ఆధునిక యుగానికి ప్రథమ కవయిత్రి

ABN , First Publish Date - 2022-03-21T07:25:58+05:30 IST

వేమూరి శారదాంబ (1881-1899) ‘మాధవ’ అనే మకుటంతో అల్లిన 101 పద్యాల కూర్పును ‘మాధవశతకం’గా ‘కలావతి’ పత్రిక 1901 సంవత్సరం మార్చి నుంచి మే నెల వరకు ప్రచురించింది.

ఆధునిక యుగానికి ప్రథమ కవయిత్రి

వేమూరి శారదాంబ (1881-1899) ‘మాధవ’ అనే మకుటంతో అల్లిన 101 పద్యాల కూర్పును ‘మాధవశతకం’గా ‘కలావతి’ పత్రిక 1901 సంవత్సరం మార్చి నుంచి మే నెల వరకు ప్రచురించింది. ఆధునిక యుగ ప్రారంభంలో పాత, కొత్త తరాల స్త్రీల సాహిత్యానికి వారధి వంటిది ఈ మాధవశతకం. 125ఏళ్ల క్రితం శారదాంబ తన 14 ఏటనే ఇంతటి వైదుష్యంతో, ఎంతో సామాజిక స్పృహతో ఈ రచన చేసింది. ఆమె తన 16వ యేటనే ‘నాగ్నజితీ పరిణయం’ అనే ప్రబంధాన్ని కూడా రాసింది. భాగవతంలోని కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన నాగ్నజితిని అప్యర్థకంగా మాత్రమే కాక ఆమెకొక స్వతంత్ర వ్యక్తిత్వం ఉండాలనే భావనతోనేమో- ఆమెను ‘సుదంత’ అనే పేరుతో పరిచయం చేసింది. అంతేకాదు, ఆమెను సంగీత, సాహిత్య, చిత్రలేఖన కళా కోవిదురాలిగా తీర్చిదిద్దింది. నాగ్నజితిలో సంగీత, సాహిత్య కళానిధియైున శారదాంబ వ్యక్తిత్వం ప్రతిఫలిస్తూ ఉంటుంది. 1860-70ల తర్వాతి కాలంగా పరిగణించే ఆధునిక యుగంలో వేమూరి శారదాంబనే ప్రథమ కవయిత్రిగా గుర్తించాలి.


స్త్రీ విద్యకు దిక్సూచి వంటిది మాధవ శతకం. ఇందులో స్త్రీ విద్యా విషయాన్ని శతకమంతా అంతస్సూత్రంగా కొనసాగిస్తూనే స్త్రీవిద్యాభివృద్ధికై ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దిశానిర్దేశం చేసింది శారదాంబ. సమాజంలోని విద్యావంతులను సంస్కరించటం, సమాజ సంస్కృతిని ప్రశ్నిం చటం, స్త్రీ విద్య వల్ల కుటుంబాలకు ఎంతటి ప్రయోజనం ఉంటుందో చెప్పటం, భర్తలకు ఎంతటి సుఖమో తెలియజెయ్యటం, భార్య చదువు వల్ల భర్తలలో కలిగే భయాందోళలను పోగొట్టటం, స్త్రీలలో కూడా తమ విద్యాభివృద్ధికై కాలాన్ని సద్వినియోగపరచుకొనే చైతన్యాన్ని కలిగించటం... ఇది ఈ శతకంలో శారదాంబ కార్యాచరణ ప్రణాళిక అనుకోవచ్చు.


స్త్రీల దుస్థితి పట్ల తనలో కలిగిన విచారాన్ని పోగొట్టుకోవటానికి శతకం రాస్తున్నానని చెబుతూ, తన మాటలను ‘చెవిని రిక్కించు’ కొని స్త్రీజాతిని బ్రోవ టానికి ‘చయ్యన’ రమ్మని తన దైవం మాధవుణ్ణి వేడుకొంటుంది శారదాంబ. ఇందులో ఆమెకు స్త్రీజాతిని కాపాడే ఆరాటమే తప్ప స్వార్థం లేదు. స్త్రీల దుస్థితిని పోగొట్టాలంటే ముందుగా విద్యనేర్పించాలని, అప్పుడే వారికి జ్ఞానం కలుగుతుందని ఆమె భావించింది. ప్రతి మనిషికి తనని తాను అంచనా వేసుకోవటానికి గాని, మిగిలినవారితో సమానమైన గౌరవం తన పుట్టుకకు ఉన్నదో లేదోనన్న ఎరుక కలగటానికి గాని చదువే ఉపయోగపడుతుంది.


స్త్రీలకు విద్య అనవసరమనే కరుడుగట్టిన భావజాలంతో ఉన్న సమాజాన్ని సంస్కరించాలని తన దైవమైన మాధవుడ్ని మధ్యవర్తిగా చేసుకొని, ఆ మాధవుడికి కర్తవ్యాన్ని సూచించింది. దానికై సద్బుధులవద్ద స్త్రీలకు విద్యను నేర్పించమంది. అయితే అది అంత సులువైన విషయం కాదు. అందుకని ముందుగా విద్యావంతుల మనస్సు ప్రక్షాళన అయ్యే విధంగా వారిని సన్మార్గవర్తనులుగా చేయమని అడిగింది. అంతేకాదు, పురుషులలోని లోపాలను సరిదిద్దమనీ, ముఖ్యంగా స్త్రీలను హింసించేవారి మనస్తత్వాన్ని మార్చమని అడుగుతుంది. స్త్రీవిద్యకు ఆటంకప్రాయమైన సామాజిక మనస్తత్వానికి తగిన చికిత్స అవసరమని భావించింది. అప్పుడే పురుషులలో స్త్రీవిద్యను అంగీకరించే మనస్సు సిద్ధమవుతుతుంది.


మనువు కూడా స్త్రీలను పూజించమనే ‘ముచ్చట’ చెప్పాడుగాని స్త్రీలను బాధ పెట్టే విషయాలను గురించి పేర్కొనలేదన్న విషయం గుర్తించమంటుంది శారదాంబ. స్త్రీవిద్య పట్ల వ్యతిరేకతగల సమాజాన్ని సామ దాన భేద దండో పాయాలతో సంస్కరించాలంటుంది. స్త్రీ పురుషులలో మేధోశక్తులు సమాన మనే భావనను కలిగిస్తూ ఇలా రాస్తుంది:


‘‘వలదనుటెట్లు విద్య మగవారలకెట్టులనట్లేకదా

పొలతులు విద్యయందు రుచి పూనకయుండుట తప్పిదంబుగా

లలనలు నాలుగక్షరములం జదవంగనె విద్య కాదుగా

తెలివి సమమ్ము పూనగను స్త్రీపురుషుల్థరయందు మాధవా!’’  


స్త్రీలు చదువుకుంటే వారిలో చెడ్డగుణాలు ఏర్పడతాయనే అపప్రథకు చెంపదెబ్బకొడ్తూ మగవారు చదువుకుంటేకూడా చెడ్డవారైనట్లేకదా అంటుంది:


‘‘చదివిన దుర్గుణంబులను జాలగబొందుదురండ్రుగాని య

య్యది చెడుబుద్ధులన్‌ గరపునట్లయినన్మగవారు నేర్వ చె

ల్లదుగద విద్యనెట్లు మది రంగుగ నేరుచుచున్నవారలి

య్యదనున నందరున్‌ జెడగునందిరి జూడగదయ్య మాధవా!’’ 

- అని సమాజానికి చురకవేస్తుంది.


స్త్రీలు చదువుకుంటే కుటుంబానికి ఎంత ప్రయోజనమో చెప్తూ- విద్యావంతులైన స్త్రీలు కుటుంబంలోని వ్యక్తులతో సత్సంబంధాలతో మెలుగు తారనీ, పిల్లలను మంచిబుద్ధులతో పెంచుతారని అంటుంది. ఆడపిల్ల చదువుకు ఖర్చుపెట్టడం యిష్టంలేని వాళ్లకు స్త్రీల చదువు కూడా లాభ దాయకమే అని చెపుతూ- ఒకసారి ఖర్చుపెట్టి ఆడపిల్లను చదివిస్తే తరు వాత వచ్చే తరతరాల ఆడపిల్లలు తమ తల్లులదగ్గరనే చదువుకోగలరని అంటుంది. చదువుతో స్త్రీలకు శాస్త్రజ్ఞానం ఏర్పడుతుందనీ, దానితో అవసర మైనప్పుడు శిశువులకు స్వయంగా చికిత్సచేసి బిడ్డలను కాపాడుకోగలుగు తారని చెప్పింది. పితృస్వామ్య కుటుంబాల్లో యింటికి పెద్ద అయిన మామకు కోడలు చదువు పట్ల నిరసన భావం ఉంటుంది. కాబట్టి మామలకు స్త్రీ విద్యా ప్రయోజనాన్ని రుచి చూపించాలనుకొని- మామ లవణంతెచ్చి వడ్డించ మంటే కోడలికి అర్థంతెలియక ఆవుపేడతెచ్చిన విషయాన్ని ఉదాహరిస్తుంది. 


ఇక భార్య చదువుకొంటే- ‘పడతులు విద్యనేర్చినను భర్తలకెంత సహాయు లౌదురెయ్యెడలనునైన’ అంటూ భర్తకు సహాయకురాలిగా ఉంటుందనీ, ‘స్త్రీలకు విద్యనేర్పినను జేకురు సౌఖ్యములెల్ల’ అని చెప్పి భర్తకు అది ఎంతో సుఖాన్ని కలిగిస్తుందనీ చెప్పి వారి మనస్తత్వానికి కావలసిన చికిత్స చేయాలను కొంది. మనువు చెప్పినట్లుగా భార్య ‘కరణేషుమంత్రి’ కావాలంటే, ‘ధైర్యము పూని విద్య ప్రమదామణి నేరక మంత్రి యెట్లగున్‌’ అంటూ మంచి మంచి ఆలోచనలు యివ్వటానికైనా భార్య చదువుకొని ఉండాలంటుంది. ఇంటి వ్యవహారాల్లో సొమ్ములెక్కలు ఆమే చూసుకోగలిగితే భర్తకు సుఖంగా ఉంటుందంటుంది. తీరికలేని పనుల మీద బయటకువెళ్లి అలసివచ్చిన భర్తకు వార్తాపత్రిక చదివి వినిపించి దేశ సమాచారాన్ని తెలియజేస్తుందని చెబుతుంది. ‘అంగనలెల్లరుం సహజమౌ తెలివిం దగబొందియుండగా రంగుగ విద్యనేర్చిననె రాజిలుగా తెలివెందుమాధవా’ ‘ముద్దరాండ్రకింపలరగ నాల్గు రెట్లు మగవారలకన్నను బుద్ధియెక్కుడంచిలదెలుపంగ’ స్త్రీలకు చదువెందుకని మాట్లాడకూడదని చెప్పింది. స్త్రీలకు చదువే హస్తభూషణం అయినప్పుడు భార్యలకు నగలమీది వ్యామోహంతగ్గి నగలకై ధనాన్ని అడగరని చెప్పింది. చదువుకున్న స్త్రీలు దుష్ప్రవర్తనతో ఉంటారనే భావం ఆనాటి మగ వారిలో నరనరాల్లో జీర్ణించుకొని ఉండేది. కాబట్టి దానికి విరుగుడుగా మగవాళ్ళు భార్యలలో కోరుకొనే సత్ప్ర వర్తన, నాగరికత స్త్రీలకు విద్యాజ్ఞానంవల్లనే వస్తుందని చెప్పింది. భర్తలు అంత సులభంగా ఈ విషయాలను అంగీకరించరనే భావంతో కవయిత్రి వారిని నయానా భయానా కూడా ఒప్పించే పయత్నం చేస్తుంది. స్త్రీలకు విద్య లేకుంటేనే, భార్య మూఢురాలిగా ఉంటేనే నయమనుకొనే భర్తలు మూగ అమ్మాయిలను పెళ్ళిచేసుకోవాలంటుంది. అంతేకాదు చదువుకొన్న భర్తలు చదువులేని అమ్మాయిని అర్ధాంగిగా చేసుకొంటే అతని శరీరంలో సగభాగం చచ్చుపడినట్లయి శక్తిహీనుడు అవుతాడని, అదే అతనికి పెద్ద శిక్ష అని అర్థం వచ్చేటట్లుగా రాస్తుంది.


పితృస్వామ కుటుంబాల్లో భర్తలకు స్త్రీలు చదువుకుంటే తమ పురుషా ధిక్యతకు ముప్పు వస్తుందనే భయం ఉంటుంది. శారదాంబ ఈ భయానికి మనోవిజ్ఞాన చికిత్స చేయాలనుకొంది. తనని దేవుడంటూ పూజించాల్సిన భార్య చదువుకుంటే ఇక గౌరవించదనీ, ఇంటి చాకిరీ కూడా తన నెత్తి మీద పడుతుందనీ, ఆమెలో దుర్గుణాలు ఏర్పడతాయనే అపోహలు భర్తల్లో ఉంటాయనీ, కానీ దానికి భిన్నంగా, స్త్రీలు విద్యావంతులైతే భర్తలను మరింతగా గౌరవిస్తారని చెపుతుంది:


‘‘ముదితలకెల్ల యోగ్యతలు మున్మును గష్టముచేసి యాభువిన్‌

చదువుటవల్ల రావు సహజంబులుగానె లభించునందుర

య్యది నిజమైన శాస్త్రములనన్నియు నేల నిరర్థకంబులే

మదిగనట్టులైన మగవారలకుం జదువేల మాధవా!’’


స్త్రీలు విద్యావంతులైతే స్వతంత్రులవుతారనీ, తమ మాటలను పట్టించు కోరనే భయం వారిలో ఉంటుంది కాబట్టి వారి నాడిని పట్టుకొన్న కవయిత్రిగా-

‘‘తరుణులు విద్య నేర్చిన స్వతంత్రములిమ్మటంచుండ్రటంచునం

దురే యది కల్ల దాము దగునో యెవి పూనగనెవ్వి గూడదో

యెఱింగియె పొందుచుండ్రుగద యెప్పుడు గూడను బాగవిద్యలన్‌

గరచినవారు గాననిది న్యాయమె జెప్పగచూడ మాధవా!’’


- అని సామాజిక సంస్కృతిని ప్రశ్నకు పెట్టింది. స్త్రీలకు స్వాతంత్య్రం యిచ్చేందుకు పురుషులకేమి హక్కు ఉందని ఈ నాడు స్త్రీలు చర్చించుకొనే విషయాన్ని ఆనాడే శారదాంబ చెప్పింది. స్త్రీలు తన స్వతంత్రాన్ని తామే పొందుతారని, దాన్ని బాధ్యతతో ఏమేరకు వినియోగించుకోవాలో వారికి తెలుసని చెప్పిన క్రాంతదర్శి శారదాంబ. స్త్రీలు కూడా తీరిక సమయాల్లో పొరుగింటి అరుగుమీద కూర్చొని భారత కథలను తోచినట్లు చెప్పుకోవటం కాక గ్రంథ పఠనంచేసి జ్ఞానాన్ని పొందాలంటుంది. నోములు, వ్రతాలకు వెచ్చించే సమయాన్ని చదువుకి వాడమంటూ సాంస్కృతిక విప్లవ భావాలను వారిలో రేకెత్తిస్తుంది. గర్భిణి, ప్రసవ సమయాల్లో తప్ప మిగిలిన కాలంలో స్త్రీలు ధైర్యంతో, పూనికతో విద్యార్జన చేయాలంటుంది.


మన స్త్రీలలో అవిద్య ఎంత ప్రాచీనమైనదో కూడా ఈ మాధవశతకం వల్ల అర్థమవుతుంది. క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన గాథాసప్తశతిలో స్త్రీలు తమ భర్తలు పొరుగూళ్ళకు వెళ్లిన తరువాత రోజులు లెక్కపెట్టటానికై గోడల మీద గీతలు గీసే వారని ఉంది. మాధవశతకంలో కూడా స్త్రీలు పాల లెక్కలకై గీతలు గీసేవారని కవయిత్రి పేర్కొంటుంది. దీన్ని బట్టి, 19 శతాబ్దానికి కూడా స్త్రీ విద్య అదే స్థితిలోనే ఉన్నట్లుగా అర్థమవుతుంది.

125 సంవత్సరాలక్రితం రాయబడిన ఈ మాధవశతకం మహిళావిద్యలో ఒక మైలురాయి. స్త్రీ విద్యకు సంబంధించి సమాజంలోని తప్పిదాలను తర తరాలకు పాఠక హృదంతరాళాల్లో నాటుకొనేటట్లుగా చెప్పిన రచన కూడా. ఈ శతకంలో వ్యక్తమయ్యే స్ఫూర్తిని విస్మరించటంవల్లనే-- ప్రభుత్వాలు స్త్రీల విద్యా శాతాన్ని గురించి ఎన్ని కాకిలెక్కలను కాగితంమీద చూపించు కొంటున్నా-- ఇంకా గ్రామీణ, బలహీనవర్గాల స్త్రీలలో అవిద్య తాండవి స్తున్నది. మహిళావిద్యకు మాధవశతకాన్ని భద్రాసనంగాచేసి తన 18వ యేటనే నింగికెగసిన వేమూరి శారదాంబ నేటికీ, ఎన్నటికీ స్త్రీవిద్యకు వేగుచుక్కగా ప్రకాశిస్తూనే ఉంటుంది. 


జె. కనకదుర్గ

94911 40299

Updated Date - 2022-03-21T07:25:58+05:30 IST