పెరుగుతున్న లెక్కలు, తరుగుతున్న నిధులు

ABN , First Publish Date - 2022-03-05T06:36:00+05:30 IST

మార్చి 7 నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 2022–2023 సంవత్సరానికి మొదటి రోజే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ ప్రతి సంవత్సరం చట్టసభల్లో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నబడ్జెట్లను పరిశీలిస్తే, ఈ బడ్జెట్లకు చట్టబద్ధత, నిర్దిష్ట ప్రాతిపదిక ఏమీ ఉండటం లేదని..

పెరుగుతున్న లెక్కలు, తరుగుతున్న నిధులు

గత ఎనిమిదేళ్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లను విశ్లేషిస్తే చాలా సందర్భాల్లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో సగం కూడా ఖర్చు చేయడం లేదు. ఈ బడ్జెట్లలో పాలకులు ప్రజల అవసరాలను, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవటం లేదు. ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా కేటాయింపులు జరుపుతున్నారు. సామాజిక న్యాయం, ప్రజలకు స్థిరమైన హక్కులతో కూడిన జీవనోపాధుల కల్పన, ఆర్థికంగా, సామాజికంగా బలహీనపడిన వర్గాల సంక్షేమం కేంద్రంగా 2022–2023 రాష్ట్ర బడ్జెట్ రూపొందాలి.


మార్చి 7 నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 2022–2023 సంవత్సరానికి మొదటి రోజే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ ప్రతి సంవత్సరం చట్టసభల్లో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నబడ్జెట్లను పరిశీలిస్తే, ఈ బడ్జెట్లకు చట్టబద్ధత, నిర్దిష్ట ప్రాతిపదిక ఏమీ ఉండటం లేదని అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ పరిమాణాన్ని అనంతంగా పెంచుకుంటూ పోతున్నారు. కానీ బడ్జెట్‌ అమలు తీరు నాసిరకంగా ఉంటున్నది. ప్రతి సంవత్సరం ప్రణాళిక కేటాయింపులు (ప్రగతి పద్దు) భారీగా వుంటున్నా, ఆయా శాఖలకు, పథకాలకు నిధుల విడుదల, వాస్తవ ఖర్చు క్రమంగా తగ్గిపోతున్నాయి. 


భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. రాష్ట్ర అప్పు మూడు లక్షల కోట్లకు పైమాటే. ఈ అప్పుపై గత రెండేళ్లుగా అసలు, వడ్డీ ప్రతి ఏటా భారీ మొత్తంలో చెల్లించాల్సి రావడం వల్ల, కీలక రంగాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. 


రోజు రోజుకూ ప్రజలపై ప్రత్యక్షపరోక్ష పన్నుల భారం పెరిగిపోతున్నది. చాలా శాఖలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. ఆ శాఖలన్నీ ఫీజుల రూపంలో, జరిమానాల రూపంలో ప్రజలను పిండుకు తింటున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వం పన్నుల ఆదాయం కోసం అత్యంత హీనంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ, తెలంగాణను అనారోగ్య రాష్ట్రంగా మారుస్తున్నది. మద్యం అలవాటు ఉన్న వ్యక్తుల నుండి రూ.16వేల కోట్లను ఎక్సైజ్ పన్ను రూపంలో పిండుతూ, మరోపక్క ఆయా కుటుంబాల్లోని బాధితులకు రూ.10వేలకోట్లు ఆసరా పెన్షన్లుగా అందిస్తున్న ఈ ప్రభుత్వానిది పూర్తి స్థాయి అమానవీయత. 


ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెటును నిర్దిష్ట సమయంలో ప్రవేశపెట్టడం వరకే ఒక క్రమపద్ధతిని పాటిస్తున్నది తప్ప, అంతకు మించి ఆ బడ్జెట్టుకు ఎటువంటి చట్టబద్ధత ఉండటం లేదు. కేటాయించిన నిధులు సకాలంలో విడుదల చేయకపోయినా, ఖర్చు చేయకపోయినా, నిధులను దారి మళ్లించినా అడిగే పరిస్థితి లేదు. పైగా ఒక్కోసారి కాగ్ సంస్థ రాష్ట్ర బడ్జెట్‌లను విశ్లేషించి, నివేదికలను వెలువరిస్తే తప్ప, బడ్జెట్‌ పరంగా నిజంగా ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదు. 2015–2016, 2016–2017 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన ఖర్చుల లెక్కలు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేవు. ప్రతి శాఖలో స్కీముల పేర్లు మారిపోవడం తప్ప, కేటాయింపుల్లో పెద్ద మార్పు లేదు. ఫలితంగా ఏ స్కీములూ అమలు కావడం లేదు. 


ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కూడా ఆయా రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించే దిశగా ఉపయోగపడటం లేదు. అధికార పార్టీకి ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఓట్లు, సీట్లు కేంద్రంగా మారిపోయయి. బడ్జెట్ నిధులు కేటాయించకపోయినా, డబ్బులు మాత్రం ఖర్చు చేస్తున్నారు. అమలుకు సరైన మార్గదర్శకాలు, నిధుల కేటాయింపుకు సరైన ప్రణాళికలు లేకుండా, కేవలం ఎన్నికల లక్ష్యంతో పథకాలు రూపొందిస్తున్నారు. 'దళిత బంధు పథకం' ఇలాగే రూపొందింది. క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక ఉండడం లేదు. 'రైతు బంధు పథకం' అమలు విషయంలో ఇది స్పష్టంగా కనపడుతున్నది. ఈ పథకంలో వేల కోట్ల నిధులను పంటలు పండని భూములకు, పంటలు పండించని రైతులకు విచ్చలవిదిగా పంచుతున్నారు. తెలంగాణాలో కోట్లాది మంది పేద మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమైన విద్యా వైద్య రంగాలకు కేటాయింపులు అతితక్కువగా ఉండడం వల్ల, ప్రభుత్వ రంగంలో వీటి పని తీరు నాసిరకంగా ఉంటున్నది. ఈ రంగాలు పూర్తిగా ప్రైవేటు, కార్పొరేటు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీని దుష్ప్రభావం పేద మధ్యతరగతి శ్రామిక కుటుంబాలపై పడుతున్నది. 


బడ్జెట్ల లక్ష్యం నెరవేరాలంటే కేటాయించిన నిధులను సేవలను పూర్తిగా ప్రజల దగ్గరకు చేర్చడానికి అన్ని ప్రభుత్వ శాఖలను బలోపేతం చేయాలి. ఆయా శాఖలలో ఖాళీలను భర్తీ చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ అనేది ఒక ప్రహసనంగా మారిపోయింది. సంవత్సరాలు గడిచినా నోటిఫికేషన్లు రావు. పరీక్షలు జరగవు. ఫలితాలు వెలువడవు. 2014తో పోల్చినప్పుడు 2021లో పోస్టుల ఖాళీల విషయంలో వివిధ శాఖల పరిస్థితి మరింత దిగజారింది. ఫలితంగా ప్రజలకు అవసరమైన శాఖలలో సేవలు ప్రజలకు సకాలంలో ఉచితంగా అందడం లేదు. ఉద్యోగ ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడమొక్కటే దీనికి పరిష్కారం. 


గత ఎనిమిదేళ్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లను విశ్లేషిస్తే చాలా సందర్భాల్లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో సగం కూడా ఖర్చు చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ నిధులు 50 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. నిధుల కోతకు గురవుతున్న రంగాలలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక, సంక్షేమ రంగాలు ఉన్నాయి. 


రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు ప్రతి ఏటా కొత్తగా రూ.2500 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉన్న ఆసరా పథకం కోసం గత మూడేళ్లుగా దరఖాస్తుదారులకు పెన్షన్ లు చెల్లించడం లేదంటే, ప్రభుత్వాల నిజవైఖరిని అర్థం చేసుకోవచ్చు. ఈ వైఖరి వల్ల ఒక్కో పేద కుటుంబం ఈ మూడేళ్లలో కనీసం రూ.72వేలను నష్టపోయింది.

 

ఈ బడ్జెట్లలో పాలకులు ప్రజల అవసరాలను, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవటం లేదు. ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా కేటాయింపులు జరుపుతున్నారు. నిరుద్యోగ భృతి, రైతులకు లక్ష రూపాయల ఋణ మాఫీ లాంటి ఎన్నికల హామీలు అమలు చేయనే లేదు. పంట ఋణాలకు వడ్డీ రాయితీ నాలుగేళ్ళుగా చెల్లించకపోవడం, పంటల బీమా పథకాల అమలు నిలిపి వేయడం– ఇలా అన్ని చోట్లా బకాయిలు పేరుకు పోతున్నాయి. 


రాష్ట్రంలో సహజ వనరుల– ముఖ్యంగా భూమి, అడవులు, నీరు, ఖనిజ సంపదల వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉండాలి. వీటిని వినియోగంలోకి తెచ్చే ముందు, భవిష్యత్ తరాల అవసరాలను లెక్కలోకి తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకూ ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు పారదర్శకంగా లేవు. ప్రభుత్వం వివిధ నివేదికలలో ఒక్కో రకంగా గణాంకాలను వెలువరిస్తున్నది. మరీ ముఖ్యంగా 2019 నుంచి వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం నికర సాగు భూముల విస్తీర్ణం గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ భూములను కూడా సాగు భూములుగా చూపించి రైతు బంధు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సహజ వనరులైన భూమి, అడవుల విస్తీర్ణంపై శ్వేతపత్రం విడుదల చేసి, ఎవరి చేతుల్లో ఎంత భూమి ఉందో కూడా ప్రకటించాలి. సమగ్ర భూ సర్వే ఒక్కటే ఇందుకు మార్గం.


సమగ్ర భూ సర్వే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం అన్నిరాష్ట్రాలకు నిధుల సహకారం అందిస్తున్నది. వివాదాలకు తావు లేకుండా ఈ సమగ్ర భూ సర్వే నిర్వహించి సర్వే నంబర్ల వారీగా సెటిల్మెంట్ చేయాలి. ఈ సర్వేలో తేలిన మిగులు భూములను 1973 భూ గరిష్ట పరిమితి (సంస్కరణల) చట్టం ప్రకారం భూమి లేని పేదలకు పంచి, రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. అప్పటివరకూ– కౌలు, పోడు, భూమి హక్కులు లేని మహిళా రైతులను గుర్తించి వారికే రైతు బంధు సహాయం అందించాలి. 


సహజ వనరుల సంరక్షణ ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అత్యంత ముఖ్యమైనది. ఈ వనరులపై స్థానిక ప్రజలకు హక్కులు కల్పించినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యం అవుతుంది. ప్రజలకు జీవనోపాధులు మెరుగవుతాయి. వారి ఆదాయాలు. ఇందులో భాగంగానే స్థానిక యువతకు అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణలు ఇచ్చి, రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలలో 80శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇచ్చేలా అసెంబ్లీలో చట్టం చేయాలి. 


వీటిపై ఈ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా చర్చించి అవసరమైన విధానాలు రూపొందించాలి. వీటి అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలి. భూములను, అడవులను, నీటి వనరులను, ఖనిజ సంపదను, ఇసుకను కేవలం మార్కెట్ సరుకుగా మార్చి, రాష్ట్ర బడ్జెట్ కోసం నిధులు సంపాదించాలనే తప్పుడు ఆచరణకు ఫుల్ స్టాప్ పెట్టాలి. పర్యావరణ సుస్థిరత, సామాజిక న్యాయం, ప్రజలకు స్థిరమైన హక్కులతో కూడిన జీవనోపాధుల కల్పన, ఆర్థికంగా, సామాజికంగా బలహీనపడిన వర్గాల సంక్షేమం... ఇవి కేంద్రంగా 2022–2023 రాష్ట్ర బడ్జెట్ రూపొందాలి.

n కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Read more