మన ఘన కీర్తిలో మచ్చలు లేనట్టే నటిద్దామా?

ABN , First Publish Date - 2022-10-02T06:53:29+05:30 IST

‘చీకటిలో ప్రజాస్వామ్యం మరణిస్తుంది’ అనే నినాదం ఉంటుంది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేరు కింద. ఆ పత్రిక కొద్ది నెలల క్రితం ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది...

మన ఘన కీర్తిలో మచ్చలు లేనట్టే నటిద్దామా?

‘చీకటిలో ప్రజాస్వామ్యం మరణిస్తుంది’ అనే నినాదం ఉంటుంది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేరు కింద. ఆ పత్రిక కొద్ది నెలల క్రితం ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది. ఆ పరిశోధన ద్వారా వెలుగు చూసిన కొత్త కోణాలపై నేడు అమెరికాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.


బ్రిటిష్ వలస పాలన తర్వాత అమెరికాలో ఏర్పడిన రాజ్య వ్యవస్థకు నల్లవారి బానిసత్వానికి మధ్య ఉన్న సంబంధం గురించిన వాస్తవాలను బయటపెట్టింది ఈ పరిశోధన. 1861–65 మధ్య జరిగిన పౌర యుద్ధం తర్వాత చట్టబద్ధంగా బానిస వ్యవస్థని నిషేధించారు. అయినప్పటికీ బానిస వ్యవస్థ పునాదులు చెక్కుచెదరలేదన్న నిజాన్ని ‘వాషింగ్టన్ పోస్ట్’ పరిశోధన తేటతెల్లం చేసింది. వేలకొలది అధికారిక చారిత్రక పత్రాలను పరిశీలించి 1789 నుండి 1921 మధ్యకాలంలో అమెరికా చట్టసభలలో పనిచేసిన 5558 మంది శాసనకర్తల్లో ఏకంగా 1800 మంది బానిస యజమానులు ఉన్నారని తేల్చింది. అంటే అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన 130 ఏళ్ల వరకు కూడా బానిస యజమానులు, బానిసల మాజీ యజమానులు చట్టసభలకు ఎన్నికవుతూ వస్తూనే ఉన్నారన్నమాట! అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫెర్సన్‌కు, భార్య మరణం తర్వాత సంక్రమించిన వారసత్వ సంపదలో శాలీ అనే బానిస మహిళ కూడా ఉంది. శారీరకంగా, మేధోపరంగా నల్లవారు నాసిరకం మనుషులు కాబట్టి వాళ్ల రక్తం తెల్లవారి రక్తంతో ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి వీలు లేదనే విశ్వాసం ఉన్న ఆయన శాలీకి పుట్టిన పిల్లలందరికీ తండ్రి అని 1802లోనే రిచ్మండ్ రికార్డర్ అనే పత్రిక ప్రకటించింది. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, చట్ట సభకు 1922లో ఎన్నికైన మొదటి మహిళ కూడా గతంలో బానిస యజమానులే. వీరిలో చాలామంది బానిసత్వాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు చేసారు. బానిసలు లేని శాసనకర్తలతో పోలిస్తే, బానిస యజమానులు రెండు వంతుల మంది బానిసత్వాన్ని, వివక్షను ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థించే చట్టాలకు అనుకూలంగా ఓటు వేశారు.


వీరిని ఇప్పుడు ఎందుకు గుర్తించాలి? వీరందరూ బానిసత్వం నుంచి వైయక్తిక ప్రయోజనాలను పొందినవారు. అంతేకాదు, వీరు నిర్మించిన రాజ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, చట్ట, నేర న్యాయ వ్యవస్థలు బానిసత్వ పునాదుల మీద ఆధారపడినవి. వ్యాపార ప్రయోజనాలను, బ్యాంకింగ్ పనితీరును, షిప్ బిల్డింగ్ వ్యవస్థను, విదేశీ పెట్టుబడి, కార్మిక చట్టాలను, వివక్షాపూరితమైన విద్య, ప్రజా రవాణా రంగాన్ని, మొత్తంగా పౌర సమాజాన్ని ఈ బానిస యజమానులైన శాసనకర్తలు ప్రభావితం చేసారు. బానిసత్వానికి వ్యతిరేకంగా కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. అబ్రహం లింకన్ బానిసత్వానికి వ్యతిరేకంగా చట్టం చేయడానికి 70ఏళ్ల ముందు కూడా రాబర్ట్ కార్టర్ లాంటి ఎంతోమంది నల్లవారిని విముక్తి చేసారు. కానీ వారి జ్ఞాపకాలను వ్యవస్థ పూర్తిగా తుడిచేసింది. కానీ శాసనకర్తలుగా, ప్రభుత్వ రాజనీతిజ్ఞులుగా చెలామణీ అయిన బానిస యజమానుల పేర్లు మాత్రం ప్రజా భవనాలకు, రోడ్లకు, యూనివర్సిటీలకు పెట్టి వారి వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ సామాజిక వాతావరణం జాతి వివక్షను, సమానత్వాన్ని, చరిత్రను ఎలా బోధించాలనే దాన్ని ఈనాటికి నిర్దేశిస్తూనే ఉంది. గతకాలపు చీకట్లు వర్తమానంలో మరో రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి.


బానిసత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలు పెరిగిన కొద్దీ బానిసత్వాన్ని అంతర్గత ఒప్పంద కార్మిక (Indentured Labour) వ్యవస్థగా పునరుద్ధరించారు. విచిత్రమేమంటే బ్రిటన్ నుంచి 1630 తర్వాత అమెరికాకు వలస వచ్చిన సగటు తెల్లవాళ్ళు ఒప్పంద కార్మికులుగా వచ్చిన వాళ్లే. కానీ అమెరికా స్వతంత్ర ప్రకటన తర్వాత ఆఫ్రికా నుంచి నల్ల వారిని బానిసలుగా తెచ్చుకోవడం చౌక అని భావించింది. బానిసత్వంలో ఉన్న నల్లజాతి వ్యక్తి మరణించే వరకు శ్రమించాలి. ఈ ఒప్పంద కార్మికులు మాత్రం స్వదేశంలోను, కరీబియన్ దీవుల్లోను ఒక నియమిత కాలానికి మాత్రమే పనిచేయాలనేది షరతు. వారికి వేతనాలు ఉండవు. ప్రయాణ, ఆహార ఖర్చు మాత్రమే ఇచ్చేవారు. వారిలో మరణాల శాతం బానిసలతో పోలిస్తే తక్కువేమీ కాదు. ఒప్పంద కార్మిక వ్యవస్థ చట్టబద్ధమే కానీ న్యాయబద్ధమైనదా అని శాసనకర్తలు ఆలోచించలేదు. ఈనాటికీ అమెరికా జైళ్లలో, ముఖ్యంగా ప్రైవేటు జైళ్లలో ఈ వ్యవస్థ మరో రూపంలో కొనసాగుతోంది. వాటిలో అధికులు నల్లవాళ్లు అనే విషయం వేరే చెప్పనక్కరలేదు.


మరి భారతీయ శాసనకర్తల సామాజిక, ఆర్థిక మూలాల గురించి నిర్దిష్టంగా మనమూ ఇలాంటి ప్రశ్నలు అడగలేమా? వలస పాలకులతో అప్పటికే ఆధిపత్యంలో ఉన్న కులాలు సహకరించకుండానే కోట్లమంది భారతీయులను ఒక లక్షమంది తెల్లవాళ్ళు పాలించలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభం నుంచి 1940 వరకు లాటిన్ అమెరికాలోని బ్రిటిష్ గయానాకు, కరీబియన్ దీవులకు, సౌత్ ఆఫ్రికాకు లక్షలాదిమంది కింది కులాల భారతీయులు ఒప్పంద కార్మికులుగా పంపబడ్డారు. భారతీయ కాంట్రాక్టర్లు సహాయం, సహకారం లేకుండానే ఒప్పంద కార్మిక వ్యవస్థ కొనసాగిందని అనుకోలేము. కానీ స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళ గురించి తెలిసినంతగా వలస ప్రభుత్వంతో కుమ్మక్కైన వారి గురించి మనకు తెలియదు.


అదే విధంగా గత డెబ్భై ఐదేళ్లలో ఎన్నికైన మన శాసనకర్తలు, న్యాయమూర్తులు ఎంతమంది కుల వివక్షను, భూస్వామ్య వ్యవస్థను ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థించారో మనం ఋజువులతో సహా అడిగే ప్రయత్నం చేయడం లేదు. భూస్వాములుగా ఉండి శాసనసభకు ఎన్నికైనవారు ఎంతమందిని పాలేర్లుగా తమ అదుపులో ఉంచుకున్నారు, ఎంత భూమి బినామీల పేరుతో అనుభవిస్తున్నారు, వారి వారసులు ఈనాడు తమ వారి కీర్తిని పాఠ్యపుస్తకాలలో ఎలా నిక్షిప్తం చేస్తున్నారో గుర్తించాల్సిన అవసరం ఉంది. జమీందారీ కుటుంబాల నుంచి వచ్చి ఉన్నతాధికారులుగా, న్యాయమూర్తులుగా ఎదిగి భూసంస్కరణలను ఎలా నీరుగార్చారో తెలిపే పరిశోధనలు మన దగ్గర లేవు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్.కె. సింగ్ గర్వంగా రాసిన ‘అధికార చిత్తరువు’ గ్రంథం చదివితే గత యాభై ఏళ్లుగా భారతదేశాన్ని ఓ వంద కుటుంబాలు మాత్రమే పాలిస్తున్నాయా అన్న అనుమానం కలుగుతుంది. అజ్ఞాతంగా నిధులు ఇస్తున్న కార్పొరేట్లకు అనుగుణంగా ఎన్ని చట్టాలు చేస్తున్నారు, కార్మిక సంస్కరణల పేరు మీద కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు చేస్తున్నారు? ఇవన్నీ బహిరంగంగా చర్చకు పెట్టలేమా? లేదూ పార్టీల యజమానులకు శాసనసభ్యులు బానిసలుగా మారిపోయారని, అందుకే శాసనసభలో చర్చ జరగకుండా ప్రతి చట్టాన్ని ముందుగా ఆర్డినెన్స్ విడుదల చేస్తుంటే మిన్నకున్నారని అర్థం చేసుకుందామా? అధినాయకత్వం వెనుక ఏ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయో తెలిసే పరిశోధనలు చేయలేమా? కంపెనీలలో తాము పెట్టుబడులు పెట్టి, వాటి కేసులలో తామే తీర్పులు చెప్పిన న్యాయమూర్తులు ఎంతమందో లెక్క పెట్టలేమా?


మన వ్యవస్థలలో అంతిమ ఫలితాలను ఎవరు, ఏ పద్ధతుల్లో నిర్ధేశిస్తున్నారు, వాటివల్ల ఇప్పటికే బలవంతులైన వాళ్ళు ఎలా ప్రయోజనం పొందారు అనే నిర్దిష్టమైన వాస్తవాలు బయటకు తీయాల్సిన బాధ్యత మనకు లేనట్లు నటిస్తున్నాం. అలాంటి పరిశోధనలు చేసే వారిపట్ల ఎక్కడైనా విశ్వవిద్యాలయాలు ఉదాసీనంగా వ్యవహరిస్తాయి. వ్యవస్థలను నడిపే వారి సామాజిక, ఆర్థిక మూలాలు సమాజ గమనాన్ని, స్వభావాన్ని నిర్ధేశిస్తాయనే అమూర్తమైన సిద్ధాంత చర్చకు మన దగ్గర కొదవేమీ లేదు. కాకపోతే అవి ప్రతి రంగంలో ఎంత నిర్దిష్టంగా అన్యాయాన్ని స్థిరీకరిస్తాయో చెప్పే వాస్తవాలను సేకరించి, విశ్లేషించే ఓపిక తీరిక మన పరిశోధకుల్లో అంతంత మాత్రమే కనపడుతుంది.


అమెరికాలోనైనా, భారతదేశంలోనైనా సామాజిక ఆధిపత్యంలో ఉన్నవారి నిర్దిష్టమైన అమానవీయ చారిత్రక మూలాలు తెలుసుకోవడం వల్ల జరిగేదేమిటి? ఘనమైన చరిత్ర తమది అని వర్తమానంలో చెప్పుకుంటున్న వారి విశేషాధికారాలన్నీ అన్యాయపు పునాదుల మీద ఆధారపడిందనే విషయం బహిర్గతం అవుతుంది. ఆ తర్వాత తాము తమ కష్టం ఫలితంగా మాత్రమే సమాజంలో పైకి ఎదిగామనే వాదన చేయడం కుదరదు. అంటరానితనాన్ని నిషేధించాం కాబట్టి, రిజర్వేషన్లు ఇచ్చాము కాబట్టి ఇక మిగిలిన చారిత్రక బాధ్యత ఏమీ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమూ కుదరదు. గతంలో ఎవరో ఎదో చేసారు కాబట్టి మమ్మల్ని మూల్యం చెల్లించమంటారా అని తప్పించుకోవడమూ సాధ్యం కాదు. అమెరికా బానిస యజమానుల వారసులు ఈనాటికీ ఉలిక్కిపడి ‘అంటే ఈనాడు మేము అపరాధ భావనతో కుంగిపోవాలా?’ అని దబాయిస్తున్నారు. వారసత్వాలను మనం నిర్ణయించలేం కాబట్టి ఎవరూ అపరాధ భావనకు గురి కానక్కరలేదు. కానీ గతంలో సామాజిక అసమానతలకు సమాంతరంగానే అధికార పంపిణీ జరిగిందని, దాని ఫలితంగా అన్యాయపు పునాది మీద తమకు విశేషాధికారాలు వర్తమానంలో దక్కాయనే స్పృహ పెరిగితే అణగారిన వర్గాల హక్కులకు వ్యతిరేకంగా నిలబడే దుస్సాహసం చేయడం కష్టం. మన గతమంతా ఘనకీర్తి అని అమూర్తంగా ప్రకటించే ఏ వాదం అయినా వర్తమానాన్ని వంచించడానికే అనే స్పృహ ప్రజాస్వామ్య వాదులందరికీ అవసరం.

మురళి కర్ణం

నల్సార్ విశ్వవిద్యాలయం

Read more