‘ఐదురోజుల ఆట’లోనే అందం, ఆనందం!

ABN , First Publish Date - 2022-08-27T09:55:03+05:30 IST

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడుగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అన్ని మ్యాచ్‌లను వీక్షించేందుకు నాకు ఉచిత ప్రవేశం లభిస్తుంది.

‘ఐదురోజుల ఆట’లోనే అందం, ఆనందం!

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడుగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అన్ని మ్యాచ్‌లను వీక్షించేందుకు నాకు ఉచిత ప్రవేశం లభిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయంలో ఈ హక్కును నేను ఎన్నడూ వినియోగించుకోలేదు. ఐపీఎల్‌కు సంబంధించి నాకు ఒకే ఒక్క జ్ఞాపకం ఉన్నది. అది 2008 సంవత్సరం నాటిది. బెంగళూరులోని ఒక రెస్టారెంట్‌లో టెలివిజన్ స్క్రీన్‌పై షేన్‌వార్న్ కనిపించాడు. స్పిన్ బౌలర్స్‌లో మహా ప్రతిభావంతుడు అయిన షేన్‌వార్న్ టెస్ట్ క్రికెట్ నుంచి విరమించుకున్న రోజులవి. మళ్లీ ఆయన బౌలింగ్ నైపుణ్యాన్ని కొత్తగా చూసే అవకాశం లభించింది. ఆసక్తితో కొంచెంసేపు టెలివిజన్ ముందు నిలబడ్డాను. మహేంద్ర సింగ్ ధోనీకి ఆయన వేసిన మూడు బాల్స్‌ను వీక్షించాను. బౌలింగ్ మహేంద్ర జాలమది! 


2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఏ మ్యాచ్‌నూ ప్రత్యక్షంగా కాదు కదా, కనీసం టెలివిజన్‌పై కూడా చూడలేదు. క్రికెట్ అనురక్తిలో ఉన్నప్పుడు యూట్యూబ్‌లో వార్న్ సంస్మరణ సమావేశాలను వీక్షించాను (ఈ టోర్నమెంట్ ప్రారంభమవడానికి మూడు వారాల ముందు ఆయన కీర్తి శేషుడయ్యారు). వార్న్‌పై మనసు నిండా అభిమానంతో మైక్ అథర్టన్, అలెన్ బోర్డర్, మెర్వ్ హ్యూస్, బ్రియాన్ లారా తదితరులు ఆయనకు అర్పించిన నివాళులు వింటూ సాంత్వన చెందాను. మరొకసారి షేన్‌వార్న్ బౌలింగ్ పాత క్లిప్‌లను యూట్యూబ్‌లో చూశాను. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాకు క్రికెట్ అంటే పూర్తిగా షేన్‌వార్న్ వీడియోలను వీక్షించడమే. మే మాసాంతంలో ఐపీఎల్ టోర్నమెంట్ ముగిసింది. అసలైన క్రికెట్ ప్రారంభమయింది. జూన్‌లో నాకు ఇంగ్లాండ్‌లో అకడమిక్ బాధ్యతలు ఉన్నాయి. నేను ఆ దేశానికి వెళ్లినప్పుడే లార్డ్స్‌ టెస్ట్ మొదలయింది. ఆ ప్రతిష్ఠాత్మక టెస్ట్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా అర్హత సాధించకపోవడం వల్ల అది నన్ను మరింతగా ఆకట్టుకుంది. క్రీడా సంబంధ అభిరుచులకు సంబంధించి, వయస్సు పెరుగుతున్న కొద్దీ నాలో జాతీయవాద అభిమానాలు తగ్గిపోతున్నాయి. నా సొంత దేశం ఆడకపోవడం వల్ల లార్డ్స్‌ టెస్ట్‌ను కేవలం సౌందర్యాత్మక ఆనందానికి వీక్షించవచ్చు కనుక, ఆ వీక్షణం నాకు మరవలేని ఆహ్లాదాన్ని సమకూర్చింది.


మే నెల ఆఖరి రోజున నేను లండన్ చేరాను. జూన్ 3న లార్డ్స్‌ టెస్ట్ ప్రారంభమయింది. అప్పటికి నాకు విమాన ప్రయాణ బడలిక తగ్గిపోయింది. మొదటి రోజు మ్యాచ్‌ను చూసేందుకు నాకు టికెట్ లభించలేదు. ఆ రోజున 17 వికెట్లు పడిపోయాయి. రెండో రోజున లార్డ్స్‌కు వెళ్లాను. న్యూజిలాండ్ క్రికెటర్లు మిచెల్, బ్లండెల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. మూడో రోజు ఇంగ్లాండ్ టీమ్ ప్రతిభాపాటవాలను వీక్షించాను. ఆ టీమ్ విజేత అవగలదనే భావన కలిగింది. నాలుగో రోజు లార్డ్స్‌కు వెళ్లలేకపోయాను. అదే రోజున ఇంగ్లాండ్ టీమ్ తన గెలుపు లక్ష్యాన్ని సులువుగా నెరవేర్చుకున్నది.


వలసవాద వ్యతిరేక భారతీయుడుగా నేను ఇంగ్లాండ్ టీమ్‌ను అభిమానించకూడదన్న మాట నిజమే. చాలా అరుదుగా మాత్రమే టీమ్ ఇంగ్లాండ్ వైపు ఉన్నాను కూడా. కానీ, ఈ ఏడాది లార్డ్స్‌ టెస్ట్ అందుకొక మినహాయింపు. జో రూట్ నా అభిమాన క్రికెటర్లలో ఒకడు కావడమే అందుకు కారణం. నేను ప్రప్రథమంగా అతని ఆటను తొలిసారి భారత్‌లో ఆడినప్పుడు చూశాను. అప్పుడు అతని వయసు 21 సంవత్సరాలు. ఇంగ్లాండ్ టీమ్ భారత్ పర్యటనలో ఉండగా అతడు మధ్యలో వచ్చి చేరాడు. నాగపూర్‌లో అతని టెస్ట్ క్రికెట్ జీవితం ప్రారంభమయింది. వాతావరణంలోనూ, వ్యక్తిత్వంలోనూ నాగపూర్ రూట్ సొంత పట్టణం యార్క్‌షైర్‌కు పూర్తిగా భిన్నమైనది. నాగపూర్ మ్యాచ్‌లో అతను భారతీయ స్పిన్నర్లను చాలా ప్రశాంతంగా, సమర్థంగా ఎదుర్కొని తన జట్టు విజయానికి విశేషంగా దోహదం చేశాడు (భారత్‌లో పర్యటిస్తున్న జట్టు టెస్ట్ సిరీస్‌ను పూర్తిగా గెలుచుకోవడం అదే చివరిసారి). తదాది నేను జో రూట్‌ను క్రికెటర్‌గా, వ్యక్తిగా అభిమానిస్తూ వస్తున్నాను. క్రీజ్‌కు వచ్చిన క్షణం నుంచి రూట్ పూర్తిగా ఆటలో నిమగ్నమవుతాడు. అతని అద్భుతమైన స్ట్రోక్స్, ముఖ్యంగా కవర్ డ్రైవ్, బ్యాక్ కట్‌ను నేను ఎన్నటికీ మరిచిపోలేను. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లో కూడా రూట్ ఆరితేరిన ఆటగాడు. ఆఫ్ స్పిన్‌తో వికెట్లు తీసుకోవడంలో అతడి సామర్థ్యం నన్ను అబ్బురపరుస్తుంది. ఇప్పటికీ అతడు నవ యవ్వన యువకుడుగా కనిపించడం కూడా నా విశేషాభిమానానికి ఒక కారణం. గత జూన్‌లో లార్డ్స్‌లో రూట్ ఆట చాలా రమ్యంగా ఉంది. చెప్పవలసిన విశేషం ఏమంటే, చాలాకాలం తరువాత టీమ్ కెప్టెన్‌గా కాకుండా టీమ్‌లో ఒక సాధారణ సభ్యుడుగా రూట్ ఆడాడు. అయితేనేం, తన జట్టు విజయానికి అసాధారణంగా తోడ్పడ్డాడు.


జూన్ మూడో వారంలో బెంగళూరుకు తిరిగి వచ్చాను. ప్రయాణ బడలిక తీరిన తరువాత చిన్నస్వామి స్టేడియంకు వెళ్లాను. గతంలో 41 ఛాంపియన్‌షిప్‌ల విజేత అయిన ముంబై టీమ్, ఇంతవరకూ ఒక్క టోర్నమెంట్ కూడా గెలుచుకోని మధ్యప్రదేశ్ టీమ్‌కు వ్యతిరేకంగా ఆడుతున్నది. ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. 374 పరుగులు సాధించుకుంది. గతంలో పద్మాకర్ శివాల్కర్ లాంటి వాళ్లు దాని తరఫున బౌలింగ్ చేసినప్పుడు విజయాన్ని సాధించడానికి ఈ స్కోరు సరిపోయి ఉండేది. రెండో రోజు లంచ్ అనంతరం స్టేడియంకు వెళ్లాను. మూడోరోజూ పూర్తిగా ఆ మ్యాచ్‌ను వీక్షించడంలోనే గడిపాను. మధ్యప్రదేశ్ ఆటగాళ్లు అమిత స్థైర్యంతోనూ, దృఢ సంకల్పంతోనూ ఆడడాన్ని గమనించాను. జాగ్రత్తగా ఆడే యశ్ దూబే, ప్రతిభా సంపన్నుడు శుభమ్ శర్మ, సాహసి రజత్ పటీదార్‌లు తమ బహుళ నైపుణ్యాలతో ఆడి వీక్షకులను అలరించారు. ఐదో, చివరి రోజు మ్యాచ్‌ను పూర్తిగా వీక్షించాను. ఆరు వికెట్లతో మధ్యప్రదేశ్ జట్టు విజయం సాధించింది. ఛాంపియన్‌ షిప్‌ను మధ్యప్రదేశ్ గెలుచుకోవడం అదే మొదటిసారి. ఆట అయిన తరువాత విజయానంద డోలికల్లో కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను ఆటగాళ్లు తమ భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విజేతలు, విజితులు అద్భుతంగా ఆడిన మ్యాచ్‌ను వీక్షించడాన్ని మించిన ఆనందం మరేముంటుంది? నేను మధ్యప్రదేశ్ వైపు మొగ్గుచూపాను. ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇదే స్టేడియంలో రంజీ ఫైనల్‌లో చంద్రకాంత్ పండిట్ కెప్టెన్సీలో మధ్యప్రదేశ్, కర్ణాటకపై ఆడి ఓడిపోయింది. ఇప్పుడు మెగా ఛాంపియన్ ముంబైను మధ్యప్రదేశ్ ఓడించడం నాకు అపూర్వ ఆనందాన్ని కలిగించింది. దేశీయ క్రికెట్ టోర్నమెంట్స్‌లో సదా ముంబైయేతర టీమ్ ఏదైనా ఒకటి విజేత కావాలనేది నా ఆశంస.


ఆగస్టులో ఒక ప్రసంగాన్ని వెలువరించేందుకు నేను ఇంగ్లాండ్ వెళ్లవలసి వచ్చింది. అప్పుడే లార్డ్స్‌లో మరో టెస్ట్ మ్యాచ్ జరిగింది. అతిథేయులు దక్షిణాఫ్రికాతో ఆడారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి నూటయాభై పరుగులు సాధించింది గానీ ప్రయోజనం లేకపోయింది. దక్షిణాఫ్రికా టీమ్‌లోని ఐదుగురు బౌలర్లు ఎవరికి వారే విలక్షణ ప్రతిభావంతులు. ఈ ఐదుగురిలో మొదట చెప్పవలసింది రబాడ గురించి. పేస్, స్వింగ్‌లో మేటి. ఎన్‌గిడి, నోకియాలు కూడా పేస్ మాంత్రికులే. వారి బౌలింగ్ వేగం చూడవలసిందేగానీ చెప్పనలవికానిది. ఎడమ చేతి ఆటగాడు జాన్సన్‌లో వేగం తక్కువ. అయితే అద్భుతమైన స్వింగ్ అతని విలక్షణత. స్పిన్నర్ మహరాజ్ సైతం ఎడమ చేతి ఆటగాడు. జట్టు విజయానికి తోడ్పడిన క్రీడాకారుడు. ఈ ఐదుగురి నుంచి అద్భుతమైన ఆటను సాధించిన గొప్పదనం కెప్టెన్ డీన్ ఎల్గర్‌దే. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అవసరమైన మార్పులు చేస్తూ తన జట్టుపైన, ఆటలో తటస్థించిన పరిస్థితుల పైన పూర్తి కమాండ్‌తో వ్యవహరించిన కెప్టెన్. అందుకే దక్షిణాఫ్రికా జట్టు విజేత అయింది.


దక్షిణాఫ్రికా ఇటీవల రాజకీయ, ఆర్థిక రంగాలలో కష్ట కాలాన్ని ఎదుర్కొంది. అయినా ఆ దేశ క్రికెటర్లు తమ నైపుణ్యాలను అనితర సాధ్యంగా ప్రదర్శించి తమ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేయడం ఎంతో ముదావహమైన విషయం. దక్షిణాఫ్రికాకు చెందిన గత టీమ్‌లలో వలే ప్రస్తుత టీమ్‌లో సూపర్‌ స్టార్‌లు ఎవరూ లేరు. రబాడ ఒక్కడే మినహాయింపు. పరుగుల ఆరాటపరులు అయిన కలిస్, ఆమ్లా లాంటి బ్యాట్స్‌మెన్ గానీ, డివిల్లీర్స్‌ లాంటి మిరుమిట్లు గొలిపే స్ట్రోక్ మేకర్స్ గానీ, డొనాల్డ్, స్టెయిన్‌ లాంటి భీతి గొలిపే ఫాస్ట్ బౌలర్లు గానీ, పొలాక్, ఫిలాండర్ లాంటి చతుర స్వింగ్ బౌలర్లు గానీ ప్రస్తావిత దక్షిణాఫ్రికా టీమ్‌లో లేరు. అయినప్పటికీ అది ప్రథమ శ్రేణి ఆటగాళ్ల బృందం అనడంలో సందేహం లేదు. జాతి వివక్ష విధానం అంతరించిన తరువాత ఆవిర్భవించిన ప్రజాస్వామిక దక్షిణాఫ్రికా గురించి బిషప్ టుటు అభివర్ణన ‘రెయిన్‌బో నేషన్’ను ఆ జట్టు పూర్తిగా ప్రతిబింబించింది. బ్రిటిష్, డచ్ శ్వేత జాతీయులు, నల్ల ఆఫ్రికన్లు, భారతీయుడు అందులో ఉన్నారు. 2022 ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా నేను కన్నెత్తి చూడలేదు. నైతిక దృష్టికే కాదు, సౌందర్యాత్మకంగా కూడా టెస్ట్ క్రికెట్‌తో పోల్చడానికి వీలులేని ఐపీఎల్ టోర్నమెంట్‌ను చూసినవారికంటే నేను చూసిన మూడు టోర్నమెంట్‌లు నాకు గొప్ప ఆనందానుభూతిని మిగిల్చాయి.


తెల్లని దుస్తులు ధరించి, ఎర్ర బంతితో ఐదురోజుల పాటు ఆడే టెస్ట్ క్రికెట్టే నిజమైన క్రికెట్. పరిమితులు లేని క్రికెట్ ఫార్మాట్ అది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీల సౌందర్యాత్మక లక్షణాలను పరిపూర్ణంగా ప్రదర్శించేందుకు అనువైనది టెస్ట్ క్రికెట్ మాత్రమే. ఈ ఏడాది నేను వీక్షించిన మూడు మ్యాచ్‌లు నా స్మృతిపథంలో శాశ్వతంగా నిలిపోతాయి. మీదబడుతున్న వయసులో, ఈ వేదనాభరిత కాలంలో అవి నాకు సాంత్వన కలిగిస్తాయి.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-08-27T09:55:03+05:30 IST