మహిళా శక్తి ప్రధాన లక్ష్యం ఫాసిజం అంతం!

ABN , First Publish Date - 2022-06-24T07:02:49+05:30 IST

ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆంధ్రప్రదేశ్ 8వ మహాసభలు జూన్ 25, 26 తేదీల్లో ఒంగోలులో జరుగబోతున్నాయి. ప్రగతిశీల మహిళా సంఘం తన ఉద్యమ గమనంలో మరో మైలురాయిని...

మహిళా శక్తి ప్రధాన లక్ష్యం ఫాసిజం అంతం!

ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆంధ్రప్రదేశ్ 8వ మహాసభలు జూన్ 25, 26 తేదీల్లో ఒంగోలులో జరుగబోతున్నాయి. ప్రగతిశీల మహిళా సంఘం తన ఉద్యమ గమనంలో మరో మైలురాయిని చేరుకుంటోంది. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా; సంఘపు పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సమీక్ష చేసుకొని దృఢచిత్తంతో ముందుకు పోవటానికి పీవోడబ్ల్యూ ఈ మహాసభలను ప్రధాన ఘట్టంగా భావిస్తోంది.


భారతదేశానికి ప్రజ్వలమైన మహిళా ఉద్యమ చరిత్ర ఉంది. తెభాగా, పున్నప్రా, వాయిలార్ రైతాంగ పోరాటాలు మొదలుకొని లక్షలాదిమంది మహిళలు ఆదివాసీ ఉద్యమాలలో పాల్గొన్నారు. జాతీయోద్యమంలో తమ వంతు పాత్రను నిర్వహించారు. తెలంగాణ, నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలలో మడమ తిప్పని వీర వనితల సాహసం, ప్రాణ త్యాగం అనేకమంది మహిళలను విప్లవోద్యమాల వైపు ప్రోద్బలించాయి. వాటి కొనసాగింపుగా జరిగిన గోదావరీ లోయ పోరాటం మహిళల వీరోచిత పాత్రకు ప్రాణం పోసింది. ఆ పోరాట ప్రాంగణంలోనే ఊపిరి పోసుకొన్నది ప్రగతిశీల మహిళా సంఘం. అర్ధ శతాబ్దంగా విప్లవ మహిళా ఉద్యమ ధార ప్రగతిశీల మహిళా సంఘం రూపంలో ఇక్కడి ప్రజల మధ్యన తారాడింది. ఈ పాయ రెండున్నర తరాల మహిళల సామాజికగతిపై ముద్ర వేసింది. శ్రామిక మహిళా శ్రేణుల మధ్య వెల్లువై ప్రవహించింది. ఆ ప్రవాహాన్ని అనుసరించిన మహిళలు సమాజాన్ని ఆకళింపు చేసుకొని ఆ వెలుగులో తమ సమస్యలను చూసుకోగలిగారు. ప్రగతిశీల మహిళా సంఘం మహిళా విముక్తి పరిష్కారానికి చూపుడు వేలును వ్యవస్థపై చూపింది. విప్లవాత్మకమైన పరిష్కారం మినహా ఇంకో దారి లేదని చెప్పింది. సంస్కరణలు తాత్కాలికమైనవే అనీ, కరుడు కట్టిన పురుషస్వామ్యాన్ని కరిగించటానికి సమాజం సమూలంగా మారటం తప్ప ఇంకో దారి లేదని తేల్చిచెప్పింది. అందుకే ఆ ప్రయాణం కష్టతరమైనది. కానీ గమ్యం సుస్పష్టమైనది. ఆ ప్రస్థానంలో ఎందరో అమర వనితలు నేలకొరిగారు. పంచాది నిర్మల, స్నేహలత, అంకమ్మ, సుసేన, చింతాలక్ష్మి, రంగవల్లి లాంటి వందలాది మహిళలు తమ ప్రాణాలను ఈ కర్తవ్యంలో భాగంగా సమర్పించారు.


మహిళా ఉద్యమాల కర్తవ్యాలు గతం కంటే ఉధృతమయ్యాయి. సామాజిక చలన సూత్రాలను అర్థం చేసుకుంటూ తన పనిని పదును పెట్టుకోవాల్సి వస్తోంది. లైంగిక దాడులూ, అత్యాచారాలూ, వరకట్నపు హత్యలు జరిగిన ప్రతి సందర్భంలో దోషులకు రాజ్యాంగ పరిధిలో సరైన శిక్షలు పడేలా కృషి చేయాలి. ఇంకోపక్క ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతారాహిత్యంగా ప్రతిపాదిస్తున్న తక్షణ పరిష్కారాల్లో ఉన్న ప్రమాదాన్ని ఎత్తి చూపాలి. జెండర్ సెన్సిటైజేషన్, మహిళలపై జరుగుతున్న నేరాలకు మూల కారణాలను అర్థం చేయించే ప్రక్రియలను సమాంతరంగా కొనసాగించాలి. కుటుంబంలోనూ, సమాజంలోనూ– ఉపాధి, ఆహారం, నివాసంలాంటి భద్రతనిచ్చే హక్కుల కోసం చేస్తున్న పోరాటాలను సమన్వయం చేసుకోవాలి. సంస్కరణ ఉద్యమాల పరిమితిని గుర్తిస్తూనే, ఆర్థిక పోరాటాలతో బాటు సామాజిక పోరాటాలకు బాసటనివ్వాలి. దేశంలో స్త్రీ పురుష సమానత్వం లేదనటానికి నికార్సైన ఋజువుగా నిలిచి ఉన్న ‘సమాన పనికి అసమాన వేతనాల’పై క్రియాశీలక ధిక్కారాన్ని ప్రదర్శించాలి. ఇంకోపక్క పనిగట్టుకొని ప్రజలను తాగుబోతులుగా తయారు చేస్తున్న మద్యపాన విధానాలకు చెక్ పెట్టాలి.


ఇప్పటివరకూ మహిళా విముక్తి ఉద్యమం ఎన్నోదారుల్లో ప్రయాణం చేసింది. అణచివేత నుంచి వచ్చిన ప్రశ్నలు, తిరుగుబాటు, అస్తిత్వస్పృహ స్త్రీకి కలగచేస్తున్న అలజడి నుంచి ఆమె యుద్ధంలోకి ప్రవేశించకుండా ఆమెను యథాతథ స్థితిలో ఉంచే ప్రయత్నాలు కూడా రాజ్యం వైపు నుంచి తీవ్రంగానే జరుగుతున్నాయి. అనాది కాలాల నుంచి స్త్రీ పురుషుల మధ్య తారతమ్యాలు సృష్టించి విడదీసి సగభాగాన్ని లొంగదీసి ఉంచే ప్రయత్నాలను నడిపిస్తూ వచ్చిన భూకేంద్ర వ్యవస్థకు తోడుగా ఇప్పుడు కార్పొరేట్ పెట్టుబడి రంగప్రవేశం చేసింది. పెట్టుబడికి ముద్దు బిడ్డైన పురుషాధిక్య వ్యవస్థ – మహిళల గమనాన్నీ, అభివృద్ధినీ తన వృత్తాకార పరిధిలో మాత్రమే కదలటానికి అనుమతినిస్తోంది.


గత ఏడేళ్లుగా మహిళా విముక్తి ఉద్యమం ఎన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. స్త్రీ సొంత వ్యక్తిత్వాన్ని తిరస్కరించే తిరోగమన భావజాలాన్ని అధికారికంగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్న హిందూ మతోన్మాద వ్యవస్థ రాజకీయ విధివిధానాల కర్తగా ఉనికిలోకి వచ్చింది. మహిళలను మళ్లీ మధ్యయుగాలలోకి నడిపించే ప్రయత్నం చేస్తోంది. దానికి ప్రతిఘటన కూడా మహిళల నుంచి తీవ్ర స్థాయిలో వస్తోంది. మైనారిటీలకూ, దళిత బహుజనులకు నిలువ నీడ లేకుండా చేయ సంకల్పించిన పౌరసత్వ చట్టాలను నిరసిస్తూ దేశమంతటా ముస్లిం మహిళలు బయటకొచ్చి నెలల తరబడి నిరసనలను కొనసాగించారు. జైళ్లకు వెళ్లారు. రైతాంగ వ్యతిరేక చట్టాలను తిరస్కరిస్తూ జరిగిన దేశవ్యాప్త ఉద్యమాల్లో మహిళా రైతు, రైతుకూలీ ప్రతినిధులుగా వేలాది మహిళలు సంవత్సరం పాటు ఇంటిని వదిలి రాజధాని సరిహద్దుల్లోని శిబిరాల్లో నిద్రించారు. ఉద్యమించారు.


ఫాసిస్టు పాలన ఎప్పుడూ ఒక వర్గాన్ని బుజ్జగిస్తూ ఇంకో వర్గాన్ని అణగదొక్కే విధానాన్ని పాటిస్తుంది. హిందువుల నుంచి ముస్లిములనూ, అగ్ర కులాల నుంచి దళిత బహుజనులను, స్త్రీల నుండి పురుషులను విడదీస్తుంది. ముస్లిం పురుషుడిని నేరస్థుడిని చేస్తూ, ముస్లిం మహిళను ఉద్ధరిస్తున్నట్లు ఫోజులు కొట్టే ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం ఆ విధానంలో భాగమే. హిజాబ్ వ్యతిరేక విధానాలను దౌర్జన్యంగా అమలు చేయబూనటం కూడా అలాంటిదే. రైతు ఉద్యమాల్లోకి మహిళలను తెచ్చి కూర్చోబెట్టారనే పాలక వర్గాల ప్రచారం అలాంటిదే. బుల్లి బాయ్–సున్నీ డీల్స్ పేరుతో, క్లబ్ హౌసుల పేరుతో ముస్లిం మహిళల మీద జరిగిన అంతర్జాల లైంగిక వేధింపులకు సంఘీ సమూహాల మద్దతు కూడా అలాంటిదే. దళిత, ఆదివాసీ, మైనారిటీ, కార్మిక వర్గ మహిళలు కలగలిసి ఈ విధానాన్ని తిప్పి కొట్టాలి. మతం పేరుతో, కులం పేరుతో జరుగుతున్న విభజనను తిరస్కరించి, మహిళా ఉద్యమాలను ఐక్యంగా నిర్వహించాలని ఈ చారిత్రాత్మక సందర్భం నిర్ద్వంద్వంగా నిర్దేశిస్తుంది. అలాంటి సమున్నత ఉద్యమాల నిర్మాణానికి ఈ మహాసభలు ప్రాతిపాదిక అవుతాయని పీవోడబ్ల్యూ ఆశిస్తోంది. ఈ ఉద్యమ మహిళా సంఘానికి సకల జనుల నుండి పీవోడబ్ల్యూ మద్దతు కోరుకుంటోంది.

రమాసుందరి

పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

Updated Date - 2022-06-24T07:02:49+05:30 IST