ స్వస్థలాలకు తరలివెళ్లాలని ఆత్రుత చెందుతారు. ఒక పక్కన దాడిని ఎదుర్కొనవలసిన సైనిక బాధ్యత, మరొక పక్క పౌరులను ప్రమాదం నుంచి తప్పించవలసిన పాలనాబాధ్యత నడుమ, దేశపౌరులు కాని ఇతరుల సంరక్షణ బాధ్యత కష్టతరమవుతుంది. అనుకోని పరిణామాలు జరిగితే, ఇతర దేశాలపౌరులకు జరిగే ఎటువంటి ఇబ్బంది అయినా, దౌత్యసమస్యలకు, అంతర్జాతీయ విమర్శలకు దారితీయవచ్చు. తలదాచుకోవడానికి పొరుగుదేశాలకు వెళ్లకతప్పనప్పుడు, ఆ దేశాలు ఎంతవరకు బాధ్యత తీసుకుంటాయనేది మరొకప్రశ్న. 


రష్యా, ఉక్రెయిన్ నడుమ యుద్ధమేఘాలు చాలా రోజుల ముందు నుంచే కమ్ముకుంటున్నప్పటికీ, భారతీయ విద్యార్థులను వెనక్కిరప్పించుకోవడంపై కేంద్రప్రభుత్వం అలక్ష్యం వహించిందన్న విమర్శలను వింటున్నాము. ఇప్పుడు, ఆ సంక్షోభ పరిస్థితుల నుంచి రక్షించడంలో చేయవలసినంత చేయలేకపోతున్నదని, దేశం తిరిగివచ్చిన విద్యార్థులు చెబుతున్నదానిని బట్టి అర్థమవుతున్నది. భారతీయ విద్యార్థులకు సరిహద్దుల దాకా చేరుకోవడం కష్టమవుతున్నది. చేరుకున్నాక, పొరుగుదేశాలలో ప్రవేశించడానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమను విమానాలలో వెనక్కు తీసుకువెళ్లే వంతు వచ్చేవరకు నిరీక్షణలో, ఆలనాపాలనా తగినంతగా ఉండడం లేదు. ఇవన్నీ కాక, ఉక్రెయిన్ లోనే బంకర్లలో ఉండిపోయినవారు సహాయం కోసం చూస్తూనే ఉన్నారు. రైళ్లకోసం బస్సుల కోసం గుమిగూడినవారి మీద బాంబులు పడుతున్నాయి. చనిపోతున్నారు. భారతీయ విద్యార్థులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఒక పక్షం, ఇతర దేశస్థుల తరలింపు జరుగుతున్నదని తెలిసినా దాడులు జరుపుతున్నారని మరొకపక్షం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ మధ్యలో, ఎన్నికల వేళ, తగినంత ప్రయోజనం కోసం భారతీయుల తరలింపును పంచరంగులలో చూపించే హీన కార్యక్రమం ఒకటి సాగుతున్నది. అంతా బాగానే ఉన్నదని చెప్పమంటూ విమానం దిగిన బాధితులను అధికారులు బతిమాలుకుంటున్నారట. 


ఎందుకు ఆ దేశం వెళ్లవలసి వచ్చింది భగవంతుడా అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అది సహజమే. ఉక్రెయిన్ లో మరణించిన భారతీయ విద్యార్థి తండ్రి, ఇంటర్ మీడియెట్ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన తన కుమారుడికి దేశంలో మెడికల్ సీటు రాకపోవడం వల్లనే విదేశాలకు వెళ్లవలసి వచ్చిందని వాపోయారు. దానితో రిజర్వేషన్ల మీద చర్చ మొదలయింది. అర్హులయిన అందరు విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులో ఉండేలా తగినన్ని కళాశాలలను తక్కువ ఫీజులతో, ప్రభుత్వ యాజమాన్యంలో ఏర్పాటు చేయడం దీనికి పరిష్కారం అవుతుంది తప్ప, రిజర్వేషన్లను తప్పుపట్టడం సరికాదు. మన దేశంలో ప్రైవేటు కళాశాలలు వసూలు చేసే ఫీజుల కంటె తక్కువలో చదువుకోవచ్చునని ఉక్రెయిన్ కు వెళ్లారు, ఎవరూ ఊహించని విధంగా ఈ ఉపద్రవం వచ్చింది. ఉపద్రవం నుంచి బయటపడడంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక సామాజిక వివక్ష విద్యార్థులకు ఎదురయింది. అది వర్ణవివక్ష. భారతీయులకే కాదు, తెల్లచర్మంలేని ఆఫ్రికన్లకు, ఇతర దేశాల ఏషియన్లకు కూడా ఆ వివక్ష అనుభవంలోకి వచ్చింది. రైళ్లలో, బస్సుల్లో సరిహద్దులకు తరలించేటప్పుడు, ఉక్రెయిన్లకు, ఇతర యూరోపియన్లకే ప్రాధాన్యం లభించింది. సరిహద్దుల్లో తోపులాటలకు, ఘర్షణలకు కారణం తెల్లవారికి ప్రాధాన్యమివ్వడం. ఇక, అంతర్జాతీయ వార్తాచానెళ్లలో అయితే, ఉక్రెయిన్ నుంచి తరలివస్తున్న వారి కష్టాలను వర్ణించేటప్పుడు, ప్రధానంగా ఉక్రెయిన్లనే చూపిస్తూ, ఎక్కడో ఇరాక్ లోనో, ఆఫ్ఘనిస్థాన్ లోనో, సిరియాలోనో కాదు, మన ఐరోపాలోనే ఇటువంటి పరిస్థితి రావడం ఎంత ఘోరం, ఐరోపావాసులకు ఎంత కష్టం వచ్చింది-, అంటూ కథనాలు ప్రసారం చేస్తున్నారు. రెండో ప్రపంచయుద్ధానికి ప్రధాన రంగస్థలం ఐరోపానే. కానీ, ఆ తరువాత యుద్ధరంగాలు అధికంగా దక్షిణార్థగోళంలోనే. చిన్నచిన్న దాడులు, ఆక్రమణలు జరగలేదని కాదు, బోస్నియాయుద్ధంలో అత్యంత అమానుషత్వం చెలరేగలేదనీ కాదు. కానీ, సాపేక్షంగా గత ముప్పాతికేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఐరోపాలో ప్రస్తుతానిది ఉపద్రవమే. కానీ, ఒళ్లంతా గాయాలై ఉన్న పశ్చిమాసియాను ఎవరు ఓదార్చారు? వారి ప్రాణాలకు ఎవరు విలువ ఇచ్చారు?

Updated Date - 2022-03-05T06:13:50+05:30 IST