కక్షపూరిత ప్రతిపక్షాలతో చేటు

ABN , First Publish Date - 2022-03-15T09:40:00+05:30 IST

తెలంగాణను పట్టుకున్న ఎన్నో దరిద్రాలను వదిలించ గలుగుతున్న మేము ప్రతిపక్షాల భావ దారిద్ర్యాన్ని మాత్రం వదిలించ లేకపోతున్నాం. కొలువుల కుంభమేళాను ప్రకటిస్తే ఎద్దేవా చేయడమేమిటి? 1952 ముల్కీ పోరాటం నుంచి తెలంగాణ ప్రజల్లో గూడుగట్టుకున్న ఆవేదనను తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమే..

కక్షపూరిత ప్రతిపక్షాలతో చేటు

తెలంగాణను పట్టుకున్న ఎన్నో దరిద్రాలను వదిలించ గలుగుతున్న మేము ప్రతిపక్షాల భావ దారిద్ర్యాన్ని మాత్రం వదిలించ లేకపోతున్నాం. కొలువుల కుంభమేళాను ప్రకటిస్తే ఎద్దేవా చేయడమేమిటి? 1952 ముల్కీ పోరాటం నుంచి తెలంగాణ ప్రజల్లో గూడుగట్టుకున్న ఆవేదనను తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమే..


కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం జీఎస్డీపీ రేటులో, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో సాధించిన వృద్ధిని చూసి యావత్ దేశమే అబ్బురపడుతోంది. ఈ లెక్కలు మేం చెబుతున్నవి కాదు. కేంద్ర ప్రభుత్వం గత నెల 28న విడుదల చేసిన లెక్క‌లవి. 2021–22లో స్థిర‌ ధ‌ర‌ల వ‌ద్ద జీఎస్డీపీ వృద్ధి రేటు 11.2 శాతంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది త‌ల‌స‌రి ఆదాయంలో 18.8శాతం వృద్ధితో అగ్ర‌స్థానాన నిలిచింది. 2014–15లో తెలంగాణలో త‌ల‌స‌రి ఆదాయం రూ. 1,24,104 ఉంటే, 2021–22 నాటికి అది రూ.2,78,833కు పెరిగింది. ఈ గణాంకాలు అభివృద్ధికి ప్రామాణికం కావా? మరో అభివృద్ధి సూచిక అయిన విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిన‌ట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. త‌ల‌స‌రి  విద్యుత్ వినియోగం 2014లో 1110 యూనిట్లు ఉంటే 2021లో 2012 యూనిట్ల‌కు చేరుకున్న‌ది.


అద్దం లాగా గణాంకాలు కనబడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం ఉత్త అక్కసుతో విమర్శలకు దిగుతున్నాయి. వాదనకు ఏదైనా ఆధారం ఉండాలి. ఆ కనీస ఇంగితం లేదు. గాలి పోగేసి మాట్లాడుతున్నారు. అర్ధ సత్యాలు అసత్యాలతో దేన్నైనా ఏమార్చవచ్చనే కపటనీతినే నమ్ముకొన్న ప్రతిపక్షాలు ప్రజలముందు పలుచనగాక ఎమౌతాయి? ఒక అధ్యయనం ఉండదు. ఆలోచనా ఉండదు. ఏ బాధ్యతా లేనివాళ్ళు వీధుల్లో మాట్లాడిన చందంగా శాసనసభలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు మాట్లాడటం శోచనీయం. ప్రభుత్వం ఇన్ని విజయాలు సాధించింది అంటే, ఎన్ని కారకాలను ఏకకాలంలో సమన్వయిస్తే ఇది సాధ్యమయింది? ఇవన్నీ ఆర్థిక విషయాల లెక్కలు. ప్రజల భాషలో చెప్పాలంటే గ్రామం నుంచి రాజధాని నగరం దాకా అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళు మహాత్మాగాంధీ పేరు చెప్పుకుని 50 ఏళ్లు పరిపాలించారు. గ్రామాభివృద్ధిలో గాంధీ ఆశించిన ఏ ఒక్క అంశాన్నీ సాధించలేకపోయారు. ఈ రోజు టిఆర్‌ఎస్ పాలనలో ఏ గ్రామంలోకి వెళ్లినా, ఏ మారుమూల గూడెంలోకి వెళ్లినా సమృద్ధిగా తాగునీరు అందుతోంది. ఇది నిజం కాదా... చెప్పండి? ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో నేడు దాహార్తి సమస్యలేదే? స్వచ్ఛమైన భగీరథ జలాలు ఊరూరికి అందుతుంటే రాష్ట్రంలో ఫ్లోరోసిస్ పీడ అంతమయిందని కేంద్రమే పార్లమెంటు వేదికగా ప్రకటించిన వాస్తవాన్ని సౌకర్యవంతంగా విస్మరిస్తారా?


సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీకి కందిళ్లతో, ఎండిపోయిన కంకులతో వ‌చ్చి శాసనస‌భ్యులు ప్రదర్శనలు చేసేవారు కదా. క‌రెంట్ లేక పంట‌లు ఎండిపోతున్నాయ‌ని నిర‌స‌న‌లు తెలిపేవారు కదా. ఏ దుకాణానికి పోయినా జనరేటర్ మోతతో చెవులు దద్దరిల్లితే, డీజీల్ వాసనతో ముక్కుపుటాలు అదిరిపోయేవి. ఇన్వర్టర్లు లేకుండా కాలం గడిచేది కాదు. పల్లెల్లో అయితే పగటి పూట కరెంటే ఉండేది కాదు. ప‌వ‌ర్‌క‌ట్‌తో జ‌నం స‌త‌మ‌త మ‌య్యేవారు. ఉక్కపోతల్లో ఉడికిపోయేవారు. పవర్ హాలిడేలు ఎత్తేయాలని పారిశ్రామికవేత్తలు సైతం ధర్నాలు చేసిన వైనం. నాటి దుర్భ‌ర ప‌రిస్థితుల‌కు అందరూ సాక్షీభూతులే కదా? ఎంతో మంది ఘనత వహించిన ముఖ్యమంత్రులు కరెంటు సమస్య పరిష్కారం చేయలేకపోయారు. చరిత్రలో ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కింది. నేడు రాష్ట్రంలో వ్యవసాయంతో సహా అన్ని అవసరాలకూ ఇరవైనాలుగు గంటలూ చిన్న అవాంతరం లేకుండా ధారాళంగా విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. రాష్ట్రం వచ్చిన నాడు మన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7778 మెగావాట్లు ఉంటే, నేడు 17,305 మెగావాట్లకు పెరిగింది.


ఘనత వహించిన కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఎవరో రాసిన మినీ కవిత గుర్తొస్తుంది– ‘పైన రవి, కింద భువి నడుమనున్నది పైరవీ....’ పైరవీకార్లకు, దళారీలకు స్వర్ణయుగమై భాసిల్లిన కాలం వారిది ఇవాళ హైదరాబాద్‌లో మా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మీట నొక్కితే లబ్ధిదారుల ఫోన్లు టింగు.. టింగున మోగుతున్నాయి. ఖాతాలో సొమ్ము చేరిన సమాచారం తెలుపుతున్నాయి. అవినీతికి ఆస్కారం లేకుండా అడుగడుగునా పారదర్శకతను పాటిస్తున్నాం కనుకనే ఫలితాలు వస్తున్నాయి. నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చినా, మున్సిపల్ చట్టం తెచ్చినా జవాబుదారి తనం కోసమే. నిధులు ఇచ్చాం. విధులను నిర్దేశించాం.


తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో రాష్ట్రం న‌లుమూలలా తిరిగిన అనుభవం నాది. ఆనాడు ఎక్కడ చూసినా బీడు భూములు, వాటిలో మొలిచిన సర్కారు తుమ్మలే కనిపించేవి. ఎంతలో ఎంత మార్పును సాధించాం. ఈ రోజు రాష్ట్రంలో ఏప్రిల్ – మే మండుటెండలో సైతం ఏ చెరువులో చూసినా నీళ్లే, ఏ చెక్ డ్యాంలో చూసినా నీళ్లే... ఏ ప్రాజెక్టులో చూసినా నీళ్లే... ఎటుచూసినా పచ్చని పొలాలే. ఆనాటి పాలనలో ఎప్పడూ ఎండాకాలమే అన్నట్టు ఉంటే ఈనాటి మా పాలనలో ఎప్పుడూ వానకాలమే అనిపించే విధంగా జలాశయాలు, పంటపొలాలూ కళకళలాడుతున్నాయి. కాంగ్రెస్ పరిపాలనలో రైతుల కళ్లల్లోంచి కన్నీరు ప్రవహిస్తే, టిఆర్‌ఎస్ పరిపాలనలో రైతుల పొలాల్లోకి సాగు నీరు ప్రవహిస్తున్నది.


పోయిన సంవత్సరం మే నెలలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు కోరితే హల్ది వాగు కూడవెల్లి వాగూ మంజీర నదీ ప్రవాహ మార్గంలో కాళేశ్వరం నీళ్లు వదిలినం. కోట్లాది రూపాయల పంట కాపాడినం. కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్‌కు నీళ్లు తీసుకెళ్లినం. మే నెల మండుటెండ‌ల్లో సైతం అప్పర్ మానేరు మత్తడి దూక‌డం, ఎస్సారెస్పీ నీరు కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని చిట్టచివరి భూములకు మేం నీళ్లందించినం. కాంగ్రెస్‌ నిర్వాకంతో సర్కారు తుమ్మ మొలిచిన కాల్వల్లో నీరు ప్రవహింపజేసి డోర్నకల్, మహబూబాబాద్‌ల అవసరాలు తీర్చినం. ఈ మధ్య నేను హెల్త్ ప్రొఫైల్ లాంచ్ చేసి ములుగు నుంచి వస్తుంటే.. ఎక్కడ చూసినా నిండుకుండల్లాగా చెరువులు, భూమికి పచ్చని రంగేసినట్లు పొలాలు దర్శనమిచ్చినాయి. ఇదీ, కాంగ్రెస్ పాలనకు-- టీఆర్ఎస్ పాలనకు ఉన్న తేడా. మాది తెలంగాణ పొలాల దాహార్తి తీర్చిన ప్రభుత్వం. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ప్రాంతంలో పత్తి ఏరడానికి కర్నూలు, రాయచూరు నుంచి కూలీలు వస్తున్నారు. వరంగల్ జిల్లాలో మిర్చి ఏరడానికి ఛత్తీస్‌ఘడ్ నుండి కూలీలు వస్తున్నారు. నూనూగు మీసాల సోర సోరపిల్లలు పొట్ట చేతబట్టుకొని వలసపోతుంటే, అయినవాళ్ళు బొంబాయి బస్సుల దగ్గర భోరున ఏడ్చే హృదయ విదారక దృశ్యాలు పాలమూరు నేలమీద ఇప్పుడు కనుమరుగైనయి.


చరిత్రలో ఎన్నడూ ఎరుగనంత పంట పండుతున్నది రోడ్డు మీద వెళుతుంటే ఎటుచూసినా ధాన్యపు రాసులు దర్శనమిస్తున్నాయి. తెలంగాణను పట్టుకున్న ఎన్నో దరిద్రాలను వదిలించగలుగుతున్న మేము ప్రతిపక్షాల భావదారిద్ర్యాన్ని మాత్రం వదిలించలేకపోతున్నాం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అభివృద్ధి దేవతా వస్త్రాలు ఒక్క రాష్ట్ర బిజెపి నాయకులకే కనిపిస్తాయి. వ్యవసాయ వ్యతిరేక నల్లచట్టాలు తెచ్చి, ఉత్తరాది రైతుల చేతిలో భంగపాటుకు గురైన బిజెపి, దక్షిణాది రైతులకు చేసే ద్రోహాన్ని తెలంగాణ నుంచే ఆరంభించింది. తెలంగాణలో పండిన పంటలు కొనడం చేతగాక బిజెపి ప్రభుత్వం తన అసమర్థత చాటుకుంటున్నది.


కొలువుల కుంభమేళాను ప్రకటిస్తే, దాన్ని కూడా ఎద్దేవా చేస్తూ నిరుద్యోగ యువతలో నిస్పృహ పెంచాలనీ, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనీ వికృతమైన ఆలోచనలకు పాల్పడుతున్నారు. స్థానిక యువతకు 95 శాతం రిజర్వేషన్ సాధించటానికి మా ప్రభుత్వం చరిత్రాత్మక కృషి చేసింది. 1952 ముల్కీ పోరాటం నుంచి తెలంగాణ ప్రజల్లో గూడుగట్టుకున్న ఆవేదనను తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమే. ఉద్యోగ నియామకాల్లో గతంలో స్థానికులకు జరిగిన అన్యాయాల చరిత్ర సుదీర్ఘమైనది. ముల్కీ రూల్స్, జెంటిల్‌మెన్ అగ్రిమెంట్, 610 జీవో అన్నీ నీటిమీది రాతలైపోతేనే కదా ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల ఒత్తిళ్ళ మధ్య రూపొందిన రాష్ట్రపతి ఉత్తర్వులు మారాలి.


స్వరాష్ట్రంలో స్థానికుల హక్కులు కాపాడేలా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరగాలి. కొత్త ఉత్తర్వుల కోసం తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఒక పోరాటమే చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు ఆమోదించడానికి కేంద్రం ఏడాది సమయం తీసుకున్నది. జాప్యం తమ వల్లనే అని తెలిసి కూడా రాష్ట్ర బిజెపి నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. మరోవైపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యోగుల విభజన తేలనివ్వదు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి కదా కొత్త జిల్లాల ప్రకారం క్యాడర్ విభజన జరగాలి. ప్రభుత్వ శాఖల్లో కొన్ని కాలదోషం పట్టిన పోస్టులు నామావశిష్టంగా ఉన్నాయి. ఇంతవరకూ వాటిని కూడా ఖాళీల కింద లెక్కవేసి చూపుతూ వస్తున్నారు. ఈ లోపాలన్నీ సవరిస్తే నేరుగా చేయాల్సిన నియామక ఖాళీలు 91,142గా తేలింది. ఇప్పుడు ఈ ఖాళీలన్నిటినీ ఒకే సారి భర్తీ చేసే బృహత్తర ప్రయత్నం ప్రారంభించాం. రికార్డు స్థాయిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టటం చూసి యువతలో పెద్దపెట్టున ఉత్సాహం పెల్లుబుకుతున్నది. కానీ ప్రతిపక్షాలకేమో భయం పట్టుకున్నది. విమర్శ కోసమే విమర్శ చేసే ఈ యాంత్రిక ప్రతిపక్షాన్ని ప్రజలు ఇక భరించరు. వీళ్ళ విమర్శలు చూసి, ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని వదులుకుంటారని అనుకోవటం అత్యాశ. ఈ కక్షపూరిత ప్రతిపక్షాలు ఇకనైనా ఈ సత్యం గ్రహించేనా? ఏమో వారినుంచి వివేకాన్ని ఆశించటం ఎండమావిలో నీళ్ళు వెతకటమే అనుకుంటాను.

తన్నీరు హరీశ్‌రావు

ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి 

Updated Date - 2022-03-15T09:40:00+05:30 IST