సర్వ జీవరాశి పండగ
ABN , First Publish Date - 2022-01-14T06:09:07+05:30 IST
ధనుర్మాసపు నెలగంట మ్రోగగానే రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలతో నెలరోజులు ముందుగానే...

ధనుర్మాసపు నెలగంట మ్రోగగానే
రంగవల్లుల నడుమ గొబ్బెమ్మలతో
నెలరోజులు ముందుగానే
తెలుగులోగిళ్ళకు కళ తెచ్చే
ముగ్గుల పండగ.
పంటలు చేతికొచ్చిన వేళ
కల్లాల్లో రాసులు కాసులు కురిపించగా
రైతు ఇంట వెలుగులు నింపే పండగ.
ఇంటి చూరుకు వ్రేలాడదీసిన
ధాన్యపుకుచ్చులతో
పక్షులకు పండగ.
అన్నదాతకు ఆసరాగా ఉండి
నిరంతరం శ్రమించి
పంట విరామానంతరం సేదదీరే
పశువులకు పండగ.
కొత్త బియ్యపు పిండితో
ఘుమఘుమలాడే
పిండివంటల పండగ.
కొత్తబట్టలతో, గాలిపటాలతో
ప్రభలతీర్థంలో సందడి చేసే
పిల్లల పండగ.
హరిదాసుల కీర్తనలు
గంగిరెద్దుల నాట్యాలతో
కళకళలాడే పల్లెటూరి పండగ.
కుర్రకారు జోరుకు, హుషారుకు
కోడిపందాలు తోడై వెల్లివిరిసిన
తనివితీరని ఆనందాల పండగ.
పిల్లా పాపలతో కొలువుదీరిన
వసుధైక కుటుంబాన్ని చూడగానే
అవ్వా తాతలకి కనుల పండగ.
మనుషుల్లో ఆత్మీయతల్ని నింపి
ఐక్యతను చాటే మమతల పండగ.
సర్వ జీవరాశికి క్రాంతిని పంచే
సంబరాల సంక్రాంతి పండగ.
యంయస్ రాజు