భయం గియం లేని కవిత్వం!

ABN , First Publish Date - 2022-06-27T10:29:10+05:30 IST

ప్రపంచవ్యాపితంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి, స్థానిక ఉత్పత్తి శక్తుల మీద, ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి...

భయం గియం లేని కవిత్వం!

ప్రపంచవ్యాపితంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి, స్థానిక ఉత్పత్తి శక్తుల మీద, ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి. వాటికి కారణాలేమిటో తెలియని ప్రజలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు. మన దేశంలో నెహ్రూ మార్కు బూటకపు సోషలిజం విఫలమైంది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని వైరుధ్యాలను అర్థంచేసుకోలేక, పోరాడే ప్రజలకు నాయకత్వం వహించే చొరవ కోల్పోయింది. దేశం జాతుల బందిఖానాగా, ఉత్పత్తి శక్తుల బంది ఖానాగా మారింది. గ్రామాలు సుదీర్ఘ కాలం కులాల కాన్‌సంట్రేషన్‌ క్యాంపులుగా మారి ఉత్పత్తి శక్తుల వికాసానికి ఆటంకమయ్యాయి. 


అలాంటి గడ్డుకాలంలో నల్గొండ జిల్లాలోని అంకుశాపురంలో బద్దం బాలనర్సింహ 1944లో పుట్టి, గాయాల నొప్పుల స్థితిలో బాల్యం గడిపాడు. ఆ సంవత్సరం తెలంగాణాలో ఆంధ్ర మహాసభ అతివాద, మితవాద గ్రూపులుగా చీలింది. ఆయన బాల్యం రక్తసిక్త తెలంగాణా సాయుధ పోరాటం అతలాకుతలంతో గడిచింది. అయిదవ తరగతి నాటికి బాల నర్సింహ పేరు స్కూల్లో భాస్కరరెడ్డిగా మారింది. ఇలాంటి ఒత్తిడి చిత్తడిలో కౌమారపు స్వేచ్ఛాకాంక్ష కలలుగన్నాడు. పలవరింతల మధ్య కవిత్వం ఓదార్చింది. ఈ గడబిడల మధ్యనే పదహారో ఏట శ్యామలతో పెండ్లి జరిగింది. పేదరైతు కుటుంబంలో శ్యామల వ్యవసాయ పనుల్లో గొడ్డుచాకిరీలో ఉండగా భాస్కర్‌రెడ్డి రవీంద్రుడు, శరత్‌ కలల్లో తేలిపోతూ బెంగాల్‌లోని శాంతినికేతన్‌కు పయనమయ్యాడు. ఆయనకు కవిత్వమొక తీరనిదాహం. శాంతినికేతన్‌ ధనికులదేగాని పేదలది కాదని అర్థమ య్యింది. తిరిగి ఇంటికి చేరిండు. టీచర్‌గా ఉద్యోగం. మకాం హైదరా బాదుకు-- అక్కడ కె.యాదగిరిరెడ్డి (నిఖిలేశ్వర్‌)తో పరిచయం (1962). కనిపించే కకావికలైన జీవితాలకు వెనుకగల కారణాలేమిటో తెలియక ఒంటరిగా కవిత్వమనే కలల ప్రపంచంలో తిరుగుతున్న భాస్కర్‌రెడ్డికి అలాంటి కోపోద్రిక్త హైదరాబాదు పట్టణ జీవితం, కవుల గుంపు పరి చయమయ్యింది. పాత దారులన్నీ మూసుకుపోయి, ధ్వంసమై, కాళ్లు, కీళ్లు సడలిపోయి కదలలేని స్థితిలో ఉన్న ప్రపంచంలో ఇమడలేని యువకులు-- తీవ్రమైన కోపోద్రిక్తతలో--1965 నాటికి హైదరాబాదులో దిగంబర కవులుగా రూపొందారు. పాతదాన్ని కూలగొట్టడం, రూపొందు తున్న కొత్తదేమిటో తెలియని అసహనం చెలరేగిన ఉద్వేగాల సారాంశం వీరందరి కవిత్వ లక్షణం. అట్లా బద్దం భాస్కర్‌రెడ్డి చెరబండరాజుగా, తక్కినవారు నిఖిలేశ్వర్‌, నగ్నముని, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవ య్యలుగా తమ పేర్లు మార్చుకొని తీవ్రమైన నిరసనతో దిగంబర కవిత్వం రాసి ప్రచురించారు. నిస్తేజమైన తెలుగు సాహిత్య వాతావరణంలో పెను సంచలనం లేపారు. అందులో చెర కవిత్వం అత్యంత సాహసోపేత విస్పోటనలాంటిది. 


1970 జులై 4 నాడు విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. శ్రీశ్రీ, కొ.కు., రావిశాస్త్రి, కారా, కె.వి.రమణారెడ్డి, వరవరరావు, నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి లాంటి అనేకమంది కవులు, రచయితలు విరసాన్ని ఏర్పాటు చేశారు. చెరబండరాజు విరసం వ్యవస్థాపక సభ్యుడు. ఆ తరువాత చెరబండరాజు కవిత్వం మారిపోయింది. చెర లోలోపల రగులుతున్న లావాకు దారి దొరికింది. 1982 జూలై 2న చివరిశ్వాస ఒదిలే వరకూ చెరకు సాహిత్యమే ప్రాణం. కవిత్వం, పాట, కథ, నవల, నాటికలు, నాటకాలు... జీవితం ఎన్ని రకాలుగా మలుపులు తిరిగిందో, ఎన్ని భావో ద్వేగాలకు లోనయ్యిందో అన్నీ ఎప్పటికప్పుడు రాస్తూనే వచ్చారు. ఆ రచనే ఆయనను తన వైయక్తిక జీవితంలో నుండి -- కులాలు ఘనీభవించిన పల్లెల నుండి పట్నాలకు, గనులకు, కార్ఖానాలకు, అడవులకు చేరి లక్షలాది, కోట్లాదిమంది ప్రజలను కలిపింది. ఈ ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలో, గాయాల నొప్పులో. జైలు, అనారోగ్యం, పేదరికం ఆయనను ఆపలేకపోయాయి. పాటల కోసం, కవిత్వం కోసం మూడుమార్లు జైలు జీవితం గడిపారు. కుటుంబం కకావికలం అయ్యింది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికితోడు తీవ్రమైన అనారోగ్యం. ఒక కమ్మరి కొలిమి లాగా మండిన చెర మెదడులోని ట్యూమర్‌కు మూడుసార్లు ఆపరేషన్‌ జరగడంతో నెలల తరబడి హాస్పిటల్లో గడిపాల్సి వచ్చింది. రకరకాల సంఘర్షణాత్మక యుద్ధభూమిలో చెరబండరాజు కవిగా, నాయకుడుగా, వీరులు చరిత్ర నిర్మాతలనే భావన నుంచి ప్రజలే చరిత్ర నిర్మాతలుగా రూపొందుతున్న సంక్లిష్ట చారిత్రాత్మక స్థలంలో కాలంతోపాటు నడిచారు. 


విడిగా సంకలనాలుగా వచ్చిన చెర సాహిత్యాన్ని ఆయన మరణా నంతరం చెరబండరాజు పాటలు, కవితలు కొన్ని కలిపి పీపుల్స్‌ బుక్స్‌ పేరుతో 1982లో ఒక పుస్తకంగా అచ్చయ్యాయి. ఆ సమయంలో మొదటిసారి ఆయన సాహిత్యం చదివి ఫేర్‌ చేసే అవకాశం కేవీఆర్‌ నాకు ఇచ్చారు. అప్పుడే విరసం కత్తిపాట పేరుతో ఎంపిక చేసిన పాటల్ని ఒక సంకలనంగా తీసుకొచ్చింది. ఈ పుస్తకం ఇంగ్లీషు అనువాదం 1985లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి ప్రచురించింది. 2003లో విరసం చెరబండరాజు సాహిత్య సర్వస్వం నాలుగు సంపుటాలను ప్రచురించింది. మళ్లీ ఇప్పుడు మరోసారి ‘చెర సమగ్ర సాహిత్యం’ రెండు సంపుటాలుగా తీసుకొస్తోంది. దాదాపు 12 వందల పేజీలతో ఇప్పుడు మూడో తరం ముందుకు చెరబండరాజు సమగ్ర సాహిత్యం వస్తున్నది.


భారతదేశంలోని అర్ధవలస, అర్ధభూస్వామిక దోపిడీ, హింసాత్మక పరిస్థితుల మీద తీవ్రమైన ఆగ్రహం ప్రకటించడంతో మొదలైన చెర కవిత్వం.. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ రైతాంగ పోరాటాలు ఆరంభమైన దాకా అనేక దశలను ఆనాటి వర్గపోరాట స్థితి, చైతన్యాల మేరకు చిత్రించాయి. అనగా, తెలంగాణా సాయుధ పోరాటం అనుభవించిన ఆటుపోటులు, నక్సల్బరీ, శ్రీకాకుళాలు గడించిన అనుభవాలు, గుణపాఠాలు చెర సాహిత్యం నిండా కనిపిస్తాయి. ప్రజల దైనందిన జీవితంలోని దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పెల్లుబుకిన పోరాటాలు -- 1967 నుండి 1977 దాకా ఎన్నో తీవ్రనిర్బంధాలు, అరెస్టులు, జైళ్లు, దేశవ్యాపితంగా సుమారు 16వేలమంది యువకుల హత్యాకాండ, వేలాదిమంది యువకుల నిర్బంధం --చివరకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫాసిస్టుగా మారి విధించిన అత్యయిక పరిస్థితి.... ఇలాంటి సంక్షోభ కాలంలో మునుపెన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలో పదేళ్ళ కాలం విప్లవోద్యమం నిలదొక్కు కుని, అన్ని రకాల ప్రజల్లోకి పురోగమించింది. చెరబండరాజు ఆ సమస్త ఉద్విగ్నతలను కవిత్వీకరించారు. ఇదే ప్రయత్నంలో చెర రెండు నాటకాలు -- ‘గ్రామాలు మేల్కొంటున్నాయి’ (1974), ‘గంజినీళ్లు’; నాటికలు-- ‘పల్లె పిలుస్తోంది’ (1965), ‘వెన్నెల్లో మంటలు’, ‘ఘర్షణ’ (1971), ‘టెంపరరీ లేబర్‌’ (1973 రాసి ప్రదర్శించారు. ఈ నాటకాల్లో వస్తువు -- ముందే చెప్పుకున్నట్లు ఆ పది సంవత్సరాల విప్లవోద్యమం. 1965లో ‘పల్లె పిలుస్తోంది’ కథ నుండి ‘చిరంజీవి’ దాకా పదమూడు కథలు రాశారు. చెర రాసిన నాలుగు నవలలు ఆయన రూపొందిన క్రమాన్ని, ఆయన నివసించిన స్థలకాలాల్లో జరిగిన విప్లవోద్యమాలను మరింత విస్తృతంగా, విమర్శనాత్మకంగా రూపుకట్టాయి. నక్సల్బరీ విప్లవోద్యమం కరీంనగర్‌ -- ఆదిలాబాదు రైతాంగ పోరాటాలుగా పురోగమించడానికి ముందు నశించి పోవాల్సిన పాతకు, రూపొందవల్సిన కొత్తకు మధ్య వైరుధ్యాల ఘర్షణ - ఐక్యతలను చిత్రించాయి. 


దేశవ్యాపితంగా అనేక పరిమాణాత్మక పోరాటాలు ఉవ్వెత్తున లేస్తున్న 1967 నుండి 1977 మధ్య పది సంవత్సరాల కాలంలో -- నక్సల్బరి పంథా అనేక చర్చోప చర్చలకు, సంఘర్షణలకు లోనయ్యింది. భారతదేశ విప్లవోద్యమాల కాలంలో ఇలాంటి పది సంవత్సరాల కాలం ఒక విప్లవోద్యమం నిలదొక్కు కోవడం -- ఇదే మొదటిసారి. ఒక స్పష్టమైన వ్యూహం, ఎత్తు గడలు -- రాజకీయ తీర్మానం ఏర్పరుచుకోవడం కూడా ఈ పదేండ్ల కాలంలో జరిగిన పెను మార్పు. ఇలాంటి  సంఘర్షణాత్మక స్థితిలో చెరబండరాజు రాజకీయ ఉద్యమ కార్యకర్త, రచయిత. ఉద్యమానికి ఊపిరి అయిన పాటగాడు. కనుకనే ఆయన సాహిత్యం ఈ పది సంవత్సరాల సంఘర్షణ కాలానికి కొత్తపాతల భీకర పోరాటపు భావోద్వేగాల సృజనాత్మక వ్యక్తరూపం.


మన దేశం, మన గ్రామం, జిల్లాల లోనూ బయటా ఉన్న వాస్తవ పరిస్థితులనుంచి మొదలుపెట్టి ఊహాజనిత సూత్రాలను విడిచిపెట్టి వాస్తవ పరిస్థితుల్లో అంతర్గతంగా ఉన్న సూత్రాలను ఆచరణకు మార్గదర్శకంగా చేసుకోవాలి. అంటే మన చుట్టూ జరుగుతున్న సంఘటనలలోని ఆంత రంగిక సంబంధాలన్నీ కనుక్కోగలగాలి. ఇలాంటి గతితార్కిక పద్ధతిని అర్థంచేసుకొనే క్రమంలోనే చెర సాహిత్యం రాశారు.  


విప్లవపార్టీ--ఈ పదేళ్ళకాలాన్ని విశ్లేషించుకొని--ఆత్మ విమర్శ రిపోర్టు రాసుకొని--తన తప్పును సరిదిద్దుకొని-- 1977 తరువాత క్షేత్రస్థాయి అధ్యయనంతో, నిర్మాణంతో ఆదిలాబాదు, కరీంనగర్‌ రైతాంగ పోరాటాలుగా ఆరంభమై --పీపుల్స్‌వార్‌ పార్టీగా--మావోయిస్టు పార్టీగా గత యాభై అయిదేళ్ళుగా మూడు తరాలుగా పోరాడుతున్న సంగతి భారతీయ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మరింత తీవ్ర మైన ఉత్పత్తి శక్తుల పోరాటాలను పరిష్కరించే శక్తిలేని ప్రభుత్వం--అనివార్యంగా దేశవిదేశ దోపిడీదారులకు సమస్తం దోచిపెడుతూ ఫాసిస్టుగా మారింది. విప్లవోద్యమం జాతీయ అంతర్జాతీ స్థాయిలో దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలందరినీ సంఘటితపరిచి దేశ వ్యాపితంగా పురోగమించవల్సిన తరుణంలో నేటి మూడో తరం చెరబండరాజు రచనలను అధ్యయనం చేయడం అవసరం, అనివార్యం.

అల్లం రాజయ్య

(చెరబండరాజు 40వ వర్ధంతి సందర్భంగా జూలై 3న ఆవిష్కృతమవుతున్న చెరబండ రాజు 

సమగ్ర సాహిత్యం పునర్ముద్రణకు అల్లం రాజయ్య రాసిన ముందుమాటలో కొంత భాగం ఇది.)


Updated Date - 2022-06-27T10:29:10+05:30 IST