భక్తి సముద్రంలో మునిగిపోయిన ‘ప్రజాయుద్ధ నౌక’!

ABN , First Publish Date - 2022-02-17T06:30:03+05:30 IST

వంగపండు ప్రసాద రావు పాటల తర్వాత, గద్దర్ పాటలు బాగా నచ్చుతాయి నాకు. 1974లో అనుకుంటా, గద్దర్, ‘జన నాట్య మండలి’ సభ్యులైన సంధ్యతోనూ, ఇంకా కొందరితోనూ నేనున్న ఇంటికి వచ్చి...

భక్తి సముద్రంలో మునిగిపోయిన ‘ప్రజాయుద్ధ నౌక’!

వంగపండు ప్రసాద రావు పాటల తర్వాత, గద్దర్ పాటలు బాగా నచ్చుతాయి నాకు. 1974లో అనుకుంటా, గద్దర్, ‘జన నాట్య మండలి’ సభ్యులైన సంధ్యతోనూ, ఇంకా కొందరితోనూ నేనున్న ఇంటికి వచ్చి, సాయంత్రం డాబా మీద పాటలు పాడి వినిపించారు. అంతకు ముందు కూడా గద్దర్‍ని గురించి కొందరు పాఠకులు మంచి మాటలు చెపితే, అవన్నీ నచ్చి, సంతోషంగా విన్నాను. ఆ రకంగా గద్దర్ అంటే కవిగా, గాయకుడిగా అభిమానమే నాకు. అయినా, 1980లో నేను రాసిన, ‘స్త్రీలను అవమానించే మాటలు వాడడం ప్రజాపంధాయా?’ అనే వ్యాసంలో, ఇతరుల పాటలతో పాటు, గద్దర్ పాటల్లో కూడా వున్న, ‘మా పల్లె మిండెగాడు’ లాంటి ఒకటి రెండు మాటల గురించి కొంత విమర్శగా కూడా రాశాను. గద్దర్ విప్లవ గేయాలు పాడుతున్నాడని, అతడి మీద ‘కోబ్రా’ అనే నక్సలైట్ వ్యతిరేక సంస్త వాళ్ళు, 1997లో హత్యా ప్రయత్నం జరిపినప్పుడు, దాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన కూడా ఇచ్చాను.


ఒకసారి, గద్దరు వొంటి మీద చొక్కా వంటిది లేకుండా బొడ్డూ, చంకలతో సహా ఒళ్ళంతా బట్టబయలుగా కనిపించేలా, ప్రదర్శనలు చేస్తోంటే, ఆ ఫోటోలు చూసి, ‘ఏ కారణం చూపినా, అది అకారణమే’ అనే వ్యాసం ‘ఆంధ్రజ్యోతి’లో (2004లో) రాశాను. ఆ తర్వాతే అతడు చొక్కా ధరించాడు.


ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో, ఒక సారి గద్దరుతో ఫోన్లో మాట్లాడాను. ‘తెలంగాణాలో, మొదట దళిత ముఖ్యమంత్రేనటగా! అది మీరే కావాలని ముచ్చటగా వుందనుకుంటాను మీకు?’ అని హాస్యంగా అన్నాను. అతడూ నవ్వాడు. ‘ఊ.., ఊ..’ అని కూడా అన్నాడు. కొన్ని మాటలు జరిగితే, ‘ఏంటి మీరు? నిజంగా వుందా అలా అవ్వాలని?’ అని అనుమానంగా అడిగాను. అయినా, అది హాస్యమే అయింది. 


ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, మనం మెచ్చుకునే కవి, అతని మాటలకే, రాతలకే విరుద్ధంగా తిరిగితే, విమర్శించక మానకూడదు – అని! 


ఈ ఫిబ్రవరి 1న, నాకు కొందరు పాఠకులు, గద్దర్ ని విమర్శిస్తూ చాలా రాశారు. మాట్లాడారు కూడా! ఎంత బాధపడిపోతున్నారో వింటే, నేనే వెనకబడి వున్నాననిపించింది. ఆ పాఠకుల బాధలో కొంతే చూపించగలను గానీ, ఇక్కడ అంతా సాధ్యం కాదు. వాళ్ళ మాటలు: 


‘గద్దర్ సంగతి గమనించారా? ఎలా తయారైపోయాడో చూశారా? అతని నిజస్వరూపం ఇదేనా? రియల్ ఎస్టేట్ వ్యాపారులూ, పాలకవర్గాల స్వాముల వాళ్ళూ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాధినేతలు కలిసి తలపెట్టిన భక్తి టూరిజానికి ప్రచారకుడిగా గద్దరు తయారయ్యాడు చూడండి! ప్రజా యుద్ధ నౌకగా కీర్తి పొందిన గద్దర్ నిజ స్వరూపం పల్లెటూళ్ళలో వుండే మా బోటి వాళ్ళకే, తెలిసిపోతున్నది. పట్నాలలో వుండే మేధావులు ఎవ్వరూ ఒక్క విమర్శా చెయ్యరా? మేము వ్యవసాయకూలీలం, పేద రైతులం. కాయకష్టం చేసుకు బతికేవాళ్ళం. ఐదు కన్నా చదువుకున్నోళ్ళం కాదు. ఒకప్పుడు గద్దర్ పాటలు విని, ఆయన్ని ఎంత ఆదర్శంగా అనుకున్నామో మీకు తెలుసా? ఆయన మాటలు నమ్మి, పాటలు విని, ఊళ్ళల్లో అమ్మలు కూడా ఎలా తయారై పోయారో ఆయన ఎరుగునా? విప్లవకారులుగా ఆ పాటలతోనే వచ్చిన వాళ్ళకి ఒకప్పుడు బువ్వ పెట్టీ, చాపలూ, పక్కలూ ఇచ్చి, పల్లెల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులతో కూడా సంతోషపడ్డారో మీకు తెలియదు. చాలా పల్లెల్లో అప్పట్లో, కొందరు పెద్దలూ, పిల్లలూ పోలీసుల దెబ్బలకు కళ్ళు మూసేశారు. మా జీవితాలు ఆగమైపోయాయి. అయినా, దాన్ని ఆగం అనుకోలేదు అప్పుడు. గద్దర్ ముసుగు ఇలా తొలిగిపోయిందా? అతగాడు ఇప్పుడు రామ జపం, క్రిష్ణ జపం, రామానుజ జపం చేస్తున్నాడే! అతగాణ్ణి మీబోటి రాతల వాళ్ళు విమర్శించలేరా? గడ్డి పెట్టలేరా? పెట్టినా అతడు తినడని తెలుసు. అంత మారాడు!’– ఇలా సాగాయి, పాఠకుల కోపాలు! అవి, ఒకప్పటి గద్దర్ అభిమానుల ఈ నాటి మాటలు! నా మాటలైతే, ఆ మాటల కన్నా సుతారంగా వుంటాయా? 


కొందరు కొన్ని వీడియోలూ, ఫోటోలూ కూడా పంపారు! గతంలో, ప్రత్యేక తెలంగాణ రావాలని భద్రాచలంలో, సీతమ్మ తల్లిని అతగాడు మొక్కుకున్నాడని వచ్చిన వార్తలు పంపారు. ఈ మధ్య యాదాద్రి వెళ్ళాడట ఆ విప్లవకారుడు! కోట్ల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, కట్టించిన గుళ్ళనీ గోపురాల్నీ చూశాడట! అక్కడి అధికారులు ఇతడికి, ఆ గుళ్ళలో ప్రత్యేక దర్శనం చేయించారట! అదంతా ఆనందపడిపోతూ చెప్పుకుంటున్న వీడియో కూడా పంపారు! ఈ దృశ్యాలు నేను ఇంతకుముందు చదివాను గానీ, చూడలేదు. నిన్న ఏకంగా, జీయరు చానల్ అని అనధికారికంగా పిలిచే ఒక టీవీ చానల్లో, ఏం జరిగిందో చూశాను! భక్తి పారవశ్యంలో మునిగాడు గద్దరు. అతడు చేసిన ప్రశంసా వాక్యాల్నీ, భజన కీర్తనల్ని గుర్తు చేసే మైలు పొడవు పాటనీ విన్నాను. అంటే, ఒక నాటి ప్రజాయుద్ధ నౌక, ఈ నాడు భక్తి సముద్రంలో మునిగి పోయిందన్న మాట!


మనుషులకు తిండీ, బట్టా, నివాసం వుంటే, సరిపోవట! ‘మనసుకు’ తిండి కావాలట! అంటే, దేశంలో, అందరికీ తిండీ, బట్టా, నివాసం వచ్చేశాయన్న మాట! ఇప్పుడు కావలిసింది మనసుకి తిండి! అంటే భక్తి కావాలన్న మాట! ఇదీ, ఇప్పటి ఈ భక్తుడి సూక్తి! ఒకప్పుడు ‘రండిరో రండి! మాదిగోల్ల మల్లన్నా, చాకలోల్ల శాయన్నా, మంగలోల్ల మొగులన్నా, కుమ్మరోల్ల కొమ్రన్నా’.... అని శ్రామికులందరినీ కదన రంగానికి రావాలని పిలుస్తూ, ప్రోత్సహిస్తూ, ‘పట్టండిర గొడ్డండ్లూ...’ అంటూ, వీర విప్లవ నినాదాలిచ్చి, ఆ ‘ప్రజాయుద్ధ నౌక’గా కీర్తి గడించాడు. ఆ నాటి ఆ విప్లవకారుడు, ఈ నాడు ఏం పాడుతున్నాడు? ‘రండిరో, రామనుజం జాతరకు...’ అంటూ, అదే శైలిలో తాదాత్మ్యం చెందుతున్నాడు! కానీ, దీన్ని దేనికో ఆరాటం, దేనికో అత్యాశ– అనుకుంటున్నారు అనేక మంది! 


‘ఏఁ, ఒక మనిషికి అభిప్రాయాలు మార్చుకునే హక్కు లేదా? అభిప్రాయాలు మారవా?’ అని గద్దరో, అతడి భక్తులో, అడగొచ్చు. తప్పకుండా, ఆ హక్కు వుంది. ఉంటే, తగిన కారణం చెప్పాలి! 


‘ఒకప్పుడు వీర విప్లవ కవిత్వ నినాదాలు ఇచ్చి, గానాలు చేసి, ఇప్పుడు ఇలా పాలకవర్గ ఆధ్యాత్మిక సేవకుడైనావేమీ?’ అని విమర్శలతో అడిగే హక్కు, అతడి వెనకటి అభిమానులకు కూడా వుంటుంది.


ఒకప్పుడు విప్లవ గీతాలు రాసీ, పాడీ, గజ్జె కట్టి ఆడీ, ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి, ఆ మార్గం వొదిలి, పూర్తిగా వ్యతిరేక మార్గం పట్టినప్పుడు, ప్రజలకు ఏమి చెప్పుకోవాలి? ‘ఆ నాడు, అలా ఆలోచించాను. ఈ నాడు, గతంలో నేను నడిచిన దారి తప్పుదారి అని, నాకు అర్థం అయ్యింది. శ్రామిక వర్గ విప్లవ సిద్ధాంతం తప్పు అనీ, దాని వల్ల ఫలితం లేదనీ, శ్రామికులు, యజమానుల బానిసలుగా బతకవలిసిందే– అనీ, వెయ్యేళ్ళ నాటి భక్తి మార్గమే, సరైన ఉత్తమ మార్గమనీ, నేననుకుంటున్నాను.’ అని చెప్పుకున్నాడా, జనాలకి? ఓహో, ఈయనకి, ‘తెలంగాణా గాంధీ’ మార్గం నచ్చిందన్నమాట! రైతుల ఆత్మహత్యలు జరుగుతోన్నా, గుళ్ళూ గోపురాలకి బంగారు విగ్రహాలూ, తాపడాలూ, ఈ ఉత్తమ భక్తుడికి గొప్పగా నచ్చాయన్నమాట! అనుకుంటాం. ‘దున్నేవానికే భూమి’ అనే నినాదానికి ఆ నాడు మద్దతు పలికిన విప్లవ కవికి, ఈనాడు వందల ఎకరాల్ని మూఢవిశ్వాసాలకు బలి ఇవ్వడం గొప్పగా నచ్చింది. నచ్చబట్టే, దాని మీద కీర్తన! పోషకాహార లోపాలతో బాల్యంలోనే మరణించే లక్షలాది పిల్లలున్న దేశంలో, ‘144 పెద్ద యాగశాలల్లో, లక్షల టన్నుల నెయ్యిని, 1035 హోమ గుండాల్లో పారబొయ్యడమూ’, గొప్ప ఆధ్యాత్మికతగా కనపడింది, ఈ కామ్రేడుకి! ఒంటి మీద వుండే బట్టల్ని బట్టీ, తినే తిళ్ళ రకాల్ని బట్టీ, మరణాల తర్వాత పడుకునే శ్మశాన వాటికల్ని బట్టీ, పరమత ద్వేషాన్ని వెళ్ళగక్క గలడు ప్రభుత్వాధినేత. ఆ అధినేత విచ్చేసే పుణ్యక్షేత్రాన్ని చూడడానికి, ప్రజలందరినీ రమ్మని, ‘రండహో! రండి! రండి!’ అనే ప్రచార కార్యక్రమమే ఈ నాటి గద్దర్ స్వామికి విప్లవ కర్తవ్యం అయింది.


చరిత్రలో, సంస్కర్తలు వుంటారు. సంస్కరణలతో ఆగిపోయే మానవుడు, గిన్నెల్లో కన్నాలకు మాట్లు వేసేవాడే అయినా, ఆ గిన్నెకి ఆ మాట్లే కొన్నాళ్ళు అవసరం. అందుకే, మాట్ల సంస్కర్తని గుర్తిస్తాం. చరిత్ర క్రమంలో, ఆ పరిమితుల్లో, ప్రశంసిస్తాం. ఆ సంస్కర్త అభిమానులంతా, విప్లవ భావాల వేపు మొహాలు తిప్పవలిసి వుంటుంది. అంతే గానీ, నాలుగు రోజులు, విప్లవ గేయాల వాడు, వెనకటి సంస్కర్తని భగవంతుణ్ణి చేస్తూ, ఆ పేరుతో, తన కొత్త గుర్తింపు కోసం తహ తహలా? 


అందుకే, ఇవ్వాళ ఒక పాత గద్దర్ అభిమాని ఇలా రాశాడు: ‘గద్దరు, చిరిగిపోయి పీలికలైన చెద్దరు అయ్యాడు!’ అని.


ఈ చెద్దరు, విప్లవ మానవుడు కాజాలడు!

రంగనాయకమ్మ

Read more