తెలుగు సినిమా జైత్రయాత్ర

ABN , First Publish Date - 2022-04-17T07:08:15+05:30 IST

ఇటీవల తెలుగు సినిమా అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. తెలుగు సినిమాకు సంబంధించి ప్రధానమంత్రి నుండి ముఖ్యమంత్రుల వరకు సానుకూలవ్యాఖ్యలు బాగానే వినబడుతున్నాయి...

తెలుగు సినిమా జైత్రయాత్ర

ఇటీవల తెలుగు సినిమా అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. తెలుగు సినిమాకు సంబంధించి ప్రధానమంత్రి నుండి ముఖ్యమంత్రుల వరకు సానుకూలవ్యాఖ్యలు బాగానే వినబడుతున్నాయి. ఇటీవల ఒక సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ తెలుగు హీరో పాత్రలు తెలంగాణ యాస మాట్లాడకపోతే సినిమా హిట్ అవట్లేదు అని అన్నారు. అలాగే మోదీ కూడా ఆ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. తెలుగు సినిమాకి అంత హఠాత్తుగా ఇంత విజిబిలిటీ, విస్తృతీ ఎలా వచ్చాయి? అన్నది చర్చ. 


కొంచెం లోతుగా ఆలోచిస్తే కెసిఆర్ మాటలు నిజమనిపిస్తాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఫిదా, లవ్ స్టోరీ, డీజే టిల్లు వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు, సహాయక నటీనటులు తెలంగాణ యాస (dialect) లోనే మాట్లాడారు. అయితే ఈ మార్పు తెలంగాణ యాసకు మాత్రమే పరిమితం కాలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు మొదలైన యాసలు కూడా బలంగా తెలుగు సినిమాలలో వినిపించాయి. ఎస్ఆర్ కల్యాణ మండపం, పలాస, సాయి శ్రీనివాస ఆత్రేయ, అలాగే ఇటీవలే వచ్చిన పుష్ప సినిమాలలో హీరో, అతని స్నేహితులు కూడా ప్రాంతీయ డైలెక్టుని వాడారు. ఈ సినిమాలలో ప్రాంతీయ వాసన స్పష్టంగా కనిపించడం ప్రధానమార్పు. ఈ సినిమాల్లో కొన్ని భారీ బడ్జెట్, అగ్రతారాగణం ఉన్న సినిమాలు కూడా. ఒకవిధంగా ఇది తెలుగు సినిమా సామాజిక సాంస్కృతిక స్వభావాన్ని సమూలంగా ప్రశ్నించే మార్పు. విలన్లు హాస్యనటులు మాత్రమే యాసలో మాట్లాడే స్థితి మారి ప్రధాన పాత్రధారి మాట్లాడేవరకు రావడం ఒక పెద్దమార్పు. దీనికి ప్రధానకారణం తెలంగాణ ఆవిర్భావం. ప్రాంతీయ యాసలు ఉన్నత, గౌరవనీయ స్థాయికి రావడం చిన్న విషయం కాదు. 


తొలినాళ్ళ నుంచి తెలుగు సినిమా, అభివృద్ధి చెందిన డెల్టా ప్రాంతాలైన గోదావరి, కృష్ణ ప్రాంతీయ/సాంస్కృత పంధాలోనే జరిగింది. ఈ ప్రాంతాల నుండి వచ్చిన నటులు, సాంకేతిక నిపుణులు వివిధ స్థాయిలలో తెలుగు సినిమాని వారి ప్రాంత, సామాజిక/సాంస్కృతిక నేపథ్యంతో ప్రభావితం చేసారు. వారు రాసుకున్న పాత్రలు, కథాంశం, చాలవరకు ఆ ప్రాంతాలతో ముడిపడి ఉండేది. యాస శుద్ధీకరించినట్టుండేది. ఇతర ప్రాంత యాసలను వారు హేళనగా చిత్రీకరించడంతో తెలంగాణ ఉద్యమంలో చర్చనీయాంశమైంది. అయితే కొద్ది సంవత్సరాల నుండి ఈ విధానంలో మార్పు కనిపిస్తున్నది. తెలంగాణ (ముందుగా హైదరాబాద్ ఆ తర్వాత తెలంగాణ జిల్లాలు), ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం), రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు) ప్రాంత మూలాలు, సంస్కృతి, యాస ఆయా సినిమాలలో ప్రతిఫలిస్తున్నాయి. కేవలం పాత్రలు ఆ యాస మాట్లాడటం మాత్రమే కాదు, కథాంశం కూడ ఆ ప్రాంతాల్లోనిదే కావడం మరొక పరివర్తన. శేఖర్ కమ్ముల లాంటి వారు హైదరాబాద్ దాటి తెలంగాణ జిల్లాల నుండి కథలను చెప్పడంతో పాటు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన కథలు సామాజికాంశాలను హుందాగా, నిజాయితీగా ఆవిష్కరించాయి. మొత్తంగా కథాంశాలని చూసే విధానం మారింది. విడుదలైన అన్ని తెలుగు సినిమాలు ఈ మార్పుకు గురైనట్టు కూడ కాదు. కొన్ని సినిమాలు, ఉదాహరణకు పలాస చిత్రం లోకేషన్, స్టోరీ లైన్, కథని చూపే విధానం, చెప్పిన తీరు, కేరాఫ్ కంచరపాలెం, ఎస్ఆర్ కల్యాణమండపం, సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలు గోదావరి, కృష్ణాజిల్లాల సాంస్కృతిక ఆధిపత్యాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వచ్చిన తెలుగు సినిమాలలో, మరీ ముఖ్యంగా ప్రేక్షకులు బాగా ఆదరించిన సినిమాలలో హీరో పాత్రలకు ప్రాంతీయ డైలెక్టుని చాలా హుందాగా వాడుతున్నారు.


ఇక, ప్రధానమంత్రి మోదీ తెలుగు సినిమా గురించి ఈమధ్యన గొప్పగా మాట్లాడారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, వీటికి ముందు బాహుబలి బాలీవుడ్ ని ఒక్క కుదుపు కుదిపాయి. నటీనటుల నటనలో, కథలో, దాన్ని చెప్పిన విధానంలో, ఆర్థికపరమైన అంశాలలో రికార్డులను తిరగరాసాయి. ఇప్పటివరకు హిందీ పరిశ్రమని ఏలుతున్న ఖాన్‌లూ కపూర్‌లూ ఒక్కసారిగా తెలుగు సినిమా మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టారు. ఈ మధ్యనే బోనీ కపూర్ (శ్రీదేవి భర్త) దక్షిణ భారతదేశ సినిమా గురించి మాట్లాడుతూ ‘సౌత్ సినిమా తాలి భోజనం లాంటిది, అందులో అన్ని రకాల పదార్థాలూ ఉంటాయి’ అన్నాడు. ఈ ప్రధాన మార్పు వెనుక రెండు కారణాలున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది రాంగోపాల్ వర్మ– అయన సృష్టించిన పాత్రలు, కథని చూపించే విధానం, దాని ద్వారా ఆవిర్భవించిన వర్మ స్కూల్ అఫ్ థాట్. రెండవది, తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించిన తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేయడం, లేదా డబ్ చేయడం. గత కొన్ని సంవత్సరాలుగా ఇది పెద్దగా జరిగింది. ఒక్కడు, పోకిరి, కిక్, బాడీగార్డ్, రెడీ ఇలా చాలా తెలుగు సినిమాలను హిందీలో తిరిగి నిర్మించారు. ఉత్తరాది ప్రేక్షకులు వాటిని ఘనంగా ఆదరించారు. చాలా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి కూడా. మొత్తంగా ఈ రెండు దశలు తెలుగు సినిమా కథలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హిందీ చిత్రపరిశ్రమలోనూ యావత్ ఉత్తరభారత ప్రేక్షకుల్లోనూ ఒక బేస్ ఏర్పరిస్తే, ఆ తర్వాత వచ్చిన బాహుబలి, సాహో, పుష్ప, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి తెలుగు సినిమాలు హిందీ ప్రేక్షకులకు ఇంకా దగ్గరై, బలమైన స్థానాన్ని ఏర్పరిచాయి. 


రామ్ గోపాల్ వర్మ స్కూల్ ఆఫ్ థాట్ నుండి వచ్చిన చాలమంది సాంకేతిక నిపుణులు ఉత్తర భారతదేశ నలుమూలల నుండి కథలను ఎంచుకొని హిందీ భాషలో చిత్రీకరించారు. అనురాగ్ కశ్యప్ (గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్) దిబాకర్ బెనర్జీ, రాజకుమార్ హిరానీ (త్రీ ఇడియట్స్) ఇంతియాజ్ అలీ (లవ్ ఆజ్ కల్), విక్రమాదిత్య మోత్వానీ, శ్రీరామ్ రాఘవన్, నీరజ్ గైవాన్ (మసాన్) లాంటి దర్శకులు వాళ్ళ సినిమా కథలను ఉత్తరభారతదేశంలోని చిన్న చిన్న గ్రామాల నుండి, పట్టణాల నుండి చెప్పడానికి ప్రయత్నించారు. ఈ కథలు మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా ఉంటూ అత్యంత సహజంగా చూపించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు హిందీ సినిమా ప్రధాన ధోరణిని, స్రవంతిని బ్రేక్ చేసారు. అప్పటివరకు హిందీ సినిమా అంటే ప్రధానంగా పంజాబీ సాంస్కృతిక సామాజిక అంశాలపైనో, లేకపోతే కథలు ఎక్కువగా బొంబాయి, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ ప్రాంతాలతోనో ముడిపడి ఉండేవి. సూరజ్ బర్జాత్య, కరణ్ జోహార్ లాంటి దర్శకులు ఈ కథలతో ఎక్కువగా సినిమాలు తీసేవారు. ఆరు పాటలు, మూడుఫైట్లు, యాభై అరవైమంది ఉన్న పెద్ద కుటుంబాలు, విదేశీ సంబంధాలు, విదేశాల్లో షూటింగ్ ఇత్యాది అంశాలతో ఆ సినిమాలు ఉండేవి. ఈ కథలతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కనెక్ట్ అవలేకపోయాయి. వర్మ, ఆ థాట్ ఉన్న దర్శకులు ఈ మూసని బ్రేక్ చేసారు. వీరు తమ సినిమాలను వాస్తవికంగా, సగటు ప్రేక్షకుడు తనను తాను ఆ పాత్రలలో చూసుకునే విధంగా, సహజంగా చిత్రీకరించారు. ఎప్పుడైతే ఆ మూస బద్దలైందో హిందీ సినిమాలో ఒక లోటు లేదా ఖాళీ ఏర్పడింది. దానిని తెలుగు సినిమా చాల చక్కగా భర్తీ చేసింది. తెలుగు సినిమానే ఎందుకు భర్తీ చేయగలిగింది? తమిళ, మళయాళీ సినిమాలు ఎందుకు చేయలేకపోయాయి అన్నది వేరే చర్చ. ఈ మధ్య కాలంలో హిందీ భాషలోకి రీమేక్, డబ్ లేదా డైరెక్టుగా విడుదలైన తెలుగు సినిమాలను గమనిస్తే వాటి చిత్రీకరణ, కథ, కథనం, పాటలు, చాలావరకు లుంపెన్ ప్రోలెటరియేట్ (lumpen proletariat) కథాంశాలతో, హీరో పాత్ర చాలా ఎగ్రెసివ్‌గా, ఏంటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌గా కనిపిస్తాయి. అందువలన ఈ సినిమాలు ఉత్తరభారతదేశ ప్రజలకు వినోదాన్ని పంచడంలో చాలావరకు విజయం సాధించాయి.

సతీష్ చెన్నూర్

అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్, కోల్‌కతా

Updated Date - 2022-04-17T07:08:15+05:30 IST