ప్రతిపక్షాలు గ్రహించని సత్యాలు

ABN , First Publish Date - 2022-10-11T06:18:51+05:30 IST

గుజరాత్‌లో బిజెపిని ప్రజలు రెండున్నర దశాబ్దాలకు పైగా ఎందుకు ఆదరిస్తున్నారు? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రజాదరణ ఎందుకు పెరుగుతున్నదో...

ప్రతిపక్షాలు గ్రహించని సత్యాలు

గుజరాత్‌లో బిజెపిని ప్రజలు రెండున్నర దశాబ్దాలకు పైగా ఎందుకు ఆదరిస్తున్నారు? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రజాదరణ ఎందుకు పెరుగుతున్నదో అవగతమవుతుంది. ప్రజల మనోభావాలను గ్రహించి, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసి వారి ఆదరణను సంపాదించగలిగిన శక్తి మోదీకి ఉన్నదని ప్రతిపక్షాలు తెలుసుకుంటే బిజెపి విజయ రహస్యమేమిటో వాటికి తెలిసిపోతుంది. ఈ రీత్యా వచ్చే డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి ఢోకా లేదని పలు సర్వే సంస్థలు ఇప్పటికే చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అది సహజంగా జరిగే పరిణామమే.


ముఖ్యమంత్రిగా మోదీ గుజరాత్‌లో ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రధాని అయిన తర్వాత కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం మూలంగా గుజరాత్‌లో అభివృద్ధి నిరాఘాటంగా సాగుతుండడం వల్లే ఆ రాష్ట్రంలో బిజెపి ప్రజాదరణను అంతకంతకూ మూటకట్టుకోగలుగుతుంది. ఇవ్వాళ్టికీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లోనే కాదు, దేశమంతటా బిజెపిని ఎన్నికల్లో గెలిపించడం మోదీ వ్యూహరచన వల్లే సాధ్యం.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో హిమాచల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బిజెపి అధికారంలోకి వచ్చింది. దాదాపు 48.8 శాతం ఓట్లు సాధించిన బిజెపి రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేసింది. ‘కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమయ్యేది. ఒక ప్రాజెక్టుకు పునాది రాయి వేసిన ప్రధానే ఆ ప్రాజెక్టును ప్రారంభించిన దృష్టాంతాలు చాలా తక్కువ. కాని మేము ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేయడమే కాదు, వాటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం ద్వారా ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియజేశాం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల హిమాచల్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తూ అన్నారు. ఒక మారుమూల పర్వత ప్రాంతాల్లో ఎయిమ్స్ లాంటి అత్యున్నత స్థాయి ఆసుపత్రిని శరవేగంతో నిర్మించగలుతామని గతంలో ఎవరూ ఊహించలేకపోయారు. మోదీ దీన్ని ఆచరణసాధ్యం చేయగలిగారు. 2019 డిసెంబర్ 4న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన క్రింద బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. సిమ్లా–కాంగ్రా జాతీయ రహదారిపై 247 ఎకరాల స్థలంలో 2017 అక్టోబర్ 3న ప్రధానమంత్రి ఈ ఆసుపత్రికి పునాది రాయి వేశారు. ఆ వెంటనే నిర్మాణం ప్రారంభించి మూడు సంవత్సరాలు దాటకముందే ఆసుపత్రిని ప్రారంభించారు. గత ఏడాదే అక్కడ వైద్య విద్యా కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు హిమాచల్ ప్రజలు ఆరోగ్య సేవలకోసం ఏ చండీగఢ్‌కో, ఢిల్లీకో వెళ్లనక్కర్లేదు. అంతే కాదు, అక్కడి యువకులు అత్యంత నాణ్యమైన వైద్య విద్యను తమ రాష్ట్రంలోనే పూర్తి చేయగలుగుతారు. బిలాస్ పూర్ ఎయిమ్స్ మాత్రమే కాదు, నాలాఘర్‌లో వైద్య ఉపకరణాల పార్క్, బండ్లాలో హైడ్రో ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పారు. అటల్ టన్నెల్ పేరుతో లేహ్–మానాలీ జాతీయ రహాదారిపై నిర్మించిన టన్నెల్ ప్రపంచంలోనే పదివేల అడుగుల ఎత్తులో నిర్మించిన పొడవైన సొరంగ మార్గం. దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఈ సొరంగ మార్గ నిర్మాణం మోదీ కృతనిశ్చయం వల్లే పూర్తి అయింది. ఇలాంటి అనేక కారణాల రీత్యా హిమాచల్‌లో కూడా బిజెపి మరో సారి గెలుపు ఖాయం అని చెప్పక తప్పదు.


అభివృద్ధి, సామాజిక సంక్షేమం విషయంలో మోదీ ఎక్కడా ఎటువంటి వివక్ష చూపలేదు. సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ నినాదాన్ని మనసా వాచా కర్మణా నమ్మినందుకే ఆయనకు విజయాలు దక్కడం సాధ్యమవుతోంది. ఈ వాస్తవాలు చాలా మంది కుహనా లౌకిక వాదులకు, కాలం చెల్లిన భావాల ప్రతిపక్షాలకు అర్థం కాని విషయాలు. ముఖ్యంగా ప్రాంతీయ అసమానతలు, సామాజిక సమస్యలను దూరం చేయాలంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే సరైన పరిష్కారమని మోదీ విశ్వసిస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశం నలుమూలల్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు చోట్ల ఎయిమ్స్‌ను నెలకొల్పింది ఈ ఉద్దేశంతోనే.


మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పదవ ర్యాంకులో ఉండేది. ఆయన హయాంలో ఇప్పుడు భారత్ అయిదవ ర్యాంకుకు చేరుకుంది. కరోనా సమయంలో ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొనప్పటికీ మోదీ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల భారత దేశం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది. వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకువెళ్లడం ద్వారానే ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతను అధిగమించగలుగుతామని మోదీ గుజరాత్ ద్వారానే నిరూపించారు. ఇతర రాష్ట్రాలలో మాదిరే గుజరాత్‌లో కూడా ఆదివాసీ ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఆ రాష్ట్ర జనాభాలో 14.8శాతం మంది ఆదివాసీలే. అయినప్పటికీ ఆదివాసీల వెనుకబాటు తనాన్ని ఆసరాగా తీసుకుని నక్సలిజం ఆ ప్రాంతాల్లో విస్తరించకుండా మోదీ అడ్డుకోగలిగారు. జఘాడియా వంటి మూరుమాల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మనకు పరిశ్రమలు కనపడతాయి. ఆదివాసీలే కాదు, దళితులు, చెప్పులు కుట్టేవారు, స్వీపర్లతో పాటు అనేక చిన్న చిన్న తరగతులతో సహా పలు ఓబీసీ కులాల వారు ఇవాళ తమ రాష్ట్ర నాయకుడు మోదీ ప్రధానమంత్రి అయ్యారని సగర్వంగా చెప్పుకుంటారు. ‘గుజరాత్‌లో నక్సలిజం ప్రవేశించకుండా అడ్డుకోవాలని మేము నిర్ణయించాం. మా ఆదివాసీ ప్రజలు మమ్మల్ని విశ్వసించడం వల్లే వారు నక్సలిజం తమను సమీపించకుండా అడ్డుకోగలిగారు’ అని మోదీ అన్నారు.


మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక గుజరాత్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి విస్తరించింది. 2009లో ఉత్తరాది గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి కేవలం 16.5 శాతం సీట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సీట్ల సంఖ్య దాదాపు 75శాతానికి పెరిగింది; అలాగే పట్టణ ప్రాంతాల్లో బిజెపికి కేవలం 13.9 శాతం నియోజకవర్గాలుండగా, ఇప్పుడు 94.9 శాతం పట్టణ నియోజకవర్గాలు బిజెపి వశమయ్యాయి. బిజెపి లోక్‌సభ ఎంపీల్లో 37.2 శాతం ఓబీసీలు కాగా, 14.1 శాతం ఎస్టీలు, 17.4 శాతం ఎస్సీలు. దేశ జనాభాలో దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీల శాతం 69.2 అయితే అందులో 68.9 శాతం మంది ఓట్లు బిజెపికి దక్కినప్పుడు అది అగ్రవర్ణాల పార్టీ ఎలా అవుతుంది? రాజకీయాధికారంలో ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు అనేక పథకాల ద్వారా కూడా బిజెపి వివిధ సామాజిక వర్గాలను చేరుకునేందుకు మోదీ కారణం అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు 2014లో ఆయన ప్రారంభించిన ప్రత్యక్ష నగదు బదిలీ 53 మంత్రిత్వ శాఖలకు చెందిన 328 పథకాల ద్వారా ప్రజలకు లబ్ధినిస్తోంది. 2022–23లో 80.5 కోట్ల మంది ప్రజలకు మొత్తం రూ.2,22,968 కోట్లు బదిలీ అవనున్నాయి. బిజెపి విజయ రహస్యమేమిటో ఈ ఒక్క పథకం ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Read more