దారులు మూసుకున్నప్పుడు, తెరచుకున్న కొత్త కిటికీ!

ABN , First Publish Date - 2022-08-11T09:59:50+05:30 IST

ఎంత మొహం వాచి ఉన్నారంటే, ఎంతగా ఆవురావురుమంటున్నారంటే, పగటి కలకు కూడా పరవశించిపోతున్నారు.

దారులు మూసుకున్నప్పుడు, తెరచుకున్న కొత్త కిటికీ!

ఎంత మొహం వాచి ఉన్నారంటే, ఎంతగా ఆవురావురుమంటున్నారంటే, పగటి కలకు కూడా పరవశించిపోతున్నారు. చిన్నగాలి తరగ వీయగానే ప్రభంజనాలను ఊహించుకుంటున్నారు. గాలిమేడలు, స్వర్గానికి నిచ్చెనలు, చిటెకెల పందిళ్లు, ఆశల సరంజామా అంతా సిద్ధమయిపోతోంది! ఒక్క ఫిరాయింపుతో, దశ తిరిగిపోయినంత తబ్బిబ్బు కలుగుతోంది!! వారిదేమీ తప్పు లేదు, అంతటి ఉక్కపోతలో, అంతటి అంధకారంలో, అంతటి దాహంలో ఉన్నారు మరి! కుక్కతోకో గడ్డిపోచో తెలియదు కానీ, వరద గోదావరిని ఎదురీదగలమని ఉత్సాహపడుతున్నారు!


దేవెగౌడ భళిభళి, శరద్ పవార్ జయహో, స్టాలిన్ ఓహో, మహబూబా ముఫ్తీ ఆహా.. ఇట్లా ఒక్కొక్కరు నితీశ్ కుమార్‌కు జేజేలు పలుకుతున్నారు. మూడోసారి కూడా మోదీ ఖాయం అనుకుంటున్న అంచనాలు బద్దలయ్యాయని విశ్లేషకులు ఢంకా బజాయిస్తున్నారు, లెక్కలు వేసి మరీ, బిజెపికి గండం తప్పదని జోస్యం చెబుతున్నారు. ఇంతకూ, ఇది కలకలమేనా, సంచలనం మాత్రమేనా?


నితీశ్ కుమార్ ఆరితేరిన ద్రోహి అని బిహార్ బిజెపి వ్యాఖ్యానించింది. ద్రోహం అవునో కాదో కానీ, అటు నుంచి ఇటుకు, ఇటు నుంచి అటుకు దూకడంలో ఆయన ఆరితేరినవాడే. రెండు దశాబ్దాలుగా నితీశ్ కుమార్ ఆడుతూ వస్తున్న రాజకీయ క్రీడలో ఫిరాయింపు ఒక ముఖ్యమైన నైపుణ్యం. అది పార్టీలు మార్చే రకం ఫిరాయింపు కాదు. తన పార్టీ చేసే స్నేహాలను ఆయన మారుస్తూ ఉంటాడు. బిజెపితో స్నేహం చేయడానికి ఆయనకు అభ్యంతరం లేదు. సమతాపార్టీ కాలం నుంచి జార్జి ఫెర్నాండెజ్ వేసిన తోవ అది. రామ్‌మనోహర్ లోహియా కుదురు నుంచి ప్రయాణిస్తూ వచ్చిన సోషలిస్టులు, బిజెపితో స్నేహం చేసే సోషలిస్టులు, చేయని సోషలిస్టులుగా చీలిపోయారు. నితీశ్ కుమార్ రెండు రకాలుగానూ ఉండగలరు. ఒకప్పుడు ఆయనకు బిజెపి మీద కోపం రావడానికి కారణం, నరేంద్రమోదీని తమ ప్రధాని అభ్యర్థిగా ఆ పార్టీ ఎంపిక చేయడం. తనను తాను ప్రధాని అభ్యర్థిగా పరిగణించుకోవడం అందుకు ఒక నేపథ్యం. మరొకటి, మోదీ పేరు గుజరాత్ హింసతో ముడిపడి ఉండడం. కొంతకాలానికి, మోదీని క్షమించి, తిరిగి బిజెపితో జట్టు కట్టారు. మోదీ మీద కోపం వచ్చినప్పుడల్లా, తన పూర్వ సహచరుడు లాలూ ప్రసాద్ రాష్ట్రీయ జనతాదళ్‌కు స్నేహహస్తం చాస్తారు. ఇప్పుడు కూడా నితీశ్ కుమార్ చూపుతున్నది బిజెపిపై కోపం మాత్రమేనా? అంతకు మించిన గంభీరమైన పరమార్థం ఇందులో ఉన్నదా?


రాజకీయ నైతికత గురించి నితీశ్ కుమార్‌కు పెద్ద పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చును కానీ, మంచి పరిపాలకుడు అని పేరుతెచ్చుకున్న ‘కొత్తతరం’ ముఖ్యమంత్రులలో ఆయన ఒకరు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పరిపాలనలతో పోల్చినప్పడు నితీశ్ మరింత ప్రస్ఫుటంగా మెరుగుగా కనిపించేవారు. బిహార్‌లో ఉండిన అరాచక సామాజిక స్థితిగతులలో కొంత మార్పు రావడానికి నితీశ్ పాలన కూడా కారణం. బిజెపితో చెలిమిచేసి, అధికారాన్ని పంచుకున్నాడు కానీ, బిజెపి భావజాలం సామాజిక రంగంలో తీవ్రప్రభావం వేయకుండా నియంత్రించగలిగాడు. ఉత్తరప్రదేశ్‌కు, బిహార్‌కు ఉన్న తేడాను అనేక అంశాలలో చూడవచ్చు. అట్లాగే, తనకు ఉన్న ముస్లిమ్ ఓట్ల మద్దతును కూడా ఎంతో కొంత నిలుపుకోగలిగాడు. భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలోను, జాతీయస్థాయిలోను భాగస్వామిగా ఉండడం ద్వారా, ఆ పార్టీ తీసుకున్న విధాననిర్ణయాలలో భాగస్వామి కాలేదా అంటే, అందుకు బాధ్యత వహించవలసిందే, కానీ, ఎంతో కొంత ఎడం పాటించిన సంగతిని కూడా గుర్తించాలి. అంతేకాదు, అవకాశవాదంగా పరిగణించే ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా, నితీశ్ వ్యూహకర్త కూడా. బిజెపి ప్రస్తుత అగ్రనేతల ద్వయం ఎట్లా ఆలోచిస్తుందో, ఎటువంటి అడుగులు వేస్తుందో తెలిసినవాడు. నితీశ్ కుమార్ బిజెపిని తన భాగస్వామ్యం నుంచి తప్పించిన నిర్ణయం, మహారాష్ట్ర పరిణామాల తరువాత, హైదరాబాద్ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత తీసుకున్నదని గమనించాలి. దూకుడుగా కనిపించిన నితీశ్ నిర్ణయం వెనుక ఆత్మరక్షణ ప్రయోజనం కూడా ఉండవచ్చు. 


జరిగిన పరిణామాలలో నితీశ్ ‘మిత్రద్రోహాన్ని’ మాత్రమే చూడడం న్యాయం కాదనిపిస్తుంది. పులి పిల్లలను తిన్నట్టు, స్నేహితులనే కబళించే పనిలో బిజెపి ఆరితేరుతున్నది. పేరుకు ఎన్‌డిఎయే కానీ, అందులో ఇతరపక్షాలేవీ లేని స్థితిని చూస్తున్నాము. బిజెపితో చెలిమి చేసిన అకాలీదళ్ అణగారిపోయింది. మహారాష్ట్ర పరిణామాలు తెలిసినవే. తన ఓటర్ పునాదిని లక్ష్యంగా పెట్టుకుని బిజెపి విస్తరిస్తున్నదని గమనించిన శివసేన, పొత్తును కాదని కాంగ్రెస్, ఎన్‌సిపిలతో కలసి కూటమి కట్టింది. అదునుచూసి శివసేనను చీల్చి బిజెపి దెబ్బతీసింది. దగ్గరగా మెలగిన అన్నాడిఎంకెతో కూడా ప్రమాదకరమైన వ్యూహాన్నే అమలుజరిపింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే, ఆరితేరిన ద్రోహం మిత్రపక్షాలకు ఎవరు చేస్తున్నట్టు, అని నితీశ్ పక్షం ప్రశ్నిస్తోంది. తన పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రిని పావుగా చేసుకుని బిజెపి వ్యూహరచన చేస్తున్నదని భయపడి నితీశ్ ఇదంతా చేశాడని అంటున్నారు కానీ, వాస్తవానికి ఆయన గుర్తించిన ప్రమాదం అంతకు మించినది. బిహార్‌లో జనాకర్షక సమర్థ పాలకుడిగా సుపరిచితమైన నితీశ్ పేరు స్థానంలో నరేంద్రమోదీ పేరు స్థిరపడుతున్నది. ఆ దిశగా బిహార్ బిజెపి శ్రేణులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు పనిచేస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేయకపోతే, తన మనుగడకే ముప్పు అని నితీశ్ గుర్తించారు.


2014లో అంటే ఎట్లాగో గెలిచావు, ఇప్పుడు 2024 అంత సులువు కాదు అంటున్నాడు నితీశ్, మోదీని ఉద్దేశించి. కొంచెం పెద్ద మాటే. నితీశ్ ప్రస్తుత చర్య కేవలం బిహార్ రాష్ట్రానికే పరిమితమైన వ్యూహంతో చేసిందా, లేక జాతీయ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని చేసిందా అన్న చర్చకు ఆ వ్యాఖ్య మరింత ఇంధనం సమకూర్చింది. అనాధ వలె మారిపోయిన ప్రతిపక్ష రాజకీయ వేదిక ఒక్కసారిగా అప్రమత్తమై, కొత్త దేవుడు వచ్చాడన్న ఉద్వేగానికి లోనయింది. నిజానికి, నితీశ్ బిజెపి నుంచి ఎడం కాగానే, దానికి సుదూర పర్యవసానాలను ఊహించడం అత్యుత్సాహమే కావచ్చు. అమితంగా స్పందిస్తున్న పక్షాలన్నీ పరిహాసానికి పాత్రమే కావచ్చు. అట్లాగని, నితీశ్ ‘రాకడ’ ప్రతిపక్ష రాజకీయం మీద తక్షణ ప్రభావం వేయదనీ కాదు. ఒక రాజకీయ వ్యాఖ్యాత చెప్పినట్టు, నితీశ్ చేసింది 2024ను తిరిగి అందుబాటులోకి తేవడమే. కొత్త అవకాశాలకు ఆస్కారం ఇవ్వడం మాత్రమే. గత రెండు నెలలుగా, భారతీయ జనతాపార్టీ సాధించిన రాజకీయ విజయాలు ఆ పార్టీకి ఇక తిరుగులేదన్న అభిప్రాయ వాతావరణాన్ని సృష్టించాయి. అది ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్‌ను మరింతగా నీరసపరచింది. 2024 గురించి ఇక ఆలోచించవలసిందేమీ లేదన్న నిర్ధారణలకు కారణమయింది. కానీ, నితీశ్ ఆ నిర్ధారణ నిజం కానక్కరలేదన్న సూచన అందించారు. ఆ మేరకు, ప్రస్తుత పరిణామాలకు అదనపు విలువ ఉన్నది. 


ఒక మార్గం మూసుకుపోతే, దేవుడు మరో తోవ తెరుస్తాడు అని నమ్మేవాళ్లుంటారు. అన్ని దారులూ మూసుకుపోయినప్పుడు బిహార్ ద్వారం తెరుచుకున్నదని కొందరికి సంబరంగా ఉన్నది. ఇక రేపటి నుంచి మహా గట్ బంధన్‌ను దేశమంతటా విస్తరించాలని ప్రయత్నాలు మొదలవుతాయి. నంగినంగిగా మారినవారికి, భయంతో కుంగినవారికి కొత్త ధైర్యాలు వస్తాయి. తన భీషణ ప్రతిజ్ఞలకు, తీవ్ర విమర్శలకు రాని స్పందన నితీశ్ ఫిరాయింపునకు ఎందుకు వచ్చిందో తెలియక కెసిఆర్ తలపట్టుకుంటారు. మోదీతో కొత్త స్నేహం ఆశిస్తున్న చంద్రబాబు, తన టైమింగ్ కరెక్టేనా అని పునరాలోచనలో పడతారు. నితీశ్ ఢిల్లీకి వెడితే తానే ముఖ్యమంత్రి కదా అని తేజస్వి యాదవ్ కలగంటారు.


ఈడీలూ సిబిఐలూ ఐటీలూ ఊరుకుంటాయా అంటే, వాటి ప్రయోగాలు ఎవరెవరిని నిర్వీర్యపరిచాయో తెలిసిన తరువాత కదా నితీశ్ ధిక్కారం! కేంద్రప్రభుత్వ గజకర్ణ గోకర్ణ విద్యలకు నితీశ్ దగ్గర ఏదో విరుగుడు ఉండి ఉండాలి, లేదా, మమతా బెనర్జీ దగ్గర కూడా లేని ధైర్యం ఉండి ఉండాలి! అమిత్ షా ఇనుప గుగ్గిళ్లు బిహార్‌లో ఉడకవా? కెసిఆర్‌ను కూడా కలవరపరుస్తున్న ఏకనాథ్ షిండేలు బిహార్‌లో మాత్రం లేరా? ఉచ్చం నీచం, మంచీ చెడ్డా, నీతీ అవినీతీ ఏవీ లేని బాహాటపు దుర్మార్గ క్రీడల నడుమ ప్రత్యామ్నాయాల ఆశలు బట్టకడతాయా? కాలమే జవాబు చెప్పగలిగిన బేతాళ ప్రశ్నలివి!


కె. శ్రీనివాస్

Updated Date - 2022-08-11T09:59:50+05:30 IST