పక్షి పంజరంలోంచి పాడటం లాంటిది అనువాదం
ABN , First Publish Date - 2022-04-18T05:54:10+05:30 IST
అంతర్జాతీయ ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇటీవల తెలుగులో కొన్ని మంచి కథల ఆంగ్లాను వాదాన్ని ‘ద బెస్ట్ స్టోరీస్ ఆఫ్ అవర్ టైమ్స్’ పేరిట ప్రచురించింది....
అంతర్జాతీయ ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇటీవల తెలుగులో కొన్ని మంచి కథల ఆంగ్లాను వాదాన్ని ‘ద బెస్ట్ స్టోరీస్ ఆఫ్ అవర్ టైమ్స్’ పేరిట ప్రచురించింది. ఓల్గా సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలోని కథలను ఎమ్. శ్రీధర్, అల్లాడి ఉమ ఇంగ్లీషులోనికి అనువదించారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు అనువాదకులతో ‘వివిధ’ సంభాషణ:
మీ ఆసక్తి అనువాదం వైపు ఎప్పుడు, ఎలా మళ్లింది? మీ మొదటి అనువాదం గురించి చెప్పండి?
మాక్మిలన్ ఇండియా భారతీయ భాషలనుండి ఇంగ్లీషులోకి కొన్ని నవలలను అనువందించాలను కున్నప్పుడు మమ్మల్ని నమూనాగా ఒక అనువాదం పంపమన్నారు. అలా మా మొదటి అనువాదం, పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ ‘సతీ సావిత్రి’ 16 మే 1993న ద హిందూలో వచ్చింది. పుస్తకంగా వచ్చింది ఓల్గా రాజకీయకథలలోంచి చేసిన ‘ఉమన్ అన్బౌండ్’. ఇప్పుడు హార్పర్ కాలిన్స్ కోసం ఓల్గా కూర్చిన సంకలనం మా అనువాదాల్లో ఆఖరిది. మేమే ఎంచుకొన్నా, మరొకరు చేసినా, మూల రచనలు నచ్చితేనే అనువదించాలనేది మా నియమం.
అనువదించటమనే పనిని మీ ఇద్దరూ ఎలా పంచుకుంటారు?
కలిసి అనువాదం చేసేటప్పుడు భావజాలాల్లో సారూప్యత అవసరం. ఇద్దరికీ నచ్చిన రచనల్ని వీలైనంతవరకూ కలిసి చర్చించుకుని చేయడం, వీలుకానప్పుడు మొదట ఒకరు అనువదించి, తరువాత ఇంకొకరు చూసి, అవసరమైతే ప్రత్యామ్నాయాల్ని సూచించడం జరుగుతుంది. మా అనువాదాన్ని తరువాత రచయితలకు పంపడం, వారి సూచనలను పరిగణించడం మా పద్ధతి.
తెలుగు కథల్లోని వచనాన్ని అనువదించటంలో మీకు తరచుగా ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి?
వచనంతో సహా, అన్ని అనువాదాల్లో ఇబ్బందులు మూల భాషల ప్రత్యేక వాక్య నిర్మాణాలూ, జాతీయాలూ, సామెతలూ, మాండలికాలవల్లా, మత, కుల, వర్గ, లింగ బేధాలను ప్రతిబింబించడంలో రచయితల భాషాప్రయోగాలవల్లా వస్తాయి. అనువాదానికి తీసుకున్న రచనలు ఒక విస్తృత ప్రాతిపదికపై ఆధారపడి, ఒక భాషా సమూహం వారి విభిన్న ప్రత్యేకతల్ని చూపెట్టడానికి ప్రయత్నించినప్పుడు వాటినన్నింటినీ, ఆయా రచయితల ప్రత్యేక శైలులతో సహా, మరో భాషా సమూహానికి అందించడం అనువాదకుల బాధ్యతగా మేము భావిస్తాము. ఈ బాధ్యతను ఈ సంకలనం ద్వారా మా శాయశక్తులా నెరవేర్చామని నమ్ముతున్నాము.
ఈ సంకలనంలోని మీ అనువాదాలకు హార్పర్ కాలిన్స్ సూచించిన మార్పు చేర్పులేమైనా ఉన్నాయా?
హార్పర్ కాలిన్స్ అన్ని ప్రసిద్ధ ఇంగ్లీషు ప్రచురణ సంస్థలలానే వారి house style కి అనుగుణంగానూ, ఇంగ్లీషులో చదవడానికి సులువుగా ఉండేలా మార్పుల్ని సూచించారు. ఇంగ్లీషు భాష ప్రయోగం కూడా అన్ని భాషలలానే ఆ భాషను వాడే అన్ని చోట్ల, అందరు రచయితల వాడుకలో ఒకే విధంగా ఉండదనీ, ముఖ్యంగా అనువాదంలో మూల రచయితల శైలిని ఇంగ్లీషులోకి తీసుకువెళ్లినపుడు అది కొంత ‘‘కృత్రిమంగా’’ తోచడం తప్పదనీ వారిని మేము ఒప్పించగలిగాము. రచయితల ప్రత్యేక వ్యక్తీకరణలనూ, శైలీ బేధాలనూ ఇంగ్లీషులో చూపెట్టలేనపుడు పాఠకులకు అన్ని కథలూ ఒకరే రాశారా అన్న అనుమానం కలగక తప్పదు. ఇంగ్లీషులో మాత్రమే ఈ అనువాదాల్ని చదవగలిగే పాఠకులకు, కొన్ని సందర్భాల్లోనైనా, ఆయా రచయితలు బహుశా తెలుగులో ఇలా చెప్పిఉంటారేమో అన్న ఆలోచన కలిగితే మా కృషి ఫలించినట్టే.
స్వేచ్ఛానువాదం, లిటరల్ అనువాదం- ఈ రెండు పద్ధతుల్లో మీరు ఎటువైపు మొగ్గు చూపుతారు?
చెప్పడం కష్టమే! మూలంలోని ఏ భాగాన్నీ వదిలివే యకుండా, వీలైనంతవరకూ వాక్యాల్ని విడగొట్టకుండా, మూలంలోని పేరాగ్రాఫ్ విభజనను అనుసరించడంవంటి మా నియమాలు ‘‘లిటరల్ అనువాద’’ పద్ధతులు. కానీ అనువాదం మౌలికంగా ఒక సృజనాత్మక ప్రక్రియ. వేరొక సందర్భంలో ప్రసిద్ధ ఆఫ్రికన్ అమెరికన్ కవి పాల్ లారెన్స్ డన్బార్ ‘Sympathy’ (సానుభూతి) కవితలో అన్న మాటలను కొంచెం మార్చి, ‘‘పంజరంలో ఉన్నా పాడు తాయి కొన్ని పక్షులు,’’ ఆంటూ అనువాదాల్లో మాకున్న పరిమితులూ, స్వేచ్ఛల గురించీ వివరించాము. మరో సందర్భంలో అనువాదకులకూ వారి ప్రత్యేక శైలులు ఉంటాయని చెప్పాము. మూలంలో ఏభాగాన్నీ తీసివేసే హక్కు అనువాదకులకు లేదని, మూలానికి చేర్పులూ, మార్పులూ కూడా చేయకూడదని మా అభిప్రాయం. ఇంగ్లీషుకూ మన భాషలకూ ఉన్న ఆధిపత్య వ్యత్యాసాల నేపథ్యంనుంచి చూస్తే, ఇంగ్లీలోషులోకి వెళ్లే అనువాదాల్లో అనుమతించే మార్పులు ఇంగ్లీషు ఆధిపత్యాన్ని మనం సమర్థించినట్లౌతుంది. మూల రచనకు సంబంధించి అనువాదకులకు ఏవైనా భిన్న అభిప్రాయాలుంటే వాటిని అనువాదకులు విడిగా చెప్పవచ్చు. ప్రతి అనువాదమూ మూలానికి ఒక వివరణ, ఒక వ్యాఖ్యానమని, మూలాన్ని పాఠకులుగా మేము అర్థం చేసుకున్న వైనం నుంచే అనువాదం పుడుతుందని మేము నమ్ముతాము.
ఈ సంకలనంలో- మిమ్మల్ని అనువాదపరంగా ఎక్కువ ఛాలెంజ్ చేసిన కథలు ఏవి? ఎందుకు?
షాజహనా ‘సిల్‌సిలా’, ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, ఎం. ఎం. వినోదిని ‘ఒక విలన్ ఆత్మహత్య’, సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, అట్టాడ అప్పలనాయుడు ‘బతికిచెడిన దేశం’ లాంటి కథలు మమ్మల్నిఎక్కువగా ‘‘ఛాలెంజ్’’ చేశాయి. షాజహానా, ఖదీర్ బాబుల కథలలో వారు ఉపయోగించిన తెలుగు, ఉర్దూ కలిసిన భాష, షాజహానా కథలోని తెలంగాణా మాండలికం, ఖదీర్ బాబు కథలోని పాత్రికేయ భాషతోబాటు, నిరంతరం మారే కథన శైలీ, జూపాక సుభద్ర, వినోదినిల కథల్లో దళిత జీవితాన్నీ, ఆ భావజాలాన్నీ వారి వారి మాండలికాల్లో చిత్రించిన తీరూ, సతీష్ చందర్ కథలో దళిత, సవర్ణ కులాల మధ్య ప్రేమ వంటి తీవ్రమైన విషయాన్ని వ్యంగ్యంతోకూడిన పైకి మాత్రం చాలా సులభమైన శైలిలా అనిపించే భాషలో రాసిన వైనం, అట్టాడ అప్పలనాయుడులాంటి ఉత్తరాంధ్ర రచయితల భాషలోని ప్రత్యేకతలూ... అన్నీ సవాళ్ళే!
ఇప్పటిదాకా మీరు చేసిన అనువాదాలను బట్టి- తెలుగు సాహిత్యంలోని ఏ అంశాలు బైటివాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయని అనుకుంటున్నారు?
మీ దృష్టిలో ఏది అంతర్జాతీయ తెలుగు కథ?
ఎవరీ బైటివాళ్ళు? భారతదేశంలోని ఇతర భాషలు మాట్లాడే వాళ్ళా? ఇంగ్లీషు మాతృభాషగా మాట్లాడే విదేశీయులా? మా అనువాదాలూ, మా ముందు మాటల, footnotes, endnotes ద్వారా ఇచ్చే పలు వివరాలూ, వివరణలూ ప్రధానంగా ఇతర భారతీయుల, మన ఇరుగుపొరుగు దేశాలవారికోసం చేసినప్పటికీ అవి అంతర్జాతీయ పాఠకులకూ అందుతాయి. మన సాహిత్యం ఇతర ప్రపంచ భాషలకు చేరడానికి ఇంగ్లీషు ఒక వాహిక. మేము సాహిత్య అకాడెమీ కోసం 2011లో ఇంగ్లీషులోకి చేసిన రావిశాస్త్రి ‘ఇల్లు’ను అకాడెమీ 2020లో రష్యన్, చైనీస్ భాషల్లో అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్ళింది. ‘‘అంతర్జాతీయ తెలుగు కథలు’’ అంటూ ప్రత్యేకంగా ఏవీ ఉండవని మా అభిప్రాయం.
భవిష్యత్తులో మీరు పని చేయబోతున్న అనువాద ప్రాజెక్టులేమిటి?
అఫ్సర్ కథా సంకలనం ‘సాహిల్ వస్తాడు’ను ఓరియంట్ బ్లాక్ స్వాన్ కోసం చేస్తున్నాము. స్త్రీ/సామ్య వారికి జి. కల్యాణరావు ‘తెలుగు నాటకం మూలాలు’ను పంపాము. పంతొమ్మిదవ శతాబ్దిలోనే (1872లో) కుల వ్యవస్థపై అర్థవంతమైన, పదునైన చర్చను పెట్టిన, సులభ గ్రాంథికంలో రాయబడిన, తొలితరం తెలుగు నవల, నరహరి గోపాలకృష్ణమ సెట్టి ‘శ్రీ రంగరాజుచరిత్ర’ను, ఒక సవాలుగా అనిపించినా, అనువదించడం మొదలుపెట్టాము.
అల్లాడి ఉమ, ఎమ్. శ్రీధర్