సామాన్యుని రాజకీయ అసామాన్యుడు

ABN , First Publish Date - 2022-03-23T06:12:10+05:30 IST

‘ఇవాళ ఈ గోడలు పరదాల మాదిరి కదులుతున్నాయి. కాని పునాదులే కదలాల్సి ఉన్నది’ అని హిందీ కవి దుష్యంత్ కుమార్ రచించిన కవితను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యంత ఇష్టంతో చదువుతూ ఉంటారు. ‘హోంగే కామియాబ్...

సామాన్యుని రాజకీయ అసామాన్యుడు

‘ఇవాళ ఈ గోడలు పరదాల మాదిరి కదులుతున్నాయి. కాని పునాదులే కదలాల్సి ఉన్నది’ అని హిందీ కవి దుష్యంత్ కుమార్ రచించిన కవితను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యంత ఇష్టంతో చదువుతూ ఉంటారు. ‘హోంగే కామియాబ్.. హోంగే కామియాబ్ ఏక్ దిన్’ (ఏదో ఒకరోజు విజయం సాధిస్తాను) అన్న పాటను కూడా ఆయన తన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశాల్లో పాడుతుంటారు. భారతీయ జనతా పార్టీ విజృంభణ పవనాలలో వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీలు కకావికలయిన తరుణంలో కేజ్రీవాల్ ఒక్కరే విజయ కేతనం ఎగురవేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన పదేళ్లకే ఆ పార్టీకి ఆయన దేశ వ్యాప్తంగా ఉనికిని సాధించారు. అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల్లో ఆప్‌కు విజయం సాధించారు. ఇటీవల పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌తో సహా ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎవరూ ఆప్ అధినేతను అభినందించి ఉండకపోవచ్చు. అంతమాత్రాన కేజ్రీవాల్ విజయం విలువ తరిగిపోదు. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు కేజ్రీవాల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి?


పంజాబ్‌లో విజయం సాధించిన రెండు రోజుల్లోనే కేజ్రీవాల్ 9 రాష్ట్రాల్లో తన పార్టీ ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. ముఖ్యంగా ఈ సంవత్సరాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌కు ఆయన సందీప్ పాథక్‌ను రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించారు. గుజరాత్‌లో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ గాంధీనగర్, సూరత్ మునిసిపల్ కార్పోరేషన్లలో 64 వార్డులను గెలుచుకుంది. ఢిల్లీ ఐఐటీలో అధ్యాపకుడైన సందీప్ పాథక్ తెరవెనుక వ్యూహకర్తగా ఆప్ పార్టీ వర్గాలు భావిస్తాయి. ఎన్నికల సర్వేలు జరపడం, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం, కేడర్‌ను నిర్మించడంలో దిట్ట అయిన సందీప్ పాథక్‌ను గుజరాత్ ఇన్‌ఛార్జిగా నియమించడంలోనే కేజ్రీవాల్ దృష్టి ఎటువైపు మళ్లుతున్నదో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్‌లో మోదీని ఢీకొనడం సామాన్యమైన విషయం కాదని కేజ్రీవాల్‌కు తెలుసు. అయితే అంతమాత్రాన వెనుకంజవేసే తత్వం కాదు ఆయనది. అలా రాజీపడే తత్వమే ఉంటే ఆయన ఐఐటిలో చదివిన తర్వాత తాను చేరిన ఐఆర్ఎస్ సర్వీస్‌కు రాజీనామా చేసి అవినీతికి వ్యతిరేకంగా సంస్థను స్థాపించి, అన్నా హజారే ఉద్యమంలో పాల్గొనే ధైర్యం చేసి ఉండేవాడు కాదు. ఆమ్ ఆద్మీ పార్టీని నిర్మించి అనేక ఆటుపోట్లను తట్టుకుని, జైలు శిక్షను కూడా భరించి పోరాడి ఉండేవాడు కాదు.


ఢిల్లీలో రెండు సార్లు మోదీ ధాటిని తట్టుకుని సుస్థిరంగా నిలబడ్డ నేత అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ పంజాబ్‌లో అఖండ విజయం సాధించిన తర్వాత కేజ్రీవాల్ అనే శక్తిని తక్కువ అంచనా వేయడం సరైంది కాదన్న విషయం అనేక మందికి అర్థమవుతోంది. సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీని దెబ్బతీయగలిగిన రాజకీయ పార్టీలు ఏవీ సమీప భవిష్యత్‌లో ఉద్భవించే అవకాశాలు కనపడని తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ తనను తాను మలుచుకున్న తీరు, బిజెపి లక్ష్యంగా పెట్టుకున్న ఓటు బ్యాంకును కూడా తన వైపుకు తిప్పుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతో పాటు అనేకమంది ప్రతిపక్ష నేతలు బిజెపి ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునేందుకు నానా మతపరమైన విన్యాసాలు చేశారు. తీర్థయాత్రలు చేశారు. తాము కూడా దేశ భక్తులమేనని ప్రకటించుకున్నారు. కానీ వారెవ్వరినీ నమ్మని ప్రజలు కేజ్రీవాల్‌ను విశ్వసించారు. కేజ్రీవాల్ జరిపే ప్రతి సమావేశమూ దేశభక్తి గీతాలతో, స్వాతంత్ర్య సమరయోధుల ప్రశంసలతో ప్రారంభమవుతుంది. భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాబా సాహెబ్ అంబేడ్కర్ లాంటి నేతలను స్మరించకుండా ఆప్ సమావేశాలు ప్రారంభం కావు. హనుమాన్ చాలీసా తనకు కంఠతా వచ్చని ఆయన ఒక సందర్భంలో నిరూపించుకున్నారు. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవత్‌మాన్ సర్దార్ భగత్‌సింగ్ పుట్టిన గ్రామం ఖట్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకారం చేయడం విస్మరించదగిన విషయం కాదు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠ్య ప్రణాళికలో దేశభక్తిని ఒక పాఠ్యాంశంగా చేర్చిన ఘనత కూడా కేజ్రీవాల్‌కే దక్కుతుంది. దేశభక్తి విషయంలోనే కాదు, మత రాజకీయాల విషయంలో కూడా బిజెపిని కేజ్రీవాల్ సమర్థంగా ఎదుర్కోగలిగారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మతకల్లోలాలు జరిగాయి. యూనివర్సిటీల్లో విద్యార్థులపై దాడులు జరిగాయి. పౌరసత్వ చట్టానికి నిరసనగా షాహీన్‌బాగ్‌లో నెలల తరబడి ప్రదర్శనలు జరిగాయి. వాటి వెనుక రాజకీయాలు తెలిసిన కేజ్రీవాల్ ఈ వివాదాల్లో తల దూర్చలేదు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 అధికరణ రద్దును కూడా ఆయన సమర్థించారు. కుడి, ఎడమ వాదాల మధ్య వ్యూహాత్మకంగా మధ్యే వాదాన్ని అవలంబించారు. తద్వారా ఢిల్లీలో ఓటు బ్యాంకు మెజారిటీ, మైనారిటీల మధ్య చీలకుండా కాపాడుకోగలిగారు. అటు మెజారిటీ వర్గాలు, ఇటు మైనారిటీ వర్గాలు ఆయనకు మద్దతునిచ్చాయి. ఇవాళ బిజెపిని రాజకీయంగా తట్టుకోవాలంటే ఏ వైఖరి అవలంబించాలో తెలిసిన నేతగా తనను తాను రుజువు చేసుకున్నారు. ఢిల్లీలో లోక్‌సభలో మొత్తం ఏడు సీట్లను బిజెపికే కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలు అసెంబ్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 70 సీట్లలో 62 సీట్లు కట్టబెట్టి ఘన విజయం అందించారు.


ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి విషయంలో కేజ్రీవాల్ గత ప్రభుత్వాల కంటే తాను ఎన్నో రెట్లు మెరుగని నిరూపించుకున్నారు. సామాన్యుల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను అత్యంత ఆధునికంగా, అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఘనత దేశంలో తొలుత కేజ్రీవాల్‌కే దక్కుతుంది. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య ప్రతి ఏడాదీ 2 లక్షల చొప్పున పెరుగుతుండగా, ప్రస్తుతం దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏడాదీ అదనంగా విద్యకు బడ్టెట్‌ను రెట్టింపు చేసి రూ.6600 కోట్లకు పెంచిన కేజ్రీవాల్ ఆరోగ్యానికీ అంతకంటే ఎక్కువగా రూ. 7500 కోట్లు కేటాయించి తన ప్రాథమ్యాలేమిటో నిరూపించుకున్నారు. ఢిల్లీలో అడుగడుగునా సామాన్యులకు మొహల్లా క్లినిక్‌లు లభ్యమవుతాయి. తాజాగా ప్రతి మెట్రో స్టేషన్‌లో ఈ వైద్యశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనధికార కాలనీలు, మురికివాడల అభివృద్ధికి రూ.8వేల కోట్లు కేటాయించడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం, 20వేల వరకు లీటర్ల వరకు ఉచిత నీటి సరఫరా, మహిళలకు ఉచిత బస్సు రవాణా మొదలైన పథకాలు ఆయన ప్రభుత్వంపై జనాదరణ పెరిగేలా చేసింది. అదే సమయంలో రహదారులు, ఫ్లైఓవర్లు వంటి కనీస మౌలిక సదుపాయాల నిర్మాణం విషయంలో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గలేదు.


విచిత్రమేమంటే అనేక ఉచితాలను సమకూరుస్తున్నప్పటికీ ఢిల్లీ రెవెన్యూ మిగులును సాధించగలుగుతోంది, 2019–20లో రూ. 9354 కోట్ల మేరకు, 2020–21లో రూ.7239 కోట్ల మేరకు ఢిల్లీ రెవిన్యూ మిగులును సాధించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలే తేల్చాయి. అన్ని రాష్ట్రాలకంటే తక్కువగా కేవలం 0.7 శాతం మాత్రమే ఆర్థిక లోటును కనపరుస్తూ, ఒక వైపు ప్రభుత్వ వ్యయాన్ని భారీ ఎత్తున పెంచుతూనే, ప్రజలకు ఉచితాలను సమకూరుస్తూనే, గత అయిదేళ్లుగా రెవిన్యూ మిగులును సాధించగలగడం కేజ్రీవాల్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సమర్థతకు నిదర్శనం. గత అయిదారేళ్లలో ఢిల్లీ అభివృద్ధి రేటు 11–23 శాతం మేరకు ఉన్నది, దేశ జనాభాలో 1.49 శాతం ఢిల్లీలో ఉన్నప్పటికీ జీడీపీలో ఢిల్లీ వాటా 4.4 శాతం. ఢిల్లీ తలసరి ఆదాయం 3.54 లక్షలు కాగా ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ.


‘మీరు ఉచితాలను ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు?’ అని అడిగినప్పుడు కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ‘మంత్రులకు, ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయల మేరకు ఉచితంగా సౌకర్యాలు సమకూరుస్తున్నప్పుడు ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడితే తప్పేముంది?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘పరిమిత డోస్‌లో ఉచితాలను సమకూర్చడం ఆర్థిక వ్యవస్థకు మంచిది. దాని వల్ల ప్రజల చేతుల్లో అధికంగ డబ్బు ఆడుతుంది. ప్రజలపై అదనపు పన్నులు వేయనవసరం లేకుండా, బడ్జెట్ లోటు లేకుండా ఉచితాలు ఇవ్వడం ఆరోగ్యకరం’ అని ఆయన చెప్పారు. అంతేకాదు, ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలను సకాలంలో కేటాయించిన వ్యయం కంటే తక్కువ ఖర్చుకు పూర్తి చేయడం ద్వారా మిగిలిన మొత్తాన్ని ఉచితాలను సమకూర్చగలుగుతున్నానని ఆయన ఒక సందర్భంలో చెప్పుకోగలిగారు. ఉదాహరణకు మంగోల్ పురి నుంచి మధుబన్ చౌక్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.423 కోట్లు కాగా దాన్ని రూ.323 కోట్లకే పూర్తి చేశారు. ఈ వంద కోట్లను సబ్సిడీలకు మళ్లించాను. ఒక్క ఫ్లై ఓవర్ల నిర్మాణాల్లోనే రూ. 500 కోట్లు ఆదాచేశాము అని ఆయన చెప్పారు. ఉచితాల కోసం భారీ ఎత్తున అప్పులు చేసి, ప్రజలపై పన్నులు పెంచి, అంచనా కంటే అత్యధిక మొత్తం వేల కోట్ల ప్రజాధనం వృధా చేసి కొల్లగొట్టే ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కేజ్రీవాల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదా?


కేజ్రీవాల్ టీమ్‌లో అత్యధికులు విద్యాధికులు, ఇంజనీర్లు, డాక్టర్లు, యువకులు. ఢిల్లీలో అనేకమంది ప్రముఖ జర్నలిస్టులను ఆయన తన టీమ్‌లో చేర్చుకున్నారు. పార్టీకి సహాయపడే ఒకరిద్దరు వ్యాపారవేత్తలకు ఆయన రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పటికీ అత్యధికులు విద్యావంతులు, మేధావులు. తన మంత్రివర్గంలో కాని, అసెంబ్లీ, రాజ్యసభ సీట్లలో కాని ఆయన ఎక్కడా బంధు ప్రీతికి, కుటుంబ సభ్యులకు తావివ్వలేదు. లంపెన్ శక్తులను చేరనివ్వలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ సహాయంతో ఆయనను ఇరికించేందుకు కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ మాత్రం విజయవంతం కాలేదు. కేజ్రీవాల్‌తో పాటు ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేసిన ఆయన సతీమణిని నానా వేధింపులకు గురిచేస్తే ఆమె రాజీనామా చేశారు. ఆయన కుమార్తె ఐఐటీలో 3322 ర్యాంకు సంపాదించి ఢిల్లీ ఐఐటిలో సీటు సాధించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ సామాన్యుడిలా వ్యవహరిస్తూ సాయంకాలం వీలున్నప్పుడల్లా మండీ హౌజ్ వద్ద నాటక ప్రదర్శనలకు హాజరయ్యే కేజ్రీవాల్ ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకూడదనుకోవడంలో తప్పేముంది?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-03-23T06:12:10+05:30 IST