రాష్ట్రం పరిధిలోనే ‘పోడు’ సమస్యకు పరిష్కారం

ABN , First Publish Date - 2022-10-04T06:50:48+05:30 IST

పోడు భూమి సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నేల విడచి సాము చేస్తున్నట్లు ఉన్నాయి. అటవీ హక్కుల గుర్తింపులో చారిత్రకంగా అన్యాయానికి గురైన ఆదివాసీలూ...

రాష్ట్రం పరిధిలోనే ‘పోడు’ సమస్యకు పరిష్కారం

పోడు భూమి సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నేల విడచి సాము చేస్తున్నట్లు ఉన్నాయి. అటవీ హక్కుల గుర్తింపులో చారిత్రకంగా అన్యాయానికి గురైన ఆదివాసీలూ, ఇతర అటవీ ఆధారిత సంప్రదాయక నివాసితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ‘అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006’ను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. అయితే అన్యాయాన్ని సరిదిద్దడంలో ప్రభుత్వం ఇంకా విఫలమవుతూనే ఉన్నది. చట్టం పరిధిలోనే పరిష్కరించగలిగే పోడు భూమి సమస్యలు కొన్ని, ప్రస్తుత చట్టం చట్రం వెలుపల ఉన్న ఆదివాసీల అటవీ భూ హక్కుల సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అయితే ఈ రెండు వేర్వేరు సమస్యల పరిష్కారానికి ఒకే సమాధానం కోసం వెతకటం వల్లనే సమస్య మరింత జటిలమవుతున్నది. 


2006లో అమల్లోకి వచ్చిన ‘అటవీ హక్కుల గుర్తింపు చట్టం’ 13 డిసెంబర్ 2005 (నిర్దేశిత తేదీ)కి పూర్వం అనుభవంలో ఉన్న అటవీ భూమి హక్కులు గుర్తింపునకు ఉద్దేశించినది. ఆ నిర్దేశిత తేదీ తర్వాత అనుభవంలో గల అటవీ భూమి హక్కుల గుర్తింపు వీలు పడదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. సమస్య పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వ చట్ట సవరణ చేయటం ఒక్కటే మార్గమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ముఖ్య మంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. ఈ లేఖకు మార్చి 2022 లో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా స్పందించారు. చట్టం నిర్దేశించిన తేదీని పొడిగించటం వల్ల గిరిజన హక్కులకు భంగం కల్గుతుందని ఆయన అన్నారు. ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన భూములు గిరిజనేతరులకు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కానీ 75 ఏళ్ళ పాటు అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనేతరులకు మాత్రమే అటవీ హక్కుల గుర్తింపునకు చట్టం వీలు కల్పించింది. దానికి భిన్నంగా ఇటీవలి కాలంలో అటవీ భూమి సాగు చేస్తున్న గిరిజనేతరుల హక్కులు గుర్తింపు కోసం చట్ట సవరణ చేస్తే గిరిజనులకు నష్టం వాటిల్లుతుందని అర్జున్ ముండా తెలంగాణ ముఖ్యమంత్రికి తన సమాధానంలో పేర్కొన్నారు. 


ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు తెలంగాణలో జూలై 2022 నాటికి 3.10 లక్షల ఎకరాల అటవీ భూమిపై 97,434 మంది గిరిజనులకు హక్కుల పట్టాలను మంజూరు చేశారు. ఇంకా రెండు లక్షలకు పైగా గిరిజన దరఖాస్తులు అటవీ భూమి పట్టాలు కోరుతూ గ్రామసభల ముందున్నాయి. అయితే నిర్దేశిత తేదీ తర్వాత సాగులో ఉన్న అటవీ హక్కుల విషయంలో హక్కులు గుర్తింపు ప్రస్తుత చట్టం రీత్యా సాధ్యం కాదు. వాటి విషయంలో గిరిజనులు అటవీ భూ హక్కుల పట్టాలను పొందలేరు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాతా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చట్టం పేర్కొన్న నిర్దేశిత తేదీని సడలించి అటవీ హక్కుల చట్టాన్ని సవరించమని కోరుతూ జూలై 2022లో మరోసారి కేంద్రాన్ని అర్థించారు.


వాస్తవానికి ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర శాసనాలను గిరిజన హక్కుల రక్షణ కోసం సవరించి అమలు చేసే అధికారం రాష్ట్ర గవర్నరుకు ఉంటుంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆ మేరకు ఒక ప్రతిపాదనను రూపొందించి, గిరిజన సలహా మండలిలో చర్చించి రాష్ట్ర గవర్నరు ప్రకటన కోసం పంపాలి. గిరిజన అటవీ హక్కుల గుర్తింపునకు అవకాశం ఇచ్చేలా నిర్దేశిత తేదీని పొడిగిస్తూ రాజ్యాంగం 244 అధికరణ పేరా 5(1) కింద గవర్నరు ఒక నోటిఫికేషన్‌ను ఇవ్వవచ్చు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అర్థించాల్సిన అవసరం లేదు. ఆదివాసీ అటవీ హక్కులు సమస్యకు తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కారం ఉంది. కానీ ఈ దిశగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. 


అనుభవంలో ఉన్న అటవీ భూముల నుంచి బలవంతంగా ఆదివాసీలను బయటకు నెట్టే అటవీ శాఖ దుశ్చర్యలు గిరిజన ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హక్కు కోరుతూ దరఖాస్తుచేసుకున్న అటవీ భూమి విషయంలో జిల్లా స్థాయిలో నిర్ధారణ జరిగేంతవరకూ ఆదివాసులను ఆ భూముల నుంచి తొలగించరాదని చట్టం స్పష్టంగా పేర్కొంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అటవీ శాఖ సిబ్బంది ఆదివాసీలపై భౌతిక దాడులకు పాల్పడతున్నది. ఇదిలా ఉండగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద శాసనపరంగా ఏర్పరచిన కమిటీలను నిర్వీర్యం చేసే విధంగా పోడు భూమి సమస్య పరిష్కారానికి వివిధ శాఖాధికారులతో ఒక కమిటీ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. సెప్టెంబర్ 11, 2022న జారీ చేసిన ఈ ఉత్తర్వులూ ప్రశ్నార్థకంగా మారాయి. గ్రామసభ, సబ్ కలెక్టర్ అధ్యక్షతన సబ్ డివిజన్ స్థాయి కమిటీ, జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలకు మాత్రమే పోడు భూమి హక్కులను నిర్ధారించే, అర్హులకు పట్టాలు మంజూరు చేసే శాసనాధికారం ఉంది. ఆ కమిటీలలో మండల, జిల్లా పంచాయితీ రాజ్ సంస్థ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీలు సక్రమంగా పనిచేస్తే పోడు భూ హక్కుల నిర్ధారణ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే పోలీసు, రెవెన్యూ, అటవీ, ఇతర శాఖ అధికారులతో జిల్లా స్థాయిలో మరొక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల గుర్తింపు చట్ట నియమాలు–2012కు భిన్నంగా వ్యవహరించడమే!

డా. పల్లా త్రినాధ రావు

Read more