రైతన్నకు పాలకుల వెన్నుపోటు

ABN , First Publish Date - 2022-06-22T10:29:15+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లిలో జూన్ 14న బటన్ నొక్కి పంట బీమా పరిహారాన్ని రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నామని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో సామాన్యులు నమ్మే విధంగా...

రైతన్నకు  పాలకుల వెన్నుపోటు

శ్రీసత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లిలో జూన్ 14న బటన్ నొక్కి పంట బీమా పరిహారాన్ని రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నామని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో సామాన్యులు నమ్మే విధంగా ముఖ్యమంత్రి తనకు తాను నిజాయితీ, నిబద్ధత ఉందని కితాబు ఇచ్చుకున్నారు. ఈ విధమైన ప్రకటన ఇచ్చి, అందులో కూడా అసత్యాలు, అర్ధసత్యాలు జొప్పించాలంటే ప్రజలను మోసపూరితంగా నమ్మించగలననే ధైర్యం ఉండాలి. ఒకదానికొకటి పొంతనలేని ప్రభుత్వ ప్రకటనలు జగన్‌రెడ్డి ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ ఏడాది మే 16న ఇచ్చిన పత్రికా ప్రకటనలో రైతు భరోసా క్రింద 50 లక్షల 10 వేల మంది రైతులకు రూ. 23,870 కోట్లు సాయం చేసినట్లు పేర్కొని, జూన్ 14వ తేదీ ప్రకటనలో 52 లక్షల 38 వేల మంది రైతులకు రూ.23,870 కోట్లు సాయం చేసినట్లు చూపడం హాస్యాస్పదం. సాయం చేసే మొత్తం పెరగకుండా 2 లక్షల 28 వేల మంది లబ్ధిదారులు ఎలా పెరుగుతారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.


రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం, ఇతర పంటలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కొనుగోలు చేసి దానిని తాను రైతులకు చేసిన ఆర్థిక సాయం కింద చూపడానికి కనీసం సంకోచించని పాలకులను ఏమనాలో అర్థం కావడం లేదు. నిజానికి ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు చంద్రన్న ప్రభుత్వం సుమారు రూ.50 వేల కోట్లు వెచ్చిస్తే, జగన్ చేసిన ఖర్చు సుమారు రూ.40 వేల కోట్లు మాత్రమే. జగన్ ప్రభుత్వ హయాంలో ధాన్యం దిగుబడులు సుమారు 400 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ప్రభుత్వం కొనుగోలు చేసింది సుమారు 220 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలిన 180 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు తెగనమ్ముకున్నారు. కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణాయక కమిటీ (సిఏసిపి) ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఒక మెట్రిక్ టన్నుపై ఎంఎస్‌పి కన్నా రూ.230 తక్కువకు అమ్ముకున్నారని తెలిపింది. అంటే ప్రస్తుత జగన్ విధానం వల్ల రైతన్నలు నష్టపోయింది (4 కోట్ల మె.ట x 230) సుమారు రూ.9200 కోట్లు. ఎస్ఎల్‌బిసి కమిటీ లెక్కల ప్రకారం ఇంకా రైతులకు చెల్లించాల్సిన రూ.2,637 కోట్లు బకాయిలు ఎప్పుడు బటన్ నొక్కి జమ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి.


రాష్ట్రంలో మొత్తం 79 లక్షల 50 వేల 844 రైతు ఖాతాలు ఉండగా, 64.06 లక్షల మందికి రైతు భరోసా వర్తింపజేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. వాస్తవంలో మాత్రం 50 లక్షల 10 వేల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారు. 15 లక్షల 36 వేల కౌలు రైతులలో 1,58,123 మందికే రైతు భరోసా వర్తింప చేసి, తరువాత 2021లో వారిని 1,40,000లకు కుదించడం అమానుషం. (ఆర్టీఐ సమాచారం). రైతు భరోసా కింద రూ.23,875.29 కోట్ల ఆర్థికసాయం అందించామని ప్రభుత్వం సొంత బాకా ఊదుకున్నా, నిజానికి ఇందులో సుమారు రూ.10,600 కోట్ల సాయం పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి అందిన రైతు భరోసా సుమారు రూ.13 వేల కోట్లు మాత్రమే. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఇవ్వవలసిన 4–5 విడతల రుణమాఫీ పథకాన్ని రద్దు చేసి రైతులకు తీరని ద్రోహం చేశారు.


2014–18 మధ్య టీడీపీ ప్రభుత్వం పంటల బీమా కింద రూ.4,007 కోట్లు రైతులకు చెల్లించినట్లు వైకాపా ప్రభుత్వ అధికారులు ఆర్టీఐ ద్వారా సమాధానం ఇస్తే, దానికి విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం రూ.3,411 కోట్లు మాత్రమే చెల్లించిందని జగన్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేయడమే కాకుండా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో కూడా పేర్కొనడం శోచనీయం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.20 వేల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్‌రెడ్డి, తన ప్రభుత్వంలో దానిని రూ.15 వేలకు తగ్గించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తుఫానులు, వరదల వల్ల 53.44 లక్షల ఎకరాలలో రూ.20 వేల 300 కోట్ల పంట నష్టం జరిగితే రూ.5,969 కోట్ల బీమా పరిహారం చెల్లించి అదేదో ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు.


64 లక్షల మంది రైతులకు రూ.నాలుగు వేల కోట్లు సున్నా వడ్డీకి ఇస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసి ఇప్పటివరకు వెయ్యి కోట్ల లోపు మాత్రమే సున్నా వడ్డీకి కేటాయింపు చేసి రైతన్నలను మోసం చేశారు జగన్. చంద్రబాబు సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల వరకు రుణం ఇస్తే, దానిని లక్ష రూపాయలకు పరిమితం చేసింది జగన్. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3000 కోట్లు, ప్రకృతి విపత్తుల సహాయ నిధి కోసం రూ.4000 కోట్లు కేటాయిస్తానని జగన్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు గాలిలో పేలాపుపిండిలా ఎగిరిపోయాయి. సుబాబుల్, జామాయిల్, సర్వీ ధరను టన్ను రూ.4,000 నుంచి రూ.5,000లకు పెంచి రైతులను ఆదుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్, ప్రస్తుతం టన్ను రూ.2,500లకు అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు దాపురించినా పట్టించుకోలేదు.


పంటలకు గిట్టుబాటు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, సున్నా వడ్డీ రుణాలు, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, ఈ–క్రాప్ నమోదులో నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు దాదాపు రూ.31 వేల కోట్లు, అంటే ఒక్కొక్క రైతు రూ.2.53 లక్షలు నష్టపోయారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను నిర్లక్ష్యం చేసిన వైకాపా ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఎరువుల పంపిణీ పథకాలను సైతం అటకెక్కించింది. అసలే అప్పులతో సతమతమౌతున్న రైతుల వెన్ను విరిచేలా, కేంద్రం ఇచ్చే అప్పుల్లో రెండు శాతం అదనం కోసం, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తును ఎత్తివేసేందుకు జిఓ నెం.22 తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రస్తుత ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ వల్ల ఆంధ్రుల జీవనాడి పోలవరం పడకేసింది. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వలన అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యలలో 2వ స్థానంలో ఉండటం అత్యంత దురదృష్టకరం.


మాట తప్పితే రాజకీయాలలో ఉండడానికి అనర్హులన్న జగన్‌రెడ్డి, రైతన్నల విషయంలో మాట తప్పి, మోసం చేసినందుకు తనకు అర్హత ఉందో లేదో బేరీజు వేసుకోవాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు మూడేళ్ళలో పెట్టిన వాస్తవ ఖర్చు రూ.30,368 కోట్లయితే రూ.1,27,823 కోట్లు రైతన్నలకు లబ్ది చేకూర్చామని అసత్యపు ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు జగన్–పీకే ద్వయం. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు మాని రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోతే వైకాపా ప్రభుత్వం ప్రజల దృష్టిలో ‘రైతు ద్రోహ ప్రభుత్వం’గా నిలవడం తథ్యం

లింగమనేని శివరామ ప్రసాద్

Updated Date - 2022-06-22T10:29:15+05:30 IST