ఉత్తరాంధ్ర జపమంతా రాజకీయ ఎజెండానే!

ABN , First Publish Date - 2022-10-21T05:56:19+05:30 IST

రాజధాని పేరున నేడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలవల్ల ఉత్తరాంధ్ర వెనుకబాటు మరోసారి చర్చనీయాంశమైంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి...

ఉత్తరాంధ్ర జపమంతా రాజకీయ ఎజెండానే!

రాజధాని పేరున నేడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలవల్ల ఉత్తరాంధ్ర వెనుకబాటు మరోసారి చర్చనీయాంశమైంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి తమ విధానమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు రాజధానుల్లో భాగంగా పరిపాలనా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమంటూ ప్రభుత్వం రాజధాని మార్పుకు సన్నాహాలు చేపట్టింది. రాజధాని వస్తోంది కదా అని కొందరు దీనిని స్వాగతించారు. అయితే కోర్టుల జోక్యంతో బ్రేకులు పడ్డాయి. నేడు రాష్ట్రంలో ఒకపక్క అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర, వైసీపీ ప్రోద్బలంతో విశాఖ రాజధానికై జరుగుతున్న కార్యక్రమాలు... వీటన్నింటి మధ్య ఈ రాష్ట్రం ఎటు పోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.


ఇక్కడ వికేంద్రీకరణ, అభివృద్ధి అనే రెండు ప్రశ్నలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. వికేంద్రీకరణ అంటే నిర్ణయాలు చేసే అధికారం కింది స్థాయికి వరకు ఇవ్వడం. దీనినే అధికార వికేంద్రీకరణ అంటారు. అయితే నేడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు ఉన్న హక్కులను క్రమేణా హరించివేస్తోంది. విద్య, విద్యుత్‌ వంటి రంగాలలో సంస్కరణల రూపేణా రాజ్యాంగం పేర్కొన్న ఫెడరల్‌ వ్యవస్థను ధ్వంసం చేస్తోంది. నేడు వికేంద్రీకరణ వాదన చేస్తున్న జగన్‌ ప్రభుత్వం విచిత్రంగా ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. సరికదా, తానే ఈ సంస్కరణలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాల కంటే ముందువరసలో నిలిచింది. కేంద్రంతో పోటీగా తాను కూడా కింది స్థాయి స్థానిక సంస్థల అధికారాలను హరించి వేస్తోంది. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను, చెత్తపన్ను ఎంత విధించాలనే అధికారాలు కూడా ఎన్నికైన పాలకమండళ్ళకు లేకుండా చేస్తూ జీవోలు జారీ చేసింది. పంచాయితీలకు సమాంతరంగా, నేరుగా తన ఆధీనంలో నడిచే గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్మించింది. ప్రజలచేత నేరుగా ఎన్నుకోబడిన సర్పంచులకు కనీస అధికారాలు కూడా లేకుండా చేసింది. దీనిపై సర్పంచులు అమరావతిలో చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసు జులుం ప్రదర్శించింది. ఒక పక్క అధికార కేంద్రీకరణకు దారితీసే ఇటువంటి చర్యలను చేపడుతూ, మరోపక్క వికేంద్రీకరణ గురించి మాట్లాడడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక వేరే ఎజెండా ఉందా అనే సందేహం ఎవరికైనా కలగక మానదు.


విశాఖ నగరం ఇప్పటికే అభివృద్ధి అయింది కనుక, ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తే, ఖర్చు పెద్దగా ఏమీ ఉండదనే వాదనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడే తప్పకుండా వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. అదేమిటంటే– ఏ రాజధానీ లేకపోయినా విశాఖ నగరం ఎలా అభివృద్ధి చెందిందీ అని. ఉమ్మడి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నగరంగా విశాఖ నిలవడానికి కారణం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరిగిన పారిశ్రామికీకరణ, ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థల స్థాపన. విశాఖ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన ఈ ప్రభుత్వ రంగ సంస్థలను బలహీన పరచడమే పనిగా నేడు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలుగు ప్రజలు పొరాడి సాధించుకున్న, రాష్ట్రానికే తలమానికమైన విశాఖపట్నం స్టీలు ప్లాంటును అమ్మేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కార్మికులు, రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. దీనిపై జగన్‌ ప్రభుత్వ వైఖరి మోసపూరితంగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది. ప్రధానికి ముఖ్యమంత్రి ఇచ్చిన లేఖలలో దీని ప్రస్తావన కనీసంగా కూడా లేకపోవడం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరచింది. పార్లమెంటులో వైసీపీ సభ్యులు ప్రశ్నలు వేయడం, మోదీ ప్రభుత్వం నుంచి ‘తగ్గేదే లే’ అన్న జవాబే వచ్చినా వీరు నోరు మూసుకుని కూర్చోవడం పరిపాటిగా మారింది. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏకంగా ఇది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమంటూ బీజేపీ పాడుతున్న పల్లవినే ఎత్తుకున్నారు. దీనర్థం– ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్టీలు ప్లాంటును ముంచేస్తారన్నదే! కేంద్రంతో పోటీ పడుతున్నట్లుగా జగన్‌ ప్రభుత్వం విశాఖలోని గంగవరం పోర్టులోని 10.39శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతోసహా 2852.26 ఎకరాల భూమిని అదాని సంస్థకు ధారాదత్తం చేసింది. మూతబడ్డ చక్కెర, జూట్‌ పరిశ్రమలను తెరిపించడానికి కనీస చర్యలు కూడా చేపట్టలేదు సరికదా, వైసీపీ మాజీ మంత్రి తానే దగ్గరుండి చిట్టివలస జూట్‌ మిల్లు యజమాన్యానికి సహకరించారు. ఐటీ రంగం, సినీ ఇండస్ట్రీలను రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలేమీ చేసింది లేదు. పారిశ్రామికీకరణ ఇలా ఉంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్యం?


ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారు ఎవరైనా నేడు మోదీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని తప్పక గమనంలో ఉంచుకోవాలి. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్నీ కేంద్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక అభివృద్ధి పేకేజీలను ఎగ్గొట్టింది. విశాఖ రైల్వే జోన్‌ గత ఎనిమిదేళ్లుగా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. తాజాగా ఇది సాధ్యం కాదని అధికారులు తెలిపారు. ఈ పేరుతో వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను ఎత్తేయాలని మాత్రం మోదీ ప్రభుత్వం నిర్ణయించడం దగా తప్ప మరొకటి కాదు. ఇక విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఊసే మరిచారు. ఉత్తరాంధ్రలో నిర్మించవలసిన విద్యా సంస్థల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. పెట్రో యూనివర్సిటీ నిర్మాణమే ప్రారంభం కాలేదు. గిరిజన యూనివర్సిటికైతే స్థల సేకరణే జరగలేదు. గత రాష్ట్ర ప్రభుత్వం దీని ఏర్పాటుకు భూ సేకరణ చేసి, ప్రహారీగోడ కూడా నిర్మించిన స్థలాన్ని జగన్‌ ప్రభుత్వం కాదని, వేరే చోటుకు మార్చేయాలని నిర్ణయించింది. ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఒక ఊతం ఇచ్చినట్లయింది. అన్ని అంశాల్లోనూ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని దోషిగా బోనులో నిలబెట్టవలసిన జగన్‌ ప్రభుత్వం, ఆ పని చేయకపోగా నేడు చర్చ అంతా రాజధాని సమస్య చుట్టూ తిప్పి, కేంద్ర ప్రభుత్వం బోను నుంచి తప్పించుకునేందుకు సహాయపడుతోంది.


వీటన్నింటినీ మించి, రాష్ట్ర ప్రజలను ఐక్యం చేయవలసిన ప్రభుత్వం, గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఆఖరుకు ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో కూడా లేనంతగా నేడు ప్రాంతీయ విభేదాలను, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. రాష్ట్ర విభజనతోనూ, మోదీ ప్రభుత్వ ద్రోహంతోనూ ఇప్పటికే అన్ని రకాలుగానూ నష్టపోయిన రాష్ట్రాన్ని ప్రజలందరి సహకారంతోనూ అభివృద్ధి పథంలోకి నడిపించే ప్రయత్నం చేయకపోగా, ఆ ప్రజలనే చీల్చేలా వ్యవహరించడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు.


ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించే విశాఖ రాజధాని అని చెబుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ కాలంలో ఎన్ని నీటి ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పాలి. రైల్వే జోన్‌, మెట్రో రైలు, విద్యా సంస్థల విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలేదో చెప్పాలి. స్టీలు ప్లాంటు అమ్మకాన్ని అనుమతించేది లేదని మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు హెచ్చరించలేక పోతున్నారో, తిరిగి ఆ పల్లవే ఎందుకు ఎత్తుకున్నారో ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని ఇంకా విశాఖకు రాలేదు కానీ, హత్యా సంస్కృతి మాత్రం వచ్చేసింది. భూ మాఫియా చురుకుగా సర్దేసుకుంటోంది. తాజాగా ఋషికొండ, దసపల్లా హిల్స్‌ వంటి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు జగన్‌ ప్రభుత్వ ప్రత్యక్ష అండతో అన్యాక్రాంతమై పోతున్నాయి. ఈ పనులు ఇంకా బాగా చక్కబెట్టుకోవడానికేనా రాజధాని అనే సందేహం సాధారణ ప్రజలలో కూడా నేడు కలుగుతోంది. అభివృద్ధికి అవసరమైన ఏ చర్యలూ చేపట్టకుండా కేవలం రాజధాని మాత్రమే సర్వరోగ నివారణిలా నమ్మబలకడం విడ్డూరమే.


రాజధాని ఏ ఒక్క పార్టీకో, సంస్థకో చెందినది కాదు. ఐదు కోట్ల మంది పైగా ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం. ఇటువంటి సున్నితమైన విషయంపై ఏకపక్ష నిర్ణయాల వల్ల దీర్ఘకాలంలో నష్టమే జరుగుతుంది. ఈ అంశం కోర్టుల్లో ఉంది కనుక దీనికి నేడు చట్టబద్ధత కూడా లేదు. రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే, మరలా ఈ నిర్ణయాన్ని మార్చదన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. అందుకనే ఇటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడం, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు చేయడమే మార్గం. ఎనిదేళ్లయినా అతి ముఖ్యమైన రాజధానిపై ఇంకా ఎటూ తేల్చలేకపోవడం, కొత్త సమస్యలు సృష్టించడం సిగ్గుపడాల్సిన విషయం. దీనికి ఫుల్‌‍స్టాప్‌ పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2022-10-21T05:56:19+05:30 IST