బీసీ గణనపై బీజేపీ వైఖరేమిటి?

ABN , First Publish Date - 2022-07-02T08:42:59+05:30 IST

దేశంలో మొదటిసారి ఒక బీసీ ప్రధాని పదవి చేపట్టినందున డెబ్బై ఏండ్లుగా తాము అనుభవిస్తున్న బాధలు తొలగిపోతాయని...

బీసీ గణనపై బీజేపీ వైఖరేమిటి?

దేశంలో మొదటిసారి ఒక బీసీ ప్రధాని పదవి చేపట్టినందున డెబ్బై ఏండ్లుగా తాము అనుభవిస్తున్న బాధలు తొలగిపోతాయని, తమ శకం ఆరంభమవుతుందని ఆ కులాల వారు సంబరపడ్డారు. గతంలో ఉన్న ప్రధానులు చేయలేని పనులు నరేంద్ర మోదీ చేస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ బీసీలకు మోదీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఏమీ చేయలేక పోయింది. బీసీల డిమాండ్లు నెరవేర్చాలని అనేకమార్లు నరేంద్రమోదీని, అమిత్‌ షాను, బీజేపీ అధ్యక్షులను కలిసి చర్చించినా, కొద్దో గొప్పో అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు గాని, అసలు పరిష్కరించవల్సిన డిమాండ్లు నేటికీ నెరవేర్చలేదు. 


కేంద్రంలో 75 మంత్రిత్వశాఖలు ఉన్నా అరవై కోట్ల మంది బీసీల సంక్షేమం కోసం ఒక్క ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు. 32 లక్షల రూపాయల కేంద్ర బడ్జెట్‌ లో బీసీల సంక్షేమానికి 1200 కోట్లకు మించి కేటాయించ లేదు. మోదీ ప్రతిరోజు స్వర్ణ భారత్‌, అఖండ భారత్‌ అంటూ ఇస్తున్న నినాదం చూస్తే ఉత్తిదే అనిపిస్తుంది. దేశంలో సగభాగం ఉన్న జనాభాను అభివృద్ధి చేయకుండా స్వర్ణ భారత్‌ ఎట్లా అవుతుంది? చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో  బిల్లు ప్రవేశపెట్టాలని దేశమంతా ఉద్యమిస్తుంటే, బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏడు శాతం జనాభా ఉన్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇడబ్ల్యుఎస్‌ పేరుతో పార్లమెంటులో చట్టం చేసి, మేమూ మళ్లీ వాళ్ళ పక్షమే అని నిరూపించుకుంది.


బీసీ కులాల లెక్కలు తీయాలని దేశవ్యాప్తంగా ఉద్యమిస్తుంటే, ఒకే దేశం - ఒకే విధానం అన్న బీజేపీ బీసీ గణన విషయంలో ఒకే పార్టీ–రెండు విధానాలు అవలంబిస్తోంది. 2011 సంవత్సరంలో జాతీయ జనగణనలో బీసీ గణన కూడా చేపట్టాలని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్లమెంటులో సమర్ధిస్తూ మాట్లాడింది. తీరా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి చేస్తామని, ఇంకొకసారి చేపట్టబోమని చెప్పి ఒక పార్టీ–రెండు విధానాలు అని చెప్పకనే చెప్పింది. బీసీ గణన లేకపోవడం మూలంగా దేశంలో ప్రస్తుతం అమలవుతున్న బీసీ రిజర్వేషన్లకే ఎసరు వచ్చింది. లెక్కలు తేలనందున రిజర్వేషన్ల మెడమీద సుప్రీంకోర్టు కత్తి వేలాడదీసింది. ఈరోజు సామాజిక రిజర్వేషన్లు తుమ్మితే ఊసిపోయే ముక్కులా తయారయ్యాయి. ఇతర సామాజిక వర్గాల వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం 27 శాతం అత్తెసరు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇందులో కూడా ఏ వర్గానికి లేని క్రిమీలేయర్‌ను బీసీలపై విధించి, కాస్తో కూస్తో అమలవుతున్న రిజర్వేషన్లకు గండికొట్టింది. కేంద్రీయ విద్యాలయాలలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రిమీలేయర్‌ మూలంగా బీసీలకు ఈరోజు 13 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. దీని మూలంగా ఇప్పటివరకు మెరిట్‌ ఉండి, సెలెక్ట్‌ అయిన 250 మంది ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కాకుండా పోయారు. కనీసం క్రిమీలేయర్‌ ఆదాయ పరిమితిని ఇరవై లక్షలకు పెంచాలని బీసీలు కోరుతున్నా, ఇంతవరకు అది కూడా పెంచ లేదు.


దేశంలో బీసీల బతుకులు మార్చడానికి బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి బి.పి మండల్‌ నేతృత్వంలో వచ్చిన మండల్‌ కమిషన్‌ 42 సిఫార్సులు చేస్తే, రాజవంశీయుల కుటుంబం నుంచి వచ్చిన వి.పి సింగ్‌ తన ప్రధాని పదవి త్యాగం చేసి మరి 1992లో ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మిగిలిన 41 సిఫార్సులను ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మేము వేలమందితో ఎన్నో పర్యాయాలు ‘ఛలో పార్లమెంటు’ చేపట్టి ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు చేశాం. దాంతో బీజేపీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత, నల్సార్‌, సైనిక్‌ స్కూల్స్‌లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, నీట్ (ఆల్‌ ఇండియా మెడికల్‌ ఎగ్జామ్స్‌)లో కూడా 27 శాతం రిజర్వేషన్లు, కేంద్ర క్యాబినెట్‌లో 27 మంది ఓబీసీలకు మంత్రులుగా అవకాశం కల్పించింది. 


అతి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించడానికి ఇప్పటికైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం, భారతీయ జనతాపార్టీ హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో బీసీ పాలసీపై చర్చించి, అమలుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే దేవుడి పేరుతో, మతం సెంటిమెంటుతో ఓట్లు పడతాయి మూడవసారి కేంద్రంలో, త్వరలో తెలంగాణలో అధికారంలో వస్తామనుకుంటే అది భ్రమ మాత్రమే అవుతుంది. బీసీలకు దేవుడు, మతం ఎంత ముఖ్యమో, అంతకంటే జాతి ముఖ్యమనే విషయాన్ని బీజేపీ పెద్దలు గ్రహించాలి. భారతదేశం ప్రపంచంలో అగ్రదేశం కావాలన్నా, అఖండ భారత్‌, స్వర్ణభారత్‌ కావాలన్నా దేశంలో సగభాగం ఉన్న బీసీల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. 


ఈ నెల 2, 3తేదీలలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలలో బీజేపీ అధిష్ఠానం, ప్రధాని మోదీ బీసీల పక్షాన నిలబడతారని ఆశిస్తున్నాం.


జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2022-07-02T08:42:59+05:30 IST