పోరాటం ఎట్లాగూ లేదు, కనీసం ఆరాటమూ లేదు!

ABN , First Publish Date - 2022-08-04T06:42:26+05:30 IST

ఆటల్లో ‘అండర్ డాగ్స్’ను అభిమానించడం వేరు. గెలిచే అవకాశాలు లేవనుకుని రంగంలోకి దిగినా, పోరాడే ఆటగాళ్లు అప్పుడప్పుడు అద్భుతాలు సృష్టిస్తారు...

పోరాటం ఎట్లాగూ లేదు, కనీసం ఆరాటమూ లేదు!

ఆటల్లో ‘అండర్ డాగ్స్’ను అభిమానించడం వేరు. గెలిచే అవకాశాలు లేవనుకుని రంగంలోకి దిగినా, పోరాడే ఆటగాళ్లు అప్పుడప్పుడు అద్భుతాలు సృష్టిస్తారు. సమాజంలో అభాగ్యులు, అంచుల్లో ఉండేవారిని ప్రేమించడం వేరు. నిస్సహా యులు, నివురు గప్పిన నిప్పులు. కానీ, చేతగాక, చేవచచ్చి, ముడుచుకుపోయి మూలుగుతూ ఉండే వారి మీద ఇంకా ఆశపెట్టుకుని ఉండడం కష్టం. ఉదాహరణకు, భారత జాతీయ కాంగ్రెస్. అది అంతులేని పతనగతిలో పడి దొర్లుకుంటూ పోతున్నది. దాన్ని చూస్తే జాలి వేసే మాట నిజమే కానీ, ఆశ కలగడం కష్టం. 


భారత జాతీయోద్యమానికి తాను నాయకత్వం వహించానని, బ్రిటిష్ వాడి అప్పగింతలకు తానే స్వీకర్తనని, ఆ పార్టీ అధ్యక్షురాలికి గుర్తున్నట్టు లేదు. ఈడీ ఆఫీసులకు తిరగవలసివచ్చిన దుఃఖంలో తల్లీ కొడుకులిద్దరూ తారీఖులు కూడా మరచినట్టున్నారు. లేకపోతే, స్వాతంత్ర్య అమృతోత్సవాన్ని, జాతీయపతాకాన్ని, పింగళి వెంకయ్యను కూడా నరేంద్రమోదీకి అప్పగించి, ఏమి చేస్తున్నట్టు? వీధులు వెలిగించాలని, కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వాలలో ఉన్న వాళ్లు చెబుతారు, కానీ, ఇళ్ల మీద జెండా ఎగరేయాలని, డిస్‌ప్లే పిక్చర్లు పెట్టుకోవాలని చెప్పకపోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది? ఉన్మాదపు దేశభక్తో, తీవ్రజాతీయతో కాదు కదా, భారత స్వాతంత్ర్యానికి 75ఏండ్లు నిండిన సందర్భం, నువ్వు చెప్పుకునే లౌకిక ఉదారవాదానికి తగ్గట్టుగానే, ఆచరణకు అవకాశం కదా? నీ పార్టీకి, నీ అభిమానులకు, నీ ప్రజలకు ఏదో ఒక కార్యక్రమం ఇవ్వాలి కదా? ఇంతటి అగమ్య గోచరతలో ఉన్న పార్టీ, ప్రత్యామ్నాయంగా నిలబడగలదా? ఒకరోజు ఆలస్యంగా మేలుకొన్నా, అట్టహాసపు కార్యక్రమాలతో కెసిఆర్ ముందుకు వచ్చాడు కదా, మీకెందుకు మెలకువ రాదు మేడమ్?


ఫలానా పార్టీకో, ఫలానా నాయకుడికో ఎదురులేదన్న వాతావరణం, ఆ ఎదురులేని తనాన్ని మరింత పెంచి పోషిస్తుంది. అట్లాగే, ఒక పార్టీ, ఒక నాయకత్వం వీగిపోతున్నదని పదే పదే కలిగే అభిప్రాయం, ఆ పతనాన్ని మరింతగా పెంచుతుంది. ఈ క్రమం ఎక్కడో తెగిపోకపోతే, బాహుబలి బాహుబలిగానే, అల్పజీవి అల్పజీవిగానే నిరంతరం మిగిలిపోతారు. కాంగ్రెస్ ప్రాభవం వెలిగిపోతున్న రోజులలో దాని రాజకీయాలను తీవ్రంగా విమర్శించి, ఒక్కసారి కూడా ఓటు వేయనివారు కూడా, ఇప్పుడు దాని దీనత్వాన్ని చూసి కలత చెందుతున్నారు. అది ఆ పార్టీ మీద ప్రేమ కాదు. ఎంపికకు అవకాశం లేని ఏకపక్షంలో ఉండే ఊపిరాడనితనం. హిందూత్వ రాజకీయాలను, అవి కల్పిస్తున్న సాంఘిక వాతావరణాన్ని, విభజనలను ఇష్టపడని వారు, కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనపడని నిరాశలో పడిపోయారు. భావపరమైన ఘర్షణలు, చర్చలు కొన్నికొన్ని వేదికల మీద, సమూహాలలో జరుగుతుంటాయి కానీ, అవి వాస్తవికతలోకి అనువదితం కావడం లేదు. క్షేత్రస్థాయి యుద్ధం ఏకపక్షంగానే కనిపిస్తున్నది. 2024 కూడా ఇంతే. ఆ తరువాత కూడా అంతే.


సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా, ‘నేషనల్ ఇంటరెస్ట్’ అన్న శీర్షికతో రాసే తన కాలమ్‌లో ఈ మధ్య మూడు భాగాల చర్చ ఒకటి చేశారు. బిజెపి ఎదురులేని తనం నుంచి నిష్కృతి ఉన్నదా అన్న ప్రశ్న వేసుకుని, లేదు, లేదు, ఉన్నది అని మూడు సమాధానాలు చెప్పారు. పాత పద్ధతులు, పాత ఆలోచనలు మానుకోకుంటే బిజెపికి ఎదురు ఉండదని, కొత్త వాదనలతో హిందువులను ఆకట్టుకుంటే ఫలితం ఉంటుందని శేఖర్ గుప్తా ప్రతిపాదన. మోదీ, షా ద్వయం జనాకర్షణ, వ్యూహరచనల మీద గుప్తాకు అమితమైన ఆరాధన. వామపక్షాలు, వారిపక్కనే ఉండే ఉదారవాదుల కారణంగా, భారతీయ జనతాపార్టీ-, ఆర్ఎస్ఎస్ వాదనలకు బలం చేకూరిందని, కుడివైపున ఉండే ఉదారవాదులను పట్టించుకుని ఉంటే, దేశగమనం మరో రకంగా ఉండేదని ఆయన అంటుంటారు. మోదీ ఆకర్షణీయ సమర్థతను విశ్లేషించి, ప్రశంసించడం ద్వారా శేఖర్ గుప్తా దాని కొనసాగింపునకు సహాయపడుతున్నారేమో తెలియదు కానీ, ఆయన పరిశీలనలు ఆసక్తికరంగా ఉంటాయి. బిజెపిని నిలువరించడం సాధ్యమేనని, ఆ పార్టీ విజృంభణలో భాగంగా దేశంలో ఏర్పడుతున్న వాతావరణాన్ని నిరోధించడం అవసరం కూడానని ముగింపు పలికిన ఈ వ్యాసాలు, ప్రధానంగా కాంగ్రెస్‌ను, దాని సహపక్షాలను ఉద్దేశించి రాసినవే.


ముస్లిముల ఓట్లను సంఘటితపరచి, హిందువుల ఓట్లను వివిధ సామాజిక అస్తిత్వాల పేరుతో చీల్చిన సోకాల్డ్ సెక్యులర్ రాజకీయాలు పనిచేయవని, బిజెపి ఇప్పుడు హిందువుల ఓట్లను సంఘటిత పరచి, ముస్లిముల ఓట్లను చీల్చే వ్యూహరచనలో ముందుకు వెడుతున్నదని శేఖర్ గుప్తా రాశారు. తెలుగు రాష్ట్రాలకు చెంది బిజెపి పార్టీ యంత్రాంగంలో ప్రముఖ పాత్ర వహించిన ఒక నాయకుడు, ఇవే మాటలను కొంతకాలం కిందట అన్నాడు. వెనుకబడిన కులాలు, ప్రాంతం, మైనారిటీ మొదలైన అస్తిత్వాలతో రాజకీయాలు నెరుపుతున్న పార్టీలన్నీ బలహీనపడడం చూస్తున్నాము. ఇంకా బలహీనపడని ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా గుడులు కట్టడమో, గుడులకు వెళ్లడమో చేయకతప్పడం లేదు. కేంద్రీకృత పరిపాలన, జాతీయవాదం బలపడుతున్నాయి. ఆర్థికంగా కష్టనష్టాలు కలుగుతున్నా, దేశాధినేత మీద అభిమానం తగ్గడం లేదు. గిన్నెలు పళ్లేలు మోగించమన్నా, జెండాలు ఎగరేయమన్నా ముచ్చటపడి మరీ పాటిస్తున్నారు. దీన్నంతటినీ తిరుగుముఖం పట్టించడం చిన్న పనేమీ కాదు. కొత్తగా అస్తిత్వం సమకూర్చుకున్న హిందువులను సంతృప్తిపరచడం, సహజీవనంలోనే సామరస్యంలోనే హిందూ విలువలున్నాయని, విభజనవాదం, ద్వేషం హైందవానికి వ్యతిరేకమని హిందూ సమాజాన్ని ఒప్పించగలిగినవారే బిజెపికి ప్రత్యామ్నాయం కాగలరని శేఖర్ గుప్తా రాసినదాన్ని పూర్తిగా ఆమోదించడం కానీ, మారిన పరిస్థితుల గురించి అతని విశ్లేషణను పూర్తిగా నిరాకరించడం కానీ చేయలేము.


2014 నాటికి నరేంద్రమోదీ వెనుక గుజరాత్ అభివృద్ధి నమూనా ఆర్భాటపు ప్రచారమూ, లోపాయికారీగా మైనారిటీలను దారికి తెచ్చిన కీర్తీ రెండూ ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ ఆ ఎన్నికలలో హిందూత్వ పేరుతో పోరాడలేదు. యుపిఎ దుష్పరిపాలన నుంచి మంచిరోజులు కావాలని ఓటర్లు అనుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో, హిందూత్వ బలపడిన తరువాత కూడా, ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉన్నది. మతతత్వాన్ని వ్యతిరేకించడం, తమ బ్రాండ్ లౌకికవాదాన్ని సమర్థించుకోవడం రాజకీయరంగంలో ప్రతికూలతను ఇస్తుంది అనుకుంటే, కేవలం ప్రజాజీవన సమస్యల మీద కూడా ప్రతిపక్షాలు పోరాడి బలపడవచ్చు. ఎన్నికల రంగంలో విజయమే కీలకం అని నమ్మినప్పుడు దానికి అవసరమైన వ్యూహమేదో అనుసరించాలి. ప్రత్యర్థి బలపడడానికి ఉపయోగపడకుండా వేయగలిగే అడుగులు, ఎత్తుగడలేవో అన్వేషించాలి. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ముస్లిములలోని వెనుకబడిన శ్రేణుల మీద దృష్టి పెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా మోదీ అట్టడుగు ముస్లిమ్‌లను ఆకట్టుకోవడం గురించి చెప్పారు. తమ ఓటర్ల సామాజిక అమరిక ఏమిటి, దానిని ఎట్లా పెంపొందించుకోవాలి, ఎట్లా సవరిం చుకోవాలి అన్న అంశాల మీద ‘సెక్యులర్’ పార్టీలేవీ దృష్టి పెట్టడం లేదు. సెక్యులర్ మధ్యేవాద పార్టీల నుంచి ముస్లిమ్ ఓటర్లు వలసపోతున్నారు, మరి కొందరు బిజెపిని ఆశ్రయిస్తున్నారు. ఆదివాసులలో బిజెపి జైత్రయాత్ర సాగుతూనే ఉన్నది. 


ప్రత్యామ్నాయం కావడం అటుంచి, కేసుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడుకోవడమే ముఖ్యమయ్యే పరిస్థితి ఏర్పడితే, బిజెపియేతర పక్షాలకు మనుగడ కూడా ఉండదు. అనేక రాష్ట్రాలలో ఉనికిలో ఉన్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థి హోదాలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ పార్టీ తనను తాను కాపాడుకోవాలి. దయనీయమైన, నిరాశజనక పరిస్థితి నుంచి తనను తాను ఉద్ధరించుకోవాలి. స్వతంత్ర భారతం మూడు పాతికలు దాటబోతున్న సందర్భంగా, విశేష విలువలేవీ మిగలకున్నా, జాతీయోద్యమ అవశేషంగానైనా ఆ పార్టీ మిగలాలని, అంతరించి పోకూడదని కోరుకోవలసి వస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అధికారపక్షంతో పాటు, ప్రతిపక్షాన్ని కూడా కలిగి ఉండే హక్కు ఉన్నది. ప్రత్యామ్నాయాన్ని నిలుపుకునే హక్కు ఉన్నది. మన్ను తిన్న పాములాగా ఉండకండి, ప్రయత్నించి అధికారం అందుకోండి అని జనమే చెప్పవలసి రావడం విషాదం. ఒకనాడు అవినీతికి, పెత్తనానికి, నియంతృత్వానికి పేరుపొందిన పార్టీనే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపించడం చారిత్రక విచిత్రం.


కె. శ్రీనివాస్

Read more