ప్రజా నాయకుడు, గాయకుడు
ABN , First Publish Date - 2022-03-22T07:53:36+05:30 IST
నువ్వు ప్రజాయుద్ధ సైనికుడివి, ప్రజా యుద్ధ నాయకుడివి, గాయకుడివి. నీ ఉక్కుగొంతు నుంచి ఖణేల్మని దూకిన నీ పాటలు తుపాకీ తూటాల్లా రాజ్యాన్ని పేల్చాయి...

నువ్వు ప్రజాయుద్ధ సైనికుడివి,
ప్రజా యుద్ధ నాయకుడివి, గాయకుడివి.
నీ ఉక్కుగొంతు నుంచి ఖణేల్మని దూకిన నీ పాటలు
తుపాకీ తూటాల్లా రాజ్యాన్ని పేల్చాయి.
రక్తంతో తడిసిన నుదుటిని తుడుచుకొని
నీవున్న గోతిలోంచి గుళ్ల వర్షాన్ని కురిపించావు.
నిన్ను, నీ దళ సభ్యుల రక్తాన్ని తాగేందుకలవాటుపడ్డ
కూంబింగ్ దళాల బూట్ల చప్పుళ్లు అటువైపు,
మీ నుదుళ్లపై రక్తపు ఎరుపు,
మీ టోపీలకున్న నక్షత్రపు ఎరుపు మెరుపులు మీ వైపు
అజ్ఞాతంలో ఎస్ఎల్ఆర్‌లు, మెషిన్‌గన్నులు, ఎకె–47 అరుపులు
నిత్య నిర్బంధంలో కూడా నీ విధిని నిర్వహించావు.
రేపటి తరాలను నీ త్యాగంతో ఉత్తేజపరచావు.
ఏ యుద్ధాలు లేని సమాజం కోసం
ప్రజా యుద్ధంలో ప్రాణాలర్పించి అమర వీరుడయినావు.
డప్పు శాస్త్రాన్ని లిఖించిన ఆది జాంబవంతుడివి.
నీవొక సుడిగాలివి, నీవొక అగ్నిగుండానివి.
అన్యాయాన్ని ప్రతిఘటించిన ప్రజా యుద్ధ వీరుడివి,
డప్పే నీ బాట, నిరవధిక ప్రజా యుద్ధమే నీ పాట.
బి. విల్సన్
కుల నిర్మూలన పోరాట సమితి
(డప్పు రమేష్‌్ సంస్మరణలో)