ప్రజాస్వామ్య బలం చాటిన తొలి ఎన్నికలు

ABN , First Publish Date - 2022-02-19T07:24:34+05:30 IST

డెబ్భైఏళ్ల క్రితం (ఫిబ్రవరి 21, 1952న) ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మహత్తర ప్రయోగం పూర్తయ్యింది. స్వాతంత్ర్య సముపార్జన తరువాత నవ శకానికి నాంది పలికే దిశగా మొట్టమొదటి సార్వత్రక ఎన్నికల ప్రక్రియ..

ప్రజాస్వామ్య బలం చాటిన తొలి ఎన్నికలు

డెబ్భైఏళ్ల క్రితం (ఫిబ్రవరి 21, 1952న) ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మహత్తర ప్రయోగం పూర్తయ్యింది. స్వాతంత్ర్య సముపార్జన తరువాత నవ శకానికి నాంది పలికే దిశగా మొట్టమొదటి సార్వత్రక ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 21, 1951న ప్రారంభమై ఫిబ్రవరి 21, 1952న 68 దశలలో ముగిసింది. లోక్‌సభలో 489 స్థానాలకు (86 ద్విసభ్య స్థానాలు), 27 రాష్ట్రాలలో 3,280 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల సంరంభంలో పది కోట్ల అరవై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును మొట్టమొదటిసారి వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు ఇరవై వేల అభ్యర్థులు ప్రజల తీర్పును కోరారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం తన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఆ చారిత్రక ఘట్టం ప్రపంచ దృష్టిని అమితంగా ఆకర్షించింది. అప్పటికి రెండేళ్ల క్రితమే అమలులోకి వచ్చిన రాజ్యాంగపు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజలంతా తమ ఓటు ద్వారా వెల్లడించిన వైనం ప్రపంచాన్ని అమితాశ్చర్యానికి గురిచేసింది. నాటికి లాటిన్ అమెరికా, ఇండో చైనా, ఆఫ్రికాలలో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉండేవి. పలు దేశాలు మహిళలకు ఇంకా ఓటు హక్కును కల్పించలేదు. ఆ పరిస్థితుల్లో పేదరికం, నిరక్షరాస్యత, పారిశ్రామిక వెనుకబాటుతనంతో సతమతమవుతున్న భారతదేశం ప్రపంచ చరిత్రలో అతి పెద్ద ప్రజాస్వామ్య క్రతువుకు ఉపక్రమించింది.


ఈ ఎన్నికల ఏర్పాట్లు ఒక మహాయజ్ఞంలా సాగాయి. ఎన్నికల సంఘం ప్రథమ కమిషనర్ సుకుమార్ సేన్ ఆధ్వర్యంలో 17,32,12,343 మంది ఓటర్ల జాబితాలను తయారు చేయడానికి పదహారువందలమంది రిజిస్ట్రార్లు ఇంటింటికీ తిరిగి వారి వివరాలు సేకరించారు. ఆ సందర్భంగా 40 లక్షల మంది మహిళలు తమ పేర్లు వెల్లడించకుండా ఫలానా వారి భార్య, కుమార్తె లేదా సోదరిగా నమోదు చేయగా సేన్ ఆ జాబితాలను మార్చవలసిందిగా ఆదేశించారు. అయినా ఇరవై లక్షల మంది మహిళలు తమ పేర్లతో ఓటర్లుగా నమోదు చేసుకోలేదు. ఓటర్లలో నిరక్షరాస్యులు అత్యధికంగా ఉన్నందున బ్యాలెట్ పెట్టెలపై అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తుల కాగితాలను అంటించి ఓటింగ్ ప్రక్రియను సరళతరం చేశారు. దాదాపు ఇరవై లక్షల స్టీల్ బ్యాలెట్ పెట్టెలను దేశమంతటా ఉన్న రెండు లక్షల ఇరవై నాలుగు వేల పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి రెండు నెలల సమయం పట్టింది. ఓటు వేసే పద్ధతిని ప్రజలకు వీధి సమావేశాలు, నాటికలు, తోలుబొమ్మలాటలు, లఘు చిత్రాలు, రేడియో ప్రకటనల ద్వారా తెలియజేసారు. మూడు లక్షల తొంభై వేల సీసాలలో చెరిగిపోని సిరాను సిద్ధం చేశారు. మహిళా ఓటర్లకు ప్రత్యేకంగా ఇరవై ఏడు వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


అది అక్టోబర్ 25వ తేదీ. పది వేల అడుగుల ఎత్తున ఉన్న ఆ ఊరు పేరు చిన్ని (ఇప్పుడు కల్ప), కిన్నౌర్ జిల్లా, హిమాచల్‌ప్రదేశ్. ఉదయం తొమ్మిది గంటలకు ఆ ఘడియలు రానే వచ్చాయి. ముప్ఫయి నాలుగేళ్ల శ్యామ్‌శరన్ నేగి తన ఓటు హక్కును వినియోగించుకుని భారత రిపబ్లిక్ చరిత్రలో ప్రప్రథమ ఓటరుగా చరిత్ర సృష్టించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లో మొదలైన ఈ ప్రజాస్వామ్య మారుతం నాలుగు నెలల పాటు దేశమంతటా వీచింది. 17,32,12,343 మంది ఓటర్లలో 10,59,50,083 (44.87 శాతం) మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.


ఈ సమరంలో హేమాహేమీలు తలపడ్డారు. స్వాతంత్ర్య పోరాటాన్ని విజయవంతంగా నడిపిన భారత జాతీయ కాంగ్రెస్ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. జాతీయోద్యమంలో ఒక ఉజ్వల ప్రకరణానికి కారణభూతమైన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ లెగసీని పుణికిపుచ్చుకున్న సోషలిస్టు పార్టీ తరఫున క్విట్ ఇండియా ఉద్యమ హీరోలైన జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా; సాయుధ పోరాటం, కార్మిక ఉద్యమాలలో రాటుదేలిన భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అజయ్ ఘోష్, డాంగే, సుందరయ్యలు; ఎన్నికలకు నెల ముందే కశ్మీర్, విభజన కల్లోలంలో హిందూ బాధితుల సమస్యలే ప్రధాన అజెండాగా పురుడు పోసుకున్న భారతీయ జనసంఘ్ (1980 నుంచి బీజెపి) ప్రధాన ప్రచారకుడిగా శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ; షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్; కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరఫున జెబీ కృపలాని; కృషికార్ లోక్‌పార్టీ తరఫున ఎన్‌జి రంగా ప్రకాశం ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ప్రథమ ప్రధానమంత్రిగా అప్పటికే అంతర్జాతీయ స్థాయిని అందుకున్న నెహ్రూ అన్నీ తానై, మూడు వందల బహిరంగ సభల్లో ప్రసంగించి కాంగ్రెసును 364 స్థానాలతో విజయపథంలో నడిపించారు. ఆయన కేబినెట్‌లో మంత్రులంతా ఎన్నికయ్యారు. ఓట్ల శాతంలో రెండవ స్థానంలో (10.59) ఉన్న సోషలిస్టు పార్టీ 12 సీట్లతో సరిపెట్టుకోగా, కేవలం 49 స్థానాల్లో పోటీ చేసి 3.9 శాతం ఓట్లతో 16 సీట్లు సంపాదించిన అవిభక్త సీపీఐ అతి పెద్ద ప్రతిపక్షంగా అవతరించింది. కృపలాని నాయకత్వంలో పోరాడిన కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ (కెఎంపీపీ) 145 స్థానాలలో పోటీ చేసి 5.8 శాతం ఓట్లతో 9 సీట్లను గెలుచుకున్నది. జనసంఘ్ 94 స్థానాలలో పోటీ చేసి 3 శాతం ఓట్లతో 3 సీట్లను గెలుచుకుని ప్రథమ లోక్ సభలో అడుగు పెట్టింది. ఈ ఎన్నికలతోనే– ఓట్ల శాతానికి గెలిచిన సీట్లకు అప్పుడప్పుడు పొంతన ఉండదని సోషలిస్టు పార్టీ వైఫల్యంతో ఋజువయ్యింది. ఈ నాలుగు ప్రతిపక్షాలు నెహ్రూ నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ తమ సైద్ధాంతిక కోణాల నుంచి విమర్శల వర్షం కురిపిస్తూ ప్రజలను ఆకట్టుకున్నా కాంగ్రెస్ సంస్థాగత బలం, స్వాతంత్ర్య పోరాట సారథ్యం, నెహ్రూ ప్రజాకర్షణ శక్తి ముందు నిలువలేకపోయాయి.


దురదృష్టవశాత్తు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ అంబేడ్కర్ ద్విసభ్య నియోజకవర్గమైన బొంబాయి ఉత్తరంలో ఓటమి పాలయ్యారు. అదే నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి డాంగే, సోషలిస్టు అభ్యర్థి అశోక్ మెహతా కూడా ఓటమి చవిచూశారు. కృపలానీ, రంగా దంపతులు లాంటి ప్రముఖులు ఓడిపోగా, నెహ్రూ, జగ్జీవన్‌రామ్, మౌలంకర్, రాజకుమారి అమృత్ కౌర్, వీవీ గిరి, ఏకె గోపాలన్, హరేకృష్ణ మెహతాబ్, సుచేత కృపాలాని, రావి నారాయణ రెడ్డి మొదలైన వారు జయకేతనం ఎగురవేశారు. నాటి మద్రాస్, హైదరాబాద్‌లలో అంతర్భాగమైన తెలుగు రాష్ట్రాలలో (ముఖ్యంగా నేటి ఆంధ్రప్రదేశ్) పాతపట్నం నుంచి చిత్తూరు వరకు గల లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెసుకు కేవలం నాలుగు సీట్లు మాత్రమే రాగా స్వతంత్రులు, సీపీఐ, సోషలిస్టులు మిగిలిన స్థానాలను కైవశం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెసు విజయదుందుభి మ్రోగించింది. మద్రాసు, హైదరాబాద్‌లలో కమ్యూనిస్టులు, ఒరిస్సాలో గణతంత్ర పరిషద్ (మాజీ సంస్థానాధీశులు, జమీందార్ల పార్టీ) కాంగ్రెసుకు గట్టి పోటీనిచ్చాయి. పశ్చిమ బెంగాల్, ట్రావెన్‌కోర్‌లలో కమ్యూనిస్టులు అక్కడక్కడా తమ సత్తా చాటారు. గెలిచిన వారిలో అన్ని కులాల, మతాల, జాతుల వారు ఉన్నారు. వారిలో మధ్యతరగతికి చెందిన విద్యావంతులు కొట్టొచ్చినట్లు కనిపించేవారు. విజేతలలో పెద్ద సంఖ్యలో జాతీయోద్యమకారులు కూడా ఉన్నారు.


మాజీ ఐసీఎస్ అధికారి, గణితశాస్త్ర పోస్ట్‌గ్రాడ్యుయేట్ అయిన సుకుమార్ సేన్ సునిశిత దృష్టిని సమర్థతను ఎంత పొగిడినా చాలదు. నాలుగు నెలలపాటు సాగిన ఈ విస్తృత ప్రక్రియలో ఎక్కడా అపశ్రుతులు దొర్లకుండా పోలింగును నిర్వహించిన అధికారగణానికి కూడా జేజేలు పలకాలి. భారత పౌరుల క్రమశిక్షణ కూడా పరిశీలకులను ఆశ్చర్యపరచింది. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా సమస్యలపై చర్చకు శ్రీకారం చుట్టి కోట్లాది ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించాయి. పాశ్చాత్య ప్రపంచాన్ని సైతం సంభ్రమానికి గురి చేసిన ఈ ఎన్నికలు ఆధునిక ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి.

డా. కొట్టు శేఖర్

కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ

Updated Date - 2022-02-19T07:24:34+05:30 IST