జీవనానంద హేతువు
ABN , First Publish Date - 2022-01-15T06:36:44+05:30 IST
మానవ జీవన గమనంలో పండుగలు – జీవన మూల్య హేతువులు! సంప్రదాయం – ప్రాకృతికత్వాల మేలుకొలుపులు – తెలుగులు సంస్కృతీ వాహికలు!!...
మానవ జీవన గమనంలో పండుగలు – జీవన మూల్య హేతువులు!
సంప్రదాయం – ప్రాకృతికత్వాల మేలుకొలుపులు – తెలుగులు సంస్కృతీ వాహికలు!!
మేషం నుంచి–మీనం దాకా సాగే పన్నెండు రాశుల గమనానికి ఉత్తర – దక్షిణాయనాల కాలం ‘ముక్తి’ పధం!!
‘స్వ’గతాల ‘సంక్రాంతి’ – మురిపాల ‘ము(గ్ధ)ద్దబంతి’!! సంస్కృతీ విరిశ్రుతి!!
మంచు కురిసే శీతగాలులు – పుష్యమాసపు సుధల – సూర్యతేజాలు
హేమంతంలో వసంతావిష్కరణ ప్రాకృతిక ఉత్సవ సౌరభాలు.
మకర – కర్కాటక సంక్రమణాలు సౌరగమనాలు –శాస్త్రం శాస్త్రీయతలకు నెలవులు!!
నెలగంట పట్టిన లోగిళ్లు – పురివిప్పిన గుమ్మిళ్లు అలరింపులు
మురిపాలు ముచ్చట్లు – రంగవల్లుల జాళ్ళు శోభాయమానాలు.
వైకుంఠపాళీలు వసుధ సూర్యరధాలు పుష్యమాసపు సుధలు
రమణీయంగా కమనీయంగా విందులు కురిపిస్తుంటాయి.
భోగిమంటల క్రాగి – భోజ్యవంటలు గ్రోలి
పితరాళిదానధర్మాల సంస్మరణలతేలడం
పాడి–ప్రాధాన్యతల – పశుపక్ష్యాదుల ఆరాధనం
ముక్కోటి దేవతల్ని ఒక్కటిగా కోరికొలిచే కొలుపులు
బొమ్మల కొలువులు – రేగుపండ్లతో బాల్యానికి వేడుకలు
ఆపై తలపై పడే చిన్ని నాణాలు ఆశగా ఆత్రంగా ఏరుకోవడంలోని ఆత్రతలు ఒకప్పటి బాల్యంస్మృతులు
తరాల అంతరాల్లో కళలు – సంస్కృతులు
జానపదాలు – జ్ఞానపదాలు ఆరుగాలం శ్రమనిర్వేదనలు
మళ్ళా జీవనానంద హేతువులుగా మరోసారి కాలం ముంగిట్లోకి రావాలి.
మళ్లీ వచ్చే సంక్రాంతినాటికైనా వెన్నెముకల ధర్నాలు
వేల ఎకరాల త్యాగాలు హేతువులు ఫలించాలి.
‘పాలకుల’ రాజనీతి ధర్మం
‘పాలితుల’పాలిట సమ్యక్రాంతుల్నివ్వాలి.
మరో సంక్రాంతికి మోసులెత్తే ఆశలుగా చిగురించాలి.
– వి.యస్.ఆర్.ఎస్. సోమయాజులు