‘సమతావాది’ నన్నపనేని వెంకట్రావు

ABN , First Publish Date - 2022-01-27T05:54:10+05:30 IST

‘‘స్వేచ్ఛ నా ఊపిరి – సమత నా ప్రాణం’’ అంటూ తన భావజాలాన్ని మనసా వాచా ఆచరించిన అభ్యుదయవాది నన్నపనేని వెంకట్రావు. క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ తొలినాళ్ళలో తెనాలి ప్రాంతంలో ఉద్యమాన్ని...

‘సమతావాది’ నన్నపనేని వెంకట్రావు

‘‘స్వేచ్ఛ నా ఊపిరి – సమత నా ప్రాణం’’ అంటూ తన భావజాలాన్ని మనసా వాచా ఆచరించిన అభ్యుదయవాది నన్నపనేని వెంకట్రావు. క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ తొలినాళ్ళలో తెనాలి ప్రాంతంలో ఉద్యమాన్ని బలోపేతం చేసిన యువకిశోరాలలో నన్నపనేని ఒకరు. అనంతరం సోషలిస్ట్ భావజాలానికి ఆకర్షితులై సోషలిస్ట్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసి ఛైర్‌పర్సన్ పదవిని అధిష్టించారు. ఆంధ్రదేశంలో సోషలిస్ట్ పార్టీ తరపున మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి ఎన్నికైన తొలివ్యక్తిగా గుర్తింపు పొందారు. మూడు పర్యాయాలు తెనాలి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆయన తెనాలి పట్టణ ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించారు. ఇళ్ళు లేని పేద ప్రజల సదస్సును విస్తృత స్థాయిలో నిర్వహించి, దేశ ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. నాడు మారిన రాజకీయ పరిణామాల క్రమంలో నన్నపనేని కాంగ్రెస్ పార్టీలో చేరి పొన్నూరు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. స్వరాజ్య ఉద్యమంతో పాటు విస్తృతంగా సాగిన సహకారోద్యమంలోను వెంకట్రావు తనదైన శైలిలో నేతృత్వం వహించారు. సమీప జంపని గ్రామంలోని సహకార చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. ఆయన మరణం తరువాత ఆ ఫ్యాక్టరీకి ఆయనే పేరునే పెట్టారు. ఆయనచే సహకార రంగంలో స్థాపించబడిన విశ్వనాథ కో- ఆపరేటివ్ సొసైటీ, మాతృశ్రీ కో – ఆపరేటివ్ సూపర్ బజార్ పదిమంది ప్రయోజనం కోసం ఏర్పాటు చేయబడినవే. ప్రత్యేక ఆంధ్ర, జై ఆంధ్ర ఉద్యమాల సమయంలో విశాలాంధ్ర కోసం ఉద్యమించి అనేక ఆటుపోట్లను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. తెనాలిలో ఆయన స్థాపించిన కళాశాల దినదిన ప్రవర్ధమానమై కోస్తా ప్రాంతంలోనే అగ్రగామి విద్యాసంస్థగా ఎదిగింది. కళాపోషకునిగా కళా సంస్థలకు తోడ్పాటును ఇచ్చిన వెంకట్రావు స్వతహాగా క్రీడాకారుడు. ఆంగ్లం తెలిసినవారే ఆడగలరన్న భావన కలిగిన బ్రిడ్జి క్రీడలో దేశంలోనే అగ్రశేణి క్రీడాకారుల్లో ఒకనిగా పేరుతెచ్చుకున్నారు. రైతుల కోసం, స్త్రీ చైతన్యం కోసం, దళిత వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సదస్సుల్లో, ఉద్యమాల్లో పాల్గొని తనగళం వినిపించారు. ఆయన ఏ పార్టీలో ఉన్న సోషలిస్ట్ భావజాలాన్ని మాత్రం వదల్లేదు. సమానత్వాన్ని అందరి నాయకుల్లా మాటల్లో గాకుండా చేతల్లో చూపిన సమతావాది నన్నపనేని వెంకట్రావు నేటి తరానికి స్ఫూర్తిదాయకమనుటలో ఎటువంటి సందేహం లేదు.

తన్నీరు కళ్యాణ్ కుమార్

(రేపు నన్నపనేని వెంకట్రావు వర్ధంతి)

Updated Date - 2022-01-27T05:54:10+05:30 IST