నితీశ్ కొత్త ఎత్తులు ఫలించేనా?

ABN , First Publish Date - 2022-08-12T09:31:45+05:30 IST

రాజకీయ కసరత్తు ఒక ఒలింపిక్ క్రీడ అయితే నితీశ్ కుమార్ నిస్సందేహంగా స్వర్ణ పతకానికి ఒక గట్టి పోటీదారు అవుతారు.

నితీశ్ కొత్త ఎత్తులు ఫలించేనా?

రాజకీయ కసరత్తు ఒక ఒలింపిక్ క్రీడ అయితే నితీశ్ కుమార్ నిస్సందేహంగా స్వర్ణ పతకానికి ఒక గట్టి పోటీదారు అవుతారు. పదిహేడు సంవత్సరాల కాలంలో బిహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ ఎటువంటి అననుకూల పరిస్థితులనైనా అధిగమించి, బలశాలి ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కొని నిలబడగల నేర్పు ఉన్న రాజకీయవేత్తగా తనను తాను నిరూపించుకున్నారు. వరుస పిల్లి మొగ్గలు, పల్టీలు ఆయన రాజకీయ డిఎన్ఏలో అంతర్భాగమయ్యాయి. విశ్వసనీయత లోటు పెరిగిపోయి ఉండవచ్చుగానీ, సంకీర్ణ రాజకీయాలలో ఆయన తాజా వ్యూహం ఒక వాస్తవాన్ని స్పష్టం చేసింది. ఆసేతు హిమాచలం ఎటువంటి మినహాయింపు లేకుండా రాజకీయ విస్తరణే లక్ష్యంగా వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీ, దాని ‘అపోజిషన్ –ముక్త్ భారత్’ ఎజెండాను ప్రతిఘటించడంలో ప్రతిపక్షాలు ఎటువంటి మనుగడ పోరాటం చేస్తున్నాయో నితీశ్ తాజా రాజకీయం తేటతెల్లం చేసింది.


నిజం చెప్పాలంటే బీజేపీతో విడిపోయి మళ్లీ తన స్నేహితులు– శత్రువులు అయిన లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌తో చేతులు కలపాలనే నితీశ్ నిర్ణయం వెనుక ఎటువంటి హృదయ పరివర్తన లేదు. బీజేపీ తన అధికారాన్ని కబళించగలదనే భయమే నితీశ్‌ను ఆ చర్యకు పురిగొల్పింది. తన నేతృత్వంలోని జనతా దళ్ (యునైటెడ్) సామాజిక, రాజకీయ పునాదులను బీజేపీ నెమ్మదిగానే అయినా, కచ్చితంగా బలహీనపరుస్తుండడంతో పాటు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో ఆ పార్టీ సఫలమవడమూ ఎన్‌డిఏ కూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీశ్‌ను వేగిరపరిచాయి.


బీజేపీ విషయమై భీతి చెందుతున్నది కేవలం నితీశ్ కుమార్ మాత్రమే కాదు, 2019 సార్వత్రక ఎన్నికలలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న మరో రెండు పార్టీలు– అకాలీదళ్, శివసేన– కూడా గత మూడేళ్లలో ఎన్‌డిఏ నుంచి నిష్క్రమించాయి. మరో రెండు మిత్రపక్షాలు అన్నాడిఎంకె, లోక్‌జనశక్తి అంతర్గత తిరుగుబాట్లను ఎదుర్కొంటున్నాయి. కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతు నిరసనల కారణంగా అకాలీదళ్ మోదీ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. మహారాష్ట్రలో మరింత అధికారం కోసం శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపిలతో జట్టు కట్టి, బీజేపీకి దూరమయింది. ఎన్‌డిఏ నుంచి వైదొలిగిన అనంతరం అకాలీదళ్ బలహీనపడగా, శివసేనలో చీలికలు వచ్చాయి.


ఒక విధంగా ఎన్‌డిఏ మనుగడలో లేదని చెప్పక తప్పదు. దాని స్థానంలో నరేంద్రమోదీ–అమిత్‌ షా నాయకత్వంలోని బీజేపీ చెలరేగిపోతోంది. అడ్వాణీ– వాజపేయి నేతృత్వంలోని బీజేపీ హయాంలో అసలు ఎన్‌డిఏ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతకు పేరు పడ్డ పలు రాజకీయ పార్టీల బృందంగా ఉండేది. దీనికి తోడు వాజపేయి అనుసరించిన ఏకాభిప్రాయ సాధన రాజకీయాలు ఆ పార్టీలను ఐక్యంగా ఉంచాయి. సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్, ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ, హిందూత్వవాది బాల్‌ఠాక్రే నేతృత్వంలోని భిన్న పార్టీలకు ఆనాటి ఎన్‌డీఏలో స్థానం లభించింది. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌డిఏ 20కి పైగా మిత్రపక్షాలను కోల్పోయింది. వీటిలో పెద్ద పార్టీలూ ఉన్నాయి, చిన్న పార్టీలూ ఉన్నాయి. ఇప్పుడు లోక్‌సభలో రెండంకెల్లో సీట్లు ఉన్న బీజేపీ మిత్రపక్షం ఒక్కటీ లేదు. మోదీ –షాల నేతృత్వంలోని బీజేపీ ఒక స్పష్టమైన రాజకీయ ప్రాబల్యాన్ని సాధించాయని ఈ పరిణామాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షాలు ఉండవచ్చు కానీ అవి అంత ప్రధానమైనవి కావు. మరింత స్పష్టంగా చెప్పాలంటే బీజేపీకి అవి అప్రధానమైనవి.


దేశ రాజకీయాలలో తన సర్వోత్కృష్ట ప్రాబల్యాన్ని సువ్యవస్థితం చేసుకునేందుకు బీజేపీ చూపుతున్న ఆతురత, సమర్థత దాని పాత మిత్రపక్షాలను విస్మయపరచడమేకాదు, అమితంగా భయపెడుతున్నాయి. బిహార్‌లో 2020 అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీకి జనతాదళ్ (యు) సీనియర్ భాగస్వామిగా ఉండేది. నితీశ్‌ను బలహీనపరిచేందుకు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ ప్రోత్సహించింది. దీంతో బీజేపీ– జనతాదళ్(యు) మధ్య సంబంధాలలో పొరపొచ్చాలు ప్రారంభమయ్యాయి. అలాగే మహారాష్ట్రలో శివసేనకు ఇచ్చే ప్రాధాన్యాన్ని బీజేపీ అకస్మాత్తుగా తగ్గించివేసింది. ఒక జూనియర్ భాగస్వామిగా మాత్రమే పరిగణించడం ప్రారంభించింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే బతికి ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి అనూహ్యమైనది. ఆయన నిర్ణయాలనే బీజేపీ ఔదలదాల్చవలసివచ్చేది. అకాలీదళ్ సైతం తనకు ఒకప్పుడు అంటే ప్రకాశ్‌సింగ్ బాదల్ హయాంలో ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఇవ్వడం లేదన్న వాస్తవాన్ని గుర్తించింది. ప్రకాశ్‌సింగ్ బాదల్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాలంలో ఆయన మాటే తుది నిర్ణయంగా ఉండేది. వాజపేయి సైతం ఆయన నిర్ణయాలను గౌరవించేవారు. మోదీ యుగం ప్రారంభమయిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఈ మిత్రపక్షాలలో ఏ ఒక్కదానికి కూడా మోదీ ప్రభుత్వంలో ఒకటికి మించి కేబినెట్ మంత్రిపదవులు లభించకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.


అడ్వాణీ –వాజపేయి హయాంలో కీలక రాష్ట్రాలలో ఉనికి కోసం మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడేది కాంగ్రెస్ ప్రాబల్యమున్న మహారాష్ట్రలో శివసేన మద్దతు, సహాయసహకారాలు బీజేపీకి తప్పనిసరి అయ్యాయి. పంజాబ్‌లో అకాలీదళ్ సిఖ్ అస్తిత్వం బీజేపీ వ్యాప్తికి దోహదం చేసింది. బిహార్‌లో అగ్రకులాల పార్టీ అనే ముద్రను తొలగించుకునేందుకు ‘మండల్’ శక్తి అయిన జనతాదళ్ (యు) తోడ్పాటు బీజేపీకి అవసరమయింది. అయితే మోదీ–షాల నేతృత్వంలోని బీజేపీ గత దశాబ్దంలో ఇతర వెనుకబడిన వర్గాల నేతృత్వంలో ఒక భిన్న సామాజిక సంకీర్ణాన్ని నిర్మించడంలో సఫలమయింది. తద్వారా హిందీ రాష్ట్రాలలో బీజేపీ తన మిత్రపక్షాలపై ఆధారపడవలసిన పరిస్థితి తగ్గిపోయింది. దీనికి తోడు నరేంద్ర మోదీ శక్తిమంతమైన నాయకత్వం, అమిత్ షా రాజకీయ చాణక్యాలు బీజేపీ బలపడేందుకు విశేషంగా తోడ్పడ్డాయి. అన్నిటా ఈ నాయకత్వానిదే పైచేయి కావడంతో ఏ రాజకీయ పక్షమూ వారి నెదిరించేందుకు సాహసించలేక పోతోంది. 


ఈ పరిస్థితి జనతాదళ్(యు) మనగడకు శ్రేయస్కరం కాదని నితీశ్ కుమార్ సరిగానే గుర్తించారు. ఈ కారణంగానే ఆయన ఎన్‌డిఏతో తెగతెంపులు చేసుకునేందుకు దృఢ నిర్ణయం తీసుకున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరెవ్వరికంటే ముందుగా సవాల్ చేసిన నాయకుడు నితీశే అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసిన అవసరముంది. 2013లో బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడుగా నరేంద్ర మోదీ నియమితుడు అయినప్పుడే ఆ నిర్ణయాన్ని నితీశ్ వ్యతిరేకించారు. అప్పటికి మోదీని ఇంకా ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించలేదు. అయినప్పటికీ నితీశ్ ఎన్‌డీఏ నుంచి వైదొలిగేందుకు నిర్ణయం తీసుకున్నారు. తన ‘లౌకిక’ విశ్వాసాలపై రాజీపడబోనని ఆయన స్పష్టం చేశారు. అయితే 2017లో ఆయన మళ్లీ ఎన్‌డీఏలో చేరారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సవాల్ చేయడంలో తన పరిమితులను గుర్తించబట్టే నితీశ్ ఒక రాజకీయ ఎత్తుగడగా మోదీ నాయకత్వాన్ని అంగీకరించారు. ఆ నిర్ణయాన్ని కూడా ఆయన అనిష్టంగానే తీసుకున్నారని చెప్పవచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ 2018లో తన రాజకీయ అనుభవాలపై రాసిన పుస్తకంలో ఆ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. ఆరు నెలల్లో మళ్లీ మహాగఠ్ బంధన్‌లో చేరాలని నితీశ్ కోరుకున్నారని లాలూ పేర్కొన్నారు. అయితే నితీశ్‌పై పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు నమ్మకాన్ని కోల్పోవడంతో ఆయన సత్వరమే మహాగఠ్ బంధన్‌లో చేరలేకపోయారని కూడా లాలూ తెలిపారు.


నితీశ్ కుమార్ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి ఇప్పుడు పలు ప్రాంతీయ పార్టీల నాయకులు ఎదుర్కొంటున్న అవస్థను ప్రతిబింబిస్తోందని చెప్పవచ్చు. ఆ నాయకుల ముందున్న ప్రత్యామ్నాయాలు చాలా కఠినమైనవి. నరేంద్ర మోదీ– అమిత్ షాల నాయకత్వాన్ని పూర్తిగా ఆమోదించి తీరాలి. లేదంటే రాజకీయంగా ఏకాకులు కావాలి. అంతేగాక కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నవీన్ పట్నాయిక్, జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా కేంద్రంతో ఐక్యత పాటిస్తున్నారు. మోదీని సదా ధిక్కరిస్తుండే మమతా బెనర్జీ ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్‌లో పాల్గొనలేదు. తద్వారా మోదీ ప్రభుత్వంపై నిరంతర పోరు జరిపేందుకు మమత సుముఖంగా లేరనేది స్పష్టమయింది. ఆమెలో ఈ మార్పునకు కారణాలు ఏమిటో తెలియదు. ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతలపై కూడా బీజేపీ నిశిత దృక్కులను సారించింది. మోదీ–షా రాజకీయ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తే వారూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి చిక్కులను ఎదుర్కోవడం అనివార్యమవుతుంది.


అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న కేంద్రం, వయోవృద్ధ, అయితే ముందు జాగ్రత్తతో వ్యవహరించే ప్రాంతీయ సత్రాప్‌ల మధ్య బిహార్ తుది రణ క్షేత్రమయ్యే అవకాశముంది. నితీశ్ తన సాహసోపేత ముందస్తు దాడితో తన మనుగడకు కొంత సమయాన్ని కొనుక్కున్నారని చెప్పవచ్చు. అయితే ‘మోసపోయిన’ బీజేపీ మౌనంగా ఉంటుందా? అసాధ్యం. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తదుపరి గమ్యం పాట్నా అయ్యే అవకాశం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - 2022-08-12T09:31:45+05:30 IST