దేశ రాజకీయాలకు కేసీఆర్‌ అవసరం

ABN , First Publish Date - 2022-10-07T05:55:46+05:30 IST

బీజేపీ అధికారం చేపట్టిన తరువాత దేశంలో మనువు ఆశించిన రీతిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హిందు మతం, దేశభక్తి ఆ పార్టీ పెటేంట్‌ హక్కులుగా మారాయి...

దేశ రాజకీయాలకు కేసీఆర్‌ అవసరం

బీజేపీ అధికారం చేపట్టిన తరువాత దేశంలో మనువు ఆశించిన రీతిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హిందు మతం, దేశభక్తి ఆ పార్టీ పెటేంట్‌ హక్కులుగా మారాయి. ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకికభారతం విచ్ఛినకరశక్తుల చేతిలో బందీ అయింది. చరిత్ర వక్రీకరణ జరుగుతోంది. స్వాతంత్య్ర పోరాటంలో తాకట్టు రాజకీయం చేసిన వారు నేడు సమరయోధులుగా కీర్తించబడుతున్నారు. యావత్ దేశాన్ని శాసించే స్థాయిలో బీజేపీ బలపడటంతో అన్ని రంగాల్లోనూ శూన్యం ఆవహించింది. స్వాతంత్య్ర పోరాటంలో, నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నేడు గడ్డుస్థితిలో ఉంటూ బీజేపీని ఎదుర్కోగలిగే శక్తి కోల్పోయింది. సమసమాజ స్థాపన కోసం, దేశ నిర్మాణంలోనూ అద్భుతమైన పాత్ర పోషించిన కమ్యూనిస్టులు నేడు చీలికలూ పీలికలై శల్యమైపోయారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం తన సహజత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవాలంటే, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్‌ లాంటివారు అవసరం. ఆయన బీజేపీతో ప్రత్యక్షంగా తలపడుతున్నారు. బీజేపీ విముక్తితోనే దేశం సమైక్యంగా, బలంగా ఉంటుందని కేసీఆర్‌ నమ్ముతున్నారు. మతాధారిత పాలన చేస్తూ, లౌకిక భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్న బీజేపీని ఎదుర్కోగల ఒక బలమైన శక్తి కేసీఆర్‌ రూపంలో దేశానికి దొరికినందుకు మనందరం సంతోషించాలి. బీజేపీ చేతిలో బందీ అయిన భారతాన్ని విముక్తి చేసేందుకు ముందుకు వచ్చిన కేసీఆర్‌ను బలపర్చాలి. బీజేపీ దూకుడుకు కళ్ళెం వేయగలిగేది ఆయన మాత్రమే. 

సీపీ నాయుడు

ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు


Updated Date - 2022-10-07T05:55:46+05:30 IST