శరత్ ప్రగతి భావనల్లో నేటికీ అదే పదును
ABN , First Publish Date - 2022-10-17T07:53:24+05:30 IST
బెంగాలీలో రాసినప్పటికీ అనువాదాల రూపంలో తెలుగువారి నుంచి తమ రచయితే అన్నంత అభిమానాన్ని పొందాడు శరత్ చంద్ర ఛటో పాధ్యాయ. ఆయన సాహిత్యంలోని తాత్విక భావాలను ఎత్తి చూపుతూ చర్చ చేయడం...
బెంగాలీలో రాసినప్పటికీ అనువాదాల రూపంలో తెలుగువారి నుంచి తమ రచయితే అన్నంత అభిమానాన్ని పొందాడు శరత్ చంద్ర ఛటో పాధ్యాయ. ఆయన సాహిత్యంలోని తాత్విక భావాలను ఎత్తి చూపుతూ చర్చ చేయడం కష్టసాధ్యమైన పనే. ఎందుకంటే శరత్ సాహిత్యంలో ‘ఇవీ నా తాత్విక భావాలు’ అని నేరుగా చెప్పిన సందర్భాలుండవు. వాటిని మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి- తత్వశాస్త్రంలో తరచుగా చర్చించే సత్యం, మతం, మత గ్రంథాలు, సనాతన ధర్మం తదితర భావనలు. రెండు- స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కులు, వివాహం, కట్టుబాట్లు, స్త్రీ పురుష సంబంధాలు మొదలైన అంశాలు. మూడు- దేశ స్వాతంత్య్రం, శాంతి, విప్లవం వంటి రాజకీయ అభిప్రాయాలు. ఈ మూడింటిని సంక్షిప్తంగా ఆయన రచనలనుండి సేకరించి, ప్రస్తావిస్తాను.
శరత్ ప్రఖ్యాత నవల ‘భారతి’లో ప్రధాన నాయకుడు సవ్యసాచి మరొక ముఖ్య పాత్ర భారతితో ఇలా అంటాడు: ‘‘నువ్వు ‘అంతిమ సత్యం’, ‘శాశ్వత సత్యం’ అని చెబుతావు- ఈ అర్థం లేని, పసలేని పదాలు నీకు చాలా విలువైనవి. అమాయకుల్ని మోసం చేయడానికి ఇంతకంటే మించిన మాజిక్ పదాలు ఇంకేవీ లేవు. సత్యం శాశ్వతమనీ, మరణం లేనిదనీ, దైవికమైనదనీ, అసత్యం మాత్రమే ఇహలోకానికి చెందినదనీ, మనిషి సృష్టించినదని నువ్వు భావిస్తావు. ఇది పచ్చి అబద్ధం. అసత్యంలాగే, సత్యాన్ని కూడా మనిషి ప్రతిదినము సృష్టిస్తూనే ఉంటాడు.’’ దీని అర్థం అందరికీ తెలిసిందే. అంతిమ సత్యాలు, శాశ్వత సత్యాలు, నిత్య సత్యాలు అనేవి ఏవీ ఉండవు. కాలమాన పరిస్థితులను బట్టి సత్యం మారుతూ ఉంటుంది. ఒక కాలానికి సత్యమైనది మరొక మారిన కాలానికి అసత్యమైపోవచ్చు. అందుకే ఆ నవల లోనే అదే సవ్యసాచి ఇలా కూడా అంటాడు: ‘‘నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో అఖండమైన, శాశ్వతమైన సత్యాన్ని గ్రహించడ మనేదేమీ లేదు. సత్యం ఉనికిలోకి వస్తుంది, ఉనికిలో నుండి పోతుంది. కాలం గడిచేకొద్దీ ఒక యుగం నుండి మరొక యుగానికి అది మార్పులకు లోనవు తుంది. మానవ సమాజ అవసరాలకు తగినట్టుగా నూతన, నిత్య నూతన రూపాలను సంతరించుకుంటుంది. గత కాలానికి చెందిన సత్యాన్ని ప్రస్తుత కాలంలో పాటించాలనే నమ్మకం తప్పవుతుంది. అటువంటి భావం మూఢనమ్మకమ వుతుంది’’ ఈ వాక్యాలు ఎంతో లోతైన తాత్విక దృక్పథాన్ని వెల్లడి చేస్తాయి.
అన్ని మతాలు, మత గ్రంథాలు ప్రశ్నింప వీలులేని విధేయతను కోరుతాయి. ఆ గ్రంథాలే జ్ఞాన సర్వస్వాలనే ఒక నమ్మకం చిరకాలంగా పాతుకుపోయింది. శరత్ మరొక ప్రముఖ నవల అయిన ‘చరిత్రహీనులు’లో ‘‘అన్ని పరిస్థితులలోనూ, ఎల్లవేళలా సత్యాన్ని ఆమోదించడానికి ప్రయత్నించు. దాని వలన ఒకవేళ వేదాలు, మతబోధనలు అసత్యమని నిరూపిత మైనప్పటికీ సత్యాన్ని ఆమోదించు, ఇవేవీ సత్యాన్ని మించినవి కావు; సత్యంతో పోల్చినప్పుడు వాటికసలు విలువలేదు. మొండితనం వలన కానీ, భావోద్వేగపూరిత ఆకర్షణ వలన కానీ లేదా ఎంతో కాలంగా ఉన్న మూఢ నమ్మకం వలన గానీ ఒక అసత్యాన్ని సత్యంగా నమ్మడమనేది ఒక మనిషి చేయవలసిన పని కాదు.’’ అని ధైర్యంగా ప్రకటించాడు.
అలాగే మన దేశంలో సనాతన ధర్మం, సనాతన సంప్ర దాయం అంటూ గొప్పగా చెప్పడం జరుగుతూ వస్తోంది. ఏదైనా ఒక దాన్ని సుధీర్ఘ కాలంగా ప్రజలు నమ్మినంత మాత్రాన లేదా ఆచరించినంత మాత్రాన అది గొప్పదైపోదు. ‘శేషప్రశ్న’ నవలలో ఆయన వీటిని చర్చకు తీసుకువచ్చి, వాటి డొల్లతనాన్ని బహిర్గతం చేస్తాడు. కమల పాత్ర ద్వారా ఆయన ఇలా వ్యక్తపరుస్తాడు: ‘‘మనుషులు ఒక దేశపు విశిష్ట లక్షణాలను కేవలం ప్రస్తుతించరాదు. ...ఆ విశిష్ట లక్షణాలు ప్రస్తుత కాలంలో ప్రజలకు ప్రయోజనం చేకూ రుస్తున్నాయా లేదా అన్నది ప్రధాన విషయం. ఈ విషయం మినహా మిగతావన్నీ వట్టి భ్రమలే.’’ అదే నవలలో మరో చోట ఇలా పలికిస్తాడు: ‘‘నేను ఒక దేశంలో జన్మించినంత మాత్రాన, ఆ దేశపు ఆచారాలను, సాంప్రదాయాలను పట్టుకొని వేలాడుతూ వుండాలా? ఆ దేశపు విశిష్ట లక్షణాలు అంతమైపోనీగాక! ఎందుకంత భావోద్వేగం? ప్రపంచంలోని ప్రజలందరూ ఒకేవిధమైన ఆలోచనలు, భావనలు, నియమ, నిబంధనల పతాకాన్ని చేబూనినట్లైతే వచ్చే నష్టం ఏమిటి? భారతీయుడనే ఒకరి అస్తిత్వాన్ని కోల్పోతున్నందుకు భయమా? కోల్పోతే కోల్పోనివ్వండి! ప్రపంచ మానవాళిలో ఒక సభ్యునిగా ప్రకటించుకోవడానికి ఎవరు అడ్డు చెప్పగలరు? ఆ ప్రతిష్ట ఏమైనా అల్పమైనదా?’’
గొప్ప రచయితలందరూ వారు జీవించిన కాలం నాటి స్త్రీల స్థితిగతుల యెడల తీవ్రంగా స్పందించారు. నాడే కాదు, నేడు కూడా స్త్రీ పాతివ్రత్యం, శీలం అనే వాటికి అధిక ప్రాధాన్యత నిచ్చి, ఆ ఒక్క అంశం ఆధారంగానే అంతిమ తీర్పునివ్వడం జరుగుతోంగి. ఇలాచంద్ర జోషి అనే ఆయన రాసిన ఉత్తరానికి శరత్ బదులు రాస్తూ, ‘‘తమ భర్తలతో మినహా మరే పురుషునితోనూ ఎలాంటి శారీరక లేదా మానసిక సంబంధాన్ని ఏనాడూ కలిగి లేని ఎంతో మంది స్త్రీల గురించి నాకు తెలుసు. అయితే వారి వ్యక్తిత్వంలో నీచత్వం, సంకుచితత్వం, దుర్భుద్ది, కుటిల స్వభావం తదితర గుణాలను గమనించవచ్చు. అలాగే దీనికి వ్యతిరేక పార్శ్వంలో సమాజంచే పతితులుగా ముద్రపడిన కొద్దిమంది స్త్రీలలో మాతృత్వంతో కూడిన నిస్వార్థ ప్రేమ, కరుణ నిండుగా పొంగిపొర్లుతూ కనిపిస్తాయి.’’ ఈ కారణంగానే శరత్ ఇలా ప్రకటించాడు, ‘‘శీలం కంటే, నిండైన మానవత్వం గొప్పది... పాతివ్రత్య ఆదర్శం కంటే మానవత్వాన్ని నేను గొప్పదిగా పరిగణిస్తాను. పాతివ్రత్యం, స్త్రీత్వం అనే భావాల అర్థం ఒకటి కాదు.’’ నాటి నుండి నేటి వరకు మనదేశ స్త్రీలకు వివాహమే అంతిమ గమ్యమనీ, మాతృత్వమే వారికి అంతిమ ఘనతయని చెప్పడం జరుగుతోంది. దీన్ని మెజార్టీ స్త్రీలు కూడా నిజమేనని నమ్ముతారు. వందల సంవత్సరాలుగా బోధించబడుతున్న అసత్యం నుండి స్త్రీలను విముక్తి చేయ డానికి శరత్, ‘శేషప్రశ్న’ నవలలో కమల ద్వారా ఇలా చెబుతాడు: ‘‘జీవితంలో వివాహమనేది అనేక సంఘటనల్లో ఒకటి మాత్రమే. అంతకుమించి మరేమీ కాదు. జీవితంలో అదే సర్వస్వమని మహిళలు భావించడం ఎప్పుడైతే ప్రారం భిస్తారో ఆనాటి నుండి వారి జీవితంలో గొప్ప విషాదం ఆరంభమవుతుంది... మాతృత్వమే మహిళల జీవితానికి అంతిమ ఘనతయని బోధిస్తూ దాన్ని అలంకారాలతోనూ, వాగాడంబరంతోనూ ప్రస్తుతిస్తారో వారు మొత్తం మాన వాళిని మోసగిస్తున్నారు.’’
చివరగా శరత్ రాజకీయ అభిప్రాయాలు. ఆయన దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. హౌరా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశాడు. మనకు తెలిసి నట్లుగా ఆ పోరాటానికి జాతీయవాదం, దేశభక్తి భావాలు ప్రేరణగా నిలిచాయి. అయితే కొన్ని చారిత్రక పరిమితులు వలన ఆ భావాలలో తలెత్తిన సంకుచితత్వాన్ని ఆయన ఆనాడే చూడగలిగాడు. అందుకే ఒక చిన్న వ్యాసంలో ఆయన ఇలా చెబుతాడు: ‘‘తన దేశానికి స్వాతంత్రాన్ని సాధించే కృషి అనేది సంకుచిత జాతీయ వాదమూ కాదు, ఛాందసవాదమూ కాదు. ప్రపంచ మానవాళికి సంక్షేమాన్ని తీసుకు రావడానికై అది ఉద్దేశించబడింది. ఎప్పుడైనా సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఉన్నత సిద్ధాంతం, గొప్ప సిద్ధాంతం అనేది సంక్షేమం కోసమే అనే విషయం మన మనస్సులో ఉండాలి. ప్రపంచ మాన వాళి సిద్ధాంతాన్ని మాత్రమే మనం ఆమోదించి తీరాలి. దాన్ని మనం భారతీయ సిద్ధాంతం, ఏషియన్ సిద్ధాంతం, హిందూ సిద్ధాంతం దృష్టితో ఎప్పుడూ చూడకూడదు. ఎందు కంటే అది ఒక సంకుచిత మానసికత నుండి పుట్టిన, దుర భిమానపూరిత అధమ సిద్ధాంతం. ఏవిధంగానూ అది బంధ నాల నుండి విడివడిన విశ్వజనీన సిద్ధాంతము కాజాలదు.’’ నేడు మతతత్వ శక్తులు జాతీయవాదానికి, దేశభక్తికి అత్యంత సంకుచిత అర్థాన్నిస్తూ, విద్వేషాలు రగిలిస్తున్న సమయంలో శరత్ వ్యక్తపరచిన ఈ భావాలు నిజంగా ప్రగతిశీలమైనవి.
నాటి స్వాతంత్య్ర ఉద్యమంపై గాంధేయవాద రాజీ మార్గమే ఆధిపత్యం వహించినప్పటికీ, శరత్ మాత్రం రాజీలేని విప్లవ కారుల పంథాను గట్టిగా సమర్థించాడు. ‘భారతి’ నవలను ఆనాటి విప్లవకారులు ఎంతో ఆసక్తిగా చదివి స్ఫూర్తి పొందే వారు. దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. సాయుధ విప్లవానికి వ్యతిరేకంగా అహింసాయుత శాంతి మార్గాన్ని బోధించేవారి నిజస్వభావాన్ని బట్టబయలుచేస్తూ ఆ నవలలో ఆయన ఇలా చెబుతాడు: ‘‘శాంతి! శాంతి! శాంతి! ఈ కూతతో నా చెవులు దాదాపుగా చెవిటివిగా అయిపోయాయి. ఇంత కాలం ఈ అబద్ధాన్ని ఎవరు బోధించారో తెలుసా? ఎవరైతే ఇతరుల శాంతిని దోచుకొంటున్నారో వాళ్ళు, ఎవరైతే భారీ రాజ భవనాలు రూపొందించుకొని, ఇతరుల మార్గాన్ని అడ్డుకొంటున్నారో వాళ్ళు, ఎవరైతే ఈ అబద్ధానికి బోధ కులుగా వున్నారో వాళ్ళు. పేదలు, దుఃఖితులకు వారు ఎంత గానో శాంతి మంత్రం ఉపదేశించారు. అంతేకాక ‘అశాంతి’ అనే పదం మాకు అయిష్టమని వారు ప్రజలను బెదిరిం చారు. వెంటనే ప్రజలు అది పాపం లేదా చెడు కావచ్చు అని ఆలోచించడం ప్రారంభిస్తారు! గుంజకు కట్టివేయ బడిన ఆవు దాని కాళ్ళపైనే నిలబడి ఆకలితో చనిపోవడం మీరు ఎప్పుడైనా చూశారా? అది దాని కాళ్ళపై నిలబడి చనిపోతుందేగాని యజమాని శాంతికి భంగం కలిగించకూడ దనీ, అది సులభమైనప్పటికీ, ఆ చీకిపోయిన పలుపుతాడును తెంచుకొనిపోదు.’’ చూడండి! ఎంత చక్కటి ఉపమానంతో పదునైన విమర్శను సంధిస్తాడు. ‘తరుణేర్ విద్రోహ’ (యువకుల తిరుగుబాటు) వ్యాసంలో ఆయన ఇలా అంటాడు: ‘‘స్వాతంత్య్రం అనేది కేవలం ఒక పదం మాత్రం కాదు. దానిని భిక్షాటనలో దాత కుడి చేతితో ఇచ్చే దయతో కూడిన దాతృత్వం ద్వారా పొందలేము. దానికి మీరు మూల్యం చెల్లించాలి. అయితే ఆ ఆ మూల్యం ఎక్కడ వుంది? దానిని ఎవరు చెల్లించగలరు? అది యువత రక్తంలో మాత్రమే ఉంది.’’
ఇక అపుడప్పుడే మన దేశంలో వేళ్లూనుకుంటున్న పెట్టు బడిదారీ వ్యవస్థలోని దోపిడినీ, క్రూరత్వాన్ని శరత్ ఆనాడే గుర్తించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ మానవ విలువల్ని ఏ విధంగా చంపివేస్తోందో కళ్ళారా చూసి, శ్రీకాంత్ నవలలో గుండెలు పిండే విధంగా చిత్రీకరించి, కార్మికవర్గానికి ఇలా పిలుపునిస్తాడు: ‘‘ఆధునిక నాగరికత నిర్మాతలు మీరు. మరణిం చండి! కానీ మిమ్మల్ని ఈ స్థితికి దిగజార్చిన ఈ క్రూర నాగ రికతను మాత్రం ఎప్పటికీ క్షమించకండి! మీరు దీన్ని మోయ వలసివస్తే మోయండి! కానీ దాని వినాశనం వైపుకి త్వరితంగా మోయండి!’’ ఈ ఉద్ఘాటనలోని ప్రాసంగికతను, ప్రాధాన్యతను గుర్తించ వలసిన అవసరం శరత్ కాలం కంటే నేడెక్కువగా ఉంది.
ఎస్. గోవింద రాజులు
94403 69647