ప్రతాపరుద్రుడి ‘మరణ రహస్యం’

ABN , First Publish Date - 2022-04-28T09:41:30+05:30 IST

కాకతీయ వంశంలో చివరి రాజుగా భావిస్తున్న ప్రతాప రుద్రుడు మాలిక్ కాఫర్ వరుస దండయాత్రల తర్వాత, ఒక నమ్మక ద్రోహం వల్ల ఓటమి చెందాడు. మాలిక్ కాఫర్ దండయాత్ర అనంతరం ఢిల్లీ సుల్తానులకు...

ప్రతాపరుద్రుడి ‘మరణ రహస్యం’

కాకతీయ వంశంలో చివరి రాజుగా భావిస్తున్న ప్రతాప రుద్రుడు మాలిక్ కాఫర్ వరుస దండయాత్రల తర్వాత, ఒక నమ్మక ద్రోహం వల్ల ఓటమి చెందాడు. మాలిక్ కాఫర్ దండయాత్ర అనంతరం ఢిల్లీ సుల్తానులకు కప్పం చెల్లించడానికి ప్రతాప రుద్రుడు అంగీకరించాడు. ఇందులో భాగంగా పదివేల గుర్రాలను, ఏనుగులను, అపారమైన ధనరాసులు మాలిక్ కాఫర్‌కు బహూకరించాడు. వీటితో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా ఇచ్చాడట. రాజ్యం మొత్తం సంక్షోభంలో ఉన్నా ఎంతో నేర్పుతో 1322వ సంవత్సరం వరకు తన ఓరుగల్లు రాజ్యాన్ని పాలిస్తూ వచ్చాడు. అయితే, ఢిల్లీలో రాజ్యాల మార్పిడితో తిరిగి ఉలుఘ్ ఖాన్ దండయాత్రలో పరాజయం పొందిన తర్వాత కాకతీయ వంశం దాదాపుగా అంతమైంది. ఈ సందర్భంగా రాజకుమారులందరూ పారిపోగా– ప్రతాపరుద్రుడు తన మంత్రివర్గ సభ్యుడైన కన్నయ్యతో సహా బందీ అయ్యాడు. వీరిని ఢిల్లీలోని సుల్తాన్ గయాసొద్దీన్ తుగ్లక్ దర్బారులో ప్రవేశపెట్టారు. అయితే, ప్రతాపరుద్రుడిని సుల్తాన్ గౌరవ భావంతోనే చూసి తన వద్దనే రెండేళ్ల పాటు తగు మర్యాదలతో ఉంచుకున్నాడు. ప్రతాప రుద్రుడు తిరిగి వరంగల్లుకు వెళ్లాలనే అభిలాషను వ్యక్తపరిస్తే, సుల్తాన్ అంగీకరించి మర్యాదపూర్వకంగా సాగనంపాడు. దీనితో, ప్రతాపరుద్రుడు స్వదేశానికి తిరిగివచ్చి, అజ్ఞాత జీవితాన్ని గడిపి, ప్రస్తుత మంథనిలో తుదిశ్వాస విడిచాడట. ఈ విషయాలను అహ్మద్ అబ్దుల్ అజీజ్, అహమ్మద్ సుల్తాన్‌లనే చరిత్రకారులు తమ పరిశోధన గ్రంథమైన ‘ఖాజినా– ఏ– తారీఖ్’లో పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా, ఢిల్లీ సుల్తానులు ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకుపోతున్న క్రమంలో 1330లో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు మరికొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. ఇప్పటికీ, మెజారిటీ చరిత్రకారులు ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే నమ్ముతున్నారు. అయితే, మహోన్నత వ్యక్తిత్వం, పాలనాదక్షుడైన ప్రతాపరుద్రుడు పిరికితనంతో ఆత్మహత్య చేసుకునే వ్యక్తిగల రాజుగా మనం ఆశించవచ్చా అనేది ఒక చర్చ.


మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం– ఘియాజుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ఖాన్‌ను వరంగల్లుపై దండయాత్రకు పంపాడు. ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడు, కటకపాలుడు, గన్నమనాయుడితో పాటు అనేకమంది సేనానులు బందీలయ్యారు. ప్రతాపరుద్రుడిని బంధించిన ఉలుఘ్‌ఖాన్, అతన్ని వరంగల్లులోనే ఉంచితే ప్రమాదమని భావించి, విశ్వాసపాత్రులైన ఖాదిర్‌ఖాన్, ఖ్వాజా హాజీలకు ఆయన్ను ఢిల్లీకి తరలించే బాధ్యతను అప్పగించాడు. ప్రతాపరుద్రుడు ఈ మార్గమధ్యంలోనే కన్నుమూశాడని ముస్లిం చరిత్రకారుడు షాంసి సిరాజ్ అఫీఫ్ తెలిపారు. అయితే ఎలా మరణించాడో విపులంగా వివరించలేదు.


సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుని ఢిల్లీ తీసుకువెళుతుండగా మార్గమధ్యన సోమోద్భవ (నర్మదా నది) తీరంలో ఆయన కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుని క్రీ.శ.1330 విలసదానపత్రం పేర్కొంది. ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదని స్వచ్ఛందంగానే భగవదైక్యం చెందాడని క్రీ.శ.1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో ఉంది. దీనిని బట్టి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవటమో లేదా అతని కోరిక మేరకు సహచరులెవరైనా చంపటమో జరిగి ఉంటుందని కొందరు చరిత్రకారులు తగు ఆధారాలతో వివరిస్తున్నారు.


ఇవిలా ఉండగా, వరంగల్లుకు చెందిన చరిత్రకారులు డా. నాగభూషణం అందించిన సమాచారం ప్రకారం, తుగ్లక్ సేనాధిపతి ఉలుఘ్‌ఖాన్ ప్రతాపరుద్రుడిని బంధించి ఢిల్లీ మార్గంలో వెళ్తూ, ప్రస్తుత ఏటూరు నాగారం నుంచి భూపాలపట్నం మార్గంలో సోమనూరు అనే ప్రాంతంలో స్వల్ప బసకై ఆగారట. ఈ సోమనూరు అనే ప్రాంతం అద్భుతమైన సుందర ప్రదేశం. ఇక్కడ ఇంద్రావతీ నదీ జలాలు అత్యంత తేటగా స్వచ్ఛంగా ఉండి అందులో సూది ఉన్నా కనిపించేదట. ఈ సంగమ ప్రాంతంలో గోదావరీ నదీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నదిలోనే దూకి ప్రతాపరుద్రుడు తప్పించుకున్నాడని ఒక అభిప్రాయం. ఆ తర్వాత ప్రతాప రుద్రుడు తిరిగి ఓరుగల్లుకు రాకుండా ఇక్కడే గిరిజనుల మధ్య నివసించాడని పేర్కొన్నారు. ఇప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ప్రాంతంలోని కొందరు గిరిజనులు ప్రతాపరుద్రుడు తమవాడని అంటారు. ఇక్కడ ప్రతాపరుద్రుడు తనకు వచ్చిన రసవాద విద్యతో స్వర్ణం తయారు చేసేవాడట. ఈ క్రమంలోనే ఇంద్రావతీ నదీ జలాలు బంగారం రంగులో లేత పసుపులో ఉంటాయంటారు. ప్రతాపరుద్రుడి చివరి రోజులపై ఉన్న ఈ మూడు వాదనలపై మరింత లోతుగా చరిత్రకారులు అధ్యయనం చేయాల్సి ఉంది.

కన్నెకంటి వెంకటరమణ

సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ

Updated Date - 2022-04-28T09:41:30+05:30 IST