వచ్చిన నీళ్లని నిల్వజేసుకోనివ్వండి!

ABN , First Publish Date - 2022-04-29T08:54:25+05:30 IST

‘సీమకు ‘కృష్ణమ్మ’ రాదు’ అనే వ్యాసం (21.04.2022, ఆంధ్రజ్యోతి) చదివాక, కొద్ది మార్పులతో ఆ శీర్షిక ‘సీమకు ‘కృష్ణమ్మ’ను రానివ్వం’ అని ఉంటే సరిగ్గా సరిపోయేది అనిపించింది...

వచ్చిన నీళ్లని నిల్వజేసుకోనివ్వండి!

‘సీమకు ‘కృష్ణమ్మ’ రాదు’ అనే వ్యాసం (21.04.2022, ఆంధ్రజ్యోతి) చదివాక, కొద్ది మార్పులతో ఆ శీర్షిక ‘సీమకు ‘కృష్ణమ్మ’ను రానివ్వం’ అని ఉంటే సరిగ్గా సరిపోయేది అనిపించింది. జల నిపుణుడైన ఈ వ్యాసకర్త సీమ ఉద్యమకారుల, మేధావుల డిమాండ్లను అర్థం చేసుకోవడంలో తికమకపడ్డాడా? లేక మమ్మల్ని తికమకపెట్టాలనుకున్నాడా? ఆయన మహా మేధావి, గతంలో ప్రభుత్వ సలహాదారుడు కాబట్టి మొదటిది ఆయనకు ఆపాదించలేం. ఇక మేమూ మా డిమాండ్ల విషయంలో స్పష్టంగాను, శాస్త్రీయంగానే  ఉన్నాం గనుక ఆయన ప్రయత్నమూ సఫలం కాదు. అయినా, చంద్రబాబు వేసిన పాపారావు కమిటీ రాయలసీమకు నీళ్లు అందటం లేదని నివేదిక ఇస్తే, సీమకు నీరు సమృద్ధిగానే అందుతున్నదని బ్రిజేష్ కుమార్ కమిటీకి తెల్పిన ఈ వ్యక్తి నుంచి ఇంతకన్నా సానుకూల దృక్పథాన్ని ఎలా ఆశించగలం?


సీమ ప్రజలు ప్రభుత్వం ముందు ప్రధానంగా రెండు డిమాండ్లను చాలా కాలంగా పెడుతున్నారు. సీమకు కృష్ణా ట్రిబ్యూనళ్ళు కేటాయించిన నికర జలాలను తమకు ఖచ్చితంగా, సకాలంలో ఇవ్వాలని, అందుకు అవసరమైన రిజర్వాయర్లను నిర్మించాలనేది మొదటిది. ఇక రెండవది– మిగులు జలాలపై  నిర్మించిన ప్రాజెక్టులను విభజన చట్టం ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేయాలనేది మా రెండవ డిమాండ్. వాటిలో, అత్యాశగానీ, అహేతుకతగానీ లేదు.


బచావత్ కమిటీ సీమ ప్రాంతానికి కేటాయించిన జలాలు, చిన్న నీటి వనరులతో సహా, 144.70టీఎంసీలు. వివరాల్లోకి వెళితే కేసీ కాలువ– 31.90, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ– 32.50, తుంగభద్ర దిగువ సమాంతర కాలువ–29.50, భైరవాని తిప్ప– 4.9, శ్రీశైలంలో ఆవిరి వాటా– 11, చెన్నై తాగునీరు–1.46, శ్రీశైలం కుడి కాలువ–19. పై జలాలన్నింటినీ పొందేందుకు రాయలసీమ ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని మాజీ సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్ గారికి తెలియదనుకోలేం. పోతే గత దశాబ్దాలుగా తమకు కేటాయించిన జలాల్లో ఏ సంవత్సరమూ 41శాతం కూడా సీమ ప్రజలకు అందని స్థితి ఉంది. ఈ సందర్భంలో, రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో దాదాపు 42శాతం (90లక్షల ఎకరాలు) రాయసీమలో ఉండగా, కేటాయించినది మాత్రం కేవలం 21.41శాతం (19.27లక్షల ఎకరాలు) మాత్రమేనని తెలపడం అనౌచిత్యం కాదనుకుంటా. అలా జరగడానికి కృష్ణ, తుంగభద్ర నదులలో నీటి లభ్యతాలేమి కారణం కాదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. గత 34సంవత్సరాలలో (1984–85 నుంచి 2018–19 దాకా) శ్రీశైలం రిజర్వాయరులో చేరిన కృష్ణా జలాలు సగటున సంవత్సరానికి 976టీఎంసీలు. ఇక గత మూడు సంవత్సరాల విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అందులో, సాగర్ కుడి ఎడమ కాలువలకు, కృష్ణా డెల్టాకు కేటాయించింది 344.60టీఎంసీలని గమనించాలి. మరి మిగతా నీరు ఏమైనట్టు? శ్రీశైలం రిజర్వాయరు పైభాగాన సీమకు కేటాయించిన నీరు నిలవ చేసుకునేందుకు తగినన్ని రిజర్వాయర్లు నిర్మించకపోవడంతో, ఆ నీరంతా సాగర్ చేరి, రొయ్యల, చేపల చెరువులు నింపి, చివరకు సముద్రం పాలవడం నిజం కాదా! అందుకే, మాకు కేటాయించిన కృష్ణా జలాలను మేం వినియోగించుకునేలా రిజర్వాయర్లు నిర్మించమంటున్నాం. పై పరిస్థితులలో సీమకు కేటాయించిన నికరజలాల సరఫరాకి 50టీఎంసీల సామర్థ్యంతో సిద్దేశ్వరం అలుగు, అదే విధంగా కేసీ కాలువకు కేటాయించిన జలాల నిలవకై గుండ్రేవుల  రిజర్వాయరు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 


ఇక్కడ తుంగభద్ర జలాల విషయమూ ప్రస్తావించాలి. బచావత్ ప్రకారం, కృష్ణకు కేటాయించిన తుంగభద్ర జలాలు కేవలం 21.45టీఎంసీలు కాగా, పైన తెల్పిన 34సంవత్సరాలలో కృష్ణలో చేరినది సగటున సంవత్సరానికి 154.7టీఎంసీలు. మరోవైపు, కృష్ణా జలాలు ప్రతి సంవత్సరానికి సగటున 500టీఎంసీలకు పైగా సముద్రం పాలవుతున్నాయి. అలాంటప్పుడు సీమకు ‘కృష్ణమ్మ’ రాదు అనడం, రానివ్వం అనడమే కదా! సీమకు కేటాయించిన కృష్ణా జలాలకు, గోదావరి జలాల మళ్లింపులకు లంకెపెట్టడం బోడిగుండుకు  మోకాలికి ముడిపెట్టడం లాంటిదే. పైగా ఆ నీటిని బనకచర్లకు ఎత్తిపోయాలట. తాను ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకపు ‘ఎకనామిక్ ఫీసిబిలిటీ అండ్ వయబిలిటీ’ ఈ మాజీ చీఫ్ ఇంజనీరు గారికి తెలియదనుకోవడం  మా అమాయకత్వమే అవుతుంది. గోదావరి నుంచి మళ్లించిన నీళ్ళను సాగర్ ఆయకట్టుకు, కృష్ణా డెల్టాకు తరలించి, వాటికి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలిపి వేస్తే సరిపొతుందిగా! ఆర్థికంగా అసాధ్యమైన ప్రతిపాదన రాయలసీమ నీటి ఇబ్బందులకు పరిష్కారమని చెప్పడంలో కుట్ర దాగివుందని మేం అనుకుంటున్నాం.


ఇక ఆయన పేర్కొన్న, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టుల విషయానికి వద్దాం. వాటికి నికర జలాల కేటాయింపులు లేని మాట వాస్తవమే. కాని నికర జలాల కేటాయింపుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడో పూర్తయ్యే పోలవరానికై నిరీక్షించే బదులు, దానికి తాత్కాలిక ప్రత్యామ్నాయంగా  నిర్మించిన పట్టిసీమ వల్ల ఆదా అయిన 80టీఎంసీలను పై ప్రాజెక్టులకు కేటాయించవచ్చు. గత ముఖ్యమంత్రి అలా కేటాయిస్తానని అసెంబ్లీలోనే ప్రకటించారుగా. అదేవిధంగా, పులిచింతల, చింతలపూడి వల్ల కృష్ణా డెల్టాకు అదనంగా సమకూరుతున్న 54+38=92 టీఎంసీలను శ్రీశైలం రిజర్వాయరు నుంచి సీమకు కేటాయించవచ్చు. క్యారీ ఓవర్ పేరుతో శ్రీశైలం రిజర్వాయర్, సాగర్ డాంలో నిల్వ ఉంచే 150టీఎంసీలను కరువుసీమకే గాక, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్.ఎల్.బి.సిలకు కేటాయించవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది.


చివరిగా, కృష్ణలో ఇప్పటికే కేటాయించిన నీటికన్నా అదనపు నీరు లేదనడం గురించి మాట్లాడుకుందాం. బచావత్, సరాసరి లభ్యత 2300టీఎంసీలుగా తన తీర్పును 1894–95 నుంచి 1944–45 (51 సంవత్సరాలలో) బ్రిజేష్ సరాసరి లభ్యత 2578టీఎంసీలుగా తన తీర్పుకు 1962–63 నుంచి 2007–08 (47 సంవత్సరాలలో) లభ్యమయ్యే కృష్ణా జలాలను పరిగణనలోనికి తీసుకున్నారు. కానీ ఈ మధ్యనే 2017లో కేంద్ర జలసంఘం జియో స్పేషియల్ డేటా కృష్ణలో లభించే సరాసరి నీటి లభ్యత 3,144టీఎంసీలు అని తెలపడం ఎవ్వరూ గమనం లోకి తీసుకొనకపోవడం ఒక విచిత్రం. వాటి విషయం ఎలా ఉన్నా కృష్ణలో గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ వ్యవధిలో ఎక్కువ వరదలు వస్తూండటం గమనార్హం. కృష్ణా నదిలో నీరు లభ్యమైనప్పుడు భవిష్యత్తు కోసం క్యారీ ఓవర్ రిజర్వాయర్లను నిర్మించుకోవాలని  కేంద్ర జలసంఘం, అన్ని ట్రిబ్యూనల్స్ ఘోషిస్తున్నాయి. సీమ ప్రజలూ కోరుతున్నది అదే. పోతే మాకు కేటాయించిన నీటిని మేం నిల్వజేసుకుంటాం అనేదే మా డిమాండు. దీనికి మేం గోదావరి జలాల మళ్లింపుకై వేచి ఉండాల్సిన అవసరం లేదు.

అరుణ్

రాయలసీమ విద్యావంతుల వేదిక

Updated Date - 2022-04-29T08:54:25+05:30 IST