జీవ వైవిధ్య రక్షణలో కొత్త ప్రస్థానం

ABN , First Publish Date - 2022-06-24T07:09:06+05:30 IST

జీవవైవిధ్యాన్ని సంరక్షించుకోవడం తప్పనిసరి. ఈ అనివార్యతను ప్రపంచం 1992లోనే గుర్తించింది. ఎనభై దేశాలకు చెందిన 250 మంది ప్రతినిధులు...

జీవ వైవిధ్య రక్షణలో కొత్త ప్రస్థానం

జీవవైవిధ్యాన్ని సంరక్షించుకోవడం తప్పనిసరి. ఈ అనివార్యతను ప్రపంచం 1992లోనే గుర్తించింది. ఎనభై దేశాలకు చెందిన 250 మంది ప్రతినిధులు నైరోబిలో సమావేశమై జీవ వైవిధ్యానికి సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడిక విషయమై విపులంగా చర్చించారు. అదే ఏడాది బ్రెజిల్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ సమావేశం (ఇదే ధాత్రీ సదస్సు–1992గా సుప్రసిద్ధమయింది) లో సంతకాలు జరిగాయి. ఈ జీవ వైవిధ్య ఒడంబడిక పలు దేశాలలో 1993 డిసెంబర్ 29 నుంచి చట్టబద్ధంగా అమలులోకి వచ్చింది.


జీవవనరులు అంటే వృక్షజాలం, జంతుజాలం, వాటి జన్యు పదార్థాలు మొదలైన వాటిని కూడా సంరక్షించుకోవడం, ఉపయోగించుకోవడంలో దేశవాళీ ప్రజలు, స్థానిక ప్రజా సముదాయాలు భాగస్వాములు కావడం చాలా ముఖ్యం. స్థానిక ప్రజా సముదాయాల సమష్టి జీవ వనరులు, జ్ఞానసంపద వినియోగం ద్వారా సమకూరే లాభాలలో వాటికి వాటా ఇవ్వాల్సిన అవసరముంది. ఈ కారణంగానే 2010లో నగొయా ప్రోటోకాల్‌ను ప్రపంచ దేశాలు అంగీకరించాయి. జన్యు వనరుల వినియోగం ద్వారా సమకూరే ప్రయోజనాల సముచిత, సమపంపకాలకు సంబంధించిన విధి విధానాలను ఈ ప్రోటోకాల్ రూపొందించింది.


మూడు దశాబ్దాల క్రితం ప్రపంచ దేశాలు జీవ వైవిధ్య ఒడంబడికను ఆమోదించాయి. అంతర్జాతీయ సమాజం ఇన్నాళ్ళకు ఆ ఒప్పందాన్ని నవీకరించే కృషిలో ఉంది. ధరిత్రిపై సమస్త వృక్ష, జంతు జాలాల పరిరక్షణకు తన నిబద్ధతను సరికొత్త లక్ష్యాలతో ప్రకటించవలసి ఉంది. జీవ వైవిధ్యం అంతరించిపోతుండడాన్ని అరికట్టేందుకు మనం చేయవలసిన దేమిటనే దానిపై మనకు సరైన అవగాహన లేదు. జీవ వైవిధ్యాన్ని సంపూర్ణంగా సంరక్షించుకోవడంలో మన మనుగడకు, శ్రేయస్సుకు సమకూరే దోహదాన్ని అయినా మనం అర్థం చేసుకున్నామా? 


జీవ వైవిధ్య ఒడంబడికను అమలుపరిచేందుకు భారత ప్రభుత్వం చట్టబద్ధమైన, పరిపాలనా పరమైన చర్యలు చేపట్టింది. జీవ వైవిధ్య చట్టం వీటిలో ఒకటి. జీవ వైవిధ్య పరిరక్షణ, వాటి ఉత్పన్నాలను సుస్థిరంగా వినియోగించుకోవడం, తద్వారా పొందే ఫలాలను అందరూ సమష్టిగా పంచుకోవడం, వీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఈ చట్టం ప్రాధాన్యతలుగా ఉన్నాయి. 2002లో జీవ వైవిధ్య చట్టం పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ చట్టాన్ని సమర్థంగా అమలుపరిచేందుకు జాతీయ జీవ వైవిధ్య సాధికార సంస్థ, రాష్ట్ర జీవ వైవిధ్య సంస్థలు, బయో మేనేజ్‌మెంట్ కమిటీ (బీఎమ్‌సీ)లను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో పనిచేసే బీఎమ్‌సీలు జీవ వైవిధ్య రిజిస్టర్‌లను సిద్ధం చేయవలసి ఉంటుంది.


మరి జీవ వైవిధ్య చట్టం లక్ష్యాలు సక్రమంగా నెరవేరుతున్నాయా? సమాధానం స్పష్టమే. జీవవనరుల వినియోగంతో సమకూరే ప్రయోజనాలను స్థానిక ప్రజా సముదాయాలతో పంచుకోవడమనేది ఒక అర్థరహిత ఉద్యోగస్వామ్య వ్యవహారంగా కుదించివేయబడినట్టు ‘డౌన్ టు ఎర్త్’ విశ్లేషణలో వెల్లడయింది. జీవవనరులకు సంబంధించిన సంప్రదాయ జ్ఞాన హక్కుదారులు ఎవరు అనేది గుర్తించినప్పుడు మాత్రమే వాటిని వినియోగించుకోవడం, తద్వారా సమకూరే ప్రయోజనాలను పంచుకోవడమనేది సక్రమంగా జరిగేందుకు అవకాశమున్నది. ఆ సంప్రదాయ జ్ఞానాన్ని వినియోగించుకునే వ్యాపారులు, కంపెనీలు విధిగా చెల్లింపులు జరిపితీరాలి. ఆ చెల్లింపుల మొత్తాన్ని స్థానిక ప్రజా సముదాయాలు, లేదా సంప్రదాయ జ్ఞానరీతులు, ప్రావీణ్యాల హక్కుదారులకు బదిలీ చేయాలి.


అయితే సంప్రదాయ జ్ఞానాన్ని వినియోగించుకుంటున్న వ్యాపారులు, కంపెనీలు జరుపుతున్న వివరాలు ఏవీ చాలా రాష్ట్రాల వద్ద లభ్యం కావడం లేదు. అసలు జీవ వనరులు లేదా వాటికి సంబంధించిన జ్ఞానాన్ని ఏ ప్రాతిపదికన, ఏ మేరకు ఉపయోగించుకుంటున్నదీ అన్న విషయమై కూడా సమాచారం లభ్యం కావడం లేదు. ఉదాహరణకు ఇరుల సహకార సంఘం విషయాన్నే తీసుకోండి. ఔషధ ఉత్పత్తులకు ఉపయోగించే పాము విషాన్ని సేకరించే సంప్రదాయ పద్ధతుల పై హక్కుదారుల సంఘమది. వారి విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నందుకు గాను నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించేందుకు ఒకే ఒక్క కంపెనీ అంగీకరించింది. అయితే అది కూడా తన మాటను సరిగ్గా నిలబెట్టుకోవడం లేదు. అంతకంటే ఘోరమైన విషయమేమిటంటే వ్యాపారుల, కంపెనీల నుంచి తమకు అందిన సొమ్మును స్థానిక ప్రజాసముదాయాలకు గానీ, సంప్రదాయ జ్ఞానరీతులు, ప్రావీణ్యాల హక్కుదారులకు గానీ ఇవ్వడం లేదని రాష్ట్ర జీవ వైవిధ్య సంస్థలు తెలిపాయి.


కారణమేమిటి? జీవవనరులకు సంబంధించిన సంప్రదాయ జ్ఞానరీతుల హక్కుదారుల గురించిన ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. సదరు సమాచారం లభ్యం కాని పక్షంలో సమకూరిన నిధులను ఆ జీవ వనరులను పొందిన ప్రాంతాలలో జీవ వైవిధ్య సంరక్షణకు వినియోగించాలని చట్టం స్పష్టంగా చెప్పింది. అయినా నిధులు అనుపయోగకరంగా మిగిలిపోతున్నాయని రాష్ట్ర జీవ వైవిధ్య సంస్థలు చెబుతున్నాయి.


కేరళలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో నివసించే కనీ గిరిజనుల విషయాన్నే తీసు కుందాం. ఆరోగ్యపాచ అనే ఔషధీయ మొక్క విషయంలో వారి అవగాహన సమగ్రమైనది. ఆ గిరిజనుల జ్ఞానాన్ని వినియోగించుకుంటున్న సంస్థ, దాని అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయంలో వారికి వాటా ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఆ ఓషధిని ఎలా సేకరించాలనేది అసలు ప్రశ్న. అది అడవులలో ఉంటుంది. అటవీ శాఖ యాజమాన్యంలోని భూములలో అది పెరుగుతుంది. దానిని సేకరించేందుకు లేదా పెంచేందుకు కనీ గిరిజనులకు అనుమతినిచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే అది అంతరించిపోయే వృక్షజాతి అనేకారణం చెప్పుతున్నారు. ఆ వన ఓషధులను సేకరించిన, పెంచిన గిరిజనులపై కేసులు దాఖలు చేస్తున్నారు! దీన్నిబట్టి స్థానిక ప్రజా సముదాయాలకు లబ్ధి కలిగేలా సంప్రదాయ జ్ఞానరీతులు, ప్రావీణ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా జీవ వైవిధ్య సంరక్షణ ఉద్యమాన్ని నిర్మించడం అనేది నిరర్థకమని స్పష్టమవుతుంది. రాబోయే దశాబ్దంలో జీవ వైవిధ్య పరిరక్షణ విషయమై వచ్చే సెప్టెంబర్ 21న న్యూయార్క్‌లో ‘ప్రపంచ జీవ వైవిధ్య శిఖరాగ్ర సదస్సు’ జరగనున్నది. ఈ విషయంలో గతానుభవాల వెలుగులో భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణపై ఆ సదస్సులో సముచిత నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. జీవ వనరుల సంరక్షణలో పాల్గొన్న వారి అనుభవాలు, అభిప్రాయాల ప్రాతిపదికన ఒక సమగ్ర, మెరుగైన జీవ వైవిధ్య పరిరక్షణ విధానాన్ని రూపొందించవలసిన సమయమాసన్నమయింది.


సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - 2022-06-24T07:09:06+05:30 IST