న్యూస్ ఛానెళ్ళకి ‘నూపుర్’ పాఠాలు..!

ABN , First Publish Date - 2022-06-17T06:31:37+05:30 IST

ప్రవక్త మహమ్మద్‌పై నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం అనంతరం ఇండియన్ టెలివిజన్ న్యూస్ మీడియాను అటు వామపక్షాలు, ఇటు మితవాద పక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న శక్తులకు...

న్యూస్ ఛానెళ్ళకి ‘నూపుర్’ పాఠాలు..!

ప్రవక్త మహమ్మద్‌పై నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం అనంతరం ఇండియన్ టెలివిజన్ న్యూస్ మీడియాను అటు వామపక్షాలు, ఇటు మితవాద పక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న శక్తులకు న్యూస్ టెలివిజన్ వేదిక అవుతున్నదని వామపక్ష–ఉదారవాద శ్రేణులు వాదిస్తున్నాయి. మితవాదులేమో, ముఖ్యంగా హిందూత్వ అనుయాయులు ముస్లిం సంకుచితత్వ వాదులకే న్యూస్ టీవీ ఎక్కడలేని ప్రాధాన్యమిస్తోందని ఆరోపిస్తున్నారు. నిజమేమిటి? 


తొలుత వామపక్ష–ఉదారవాద వాదనలను చూద్దాం. న్యూస్ టీవీ విద్వేషాలను రెచ్చగొడుతుందా? అవును అనేదే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం. మతతత్వ విషం చిమ్మేవారికి ఇంతకు ముందుకంటే ఇప్పుడు మరింత తోడ్పాటు లభిస్తోంది. ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్ గుత్తాధిపత్యానికి 1990ల్లో తెరపడింది. కొత్తగా ప్రభవించిన ప్రైవేట్ న్యూస్ టీవీ తన తొలి సంవత్సరాలలో నేడు మనం చూస్తున్న తీవ్ర పోటీలో చిక్కుకోలేదు. హద్దులు లేని ఈ పోటీలో ‘బ్రేకింగ్ న్యూస్’ భావన ఎలా వికృతమయిపోయిందో మనకు తెలుసు. సాపేక్షంగా నవీన రంగమైన న్యూస్ టీవీలో భాగస్వాములు అయిన న్యూస్ ఎడిటర్లు, విలేఖర్లు మార్కెట్ ఒత్తిళ్లకు లోనుకాకుండా పాత్రికేయ విలువలకు ఎనలేని ప్రాధాన్యమిచ్చేవారు. మరి ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ సంఖ్య నాలుగు వందలకు పైగా ఉంది. రేయింబవళ్లు అవి ఎక్కడెక్కడి వార్తలను అందిస్తున్నాయి. రంగంలో ఉండాలంటే ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలను అందించి తీరాలి. వీక్షకులను ఆకట్టుకునే ఉన్మాద పోటీలో అగ్రగామిగా ఉండేందుకై అవి సంయమనం లేకుండా సంచలనాన్ని సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నాయి. 


ఈ పరిణామం వర్తమాన న్యూస్ టీవీ తీరుతెన్నులలో సంపూర్ణంగా ప్రతిబింబిస్తోంది. తీవ్ర వాదోపవాదాలతో ఉత్కంఠభరితంగా జరిగే చర్చే వార్తా నివేదనకు తక్కువ వ్యయంతో అధిక ప్రభావశీల మార్గంగా నేటి న్యూస్ టీవీ పరిగణిస్తోంది. క్షేత్ర స్థాయిలో వార్తా సేకరణ ఒకప్పుడు న్యూస్ టీవీకి ప్రాథమిక వార్తా వనరుగా ఉండేది. అయితే ఇప్పుడు సర్వజ్ఞాన సంపన్నులయిన యాంకర్లతో కూడిన టీవీ స్టూడియో ప్రాబల్యం వహిస్తోంది. అయితే వార్తలకు కాకుండా అనుక్షణం గడబిడ జరిగే ప్రదేశంగా మాత్రమే అది ఉంటోంది. ‘చర్చ’ స్వభావ స్వరూపాలు కూడా నాటకీయంగా మారిపోయాయి. 1990ల్లో నేను ఒకసారి మేధావి అయిన కాంగ్రెస్ నాయకుడు విఎన్ గాడ్గిల్‌ను చర్చకు ఆహ్వానించాను లౌకికవాదంపై ఆయన రాసిన ఒక వ్యాసమే ఆ చర్చకు ప్రాతిపదిక. గాడ్గిల్‌తో వాద ప్రతివాదాలు చేసేందుకు మరో అగ్రశ్రేణి మేధావి అరుణ్ శౌరీని ఆహ్వానించాను. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ చర్చలో పాల్గొనేందుకు గాడ్గిల్ మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. ఒక అంశంపై సుదీర్ఘ చర్చకు గరిష్ఠంగా ఇద్దరు లేదా ముగ్గురు ప్రముఖులను మాత్రమే ఆహ్వానించడం పరిపాటిగా ఉన్న కాలమది. మరి ఇప్పుడో? ఏ చర్చనైనా తీసుకోండి. టీవీ తెరపై పది తలకాయలు తప్పక కనిపిస్తుంటాయి. వారి వాదోపవాదాలు హుందాగా జరుగుతుంటాయా? లేదు. ఒకరిపై ఒకరు అరుచుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థంకాదు. ఈ తరహా చర్చలనే నేను ‘రావణ’ స్కూల్ ఆఫ్ టాకింగ్ హెడ్స్ జర్నలిజం అని అన్నాను (వీక్షకులతో నేరుగా మాట్లాడే టీవీ యాంకర్, చర్చలో పాల్గొనే వ్యక్తుల శరీర పై భాగాలు తలలు మాత్రమే కన్పించే దృశ్యాలనే టాకింగ్ హెడ్స్ అని వ్యవహారికంగా అంటారు) మరి మృదుభాషి అయిన గాడ్గిల్ మహాశయుడు నేటి టీవీ చర్చలను చూసి ఏ విధంగా ప్రతిస్పందిస్తారో అని ఆశ్చర్యపడుతుంటాను.


టాకింగ్ హెడ్స్ టీవీ కేవలం భారత్‌కు మాత్రమే పరిమితమైన ప్రసార రంగపు దృగ్విషయం కాదు. అది ప్రపంచవ్యాప్త పరిణామం. అన్ని దేశాలలోనూ సంప్రదాయ పద్ధతుల్లో వార్తా సేకరణలో మదుపులు క్రమంగా తగ్గిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు వంటి అంశంపై అర్థవంతమైన చర్చల కంటే మత సంబంధిత అస్తిత్వాలపై విభేదాలను ప్రజ్వరిల్లింప చేసే చర్చలే అత్యధిక వీక్షకులను ఆకట్టుకుంటాయని ప్రతి టీవీ ఛానెల్ విశ్వసిస్తున్న రోజులివి. ఒక ఛానెల్ ప్రజాదరణను అంచనా వేసేందుకు లోపభూయిష్ట టెలివిజన్ రేటింగ్ పాయింట్ (టిఆర్‌పి) కేంద్రిత నమూనాను అనుసరించడమే ఈ పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు. వినియోగదారు ద్రవ్యోల్బణం గత నెలలో ఎనిమిది సంవత్సరాల గరిష్ఠానికి పెరిగిన రోజున చాలా ఛానెల్స్ తమ ప్రైమ్‌టైమ్ కార్యక్రమాలలో ఈ అత్యంత ముఖ్య సంఘటనను ఉపేక్షించి జ్ఞానవాపి మసీదు వివాదానికి ప్రాధాన్యమిచ్చాయి. నైతిక భ్రష్ట వార్తావరణంలో ప్రాథమ్యాలు ఎంత వక్రంగా ఉంటున్నాయో ఈ విషయం తేటతెల్లం చేయడం లేదా? ఫాక్స్ న్యూస్ ఆన్‌ స్టెరాయిడ్స్’ అనే వార్త నివేదన నమూనా– ‘విద్వేషం నుంచి లబ్ధి’ పొందడంలో పథగామి అయిన ఫాక్స్ టీవీ నెట్‌వర్క్ వార్త సేకరణ, నివేదనకు అనుసరించే పద్ధతులను అలా ప్రస్తావించడం కద్దు–లో పాత్రికేయ విలువల కంటే వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోంది.


ఈ శోచనీయ పరిస్థితులకు న్యూస్ రూమ్ ఎడిటర్లనే తప్పుపట్టడమెందుకు? విద్వేష ప్రసంగాలు సాధారణమైపోయిన సంఘర్షణాయుతమైన సమాజం, రాజ్య వ్యవస్థల విషమ వాస్తవాలనే న్యూస్ రూమ్ ప్రతిబింబిస్తోంది. న్యూస్ ఛానెల్స్ ‘విద్వేషాన్ని’ ఉత్పత్తి చేసి వ్యాపింపచేస్తున్నాయని ఆరోపిస్తున్నవారు, నూపుర్ శర్మ లాంటివారు ‘అప్రధాన’ వ్యక్తులు కాదనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పేర్కొన్నట్టుగా వారు ‘అప్రధాన’ శక్తులా? కానేకాదు. భారతదేశ అధికార పార్టీ ప్రధాన రాజకీయ స్రవంతికి నూపుర్ శర్మ లాంటివారు ప్రతినిధులు. అయినా మోదీ సర్కార్ వారిని అలా అభివర్ణించడమంటే చిత్తశుద్ధిరాహిత్యం మినహా మరేమీకాదు. నూపుర్ అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు టీవీ చర్చ వాదోపవాదాల వేడిలో చేసి ఉండవచ్చు. అయితే ఆమె వ్యక్తం చేసిన ముస్లిం వ్యతిరేక భావాలు, అభిప్రాయాలు సంఘ్ పరివార్ ముఖ్య విశ్వాసాలను ప్రతిబింబించడం లేదా? ఇప్పుడు వారందరూ ఆ విశ్వాసాలను దాదాపుగా నూపుర్ వ్యక్తీకరించిన తీరులోనే వ్యక్తీకరించడం లేదా? రాజకీయవేత్తలు, ముఖ్యంగా బీజేపీకి చెందినవారు ఉద్రేక జనిత భాషను ఉపయోగించడం 2014 నుంచి గణనీయంగా పెరిగిపోయిందని విద్వేష ప్రసంగాల ధోరణులను గమనిస్తున్న ఒక పరిశోధకుడు ఈ ఏడాది తొలి నెలలోనే ధ్రువీకరించారు.


సరే, ఇప్పుడు మితవాదుల ఫిర్యాదును పరిశీలిద్దాం. న్యూస్ టీవీ తమ దృక్పథానికి సరైన ప్రాధాన్యమివ్వడం లేదనేది వారి ఆక్షేపణ. సరిగ్గా ఇటువంటి వాదనతోనే అమెరికాలో ఒక దశాబ్దం క్రితం ఫాక్స్ న్యూస్ ప్రభవించింది వామపక్ష–ఉదారవాద భావాలు, అభిప్రాయాలకు విరుద్ధమైన వాదాలకు అది ప్రాధాన్యమిచ్చింది. వార్తలను నిష్పాక్షికంగా, యుక్తియుక్తంగా నివేదించడమే తమ ధర్మ సూత్రమని ఫాక్స్ టీవీ ప్రకటించింది. తీరా మితవాద ఎజెండాకు అనుకూలంగా ఉండేవారికి మాత్రమే అది ప్రాధాన్యమిచ్చింది! మన దేశంలో కూడా న్యూస్ మీడియాను నియంత్రిస్తున్న వామపక్ష–ఉదారవాద శ్రేణుల నియంత్రణలో ఉన్న న్యూస్ మీడియా ప్రత్యామ్నాయ భావాలు, అభిప్రాయాలను చులకన చేస్తుందనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. మితవాద రాజకీయ పక్షాల ఉత్థానంతో మీడియాలో సంప్రదాయ రాజకీయ సవ్యతకు కట్టుబడని వాటి అభిప్రాయాలకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది.


ఈ వాదన కొంతవరకు మాత్రమే న్యాయమైనది. భారతీయ మీడియా చాలా వరకు హిందూత్వ భావజాలం పట్ల జాగ్రత్త వహిస్తూ వచ్చింది. నిజానికి తోసిపుచ్చింది కూడా. అయితే 1992 అనంతరం భారత రాజకీయాలలో బీజేపీ ప్రధాన శక్తిగా ఆవిర్భవించడంతో మీడియా వైఖరిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. గతంలో మీడియా కథనాల రీతి రివాజులను వామపక్ష– ఉదారవాదులు నిర్దేశించేవారు. ఇప్పుడు వారి స్థానంలో మితవాద పక్షాల మద్దతుదారులు న్యూస్ రూమ్‌లలో నాయకత్వ స్థానాలలో ఉన్నారు.


నూపుర్ శర్మ సంచలనం న్యూస్ టీవీకి ఒక మేలుకొలుపు, సందేహం లేదు. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో అంతకంతకూ పెరుగుతోన్న సామాజిక మాధ్యమాల ప్రభావ ప్రాబల్యాలే మీడియా జగత్తు పోకడలను నిర్ణయాత్మకంగా నిర్దేశిస్తున్నాయనడంలో కూడా మరో అభిప్రాయం లేదు. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ గురించి ఏమిని అభివర్ణించాడు? ‘మానవాళి భవిష్యత్తుకు అతి ముఖ్యమైన విషయాలను చర్చించే డిజిటల్ టౌన్ స్క్వేర్’ అని కదా. చాలా ఘనమైన మాటలు సుమా! అయితే వాక్ స్వాతంత్ర్యం పేరిట తరచు విద్వేష ప్రసంగాలు అడ్డు అదుపులేకుండా సాగే ఒక భయ విహ్వల ప్రదేశపు వాస్తవ స్థితిని గురించి తప్పుడు భావాన్ని కల్పిస్తున్న వర్ణన అది. నేడు చాలా న్యూస్ ఛానెల్స్ ట్విట్టర్ ట్రెండ్స్‌ను అనుసరిస్తున్నాయి. వాటి ప్రైమ్‌టైమ్ ఎజెండాను డిజిటల్ జగత్తులోని కోలాహలమే నిర్దేశిస్తోంది. విచారకరమైన విషయమేమిటంటే ఈ ప్రజావరణంలో, సువ్యవస్థిత రాజకీయ పోకిరీ సైన్యాలతో సహా ప్రతి ఒక్కరూ ఎంతసేపూ దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉంటారు. మరి అన్నదాత ఆత్మహత్యల కంటే వారణాసి జ్ఞానవాపి మసీదులో కనిపించిందని చెబుతున్నది శివలింగమా లేక నీటిని విరజిమ్మే యంత్రమా అన్న చర్చే ప్రాధాన్యం పొందడంలో ఆశ్చర్యమేముంది?


రాజ్‌దీప్‌ సర్దేశాయి 

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2022-06-17T06:31:37+05:30 IST