ప్రౌచాందీ : అజ్ఞాత తెలుగు దళితుడు
ABN , First Publish Date - 2022-09-04T06:03:50+05:30 IST
సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సి. నిరూప్ తమ ‘భారత – వియత్నాం బంధానికి వారధి నేతాజీ’ అనే వ్యాసం (ఆగస్టు 27, ‘ఆంధ్రజ్యోతి’)లో ధర్మనందన్ ప్రౌచాంది గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు...
సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సి. నిరూప్ తమ ‘భారత – వియత్నాం బంధానికి వారధి నేతాజీ’ అనే వ్యాసం (ఆగస్టు 27, ‘ఆంధ్రజ్యోతి’)లో ధర్మనందన్ ప్రౌచాంది గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. గుర్తింపులేని స్వాతంత్ర్య సమరయోధడు లియోన్ ప్రౌచాంది ఆయన కుమారుడే. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సైగోన్ (నేటి హోచిమిన్ సిటీ)లో ఆశ్రయం కల్పించిన త్యాగశీలి లియోన్. ధర్మనందన్ మునిమనవడు, చరిత్రకారుడు ప్రొఫెసర్ జెబిపి మోరె ప్రోత్సాహంతో వీర మధురకవి అనే రచయిత తమిళంలో లియోన్ జీవిత చరిత్ర రాశారు. ఆ పుస్తక ప్రతిని 2005లో ప్రొఫెసర్ మోరె నాకు బహూకరించి, తెలుగులోకి అనువాదం చేయించి, ప్రచురించమని కోరారు. యానాం విదుషీమణి డా. దవులూరి సుమతి ఆ పుస్తకాన్ని అనువదించారు. దురదృష్టవశాత్తు అది ఇప్పటికీ ప్రచురణకు నోచుకోలేదు.
లియోన్ ప్రౌచాంది పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపట్నంకి చెందినవారని వీర మధురకవి పేర్కొన్నారు. బొబ్బిలి యుద్దం తరువాత బుస్సీ దొర సైన్యంతో బాటు వారు పుదుచ్చేరికి వలస వెళ్ళారు. అక్కడ నుంచి ఫ్రెంచ్ వలసరాజ్యమైన వియత్నాంకు వెళ్ళి సైగోన్ నగరంలో స్థిరపడింది. అతను కుమారుడు సవురి కన్ను ప్రౌచాంది. నావికా వ్యాపారం, కలప వర్తకం చేసిన ప్రౌచాంది కుటుంబం 1850 నాటికే విశేష స్థాయిలో సిరిసంపదలను ఆర్జించింది. ఈ కుటుంబం నిమ్నజాతులకు చెందినదిగా లియోన్ జీవిత చరిత్రలో పేర్కొన్నారు.
లియోన్ ప్రౌచాందీ ఉన్నత విద్యావంతుడు. ఫ్రెంచ్‌లో బ్రెవే సుపీరియర్ అంటే పిజి డిగ్రీ ఉన్న వ్యక్తి. ఆయన తరచు తన పూర్వీకుల మాతృభూమి పుదుచ్చేరికి వచ్చి పోతుండేవారు. భారత స్వాతంత్ర్యోద్యమంపై విశేష శ్రద్ధాసక్తులు చూపేవారు. సైగోన్ నగరంలో ఆయన ఇంటి మీద భారతీయ పతాకం ఎగురుతుండేది. వలస పాలన నుంచి భారత్ విముక్తమవాలని ప్రగాఢంగా ఆకాంక్షించిన ఇండో–ఫ్రెంచ్ పౌరుడు లియోన్ ప్రౌచాంది. నేతాజీ బోస్ ఐరోపా నుంచి ఆగ్నేయ ఆసియా వచ్చిన తరువాత లియోన్ ప్రౌచాందీ ఆయన సమరశీల కార్యక్రమాలతో గొప్పగా ఉత్తేజితుడయ్యారు. జపాన్ సహకారంతో స్వాతంత్య్రం పొందిన దేశాల్లో భారతదేశం కూడా ఉండాలని ఆయన ఆశించేవారు. బర్మా, సింగపూర్, మలేషియాలలోని లక్షలాది తమిళులు నేతాజీ ఐఎన్‌ఏలో చేరారు. సైగోన్‌లోని, ముస్లింలు, శెట్టియార్ వ్యాపారస్తులు, తమిళ అధికారులు కూడా నేతాజీకి మద్దతు ఇస్తారని ప్రౌచాంది భావించారు. అయితే ఆ నగరంలోని పుదుచ్చేరి వర్తకులు నేతాజీని కలవడానికి భయపడి ఇండియా పారిపోయారు. నాట్టికొట్టు చెట్టియార్లు ఒక బృందంగా ఏర్పడి, నేతాజీకి దూరంగా ఉండమని పుదుచ్చేరి వర్తకులకు హుకుం జారీ చేసారు. ‘ఐఎన్‌ఏలో చేరండి లేదా ఆర్థిక సహాయం చెయ్యండి’ అని నేతాజీ స్వయంగా విజ్ఞప్తి చేసినా సైగోన్‌లోని పుదుచ్చేరి వర్తకులు ముందుకు రాలేదు.
లియోన్ ప్రౌచాంది ఫ్రెంచ్ పౌరుడు. అంతేగాక ఫ్రెంచి జాతీయుల జాబితాలలో స్థానం పొందినవాడు. అయినా లియోన్ ప్రౌచాంది స్వచ్ఛందంగా నేతాజీకి అన్ని విధాల సహాయమందించాలని నిర్ణయించుకున్నాడు. నేతాజీకి సైగోన్‌లో అండగా నిలిచాడు. ఆ నగరంలోని పాల్ బ్లేణ్షీ వీధిలోని తన విశాల నివాస భవనాన్ని ఐఎన్‌ఏకు అప్పగించారు. రెండేళ్ల పాటు ఆ చిరునామా నుంచే ‘ఆజాద్ హిందు’ పత్రిక ఫ్రెంచ్ భాషలో వెలువడేది. ఆ పత్రిక నకళ్ళు నా వద్ద ఉన్నాయి. నేతాజీ మొదటిసారి సైగోన్‌కు వచ్చినప్పుడు లియోన్ ఆయనకు బంగారు నాణెముల దండవేసి స్వాగతం పలికారు. ప్రౌచాందీ భవనం మీద భారతీయ జాతీయ జెండా, వియత్నాం జెండా, జపాన్ జెండా ఎగురుతుండేవి. ప్రౌచందీ తన ఆస్తులన్నీ నేతాజీకి అప్పగించి తన కుటుంబంతో వేరేచోట నివాసం ఉండేవారు. నేతాజీ ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం తప్పక సిద్ధించగలదని, అదీకూడా జపాన్‌తోనే సుసాధ్యమవుతుందని ప్రౌచాందీ నమ్మేవాడు. సైగోన్‌లో ఉన్న బెంగాళీలు, తమిళులు, తెలుగువారు, ముస్లింలు నేతాజీని ప్రౌచాందీ భవనంలోనే కలిసి తమ గౌరవాన్ని తెలిపేవారు. యానాంకి చెందిన దున్నా నాగారావు, కోరమాటి వెంకయ్య, ఫ్రెంచ్‌లో బ్రెవే డిగ్రీ పాసై ఫ్రెంచ్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు చేసారు. అదే విధంగా ప్రొఫెసర్ దున్నా వెంకటరత్నం ఇండో–చైనా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ శాఖాధిపతిగా పనిచేసేవారు. వీరందరూ దళితులే అని ఫ్రెంచ్ కాలంలో తెలుగు దళితుల ప్రతిభ ‘‘ప్రబోధిని’’ అనే గ్రంథంలో పాము రామమూర్తి తమ ‘ప్రబోధిని’లో రాశారు. ఫ్రెంచ్ కాలంలో తెలుగు దళితుల ప్రతిభా పాటవాల గురించి విపులంగా వివరించిన గ్రంథమది. యానాంకి చెందిన వీరందరు ఫ్రెంచ్ వలస రాజ్యాలలో ఉన్నతోద్యోగాలు చేస్తూ, స్వగ్రామం యానాంకి వస్తూ పోతూ ఉండేవారు.
1945లో జపాన్‌పై అణుబాంబు వేసింది. ఘోర పరాజయంతో జపాన్, అమెరికాకు లొంగిపోయింది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ సైన్యం తిరిగి సైగోన్‌ను స్వాధీనపరచుకుంది. సైగోన్ ఫ్రెంచ్ పాలన క్రిందకు తిరిగి వచ్చేసింది. నాటి అనిశ్చిత పరిస్థితులలో నేతాజీ, సైగోన్ నుంచి జపాన్‌కి రహస్యంగా నిష్క్రమించారు. నేతాజీకి ఆశ్రయం ఇచ్చిన ప్రౌచాందీపై ఫ్రెంచ్ ప్రభుత్వం రాజ్య ధిక్కరణ నేరం మోపింది. సైనిక కోర్టు ఆయనపై విచారణ జరిపింది. ఫ్రెంచ్ పౌరుడై ఉండి, సుభాష్ చంద్రబోసుకి ఆశ్రయం కల్పించడంపై సైనిక కోర్టు ఒక నివేదికను ఫ్రెంచ్ ప్రభుత్వానికి సమర్పించింది. లియోన్‌ను అరెస్ట్ చేసి సైగోన్‌లోని ‘రాణువ’ సైనిక కారాగారానికి ఆయన్ని తరలించారు. నేతాజీని సైగోన్ రప్పించడంలో ఉద్దేశంపై కూపీ లాగడానికి లియోన్‌ను ఆరు నెలల పాటు నానా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఆయన మతి స్థిమితం కోల్పోయారు. చనిపోతాడని భయపడి జైలు నుంచి విడుదల చేసారు. అయితే లియోన్ తన జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయాడు. ఆయన కుటుంబం పూర్తిగా కృంగిపోయినది. తమిళ చెట్టియార్లు లియోన్ ఫ్రెంచ్ దేశ ద్రోహుడని, ఎవరూ సహకరించవద్దని హుకూం జారీ చేసారు. వ్యాపారాలు, ఆస్తులను ఫ్రెంచ్ ప్రభుత్వం స్వాధీనపరచుకున్నది. పిల్లల చదువులు ఆగిపోయాయి. భవిష్యత్ అంధకారం అయిపోయింది. పలకరించే దిక్కులేని దుస్థితి. లియోన్ జీవితం ముగిసిందనుకుంటున్న తరుణంలో సైగోన్‌లో మానవ హక్కుల నాయకుడు డా. లి.విలియన్ (Dr. Le. Villain) ఆయన్ని అన్ని విధాల ఆదుకున్నాడు. విలియన్ ఆదరణతో లియోన్ మామూలు మనిషి కాకపోయినా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ప్రౌచాంది శ్రేయోభిలాషులు 1946లో ఆయన్ని, ఆయన కుటుంబాన్ని సైగోన్ నుంచి పుదుచ్చేరికి పంపించివేశారు. పుదుచ్చెరిలో డ్లూప్లెక్సు వీధి (నేటి జవహర్ వీధి)లోని తన సొంత గృహంలో లియోన్ నివసించేవాడు. లియోన్ 1965లో కీర్తిశేషుడు అయ్యారు.
లియోన్ ప్రౌచాందీ సైగోన్‌లో నేతాజీకి ఆశ్రయం ఇవ్వడం వలన సర్వం కోల్పోయి బికారిగా ఇండియాలో చనిపోయాడు. ఫ్రెంచ్ పౌరసత్వం కలవాడు గనుక భారత ప్రభుత్వం ఆయన త్యాగాన్ని గుర్తించలేదు. అయితే పుదుచ్చేరి ప్రభుత్వం, భారత స్వాతంత్ర్య యోధులు ఆయనను ‘పుదువై నేతాజీ’ అని శ్లాఘించేవారు. ఆయన మనుమడు ప్రొ. మోరె పుదుచ్చేరిలో లియోన్ ప్రౌచాందీ జ్ఞాపకార్థం ఒక శాశ్వత ఛాయా చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. లియోన్ త్యాగం నేటికీ స్ఫూర్తిదాయకమే (ప్రొ. మోరె 2007లో ‘ది తెలుగూస్ ఆఫ్ యానాం అండ్ మచిలీపట్నం ఫ్రం ఫ్రెంచ్ రూల్ టు ఇంటిగ్రేషన్ విత్ ఇండియా’ అనే ఒక గొప్ప చారిత్రక గ్రంథాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో నాకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు). భారత్–వియత్నాం స్నేహ బంధానికి నిజమైన వారధి లియోన్ ప్రౌచాందీ మాత్రమే. గుర్తింపు లేని తెలుగు దళిత వీరుడుగా ఆయన చరిత్ర పుటల్లో దాగి ఉన్నాడు.
కలైమామణి పొనుగుమట్ల విష్ణుమూర్తి
జర్నలిస్టు, యానాం
