ఆర్బీఐ ‘పెట్టుబడి’పై పునరాలోచన

ABN , First Publish Date - 2022-01-18T07:56:12+05:30 IST

మనమూలధన ఖాతా గత మూడేళ్లుగా ప్రతికూలంగా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ భోగట్టా ప్రకారం మనదేశం నుంచి ఇతర దేశాలకు తరలిపోతున్న పెట్టుబడుల కంటే..

ఆర్బీఐ ‘పెట్టుబడి’పై పునరాలోచన

మనమూలధన ఖాతా గత మూడేళ్లుగా ప్రతికూలంగా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ భోగట్టా ప్రకారం మనదేశం నుంచి ఇతర దేశాలకు తరలిపోతున్న పెట్టుబడుల కంటే దేశంలోకి ప్రవహిస్తున్న పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. నిజానికి కరోనా సంక్షోభ నెలల్లో ఈ ప్రతికూల ఖాతా మరింత ఎక్కువగా ఉంది. అయితే, భారత్ నుంచి పెట్టుబడి పలాయనానికి కారణం కరోనా అనేది సరైన వివరణ కాదు. ఎందుకంటే అదే నెలల్లో ఇతర దేశాలు కూడా మనదేశం మాదిరిగానే కరోనా ఉపద్రవంతో భారీగా నష్టపోయాయి. కరోనా బాధిత భారత్ నుంచి కరోనా పీడిత మరో దేశానికి పెట్టుబడి వెళ్లిపోవడం కరోనా విలయం వల్లే జరిగిందనడం సబబు కాదు. పెట్టుబడి పలాయనాన్ని నిరోధించేందుకు పటిష్ఠ విధానాలను ఆర్బీఐ రూపొందించవలసి ఉంది. ఆర్జనపరుడు చనిపోయినప్పుడు కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఒడిదుడుకులకు లోనైన విధంగానే పెట్టుబడి పలాయనం దేశాన్ని ఆర్థికంగా కుదేలు పరుస్తుంది.


భారత్ నుంచి విదేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు పెట్టుబడి స్వేచ్ఛా చలనాన్ని అనుమతించాలనేది ఆర్బీఐ విధానం. ఆర్బీఐ కమిటీ ఒకటి ఆ విధానానికి మద్దతుగా నాలుగు వాదనలు చేసింది. పెట్టుబడి స్వేచ్ఛాగమనం వల్ల దేశంలో పెట్టుబడి లభ్యత పెరుగుతుందనేది మొదటి వాదన. భారత్‌లో మదుపు చేసేందుకు విదేశీ మదుపుదారులను ఆ అనుమతి ప్రోత్సహిస్తుంది. అయితే ఈ వాదన, వాస్తవానికి విరుద్ధంగా ఉంది. గత మూడేళ్లుగా దేశ మూలధన ఖాతా ప్రతికూలంగా ఉన్నట్టు ఆర్బీఐ సమాచారమే స్పష్టం చేసింది. పెట్టుబడి స్వేచ్ఛా చలనం దేశం నుంచి బయటకు పోయేందుకు తోడ్పడుతున్నట్టుగా విదేశాల నుంచి దేశంలోకి పెట్టుబడి ప్రవహించేందుకు దోహదం చేయడం లేదు.


పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తుందనేది రెండో వాదన. ఇది కూడా సరికాదు. ఇతర దేశాలకు తరలిపోవడం వల్ల దేశంలో పెట్టుబడి లభ్యత తగ్గిపోతుంది. తత్ఫలితంగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుందే గానీ తగ్గనే తగ్గదు. భారతీయ కంపెనీలు విదేశాలలో రుణాలు తీసుకుని స్వదేశంలో మదుపు చేయవచ్చనేది మూడో వాదన. ఇది సబబైన వాదనే అయినా కూడా అనేక మినహాయింపులు ఉన్నాయి. పెట్టుబడి స్వేచ్ఛా చలనం భారతీయ మదుపుదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో (ఒక కంపెనీ, ముఖ్యంగా ఆర్థిక కారణాల దృష్ట్యా ఇతర కంపెనీలలో పెట్టిన పెట్టుబడి)ను వైవిధ్యీకరించేందుకు సహాయపడుతుందనేది నాలుగో వాదన. భారతీయ మదుపుదారులు ప్రస్తుతం స్వదేశంలోనే ఆస్తులు, షేర్ మార్కెట్‌లో మదుపు చేస్తున్నారు. పెట్టుబడి స్వేచ్ఛా చలనాన్ని అనుమతించడం వల్ల మన మదుపుదారులు న్యూయార్క్‌లో ఆస్తులు సమకూర్చుకునేందుకు లేదా న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వాటాల కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. ఇది సరైన లబ్ధే, సందేహం లేదు. అయితే ఈ ప్రయోజనాన్ని సమాజంలోని సంపన్న వర్గాలు మాత్రమే పొందగలుగుతాయి. పెట్టుబడి ఇతర దేశాలకు తరలిపోవడం వల్ల కుబేరులు మాత్రమే లబ్ధి పొందుతారు గానీ దేశానికి ఎటువంటి మేలు జరగదు. ఆర్బీఐ కమిటీ నాలుగు వాదనలూ దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదం చేసేవి కావు. 


ఈ సందర్భంగా ఒక విషయాన్ని తప్పక చెప్పవలసి ఉంది. కరోనా మహమ్మారి లాంటి సంక్షోభ సమయంలో పెట్టుబడి స్వేచ్ఛా చలనంపై ఆంక్షలు విధించే విషయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు పరిగణనలోకి తీసుకోవాలని ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’ సంస్థ సూచించింది. కొరియా, పెరూలు కరోనా కాలంలో పెట్టుబడి స్వేచ్ఛా చలనంపై ఆంక్షలు విధించడం ద్వారా విశేష లబ్ధి పొందాయని ఐఎమ్‌ఎఫ్ పేర్కొంది.


పెట్టుబడి స్వేచ్ఛా చలనంపై ఆర్బీఐ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం వాస్తవానికి దాని సొంత సిఫారసులకే వ్యతిరేకంగా ఉన్నాయి. పెట్టుబడి స్వేచ్ఛా గమనాన్ని అనుమతించడంతో పాటు ద్రవ్యలోటును అదుపు చేయడం తప్పనిసరి అని ఆర్బీఐ కమిటీ పేర్కొంది. కరోనా విపత్తు ప్రారంభమైన తరువాత మన దేశ ద్రవ్యలోటు పెరిగిపోతున్న విషయం మనకు తెలుసు. ద్రవ్యలోటును నియంత్రించకుండా పెట్టుబడి స్వేచ్ఛా చలనాన్ని అనుమతించవద్దని ఆర్బీఐ ఒక పక్క నిర్దేశిస్తోంది; మరో పక్క ‘సరళీకృత ప్రేషణ పథకం’ (లిబరలైజ్డ్ రెమిటన్స్ స్కీమ్) కింద మదుపు చేసేందుకు భారతీయ పౌరులు విదేశాలకు పంపే డబ్బు పరిమితిని పెంచింది. అసలే ద్రవ్యలోటు పెరిగిపోతున్నప్పుడు ఇటువంటి వెసులుబాట్లు కల్పించడం వల్ల ద్రవ్యలోటు మరింతగా పెరిగిపోదా?


అసలు మనదేశం నుంచి పెట్టుబడి పలాయనం ఎందుకు జరుగుతోంది? ‘జర్నల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూషన్స్’లో ప్రచురితమైన ఒక వ్యాసం అందుకు నాలుగు కారణాలను పేర్కొంది. అవి: (1) అవినీతి. దీనివల్ల భారత్‌లో వ్యాపార నిర్వహణా వ్యయాలు చాలా అధికంగా ఉంటున్నాయి. ఈ కారణంగా విదేశీ మదుపుదారులు మనదేశంలో మదుపు చేసేందుకు వెనుకాడుతున్నారు. (2) ప్రభుత్వ రుణభారం పెరుగుదల. దీనివల్ల ప్రభుత్వం మరింత ధనాన్ని అప్పుగా తీసుకోవలసివస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు ఆర్బీఐ విధిగా సులభతర ధన విధానాన్ని అనుసరించవలసి ఉంది. ఆ విధానం ద్రవ్యోల్బణం పెరుగుదలకు, రూపాయి విలువ పతనానికి దారితీస్తుంది. దీంతో పెట్టుబడి విలువ తగ్గిపోయి మనదేశంలో మదుపు చేసిన విదేశీ మదుపుదారులు నష్టాలపాలయ్యే ప్రమాదముంది. (3) ప్రతికూల మూలధన ఖాతా. ఇది, పెట్టుబడి ఇతర దేశాలకు తరలిపోయేందుకు దారితీస్తుంది. తమ పెట్టుబడికి విలువ తగ్గిపోవడం వల్ల మదుపుదారులు ఒకరి తరువాత మరొకరు తమ పెట్టుబడిని ఉపసంహరించుకుంటారు. (4) స్వేచ్ఛా వాణిజ్య విధానాలు. మన ఆర్థిక వ్యవస్థలో సమర్థత కొరవడితే అంతర్జాతీయ విపణిలో మన ఉత్పత్తులకు గిరాకీ తగ్గిపోతుంది. తత్ఫలితంగా పెట్టుబడి పలాయనం అనివార్యమవుతుంది.


పై నాలుగు కారణాలతో పాటు మరొక కారణం కూడా ఉందని నేను విశ్వసిస్తున్నాను. మన సమాజంలో నెలకొని ఉన్న సామాజిక అశాంలే ఆ ఐదో కారణమని నేను అభిప్రాయపడుతున్నాను. మనదేశంలో సామాజిక వాతావరణం చాలా ప్రతి కూలంగా పరిణమించింది. దీనివల్ల విదేశీ మదుపుదారులు మనదేశంలో మదుపు చేసేందుకు వెనుకాడుతున్నారు. పెట్టుబడి స్వేచ్ఛా చలనంపై ఆర్బీఐ, భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పెట్టుబడి పలాయనానికి, మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్ల తగ్గుదలకు దారితీస్తోంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి స్వేచ్ఛా గమనాన్ని నియంత్రించాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌

Read more