సాంత్వన లేని ‘గుజరాత్‌’

ABN , First Publish Date - 2022-01-01T06:25:37+05:30 IST

1984 సిక్కుల ఊచకోతపై 1999లో సోనియా గాంధీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 2005లో మన్మోహన్ సింగ్ సిక్కులకే కాదు యావద్భారతీయులకు క్షమాపణ చెప్పారు. 2002 గుజరాత్ మారణకాండపై నరేంద్ర మోదీ.....

సాంత్వన లేని ‘గుజరాత్‌’

1984 సిక్కుల ఊచకోతపై 1999లో సోనియా గాంధీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 2005లో మన్మోహన్ సింగ్ సిక్కులకే కాదు యావద్భారతీయులకు క్షమాపణ చెప్పారు. 2002 గుజరాత్ మారణకాండపై నరేంద్ర మోదీ ఇంతవరకు క్షమాపణలు చెప్పక పోవడం అలా ఉంచి ఆయనలో అసలు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తమవడంలేదు. రెండు దశాబ్దాల క్రితం మోదీ పహరాలో సంభవించిన ఆ మారణ కాండ ఇప్పటికీ మన గణతంత్ర రాజ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతూనే ఉంది. 


కొత్త ఏడాది అనేక వార్షికోత్సవాల సంవత్సరం. శ్రీఅరబిందో 150వ జయంతి, సహాయ నిరాకరణోద్యమంలో మహాత్మా గాంధీ అరెస్‌్టకు నూరేళ్లు, ఎనిమిది దశాబ్దాల క్విట్ ఇండియా ఉద్యమం, భారత స్వాతంత్ర్య అమృతోత్సవం, ప్రథమ సార్వత్రక ఎన్నికల 70వ సంవత్సర వేడుకలు, ఆరవై ఏళ్ళ భారత్–చైనా యుద్ధం... ఇత్యాది వార్షికోత్సవాలన్నిటినీ ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వమూ సమధికోత్సాహంతో నిర్వహిస్తాయనడంలో సందేహం లేదు. ప్రతి వేడుకనూ నరేంద్ర మోదీ వ్యక్తిపూజను సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళడానికి తప్పక ఉపయోగించుకుంటారు. శ్రీఅరబిందో ఆధ్యాత్మిక ఔన్నత్యం, స్వాతంత్ర్య వీరుల పోరాటాలు, త్యాగాలు; భారత ప్రజాస్వామ్య సంప్రదాయాల పురాతన మూలాలు; శత్రువు కాచుకుని ఉన్నప్పుడు మన వీర సైనికులను సర్వసన్నద్ధ పరిచి, దేశ సరిహద్దుల పరిరక్షణకు ప్రభుత్వ దృఢ సంకల్పం మొదలైన అంశాలపై ప్రధానమంత్రి ఉర్రూత లూగించే ప్రసంగాలు వెలువరించడం ఈ వార్షికోత్సవాల విశిష్టతలుగా ఉండడం ఖాయం. 


అయితే ఒక వార్షికోత్సవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. బహుశా అది ఈ ఏడాది నరేంద్ర మోదీ అధికారిక కార్యక్రమాల జాబితాలో ఉండకపోవచ్చు. 2002 ఫిబ్రవరి- మార్చిలో చోటుచేసుకున్న గుజరాత్ మతోన్మాద అల్లర్లకు 2022లో ఇరవై ఏళ్లు నిండుతాయి. ఆ ఘటనను ‘అల్లర్లు’ (Riots)గా పేర్కొనడం సభ్యోక్తి మాత్రమే అవుతుంది. వాస్తవానికి ఆ సంఘటనలు ‘సామూహిక హత్యాకాండ’ (Pogrom)గా పరిగణించి తీరాలి.. ఎందుకంటే ఆ దారుణ హింసాకాండ ప్రధానంగా ఒక మైనారిటీ మత సమూహం (ముస్లింలు) లక్ష్యంగా సంభవించింది. 2002లో గుజరాత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన మారణకాండ, అంతకు ముందు పద్దెనిమిదేళ్ల క్రితం 1984లో ఢిల్లీలో సిక్కులకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న మారణకాండ మధ్య కొన్ని సాదృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి.


1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. హంతకులు సిక్కు మతస్థులు. ఇది, సిక్కులపై పైశాచిక ప్రతీకారానికి పురిగొల్పింది ఇందిర హత్యతో ఎటువంటి సంబంధంలేని అమాయక సిక్కులను ఊచకోత కోశారు. 2002లో సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఒక బోగీలోని 59 మంది యాత్రికులు సజీవంగా దహనమయ్యారు. ఈ దారుణంతో ఎటువంటి సంబంధం లేని వేలాది అమాయక ముస్లింలు పైశాచిక ప్రతీకారానికి గురయ్యారు.


ఈ రెండు దారుణాలలోనూ ప్రభుత్వ యంత్రాంగమూ, అధికారపక్షమూ ఆ హింసాగ్నులు దావానలంలా వ్యాపించడానికి దోహదం చేశాయి. మైనారిటీ మతస్థులకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన అల్లర్లు సామాహిక మారణ కాండగా పరిణమించాయి. మైనారిటీ మతస్థులను ఆ హింసాకాండకు ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోవడం జరిగింది. ఢిల్లీలోనూ, గుజరాత్‌లోనూ సామూహిక హత్యాకాండలు జరిగినప్పుడు అధికారంలో ఉన్న రాజకీయవేత్తలు- ఢిల్లీలో ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ, గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ- వాటి నుంచి రాజకీయ లబ్ధిని పొందారు. ఆ సంఘటనల వెన్వెంటనే జరిగిన ఎన్నికల ప్రచార సభలలో రాజీవ్, మోదీలు మైనారిటీ మత వర్గాలపై నానా అపవాదులు మోపారు.


ఢిల్లీ, గుజరాత్ మారణకాండల మధ్య సాదృశ్యాలేకాదు, కొన్ని తేడాలూ ఉన్నాయి. కాంగ్రెస్ అంతిమంగా సిక్కులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించింది. అనుతాపం చెందింది. ఆలస్యంగానే అయినా కాంగ్రెస్ వైఖరిలో చిత్తశుద్ధితో కూడిన మార్పు వచ్చింది. 1999లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన కొద్ది రోజులకు సోనియాగాంధీ అమృత్‌సర్‌లోని స్వర్ణాలయాన్ని సందర్శించి 1984 మారణకాండ పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.


క్షమాపణలు మాత్రం చెప్పలేదు. అయితే 2004లో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 2005 ఆగస్టులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ సిక్కులకు క్షమాపణలు చెప్పేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదని స్పష్టం చేశారు. సిక్కు మతస్థులకే కాదు, యావత్ భారత్ జాతికి క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. మన రాజ్యాంగంలో సుప్రతిష్ఠితం చేసిన జాతీయత భావనకు 1984 ఘటనలు పూర్తిగా విరుద్ధమైనవని మన్మోహన్ అన్నారు. 


వాస్తవానికి, మన్మోహన్ క్షమాపణలు చెప్పే నాటికే సిక్కులు తమకు జరిగిన అన్యాయాన్ని మరచిపోయి విశాల భారత జాతితో మమేకమయ్యారు. 2005 ఏప్రిల్‌లో నేను పంజాబ్‌ను సందర్శించాను. సిక్కు ఉపాధ్యాయులు కొంతమందితో మాటా మంతీ జరిపాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, జనరల్ జెజె సింగ్ సైనిక దళాల ప్రధానాధికారిగా, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్నందున తమను అంటే సిక్కులను భారత రిపబ్లిక్‌లో సమాన పౌరులుగా పరిగణిస్తారనే భరోసా ఏర్పడిందని ఆ ఉపాధ్యాయులు చెప్పారు. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా మూడు అత్యున్నత పదవులలో సిక్కులను నియమించలేదు. అయితే మన్మోహన్, జెజె సింగ్, అహ్లూవాలియాల నియామకాలు సిక్కులపై విశేష స్థాయిలో ఒక ప్రతీకాత్మక ప్రభావాన్ని చూపాయి.


1984 మారణకాండ పట్ల సిక్కుల మనస్తాపం రెండు దశాబ్దాలకు పూర్తిగా కాకపోయినప్పటికీ చాల వరకు తీరిపోయింది. అయితే గుజరాత్ ముస్లింలు 2002లో వలే ఇప్పటికీ భయాందోళనలు, అభ్రతా భావంతో బతుకుతున్నారు. నిజం చెప్పాలంటే 2002లో కంటే వారిప్పుడు మరింత ఎక్కువ అభద్రతకు లోనవుతున్నారు. నరేంద్ర మోదీ ఇంతవరకు క్షమాణపలు చెప్పలేదు. ఆ దారుణ ఘటనల పట్ల ఆయనలో ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తమవడం లేదు. మోదీ, ఆయన పార్టీ, గతంలో మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అనుసరించిన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ తమకు ఉన్న అధికారాల ఆధారంతో మెజారిటీవాద పాలనను నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ పాలనలో భారత్‌కు ఒక ముస్లిం ప్రధానమంత్రి, భారత సైనిక దళాలకు ఒక ముస్లిం జనరల్ నాయకత్వం వహించడాన్ని ఊహించలేం. బీజేపీకి లోక్‌సభలో 300 మందికి పైగా ఉన్న ఎంపీలలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం.


ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తన ‘రాజ్‌ధర్మ’ను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే 2002 మారణకాండ సంభవించిందని నాటి ప్రధాని వాజపేయి అభిప్రాయపడ్డారు. అయితే అధికారంలో ఉన్న రాజకీయవేత్త చేయవలసిందేమిటనే విషయమై నరేంద్ర మోదీ అవగాహన పూర్తిగా భిన్నమైనది. మోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ హిందువుల కొరకు, హిందువుల యెక్క పార్టీగా మాత్రమే పనిచేస్తోంది. 2002 గుజరాత్ ఘటనలను ఒక ప్రయోగంగా భావిస్తున్నారు.


‘మన రాజ్యాంగంలో పొందుపరిచిన జాతీయత భావనకు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు విరుద్ధమైనవని’ మన్మోహన్ సింగ్ తన క్షమాపణలో అన్నారు. 2002లో నరేంద్ర మోదీ పహరాలో గుజరాత్‌లో చోటు చేసుకున్న ఘటనలు రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘనే అన్నది స్పష్టం. అయినా తన ముఖ్యమంత్రిత్వ హయాంలో జరిగిన దానికి క్షమాపణ చెప్పవలసిన అవసరముందని నరేంద్ర మోదీ భావించడం లేదు. అందుకు ఆయన అహంకారం అడ్డుపడుతుందని చెప్పవచ్చు. అయితే ఇది పాక్షిక కారణమే. అసలు కారణం జాతీయతను గురించిన మోదీ ఆదర్శాలు. భారత రాజ్యాంగంలోని జాతియత భావనకు అది పూర్తిగా విరుద్ధమైనవి.


17వ శతాబ్ది ఫ్రెంచ్ రచయిత రోష్ ఫోకాల్డ్ నయవంచన (హిపోక్రసీ)ను ‘నీతికి అవినీతి అర్పించే ప్రణామ’ని నిర్వచించాడు. 2022లో భారతీయులకు ఆ సూక్తి అనేక విధాల అనుభవంలోకి వస్తుందనడంలోసందేహం లేదు. భారత స్వాతంత్ర్యోద్యమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందించిన తోడ్పాటు ఏమీ లేదు. అయినప్పటికీ సంఘీయుడు అయిన నరేంద్ర మోదీ 2022లో ఆ మహోన్నత ఉద్యమం గురించి ఘనంగా మాట్లాడతారు.


ఆయన హిందూత్వ భావజాలం మహాత్ముని సమ్మిళిత విశ్వాసాలకు విరుద్ధమైనది అయినప్పటికీ గాంధీజీని అద్వితీయంగా ప్రశంసించడాన్ని మనం వినవచ్చు. మోదీ ప్రధాని అయిన తరువాత పార్లమెంటు ప్రాధాన్యం అంతకంతకూ తగ్గిపోతోంది. అయినప్పటికీ ‘ప్రజాస్వామ్య స్ఫూర్తి’కి, ప్రభవిస్తున్న ‘నవ భారత్’కు ప్రతీకగా నిర్మించిన పార్లమెంటు కొత్త భవనాన్ని మోదీ ప్రారంభించడాన్ని మనం చూడనున్నాం. శ్రీఅరబిందో, తాను సగోత్రీకులమని కూడా మోదీ గొప్పగా చెప్పుకోవచ్చు. అయితే నైతికంగా, మేధో పరంగా ఇరువురి మధ్య ఒక పెద్ద అగాధమే ఉంది. ఒకరు మౌని, మార్మికుడు అయిన ఋషి కాగా మరొకరు ప్రచారానికి ఆరాటపడే ప్రధానమంత్రి. ఇరువురి మధ్య పోలిక ఎలా చూడగలం?


20౨2లో ఆయా వార్షికోత్సవాలను నిర్వహించడంలో తన కీర్తి ప్రతిష్ఠలను పెంచుకోవడానికి మోదీ తప్పక ప్రయత్నిస్తారు. అయితే గుజరాత్ మారణకాండకు ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మహా విషాదంపై వ్యక్తిగత లేదా రాజకీయ దృక్పథంతో ఆయన బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలను చేయకపోవచ్చు. రెండు దశాబ్దాల నాడు మోదీ పహరాలో సంభవించిన ఆ మారణ కాండ ఇప్పటికీ మన గణతంత్ర రాజ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతూనే ఉంది.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-01-01T06:25:37+05:30 IST