రహస్యోద్యమ నాయకురాళ్లు

ABN , First Publish Date - 2022-10-17T07:41:32+05:30 IST

వీరులు సరే.. వీరుల్ని పోగొట్టుకున్న యిళ్ల గురించీ ఆ యిళ్లల్లో కూలిపోయిన వెన్నుపట్టి గురించీ అది పాడే చీకటిగాయాల...

రహస్యోద్యమ నాయకురాళ్లు

వీరులు సరే..

వీరుల్ని పోగొట్టుకున్న యిళ్ల గురించీ

ఆ యిళ్లల్లో కూలిపోయిన వెన్నుపట్టి గురించీ

అది పాడే చీకటిగాయాల పాట గురించీ

ముసురుపట్టిన చింతచెట్లలా

యిళ్ల ముంజూరు పెణకల మీంచి కురిసే 

కన్నీళ్ల దుఃఖం గురించీ ఎవరు మాట్లాడతారు?


తథాగతుల్ని కోల్పోయిన యశోధరల గురించీ

పద్మవ్యూహాల్లో 

బిడ్డల్ని కోల్పోయిన సుభద్రల గురించీ

కనీ.. మోదుగువనాల్లోకి విసిరి పారేసిన 

తల్లుల ఆవేదన గురించీ ఆర్తి గురించీ

పేగు తెంచుకున్న బాధ గురించీ

ఆ తల్లుల కనురెప్పల్లో యింకిపోయిన

కన్నీటి సముద్రాల గురించీ ఎవరు మాట్లాడతారు?


వీరుల్ని కన్న యిళ్లు.. తిండిపెట్టిన యిళ్లు 

ధూళి ధూసర దేహాలకు నీడనిచ్చిన యిళ్లు

ఎక్కడో అడవిలో రాలిపోయిన చుక్కల్ని 

అక్కున జేర్చుకొని మౌనంగా రోదించిన యిళ్లు

నెత్తుటి నాలుక చాపిన విప్లవ కాళికకు 

పిల్లల్ని బలిచ్చిన యిళ్లు

ప్రజల కోసం.. నమ్మిన సిద్ధాంతం కోసం 

తమ బతుకుల్ని 

పోరుదేవరకు నైవేద్యమిచ్చిన యిళ్లు 

అలాంటి యిళ్ల గురించీ 

ఆ యిళ్లకు కేంద్రాలైన తల్లుల గురించి 

              ఎవరు మాట్లాడతారు?


వీరుల తల్లులు.. 

రహస్యోద్యమ నాయకురాళ్లు

కదలనట్టు కనిపించే కదిలే జీవనదులు 

కురిసీ కురవనట్టున్న కన్నీటిమేఘాలు

లోకానికింత వెలుగునివ్వటం కోసం

రగులుతున్న నిప్పురవ్వల్ని 

పయ్యాడకొంగున మూటగట్టుకొని

పోరుపాదాలకింద పరచే ఎర్రమల్లెలు

ఎరుపెక్కినదారుల్లో 

బిడ్డలకు విల్లమ్ములందించే శమీవనాలు!

అందరి తల్లులూ పిల్లల్ని కంటారు

వీరుల తల్లులు మాత్రం విప్లవాల్ని కంటారు!

సిరికి స్వామినాయుడు

94940 10330


Updated Date - 2022-10-17T07:41:32+05:30 IST