మత విద్వేషమే ఎన్నికలకు ఊతం!

ABN , First Publish Date - 2022-01-14T06:18:36+05:30 IST

యోగిఆదిత్యనాథ్ ఆహార్యంలోనూ, ఆలోచనలలోనూ కాషాయ వర్ణ సంజాతుడు. మరి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను ‘80:20’ పోరాటంగా ఆయన అభివర్ణించడంలో ఆశ్చర్యమేముంది...

మత విద్వేషమే ఎన్నికలకు ఊతం!

యోగిఆదిత్యనాథ్ ఆహార్యంలోనూ, ఆలోచనలలోనూ కాషాయ వర్ణ సంజాతుడు. మరి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను ‘80:20’ పోరాటంగా ఆయన అభివర్ణించడంలో ఆశ్చర్యమేముంది? ఆ రాష్ట్రంలో హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని దృష్టిలో ఉంచుకునే ఆయన ఆ వ్యాఖ్య చేశారన్నది స్పష్టం. ‘రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది జాతీయతను సమర్థించేవారు, ఉత్తమ పరిపాలన, అభివృద్ధికి సంపూర్ణ మద్దతునిచ్చేవారు. 20 శాతం మంది రామజన్మభూమి వ్యతిరేకులు, ఉగ్రవాదుల సానుభూతిపరులు’ అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాదించారు. ఎన్నికలవేళ రాజకీయ చర్చను ఇంత నిస్సిగ్గుగా ‘మనం’, ‘వారు’ అనే విభజిత భావంతో నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసేందుకు ఒక ముఖ్యమంత్రి ప్రయత్నించడం అరుదు. ఆ మాట కొస్తే ఒక హిందూ తీవ్రవాద బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవడమనేది మున్నెన్నడూ సంభవించలేదు. ఒకవిధంగా 2022 ఎన్నికలకు ఒక వ్యూహాత్మక వాతావరణాన్ని ఆదిత్యనాథ్ సృష్టిస్తున్నారని చెప్పవచ్చు. మతపరమైన విభజనలు, అస్తిత్వ రాజకీయాలు కేవలం యూపీలోనే కాకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాలలోనూ ఆయా పార్టీల గెలుపోటములను నిర్ణయించే అంశాలుగా ఉన్నాయి.


నిర్దిష్ట సామాజిక వర్గానికి ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని పంపే ధోరణి యోగి ఆదిత్యనాథ్ ప్రకటనలలో స్పష్టంగా కనిపిస్తోంది.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి విభజన రాజకీయాలకు ఆయన గత సెప్టెంబర్‌లోనే పూనుకున్నారు. ‘2017 సంవత్సరానికి ముందు ప్రతి ఒక్కరికీ రేషన్ అందిందా? అబ్బా జాన్ అని అన్నవారికే రేషన్ లభించింద’ని అంటూ తనకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేశ్ యాదవ్ బుజ్జగింపు రాజకీయాలను ఆక్షేపించారు. గత ఆగస్టులో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని హర్షించే వారిపై కఠిన చర్య తీసుకుంటామని ఆదిత్యనాథ్ తీవ్రస్వరంతో హెచ్చరించారు. వాస్తవానికి యోగి ప్రభుత్వం గత ఐదేళ్లలో జాతీయ భద్రత, ఉగ్రవాద నిరోధక చట్టాలను పదే పదే ప్రయోగించింది. వాటి బాధితులు అందరూ ఇంచుమించు ముస్లింలే కావడం గమనార్హం. ముస్లింలు ‘నేరపూరిత మనస్తత్వం’ కలవారనే భావాన్ని ప్రజల మనస్సుల్లో సుప్రతిష్ఠితం చేసేందుకే ఆ చట్టాలను యోగి ప్రభుత్వం విరివిగా వినియోగించుకుంది. ‘చట్టవ్యతిరేక’ కబేళాలను మూసివేయించడం మొదలు, పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలిపిన వారి ఆస్తులు జప్తు చేయించడం వరకు యోగి ప్రభుత్వం స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలతో వ్యవహరించింది. భారత్‌లో ముస్లిం పౌరులకు వారి స్థానమేమిటో చూపే ప్రయోగాత్మక ‘హిందూ రాష్ట్ర’ను సృష్టించే ప్రయత్నాలలో భాగంగానే యోగి సర్కార్ ఆ చర్యలు చేపట్టిందనేది స్పష్టం.


యూపీ ప్రభుత్వం ఇటీవల వార్తాపత్రికలకు ఇచ్చిన ఒక వాణిజ్య ప్రకటనలో రెండు ఫోటోలు ఉన్నాయి. ఒక దానిలో పెట్రోల్ బాంబు విసురుతున్న ఒక యువకుడు కనిపిస్తున్నాడు. రెండో దానిలో అదే యువకుడు చేతులు జోడించి క్షమాపణలు కోరుతుంటాడు. ఇస్లాం మతం పట్ల ద్వేషభావాన్ని రగుల్కొలిపే ప్రయత్నంలో భాగమే ఈ వాణిజ్య ప్రకటన అనడంలో సందేహం లేదు. 2017లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తరువాత యూపీలో సంభవించిన మార్పును విశదం చేయడమే ఆ ప్రకటన లక్ష్యం. చట్టానికి నిబద్ధమయి ఉండే ‘80 శాతం’ మంది ‘జాతీయవాదులు’ ఇంకెంత మాత్రం ‘20 శాతం’ దొమ్మీ మూకలకు భయపడవలసిన అవసరం లేదని, ఆ చట్ట విద్రోహులకు యోగి సర్కార్ ఒక కఠిన గుణపాఠం నేర్పిందన్నదే ఆ ప్రకటన సందేశం.


ఉత్తరప్రదేశ్‌లో గత మూడు దశాబ్దాలుగా ఘర్షణాత్మక కుల, మత ఓటు బ్యాంకుల రాజకీయాల చరిత్ర ఆధారంగానే ఈ ‘80:20’ అధిక సంఖ్యాక వాద కథనం ప్రాచుర్యంలోకి వచ్చింది. 1990ల్లో దేనికీ వెనుదీయని హిందూత్వ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉత్థానానికి ప్రతిస్పందనగా సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంలో కుల సమీకరణలు జరిగాయి. యాదవ్‌లు, జాతవ్‌ల నాయకత్వంలోని ఈ రెండు కులాధారిత పార్టీలు ముస్లింలను తమ ‘సహజ మిత్రులు’గా భావించాయి. స్థానిక ఇస్లామిక్ మతాచార్యుల, నేర కార్యకలాపాలలో రాటుదేలిన జిల్లా స్థాయి ముస్లిం ప్రముఖుల తోడ్పాటుతో విశాల ముస్లిం ప్రజానీకపు మద్దతును పొందేందుకు ఎస్పీ, బిఎస్పీ పలువిధాల పోటాపోటీగా ప్రయత్నించేవి. ఆ ప్రయత్నాలు హిందూ మతస్థులలో మరిన్ని భయాలు, అభద్రతలను సృష్టించాయి. ఈ పరిస్థితిని బీజేపీ సహజంగానే తన రాజకీయ ప్రయోజనాలకు పూర్తిగా ఉపయోగించుకుంది. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్‌పటేల్, మహమ్మద్ అలీ జిన్నాలను తాను సమానంగా గౌరవిస్తానని అఖిలేశ్ యాదవ్ ఒకసారి అన్నారు. దీంతో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు పాకిస్థాన్ సంస్థాపకుడిని ప్రశంసిస్తున్నాడని బీజేపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. ఎస్పీ, బిఎస్పీలు ముస్లింల మద్దతుకై బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయనే విమర్శను బీజేపీ తీవ్రస్థాయిలో కొనసాగిస్తూనే ఉంది. దీనికి తోడు అసదుద్దీన్ ఓవైసీ యూపీ రాజకీయాలలోకి ప్రవేశించి తనను తాను ‘ముస్లింల సంరక్షకుడు’గా చెప్పుకుంటున్నారు. అయితే ఆయన రాజకీయాలు కాకతాళీయంగా బీజేపీ ‘80:20’ సందేశానికి బలం చేకూర్చు తున్నాయి!


ఉత్తరప్రదేశ్ ఓటర్లలో 35 శాతంగా ఉన్న యాదవేతర ఓబీసీల కీలక మద్దతును నిలబెట్టుకునేందుకు బీజేపీ సతమతమవుతున్న తరుణంలోనే ఆదిత్యనాథ్ ‘80:20’ సూత్రీకరణ ప్రజల ముందుకు వచ్చింది. అగ్రకులాల నాయకత్వంలోని బీజేపీ అమలుపరుస్తున్న సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలు వాస్తవానికి తమను అణచివేస్తున్నాయని భావిస్తున్న వివిధ ఓబీసీ పార్టీలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని చాటుకునేందుకు హిందూత్వ పార్టీగా బీజేపీ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి. ఇటువంటి పార్టీలు అన్నిటితో ఒక విశాల కూటమి ఏర్పాటుచేసేందుకు అఖిలేశ్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ హిందూత్వ భావజాల ప్రభావంతో పాటు ఆ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ పాలనా నమూనా ను కొత్తకూటమి సమర్థంగా సవాల్ చేయగలదా? ఈ ప్రశ్నకు సానుకూల సమాధానాన్ని నిశ్చితంగా చెప్పలేము.


ఆదిత్యనాథ్ ‘80:20’ సూత్రీకరణతో యూపీ విభజనశీల రాజకీయాలు మరింతగా తీవ్రమయ్యాయి. ఈ మతతత్వ అంటురోగం యూపీకే పరిమితం కాకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుందా అనే సందేహం చాలామందిని కలవర పరుస్తోంది. హరిద్వార్‌లో ఇటీవల జరిగిన వివాదాస్పద ధర్మసంసద్‌లో విద్వేష ప్రసంగాలు వెలువరించిన సాధువులు అందరూ బీజేపీకి సన్నిహితులు కావడం యాదృచ్ఛికమేమీ కాదు. పంజాబ్‌లో ప్రధానమంత్రి భద్రతలో వైఫల్యం చోటుచేసుకున్న అనంతరం, సదా చురుగ్గా ఉండే బీజేపీ సామాజిక మాధ్యమాల యోధులు ఒక హానికర ప్రచారానికి తెర తీశారు. ఫెరోజ్‌పూర్ వద్ద ప్రధాని మోదీ కాన్వాయ్కి ఆటంకాలు కల్పించిన సిక్కు రైతులకు ఖలిస్తానీ బృందాలతో సంబంధమున్నదనేది ఆ దుష్ట ప్రచార సారాంశం. ఎన్‌డిఏ నుంచి అకాలీదళ్ వైదొలగడంతో పంజాబ్ లోని పట్టణ ప్రాంత హిందూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు బీజేపీ శత విధాల ప్రయత్నిస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాదులు మళ్ళీ విజృంభించనున్నారని, చన్ని–సిద్ధు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ భద్రతను అలక్ష్యం చేస్తుందనే ప్రచారంతో పట్టణ ప్రాంత హిందువులలో భయాందోళనలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదొక తప్పుడు ప్రచారం. దీనివల్ల ఆ సరిహద్దు రాష్ట్రంలో రెండు దశాబ్దాల క్రితం సమసిపోయిన ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమ భయానక పరిస్థితులు మళ్లీ తలెత్తే ప్రమాదముంది.


చిన్న రాష్ట్రమైన గోవా దశాబ్దాలుగా మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతోంది. ఇప్పుడు బీజేపీ రాజకీయాల వల్ల హిందూ–కేథలిక్ క్రైస్తవుల మధ్య ఘర్షణలు మళ్ళీ ప్రజ్వరిల్లే ప్రమాదముంది. కీర్తిశేషుడు మనోహర్ పరీక్కర్ కృషి మూలంగా 2012లో గోవాలో బీజేపీ సొంతంగా అధికారానికి రాగలిగింది. చర్చి నాయకులతో పరీక్కర్ ఒక సదవగాహనకు రావడం వల్లే బీజేపీ తరఫున అనేక మంది కేథలిక్ క్రైస్తవులు శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే ఇటీవల పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో వివిధ చర్చిలలోకి హిందూ మిలిటెంట్ బృందాలు చొరబడి విధ్వంసకాండకు పాల్పడడం, మతాంతరీకరణ నిరోధక చట్టాల పేరిట మిషనరీలకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల వల్ల గోవాలో కేథలిక్ క్రైస్తవులు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితిని అధిగమించేందుకై బీజేపీ మళ్ళీ హిందూత్వ ఎజెండాపై ఆధారపడుతోంది. 500 ఏళ్ల క్రితం పోర్చుగీస్‌లు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాలు అన్నిటినీ పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పిలుపు నివ్వడమే అందుకు నిదర్శనం.


ప్రజలను సతమతం చేస్తున్న అసలు సమస్యలు– నిరుద్యోగం, అవినీతి ఇత్యాదులను– నాయకులు సమర్థంగా పరిష్కరిస్తున్నారా? లేదు. ప్రజా శ్రేయస్సు విషయంలో వారు చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రజలూ వారిని విశ్వసించడం లేదు. ఈ పరిస్థితుల్లో మతాన్ని ఉపయోగించుకుని రాజకీయ ప్రయోజనాలు పొందడానికి నేతలు ప్రయత్నిస్తున్నారు. గత కాలపు మత వైషమ్యాలను ఆసరాగా తీసుకుని ప్రజల్లో మతపరమైన చీలికలను సృష్టిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఈ ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మతప్రేరిత అధిక సంఖ్యాకవాద రాజకీయాలే దేశ వ్యవహారాలను నిర్దేశించే పరిస్థితిని అవి సూచిస్తున్నాయనడం సత్యదూరం కాదు.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2022-01-14T06:18:36+05:30 IST