సగం దూరం మజిలీ దగ్గర

ABN , First Publish Date - 2022-01-03T06:15:47+05:30 IST

రంగుల కలల్ని రంగరించి ప్రాణం పోసిన మాతృ ఉదర మందిరానికీ మృదుల శయ్యకూ నా తొలుదొల్త తజ్ఞతలు హాయిని మొదటగా పరిచయం చేసిన ఊయలకూ...

సగం దూరం మజిలీ దగ్గర

రంగుల కలల్ని రంగరించి ప్రాణం పోసిన 

మాతృ ఉదర మందిరానికీ మృదుల శయ్యకూ 

నా తొలుదొల్త కృతజ్ఞతలు


హాయిని మొదటగా పరిచయం చేసిన ఊయలకూ

ఊపిన చేతులకూ, ఎత్తుకున్న మురిపాలకూ 

ఊపిరి లాంటి మొదటి మెత్తటి అన్నం ముద్దకూ 

కృతజ్ఞతలు కృతజ్ఞతలు


లోకాన్ని శ్రీకారంతో పరిచయం చేసిన పలకకూ,

నేర్పిన ఆశీస్సు లాంటి పలుకుకూ ప్రోత్సాహపు చూపుకూ

ఆడనిచ్చిన బడి నీడకూ ఆట విడుపు పాటకూ 

ఉల్లాసపు ఉత్సవాల్నీ నిబ్బరాన్నీ అందించిన స్నేహాలకూ

దగ్గరకు తీసుకుని తన గుణాన్నద్దినవూరు ఆప్యాయతకూ

కృతజ్ఞతలు కృతజ్ఞతలు


పెంచిన మొక్కల కళాశాలకూ హరిత క్షేత్రాలకూ

కొలువు నిచ్చి అండా ఆసరా ఐన తెలుగు లక్ష్మికీ 

నడవనిచ్చిన బాటలకూ, నీడనిచ్చిన నెలవులకూ 

తోడై కాపు కాసిన కమల నయనాలకూ 

మురిపెమిచ్చిన పుత్రికాద్వయానికీ గృహానికీ

కృతజ్ఞతలు కృతజ్ఞతలు


బతుకు కళ సరళతనూ ఒడుపునూ తెగువనూ చూపి నేర్పిన

అసంఖ్యాక సామాన్య శ్రామిక మహిమాన్వితులకూ హితులకూ

కలవనిచ్చిన సాదా సీదా ఋషివర్యులకూ కళాధీరులకూ

కళ్ళను పండించిన సమీప పరిసరాలకూ దూర తీరాలకూ

ఊహల్ని రేపి రాయించిన అన్ని దృశ్యాలకూ అదృశ్య హస్తాలకూ

కృతజ్ఞతలు కృతజ్ఞతలు


ఇపుడు నా లోపల వూళ్లూ పొలాలూ జలకారుణ్యాలూ జాతరలూ

సందళ్ళ పరవళ్లూ అనాది సంగీతాలూ కావ్య చరణాలూ కళాఛాయలూ

ఎందరి ఎందరి ఎన్నిటి ఎన్నిటి దీవెనలవి కానుకలవి

అందరికీ అన్నిటికీ వందనాలు వందనాలు వందనాలు!

దర్భశయనం శ్రీనివాసాచార్య

94404 19039


Read more