అమ్ముతారు, కొంటారు, అదే పాలనంటారు!

ABN , First Publish Date - 2022-06-07T06:24:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా స్వపరిపాలనతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతం వాళ్లకు..

అమ్ముతారు, కొంటారు, అదే పాలనంటారు!

తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా స్వపరిపాలనతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతం వాళ్లకు భూములను అగ్గువగా తెగనమ్ముకునే స్థితి నుంచి ఇప్పుడు మూటల నిండా డబ్బు పట్టుకుని ఆంధ్రలోనే గాక కాక, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా భూములెక్కడ దొరుకుతయా అని వెతికే పరిస్థితికి తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందారని, తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో కూడా ఎకరాకు 10 లక్షలకు తక్కువకు ఎక్కడా భూములు దొరకట్లేదని మన రాష్ట్ర పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. 


అభివృద్ధి అంటే భూముల ధరలు పెరిగేలా చేయడమే అనేది ప్రస్తుత పాలకుల భావన. ఆ దిశగానే ప్రతి విధానపరమైన నిర్ణయం, నిధుల కేటాయింపు, ఖర్చు ఉన్నాయి. అది సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని, కొత్త జిల్లాలు ఏర్పాటు, రింగు రోడ్లు వేయడం, వందల కోట్ల రూపాయలతో గుడులనూ ఆధ్యాత్మిక కేంద్రాలనూ నిర్మించడం, జాతీయ రహదారులను విస్తరించటం, ప్రభుత్వ భూముల వేలం, పరిశ్రమలూ ఫార్మా సిటీల పేరిట భూ సేకరణ, పరిశ్రమలకు చవకగా ప్రభుత్వ భూములను కేటాయించడం, పేదలకిచ్చిన అసైన్డ్ భూములను వివిధ రూపాల్లో తిరిగి తీసుకోవడం, వాటిని లేఅవుట్లుగా మార్చడం... ఇలా ఏదైనా కావొచ్చు. అంతిమంగా ఆయా ప్రాంతాల్లో భూమి విలువలు విపరీతంగా పెరగాలి. తద్వారా భూముల అమ్మకాలు, కొనుగోలు పెరగాలి. ఈ అమ్ముడు–కొనుడు ద్వారా ప్రభుత్వానికి తెల్లధనం ఆధారంగా రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది, అందుకు పదుల రెట్ల నల్లధనం సురక్షితంగా భూమిలో పాతి పెట్టబడుతుంది.


మన రాష్ట్రంలో అత్యధికంగా నల్ల డబ్బు, భూములు కొనగలిగిన స్తోమత ఉన్నవారు ఎవరన్నది బహిరంగ రహస్యమే. ఆ జాబితాలో స్వయంగా వ్యవసాయం చేసే సగటు రైతు కుటుంబం తప్ప అందరూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలూ వార్డు కౌన్సిలర్ల వరకూ, గౌరవ న్యాయమూర్తులూ న్యాయవాదుల నుంచి కోర్టు గుమస్తాల వరకు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డాక్టర్లూ ఏక్టర్ల వరకు, నూతనతరం విద్యావేత్తలైన ఇంజనీరింగూ, మెడికల్ కాలేజీల యజమానుల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరకూ ఎవరూ మినహాయింపు లేకుండా వ్యవసాయ, వ్యవసాయేతర భూములను మితం లేకుండా కొంటూనే ఉన్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొనేళ్ళకు సగానికి సగం భూములు ప్రాంతేతరులు, రాష్ట్రేతరుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. నిజంగా సాగుచేసే వారి చేతుల్లో మాత్రం ఉండవు.


ప్రస్తుతం భూములు పెద్దఎత్తున కొంటున్నవారు తమ భవిష్యత్తు అవసరాలకు, తరాలకు తగినంత ఆర్థిక, సామాజిక, రాజకీయ పెట్టుబడిని సమకూర్చుకుంటున్నారు. భూములమ్ముకున్న వారు మరింత దూరం పోయి ఎకరాల్లో వ్యవసాయ భూములో లేదా గజాల్లో ఇంటి స్థలాలో కొనుక్కుని, వాటి ధరలను మరింత పెంచుతూ రాష్ట్రమంతా భూముల విలువ పెరిగేలా చేస్తారు. నీటిలో తరంగాల్లాగా భూముల అమ్మకం, కొనుగోలు, ధరల పెరుగుదల నలుమూలలకూ చేరుతుంది. అమ్ముకోగలిగిన భూమి కలిగిన ప్రతి ఇంటా డబ్బుల పంట. ఆ డబ్బు వారి అవసరాలను, అలవాట్లను, సరదాలను, ఖర్చులను, స్తోమతను పెంచుతుంది. దాంతో మరిన్ని వస్తువులు, సేవలు అమ్మకం–కొనుగోలు పరిధిలోకి వస్తాయి. సమాజంలో సంపద మరింత పెరుగుతుంది. తద్వారా ఆర్ధిక వృద్ధిరేటు పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోతుంది. అదే నేడు తెలంగాణలో జరుగుతుంది. ఇప్పడు మన రాష్ట్రంలో విలువలంటే, భూమి విలువ మాత్రమే.


ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలాగా పని చేస్తుంది. తద్వారా అప్పటి రాజ్యాంగకర్తలు అంత కష్టపడి రూపొందించిన రాజ్యాంగం నాలుగో అధ్యాయంలోని ఆదేశిక సూత్రాల స్థానంలో, ‘అమ్ముడు – కొనుడు’ అనే సరళమైన సూత్రాన్ని పరిపాలనా విధానంగా నేటి తెలంగాణ ప్రభుత్వం అమలులో పెట్టింది. ఈ విధానంలో ప్రజలు, పౌరులు ఉండరు. వారికి రాజ్యాంగ హక్కులూ ఉండవు. కేవలం అమ్ముకోగలిగిన భూమి కలిగిన వారు, కొనుక్కోగలిగిన సంపద ఉన్నవాళ్లు మాత్రమే షేర్‌హోల్డర్లుగా ఉండే ప్రభుత్వమనబడే ఒక కంపెనీ ఉంటుంది. దేశ సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో పోగుపడకుండా, అసమానతలు పెరగకుండా చూడాల్సిన బాధ్యతను మరచి భూమి, సంపద కలిగినవారికే మరింత భూమి, లాభాలు, సంపద, తద్వారా సమాజంలో పెత్తనం సమకూరే విధానాలనే ప్రభుత్వం అనబడే ఆ కంపెనీ అమలుచేస్తుంది. అందుకే అమలు చేయలేని రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం తీసుకురావాలనే ఆలోచన కలిగినట్లుంది. ఈ మొత్తం అభివృద్ధి నమూనాకి, ప్రస్తుత పాలకుల రాజకీయ ఆధిపత్య స్థిరత్వానికి భూమే ఇరుసుగా ఉంది. ఇదే అద్భుతమైన తెలంగాణ అభివృద్ధి నమూనా అంటూ మన పాలకులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా చాటి చెపుతారు. తెలంగాణ పునర్‌వైభవం సాధించడం అంటే ఇదేనేమో.


భూమి కలిగిన, భూమి కొనగలిగిన, అమ్ముకుంటున్న పేద, మధ్య, ఉన్నతి తరగతి వర్గాలందరూ ఈ విధానంలో లాభం పొందుతూ సంతోషంగా ఉన్నారు కదా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఈ అమ్మకాల కొనుగోళ్ల చక్రం ఎంత కాలం, ఎంత మందికి లాభాలను పంచుతుందో ఎవరికీ తెలీదు. పైగా ఈ చక్రం తిరిగిన కొద్దీ భూమి ఎక్కువమంది చేతుల్లో నుండి తక్కువమంది చేతుల్లోకి కేంద్రీకృతమవుతుంది. మరి అమ్ముకోవడానికి తమ శ్రమ తప్ప ఇంకేమీలేని వారు, లేదా ఉన్న కొద్దిపాటి భూమినీ అమ్ముకోగా వచ్చిన డబ్బు కనీస అవసరాలైన విద్య వైద్యం ఉపాధి కోసం, పేరుకుపోయిన అప్పులు తీర్చటం కోసం సరిపోయి, మరింక ఏ ఆస్తీ మిగలనివారు, వ్యవసాయాన్ని జీవనోపాధిగా కలిగి సొంత భూమి లేని దళిత, ఆదివాసీ, ఇతర బలహీన వర్గాల కుటుంబాలు వీరి పరిస్థితి ఏమిటి? పెరిగిన భూమి ధరలతో తమ తరంలోనూ, తర్వాతి తరాలలోనూ ఎప్పటికీ వ్యవసాయ భూములను, కనీసం 100 గజాల ఇంటి స్థలాన్ని కూడా కొనలేని కుటుంబాలుగా వీరు మిగులుతారు. 


ప్రైవేటు ఆస్తిని కాపాడటం, దాని విలువను పెంచడమే ప్రాధాన్యతగా పని చేస్తున్న ప్రభుత్వం, పేదల జీవనోపాధికి భరోసా ఇచ్చే విధంగా వారికి కొంత ఆస్తినైనా సమకూర్చే పనులు మాత్రం పూర్తిగా అటకెక్కించింది. అవి దళితులకు మూడెకరాల సాగు భూమి కావచ్చు, ఆదివాసీలకు అటవీ హక్కులు కావచ్చు, లేదా అసైన్మెంట్ భూములు, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ భూముల అన్యాక్రాంత నిరోధ చట్టాల అమలు కావచ్చు, కొత్తగా ప్రభుత్వ భూములు పంపిణీ కావచ్చు. అయితే ఇదే ప్రభుత్వం, కేవలం భూమి కలిగి ఉండటం ఆధారంగా మాత్రమే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలుచేస్తుంది. భూమి జీవనాధారంగా మాత్రమే కలిగినవారికి మాత్రం వారు గౌరవంగా బతకటానికి ఎటువంటి ఆసరా లేదు. అసలు అటువంటి వారి ఉనికినే గుర్తించటం లేదు. 


మన రాష్ట్రంలో ఇప్పటికీ అన్ని వర్గాలకు, కుటుంబాలకు తగినంత భూమి, ఆస్తి, సంపద లేదు, వారిని స్వతంత్రులుగా చేసే విద్యా–ఉపాధి వ్యవస్థ లేదు. ముఖ్యంగా భూమి లేని కుటుంబాలు, కులాలు, వర్గాలు, మహిళలు విద్య, వైద్య, వ్యాపార, ఉపాధి అవకాశాలలో వెనుకపడటంతో పాటు, శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థల్లో వారి ప్రాతినిధ్యం తక్కువ ఉండటం కాదనలేని వాస్తవం. అటువంటి వారు ఈ రకమైన అభివృద్ధి నమూనా నుంచి లబ్ధి పొందలేరు. దురదృష్టవశాత్తు అటువంటి వారు కోట్లలో ఉంటారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఒక అపూర్వమైన అవకాశం అధికారం పొందిన పార్టీకి ఉండింది. రాష్ట్రం ఏర్పడగానే భూముల విలువ, ఆస్తిపరుల సంపద పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు రూపొందించి అమలు చేసే ముందు, ఆ భూములు శ్రమ చేసే కుటుంబాల చేతికి ఎక్కువగా అందుబాటులోకి వచ్చేట్టు, సాగుపై ఆధారపడని వారి చేతుల్లోకి మరింత పోగుపడకుండా ఉండేట్టు తగిన విధానాలను అమలు చేసి ఉంటే, ఇప్పుడు పెరిగిందని మురిసిపోతున్న సంపద, మరింత న్యాయంగా పంచబడేది. సమాజంలో తీవ్ర అసమానతలను రూపుమాపడం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు అనుగుణమైన పాలనకు గీటురాయి. గత ఏనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక, రాజకీయ స్ధాయిల్లో అసమానతలు తగ్గాయని బంగారు తెలంగాణ సాధకులమని చెబుతున్న నేటి పాలకులు రుజువు చేయగలరా? లేదు. కాని వారి వాక్చాతుర్యంతో, వేల కోట్ల రూపాయల ప్రచారార్భాటాలతో బంగారు లేడిలాగా బంగారు తెలంగాణను భ్రమింపచేయగలరు.


రవి కుమార్

న్యాయవాది

Updated Date - 2022-06-07T06:24:19+05:30 IST