‘సాగు ఉద్యమం’ సత్తా చూపింది

ABN , First Publish Date - 2022-03-18T06:27:47+05:30 IST

ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాయి. అంచనాలు తలకిందులయ్యాయి. అయితే విజేత చెప్పిందే సత్యమా? తప్పుడు కథనాలను ఎండగట్టవలసిన సమయమిది. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు...

‘సాగు ఉద్యమం’ సత్తా చూపింది

ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాయి. అంచనాలు తలకిందులయ్యాయి. అయితే విజేత చెప్పిందే సత్యమా? తప్పుడు కథనాలను ఎండగట్టవలసిన సమయమిది. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి సరళి తెలిసీ తెలియడంతోనే రైతుల ఉద్యమంపై అపనిందలతో దుమ్మెత్తిపోయడం ప్రారంభమయింది. అసలు ఆ ఆందోళనను ఏ మాత్రం సహించలేకపోయిన వారికి ‘మేం చెప్పలేదూ, రైతులు ఇటువంటి వ్యవహారాలను పట్టించుకోనే పట్టించుకోరని’ అంటూ ఒకింత విజయ దర్పం ప్రకటించేందుకు అవకాశం లభించింది. ‘ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో రైతు ఉద్యమ ప్రభావం ఏమాత్రం లేదని’ స్వామి భక్తి పరాయణులు కరాఖండీగా చెప్పడం ప్రారంభించారు. ‘నిశ్చింతగా ఉండవచ్చు, కిసాన్‌ల కోపతాపాల గురించి ఎవరూ కలవరపడవలసిన అవసరం లేదు’ అన్నదే గెలిచిన వారి ఆత్మసంతృప్తిలోని అంతర్భావం.


ఆ అంతస్సూచనను నిరూపించేందుకు అన్ని రకాల వాస్తవాలను ఎత్తి చూపారు. కొత్త సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం ఎక్కడ నుంచి ప్రభవించిందో అక్కడి రైతులే దాన్ని పూర్తిగా విస్మరించారనేందుకు బల్బీర్ సింగ్ రాజేవాల్ తదితర పంజాబీ రైతు నేతల ఆధ్వర్యంలోని సంయుక్త్ సమాజ్ మోర్చా ఘోర పరాజయమే ఒక గట్టి నిదర్శనమని నొక్కి చెప్పారు. సరే, మీడియా మేధావుల విమర్శలకు ప్రాతిపదిక ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం తరువాత కూడా రైతు ఉద్యమం గురించి తలబద్దలు కొట్టుకోవడమెందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. లఖింపూర్ ఖేరీలో బీజేపీ అభ్యర్థి విజయం రైతాంగ పోరాట నిరర్థకతకు అద్దం పట్టిందని వారు విశ్వసిస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ ప్రభవించిన ప్రాంతంలోనే బీజేపీ విజయం సాధించిందని, జాట్‌లు అధికార పార్టీ పక్షానే ఉన్నారని రుజువు చేసేందుకు ఎన్నికల తొలివిడత పోలింగ్ భోగట్టాను ఉదహరిస్తున్నారు. రాకేశ్ తికాయిత్ సొంత పోలింగ్ బూత్‌లోనే రాష్ట్రీయ లోక్‌దళ్ కంటే బీజేపీయే ఎక్కువ ఓట్లు సాధించుకున్నదని కూడా మరీ మరీ చెప్పుతున్నారు.


తప్పుడు కథనాలనేవి భ్రమలు, అర్ధ సత్యాలు, కృత్రిమ కల్పనల మిశ్రమమే కదా. రైతుల ఉద్యమంపై విమర్శలూ, ఖండనలూ అందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఎన్నికల ఫలితాల తీరుతెన్నులపై ఇప్పుడు మనకు సమగ్ర, విశ్వసనీయ సమాచారం అందుబాటులో ఉంది. ఐదు రాష్ట్రాల ఫలితాలపై లోక్‌నీతి–సిఎస్‌డిఎస్ సమగ్ర విశ్లేషణను ‘ది హిందూ’ మనకు అందుబాటులో ఉంచింది. మూడు సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం పట్ల రైతులు ఎలా ప్రతిస్పందించిందీ, వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు తెన్నులపై ఆ ఆందోళన చూపిన ప్రభావమేమిటో ఆ విశ్లేషణ స్పష్టంగా విపులీకరించింది. దాని వెలుగులో రైతుల ఉద్యమంపై వెల్లువెత్తిన అపనిందలలోని నిజానిజాలను తర్కిద్దాం.


భారతీయ జనతా పార్టీని పరాజయం పాలు చేయడంలో రైతుల ఉద్యమం తనకు తానుగా సఫలం కాలేకపోయిందన్నది మొదటి వాదన. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగు రాష్ట్రాలలో ప్రజల తీర్పుకు సంబంధించి ఇది సహేతుకమైన అభిప్రాయమే. దీనికి ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. వాస్తవమేమిటంటే ఏ ఉద్యమమూ తనకు తానుగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. ఉద్యమాలు రంగాన్ని మాత్రమే సంసిద్ధం చేస్తాయి. ప్రజల మొగ్గు నిర్దిష్టంగా ఉండేలా చేయగలుగుతాయి. ప్రజల మనో భావాలను ఓట్లుగా మార్చుకోవలసింది అంతిమంగా రాజకీయ పక్షాలు మాత్రమే. రైతుల ఉద్యమం తన సొంతంగా బీజేపీని ఓడించలేదు. అది దాని పరిధికి మించిన పని. కనుక అధికార పక్షం పరాజయానికి అది హామీ పడలేదు. అయితే రైతులపైన, ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలనే విషయమై వారి నిర్ణయాల మీద రైతుల ఉద్యమం ప్రభావం లేదని చెప్పడమనేది పూర్తిగా భిన్నమైన విషయం. 


రైతుల ఉద్యమానికి ప్రజామోదం లేదనడం మరీ ఘోరమైన దుష్ప్రచారం. నిజానికి దాని ప్రభావం పరిమితంగా కాదు, అపరిమితంగా ఉంది. ఇదొక తిరుగులేని వాస్తవం. పంజాబ్‌నే తీసుకోండి. రైతుల ఉద్యమం పంజాబ్‌లో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసిందని ఆ రాష్ట్ర రాజకీయాల గురించి ఏమాత్రం తెలిసిన వారెవరైనా సరే స్పష్టంగా చెబుతారు. రాజకీయాలలో నిలబడాలంటే రైతుల డిమాండ్లకు మద్దతు ఇచ్చి తీరాల్సిందే. మరో ఆలోచనకు ఆస్కారం లేదు. ప్రతిపక్షాలే (ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్) కాదు, అధికార పార్టీ (కాంగ్రెస్) కూడా రైతుల ఉద్యమానికి మద్దతు నిచ్చింది. గెలిచిన వారేకాదు, ఓడిపోయిన వారు కూడా ఆ ఉద్యమానికి బాసటగా నిలబడ్డారు. పంజాబీ ఓటర్లలో 84 శాతం మంది రైతుల ఉద్యమాన్ని సమర్థించారని లోక్‌నీతి–సిఎస్‌డిఎస్ సర్వే ధ్రువీకరించింది. ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించిన బీజేపీ ఆ పాంచాళ భూమిలో పత్తా లేకుండా పోయింది. పంజాబీ రైతు నేతలు బల్బీర్‌సింగ్ రాజేవాల్ నేతృత్వంలోని సంయుక్త్ సమాజ్ మోర్చా, గుర్నామ్ సింగ్ ఛదూని సారథ్యంలోని సంయుక్త్ సంఘర్ష్ పార్టీ విషయానికి వస్తే అసలు ఆ పార్టీలు రైతుల ఉద్యమానికి బలం సమకూర్చాయనడం పూర్తిగా తప్పుడు అభిప్రాయం. ఈ పార్టీలు ఆవిర్భవించిన రోజునే వాటితో ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఉద్యమంలో పాల్గొన్న సకల రైతు సంఘాల సంయుక్త వేదిక) స్పష్టంగా ప్రకటించింది. ఆ పార్టీల నేతలను మోర్చా నుంచి బహిష్కరించడం జరిగింది. చెప్పవలసిన మరో వాస్తవమేమిటంటే పంజాబ్‌లోని చెప్పుకోదగ్గ ఏ రైతు సంఘమూ ఈ కొత్త రాజకీయ పార్టీలకు మద్దతునివ్వలేదు. తొలిదశలో ఇచ్చిన వారు కూడా అంతిమంగా తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆ పార్టీలకు ఎటువంటి గతి పడుతుందని అందరూ భావించారో సరిగ్గా అదే గతి వాటికి పట్టింది.


సరే, ఉత్తర్‌ప్రదేశ్ విషయానికి వద్దాం. ఈ రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం రైతుల ఉద్యమానికి ఎదురు దెబ్బే, సందేహం లేదు. ఎన్నికలలో రైతు వ్యతిరేక బీజేపీని ‘శిక్షించాలని’ సంయుక్త్ కిసాన్ మోర్చా యూపీ ఓటర్లకు పిలుపు నిచ్చింది. ఈ రాష్ట్రంలోని రైతులు అందరూ ఆ పిలుపునకు సానుకూలంగా ప్రతి స్పందించి ఉన్నట్టయితే బీజేపీ మళ్లీ అధికారానికి వచ్చి ఉండేదే కాదు. అది వైఫల్యమైతే రైతుల ఉద్యమం విఫలమయినట్టే. అయితే ఆ ఉద్యమం అసలు ఎలాంటి ప్రభావం చూపలేదా? లోక్‌నీతి– సిఎస్‌డిఎస్ సర్వే ప్రకారం 49 శాతం మంది ఓటర్లు రైతుల ఉద్యమాన్ని సమర్థించగా కేవలం 22 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. మూడు సాగుచట్టాలను ఉనసంహరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని 46 శాతం మంది ఓటర్లు బలపరచగా కేవలం 11 శాతం మంది వ్యతిరేకించారు. (మోదీ నిర్ణయాన్ని రైతులలో 54 శాతం మంది ఆమోదించగా 11 శాతం మంది వ్యతిరేకించారు). ఎవరికి ఓటు వేయాలనే విషయమై సామాన్య ఓటర్ల, రైతుల నిర్ణయాలను ఆ ఉద్యమం ప్రభావితం చేయలేదా? తమ ఓటింగ్ నిర్ణయాలను రైతుల ఉద్యమం ప్రభావితం చేసిందని 55 శాతం మంది రైతులు వెల్లడించారు. ఈ ప్రభావిత రైతులలో అత్యధికులు సమాజ్‌వాది పార్టీ- రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికే ఓటు వేశారు. ఉత్తరాఖండ్‌లోని తెరాయి ప్రాంతంలో కూడా రైతుల ఉద్యమానికి మంచి మద్దతు లభించిందని లోక్‌నీతి– సిఎస్‌డిఎస్ సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఎన్నికలపై రైతుల ఉద్యమ ప్రభావం లేదన్నది పూర్తిగా అసత్య ప్రచారమే అనడంలో సందేహం లేదు. 


మరి లఖింపూర్ ఖేరీ హత్యాకాండ విషయమేమిటి? ఆ ప్రాంతంలో ఎన్నికల ఫలితం ఆధారంగా ఆ ఘోర ఘటన ప్రభావాన్ని అంచనా వేయడం సరికాదు. ఎందుకంటే ఆ ప్రాంతం రైతుల ఉద్యమానికి బలమైన కేంద్రం కానే కాదు. 2017లో మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్ నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపగా పలువురు మరణించారు. అయితే 2018లో మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోలీసు ఘాతుకం చోటుచేసుకున్న మాంద్‌సౌర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధే విజయం సాధించాడు. ఇది విస్మరించరాని వాస్తవం. లఖింపూర్ కిరాతక ఘటన తమ ఓటింగ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని 48 శాతం మంది ఓటర్లు చెప్పినట్టు లోక్‌నీతి సర్వే వెల్లడించింది. 


పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ విజయం, యూపీలోని మిగతా ప్రాంతాలలో ఆ పార్టీ సాధించిన విజయాలకు భిన్నమైనదీ కాదు, మెరుగైనదీ కాదు. ఏమైనా రైతుల ఉద్యమం ప్రభావం బలంగా ఉన్న ప్రాంతాలలో బీజేపీకి మద్దతు పడిపోయింది. ముజాఫర్‌నగర్, మీరట్, షామ్లి, భాగ్‌పట్ జిల్లాలలోని 19 నియోజకవర్గాలలో పదమూడింటిలో బీజేపీ ఓడిపోయింది. జాట్‌ల ఓట్లు బీజేపీ, ఎస్‌పి–ఆర్‌ఎల్‌డి కూటమి మధ్య ఇంచు మించు సమస్థాయిలో చీలిపోయాయి. అయితే 2013లో ముజాఫర్‌పూర్ మతతత్వ అల్లర్ల నాటి నుంచి పశ్చిమ యూపీలో బీజేపీ చెలాయిస్తున్న గుత్తాధిపత్యాన్ని ఆ ఓట్ల చీలిక దెబ్బ కొట్టిందన్నది గమనార్హమైన వాస్తవం. ఇక ఇప్పుడు రాకేశ్ తికాయిత్ సొంత పోలింగ్ బూత్ విషయాన్ని చూద్దాం. ఆ బూత్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థికి 521 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 162 ఓట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవం ఇది కాగా ప్రధాన స్రవంతి మీడియా సైతం నిజానిజాలను సరిచూచుకోకుండా అధికార పార్టీ అనుకూల వాదనలు చేయడమేమిటి?


చరిత్రాత్మక రైతుల ఉద్యమం ఎన్నికల రాజకీయాల ప్రాతిపదికలను పునర్ నిర్వచించింది. అది, ఎన్నికల నిర్దిష్ట ఫలితాలను నిర్ణయించలేదు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా జాగరూకతతో ప్రయత్నించనిదే నిర్దిష్ట ఫలితాలను సాధించడం అసంభవం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనే టెస్ట్ మ్యాచ్‌లో రైతు సంఘాలు బౌలర్లు కావు, బ్యాట్స్‌మెన్ కూడా కావు. ఆటకు సరైన రంగాన్ని మాత్రమే సిద్ధం చేశాయి. బ్యాటింగ్ చేసే జట్టుకు పరిస్థితులను క్లిష్టం చేశాయి. అయితే వికెట్లు తీసుకోవలసింది ప్రతిపక్షాలకు చెందిన బౌలర్లు మాత్రమే. వారు విఫలమయ్యారు. లఖింపూర్ ఖేరీ నుంచి పంజాబ్ దాకా కొత్త సాగు చట్టాలపై రైతుల నిరసనల తాకిడి ఎన్నికలపై ఉన్నదనేది నిరాకరించలేని సత్యం.


యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

(ఈ వ్యాసంలోని కీలక సమాచారాన్ని సమకూర్చిన లోక్‌నీతి–సిఎస్‌డిఎస్‌కు కృతజ్ఞతలు)

Updated Date - 2022-03-18T06:27:47+05:30 IST