‘బండి’కి ఎవరైనా భాషాశాస్త్రం బోధించండి!

ABN , First Publish Date - 2022-06-08T07:12:10+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ మే 25న శివలింగాల గురించి మాట్లాడిన సందర్భంలోనే, తాము అధికారంలోకి వచ్చి రామరాజ్యం నెలకొల్పగానే ఉర్దూ భాషను నిషేధిస్తాం...

‘బండి’కి ఎవరైనా భాషాశాస్త్రం బోధించండి!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ మే 25న శివలింగాల గురించి మాట్లాడిన సందర్భంలోనే, తాము అధికారంలోకి వచ్చి రామరాజ్యం నెలకొల్పగానే ఉర్దూ భాషను నిషేధిస్తాం అని బహిరంగంగా ప్రకటించారు. బండి సంజయ్ వ్యాఖ్యల నిండా ఉన్నది ముస్లిం వ్యతిరేకతతో కూడిన గుడ్డి విద్వేషం, భారత ఉపఖండ ముస్లింలలో కొందరు మాట్లాడుకునే ఉర్దూ భాషను ద్వేషించేంత మూర్ఖత్వం.


స్వాతంత్ర్యోద్యమ కాలంలోనే రామరాజ్య స్థాపన తన ఆశయమని ప్రకటించిన మహాత్మా గాంధీ ఉర్దూ భాష గురించి ఏమన్నారో బండి సంజయ్ తెలుసుకోవటం మంచిది. 1917లో గుజరాత్ రాష్ట్రంలో బ్రోచి అనేచోట జరిగిన గుజరాతి విద్యా మహాసభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ గాంధీజీ, ‘ఉత్తర భారతదేశంలో హిందువులు మహమ్మదీయులు మాట్లాడుకునే భాషను, దేవనాగరి లిపిలో గాని ఉర్దూ లిపిలో గాని వ్రాయబడే భాషను, నేను హిందీ అని వాడుతున్నాను. హిందీ ఉర్దూ భాషలు రెండూ వేరు వేరు భాషలనే ఒక వాదన ఉంది. కానీ అది సరి కాదు. ఉత్తర హిందూ స్థానంలో హిందువులు మహమ్మదీయులు ఒకే భాషను మాట్లాడుకుంటారు. ఈ రెంటికీ భేదం విద్యావంతుల వలన సృజింపబడినది. మీరు హిందీ అనండి, ఉర్దూ అనండి ఉత్తర హిందూ స్థానంలో ప్రజలు మాట్లాడుకునే భాష అదే. అదే భాషను ఉర్దూ లిపిలో రాస్తే ఉర్దూ అనవచ్చు. దానినే నాగరి లిపిలో రాస్తే హిందీ అవుతుంది’.


ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పాల్సింది ఏమిటంటే– ఉర్దూ భాషను నిషేధించడం అంటే రాయటాన్ని నిషేధిస్తారా? మాట్లాడటాన్ని కూడా నిషేధిస్తారా? బజారు భాష గానా లేక ఇంటి భాషగా కూడానా? అయినా కోట్లాది మంది (సుమారు ఐదు కోట్లకు పైగా) మాట్లాడుకునే ఒక భాషను నిషేధించడం ఏమిటి? ప్రఖ్యాత తెలుగు కవి దాశరథి కృష్ణమాచార్య తనకు ఉర్దూ తెలుగులు రెండు కళ్ళు లాంటివి అని ప్రకటించిన సంగతి బండి సంజయ్‌కు తెలియక పోవచ్చు.


పాకిస్థానులో ఉర్దూ అధికార భాష అయినప్పటికీ, ఉర్దూ మాట్లాడే భారత మూలాలున్న కుటుంబాల కంటే పంజాబీ, సింధీ, పస్తో, బలోచి, సరాయికి భాషలు మాట్లాడుకునే వారు ఎక్కువ. వీరంతా పర్షియన్ లిపినే వాడుకున్నప్పటికీ వీరి భాషలు వేరు. దేవనాగరి లిపిని వాడుకుంటున్న మరాఠీ, నేపాలి, రాజస్థానీ, భోజపురీ... ఇవన్నీ హిందీ భాష కానట్లే పైన పేర్కొన్న భాషలు కూడా ఉర్దూ కాదు. ఇక బంగ్లాదేశ్ సంగతి దేశంలో అందరికీ తెలుసు– వారి జాతీయగీతం ‘అమర్ సోనార్ బంగ్లా’ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అని!


భారత రాజ్యాంగ నిర్మాతలు 1949లో దేశంలో ప్రజలు మాట్లాడుకునే, ఏదో ఒక లిపిలో రాసుకునే 14 భాషలను షెడ్యూల్డు భాషలుగా గుర్తించారు. అందులో ఉర్దూ కూడా ఒకటి. మన దేశ కరెన్సీ నోట్ల పైన ఉర్దూ లిపిలో కూడా రాసి ఉంటుంది. భారత ప్రభుత్వ అధికార భాషగా దేవనాగరి లిపిలో రాసే హిందీని గుర్తించారు. దేవనాగరి అని ప్రత్యేకంగా ఎందుకు పేర్కొన్నారు అంటే... అదే భాషను పర్షియన్ లిపిలో రాస్తే ఉర్దూ అంటారని వారికి తెలుసు కనుక!


నరేంద్ర మోదీకి ముందు పదేళ్ళు భారత ప్రధానిగా ఉండిన మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రతి ఆగస్టు 15న చేసిన హిందీ ప్రసంగాలు ఉర్దూ లిపిలోనే రాసుకొని చదివేవారు. ‌1940కి ముందు హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉండిన మహారాజా కిషన్ ప్రసాద్ ఉర్దూలో కవిత్వం రాసినవారు. ఆసఫ్జాహి వంశీయుల పాలనా కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాదుకు వలస వచ్చిన హిందువుల్లో చాలామందికి, ముఖ్యంగా కాయస్థ కులస్తులకి, ఉర్దూ మాతృభాష. ప్రఖ్యాత కార్మిక నాయకులు రాజ్ బహదూర్ గౌర్, కే.ఎల్. మహేంద్ర, నరేంద్ర లూథర్ అందుకు ఉదాహరణ. భాషా సమస్య ఉండదనే ఉర్దూ వచ్చిన హిందువులను కూడా వలస వచ్చేటట్లు చేసుకున్నారు. ఉర్దూ భాష అంటే ఉత్తరప్రదేశ్ బీహార్లలో కాయస్థ హిందువులది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది.


హిందీ రచయిత ప్రేమ్‌చంద్ తన తొలి నవల ఉర్దూలోనే రాశారు. కిషన్ చందర్, రాజేంద్రసింగ్ బేడి లాంటి వారు ఉర్దూ రచయితలన్న సంగతి తెలుగువారికి చాలామందికి తెలియకపోవచ్చు. మనం వినే హిందీ సినిమా పాటలలో ఉర్దూ రచయితలు రాసినవి పూర్వం అయితే గుల్జార్, మజ్రూ సుల్తాన్‌పూరి, సాహిర్ లుధియాన్విలాంటి వారివీ, వర్తమానంలో జావేద్ అక్తర్, సయీద్ ఖాద్రీ, సమీర్ లాంటి వారివీ చెప్పుకోదగినన్ని ఉన్నాయి. బండి సంజయ్ అధికారంలోకి వస్తే ఇలాంటి వారి పాటలు వినటానికి వీలు లేదని నిషేధించేస్తారా? 


బి.పి. చోప్రా దర్శకత్వంలో 1988–90ల నడుమ దూరదర్శన్ ప్రసారం చేసిన ‘మహాభారతం’ సీరియల్‌కు మాటల రచయిత ఉర్దూ, సంస్కృత భాషలలో పండితుడైన రాహి మాసూం రాజా. కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా పనిచేసిన గోపీచంద్ నారంగ్ ఉర్దూ భాషా పండితుడే! ఉర్దూలో తొలి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న కవి ఫిరాక్ గోరక్‌పురీ అసలు పేరు రఘుపతి సహాయ్. కొద్ది సంవత్సరాల క్రితం వరకు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉర్దూశాఖకు అధిపతి జ్ఞాన్‌చంద్ జైన్. కొద్ది నెలల క్రితం అమర్నాథ్ అనే భాషా పరిశోధకుడు హైదరాబాద్ అబ్దుల్ కలాం విశ్వవిద్యాలయం నుండి ఉర్దూలో డాక్టరేట్ పొందారు.


హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఉర్దూ భాషా చరిత్ర అని ఒక వ్యాసం రాశారు. ఆయన ప్రకారం కూడా హిందీ ఉర్దూ భాషలు కవల పిల్లల లాంటివి. ఉర్దూ భాష నశించాలని కోరుకోవడం అంటే హిందూస్థానీ భాష రెండు కళ్ళలో ఒక దాన్ని పోగొట్టుకోవటమే.


‘తెలుగు భాషా తత్త్వం’ గురించి రాసినప్పటికీ ఏ భాషకైనా వర్తించే సూత్రం ఒకటి కొమర్రాజు లక్ష్మణరావు గారు చెప్పారు. అదేమిటంటే భాషను శరీరంతో పోల్చి అందులో చాలా నిదానంగా మారే మూల పదకోశము, వ్యాకరణ సూత్రాలూ అస్థిపంజరం లాంటివని చెప్పారు. అలాగే కొంత వేగంగా మారే భాషా పదజాలాన్ని రక్తమాంసాలతో పోల్చారు. పై ఉదాహరణ ప్రకారం హిందీ ఉర్దూ భాషలను ఎలా అర్థం చేసుకోవాలంటే– ఆ రెండిటికి అస్థిపంజరం లాంటి మూల భాష, వ్యాకరణ సూత్రాలు ఒకటే. పదకోశంలో కొన్ని తేడాలు ఉండే మాట వాస్తవం. హైదరాబాదు నుంచి ప్రచురించబడుతున్న ప్రముఖ ఉర్దూ పత్రిక సంపాదకులు జావేద్ అలీ ఖాన్ ఒక సందర్భంలో నాతోనూ నిర్మలానంద గారితోనూ మాట్లాడుతూ, హిందీ ఉర్దూల గురించి ఒక సమీకరణ సూత్రం చెప్పారు: ‘హిందీ – సంస్కృతం = ఉర్దూ, ఉర్దూ – పర్షియన్ = హిందీ’ (అంటే హిందీలో సంస్కృత పదాలు తీసివేస్తే ఉర్దూ అవుతుంది. ఉర్దూలో పర్షియన్, అరబిక్ పదాలు తీసివేస్తే హిందీ అవుతుంది).


సరిగ్గా 40ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కొత్తల్లో మే 28, 1982న స్వయంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ భాషా విధానంగా ప్రకటించిన తీర్మానంలోని పదవ అంశం ఏమిటంటే: ‘తెలుగునాడులో ఉర్దూ మాతృభాషగా గల ప్రజలు అసంఖ్యాకంగా ఉన్న కొన్ని ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలలో ఉర్దూ భాషకు తగు ప్రాధాన్యత యివ్వబడాలి’ అని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉర్దూ రెండవ అధికార భాషగా ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అదనపు అధికారభాషగా ఉంది.


పార్లమెంట్ సభ్యుడై ఉండి బండి సంజయ్ ఉర్దూపై చేసిన విద్వేష ప్రకటన భారత రాజ్యాంగం పట్ల లెక్కలేనితనంతో, కావాలని నిర్లక్ష్యపూరితంగా చేసినది. ఆయన తన ప్రకటనను ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినందుకు భారత సుప్రీంకోర్టు సుమోటో కేసుగా స్వీకరించి  విచారించి శిక్షించాలి. నిన్నటి వరకు ముస్లిముల చరిత్ర, సంస్కృతి, ఆచారాలపై సాగిస్తూ వచ్చిన దుష్ప్రచారాన్ని ఇప్పుడు ఉర్దూ భాషపైకి ఎక్కుపెట్టారు. కనీస మానవీయ సుగుణం ఉన్న వారు ఎవరూ దీనిని ఆమోదించలేరు.

దివికుమార్

జనసాహితి

Updated Date - 2022-06-08T07:12:10+05:30 IST